మరో మెట్టు

ఎదిగిన మనసుల అనుభవాల
అక్షరాలనుండీ ఇవ్వటంలోని
ఆనందాన్ని మదిలో ఇంకించుకున్న
వెలుతురు దారిలో నడిచే ప్రయత్నం చేస్తునపుడు.


అదే మీటతో మరో దీసం మిణుకుమంది.
అదే తాళం చెవితో మరో కవాటం విప్పారింది.
దొరికిన దానికల్లా దేబిరించే మడుగుపైన
పుచ్చుకోవటంలో ఆనందపు పెట్టుబడి కనిపించింది.
నిరంతర నడకలో అది పైమెట్టే అనిపించింది.



కుచేలుడి అటుకులకు కొంచెం
స్నేహపు అనురాగాన్ని అద్దుకుని అందుకుంటే
శబరి ఎంగిలి పళ్ళకు
పిసరంత ప్రేమను జోడించి ఆరగిస్తే
తీసుకోవటంలోని సంతోషమేమిటో తెలిసొస్తుంది.

రెండు చివర్లను మెరిపించే వెలుతురు
రెండు హ్రుదయాలను మురిపించే గురుతులు.
దాగివున్న నిజంలా బయటపడతాయి.

గుడిసెలోని గుడ్డిదీపం వెలుగులో
పల్లెతల్లి ప్రేమను వడ్డించేటప్పుడు
పేదరికం వసారాలో స్నేహపు సమయం
తాంబూలమై పండుతున్నపుడు
మనసుతో అందుకునే అద్రుష్టం వుండాలి.
పైచేతి దర్పాన్ని వదలగల నిబ్బరం వుండాలి.

శుబ్రమైన దానితో తుడిస్తేనే అద్దానికి మరకంటదు.
మనసెరిగిన తనంతో చరిస్తేనే ప్రేమకు ధనమెక్కదు.

తైలమందక దీపం కొడిగట్టటం లేదు.
వత్తిని పిండి పైకెక్కించే దిక్కులేకే రెపరెప లాడుతోంది.
http://www.facebook.com/groups/kavisangamam/permalink/448495281869896/

కామెంట్‌లు