మట్టివేళ్ళు-మన కట్టా (పుస్తక సమీక్ష) - నందకిషోర్


తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది




పరిమళించే మనసుంటే తోటి మనుషులు సీతాకోకలై పక్కన చేరుతారనుకుంటా.నిన్న కట్టా శ్రీనివాస్‌ని చూస్తే అదే అనిపించింది. నా మట్టివేళ్ళు అక్కడే ఉన్నాయని,పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరించుకుంటానని పట్టుబడ్తే ముందు కాస్త నవ్వుకున్నాంగాని అక్కడికెళ్ళాకే తెలిసింది అతని వేళ్ళు ఆ మట్టిలో ఎంత లోతుగా పాతుకున్నాయో.


సభలో మట్టివేళ్ళ గురించి నన్ను మాట్లాడమంటే మూడే ముక్కలు మాట్లాడాను.నిజం. అర్ధంకాని వచనాల్ని పేర్చి abstract అని చెప్పుకు తిరిగేవాడైతే బహుశా అంత సుళువుగా
చెప్పలేకపోయేవాన్నేమో. కవి గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు.. కానీ,రెండూ- ఒకసారి ప్రయత్నిస్తాను.
తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.ఇబ్బందిపడడు.titleకి సరిపడేలా చెప్పాలంటే మట్టిపరిమళం గుండెల్లోనే దాచుకుని,పచ్చటి చెట్టుగా ఎదుగుతూ వచ్చినవాడు కట్టా.నువ్వొక పచ్చని చెట్టువైతే--తర్వాతేం జరుగుతుందో మనకి తెలిసిందే.. :) సరదాగా గుర్తుచేస్తున్నాగాని,నిజమదే.బహుశా ఆ నిబద్దత,నిగర్విగా ఉండగల జ్ఞానమే అతని శాఖా బాహువుల్లోకి అన్ని పిట్టలు వచ్చేలా చేస్కుంది. ఈ చెట్టుకి ఉన్న మరో అదృష్టమేమంటే ఇతడు కాంతిని ఆవహించుకోగలడు.ఆవాహన అని ఎందుకంటున్నా అంటే నీడల్లో పెరుగుతున్నప్పుడు, తిరుగుతున్నపుడు కూడా తన జీవనానికి సరిపడా కాంతిని భాధ్యతగా సంపాదించుకోగల శక్తి అతని స్వంతం.


తన 67 కవితల సంకలనంలో చాలా విషయాల్నే స్పృశించాడు కట్టా..
స్నేహం,సమాజం,దాంపత్యం,దారిద్ర్యం,థెరిస్సా,ఇస్మాయిల్...అన్నింటిని వృత్త బిందువులనుకుంటే, వాటి కేంద్రం మాత్రం అన్నిట్లో సమాంతరంగా పరావర్తనమైన మనిషితనం. ఆ ఒక్కటి వ్యక్తిగాను,కవిగాను అతడెప్పుడు మరిచిపోనందుకు అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.అతని కవిత్వంలో శైలి,శిల్పాల గురించి వ్యాఖ్యానించడానికి సరిపడా సాహిత్యానుభవం నాకు లేదు.నాల్గో,ఐదో పుస్తకాలు తప్ప ఏమి చదవనందుకు అర్హత ప్రశ్నార్ధకమే.కానీ ఆలోచన్నో,ఆస్వాదన్నో ఏదో ఒకదాన్నైనా తృప్తిచెందించే విషయ సమాహారమే అవసరమైన సాహిత్యమనుకునే నాకు, అతని ప్రయత్నం చూసి సంతోషమనిపించింది.


ఇకపోతే- తర్కశాస్త్ర పరిచయంవల్లనో,గట్టిగా శబ్దించే పదాలమీద ఇష్టంవల్లనో తెలీదుగాని,అరుదుగానే అయినా అక్కడక్కడా ఒకటో రెండో సంస్కృత పదాలు దొర్లడం..తను ఈ మధ్య రాసినవి ఇంకా బాగున్నాయని చెపుతున్నా ఫిక్స్ అయిపోయిన పేజిల సంఖ్యలో మార్పులు చేయకపోవడం కట్టాపై నాకున్న కంప్లైంట్స్.సామాజికతని సబ్జెక్ట్‌గా చేసుకున్నవాటిలో మాత్రం వ్యక్తిగా కట్టా ఏంటో తెలుసు కాబట్టి ఫస్ట్ పర్సన్లో చెప్పకపోవడం ప్రాధామ్యంగా తోచలేదు. మనమెలా ఉంటున్నామనేదే తన ప్రశ్నల ఆంతర్యంగా అర్ధంచేస్కుంటే సబబుగా ఉంటుంది.సో ఆ విషయంలో నో కంప్లైంట్స్. అపరిచితుడు,చంద్రముఖి తన పదాల్లోకి వచ్చెళ్ళిపోచడం బోనస్సేనేమో.. :)


మనుషులం దీవులమంటు,మనల్ని మనమే ఆవిష్కరించుకోవాలంటు మొదలైన సంకలనం మనం చెయ్యాల్సింది పనే పనే పనే అనే ముగింపు వాక్యాల్తో,(నాలాగ నిద్రపోయేవాళ్ళకి కొంచెం కోపం తెప్పిస్తూ) అయిపోతుంది."ఇంకా- చిర్నవ్వుతో ఇద్దరు శత్రువులు తమ శత్రువునెలా చంపారో,కిరీటం పెద్దదైతే తలకేమవుతుందో,సరళాలు పరుషాలెలా అవుతాయో" ఇత్యాది గమ్మత్తులన్ని బుక్ చేతికొచ్చాక చదివేయండి..


చివరగా ఒక్క మాట.అక్కడి సాహితీమితృలందరు అతన్ని గుర్తుంచుకున్న కారణాలు,స్పందించిన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది.అందులో కేవలం సాహిత్య ప్రియత్వమే లేదు.అభిమానం,ప్రేమ అక్కడ నిశ్శబ్ధంగా ప్రవహించాయ్. బహుశా వ్యక్తీకరించడం కంటే వ్యక్తిత్వానికున్న శక్తి గొప్పదనుకుంటా!

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి