Monday, 22 April 2013

లిపిలోనూ పాశ్చాత్య వ్యామోహమేనా? -పాలంకి సత్య

కన్యాశుల్కంలోని వెంకమ్మలాంటి చదువురానివారికి ఆంగ్ల భాషపై మోజుండడాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చును. కానీ పండితులైన తెలుగువారు కూడా తెలుగు లిపిలో అక్షరాలను తగ్గించేయాలని ఉద్యమించడం అర్థంకాని విషయం. కేవలం ఇరవై ఆరు అక్షరాలుండడంవల్లనే ఆంగ్లలిపి నేర్చుకోడం సులభమనీ, తెలుగు బోధన సులువుకావాలంటే అక్షరాలు ఏరిపారెయ్యాలనీ అంటున్నారు. దీనివల్ల వచ్చే కష్టనష్టాలపై ద్వా.నా.శాస్ర్తీగారు రాసిన విషయాలు చాలా బాగున్నాయి. అక్షరాలను తీసివెయ్యాలనే పండితులు ఈ కింది విషయాలను కూడా గమనించాలి. క్ష అనే అక్షరం ఎందుకు తీసెయ్యరాదో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.
1. రోమన్ లిపి ఆంగ్లానికే పరిమితం కాదు. దాదాపుగా ఐరోపా దేశాలలో అందరూ ఆ లిపినే ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో యువత ఎక్కువగానూ, మధ్యవయస్కులు కొంతవరకూనూ ఇష్టంగా తినే వంటకాన్ని పిజ్జా అంటున్నాం. మహిళామణులు దేశీయ పిజ్జా వంటలను పత్రికలలో రాస్తున్నారు. పిఐజెడ్‌జెడ్‌ఎని పిజ్జా అని పలకడం సరేనా? ఈ వంట ఇటలీ దేశస్థులది. పీట్సా అని పలకాలి. ఇక్కడ జెడ్ అన్నది సకారానికీ, జకారానికీ మధ్యగా పలుకుతారు. ఐ అనే అక్షరం ఈకారంగా పలుకుతారు.


2. జర్మన్ భాష అయినా అంతే. జెడ్ అన్నది ట, సల సంయుక్తాక్షరం. మనం నాజీలు అని అంటున్నాం. సరైన ఉచ్చారణను పండితులు సులువుగా ఊహించవచ్చు.
3. జెఓఎల్‌ఎల్‌ఎని ఎలా పలకాలి? జోల్లా అన్నది వెంటనే స్ఫురించే జవాబు. అది స్పానిష్ పదం. హోయా అని పలుకుతారు. ప్రస్తుతం తెలుగువారు అమెరికాలో ఎక్కువగా నివసించే నగరాలలో శాన్ హోసే ఒకటి. రాసేది జెఓఎస్‌ఇ. జకారం రాసి యకారం పలకడం స్పెయిన్ వాస్తవ్యుల అలవాటు. కాలిఫోర్నియా రాష్ట్రం స్పెయిన్ రాజుల పాలనలో ఉన్నప్పుడు కట్టిన నగరం శాన్ హోసే (టిటిడివారు ఈమధ్య ఆ నగరంలో కల్యాణోత్సవం నిర్వహించినపుడు టివి చానెళ్ళు శాన్ జోస్ అని చూపించాయి).
4. క్ష అక్షరం ఎందుకు తీసెయ్యరాదో చెప్తే లక్షల్లో బహుమతిస్తారన్న విషయం గురించి ‘ఆంధ్రభూమి’లో చదివాను. ఇంగ్లీషులో ‘వ’ అనే ఉచ్చారణతో వి, డబ్ల్యూయూ అనే రెండక్షరాలున్నాయి. ఒకటి ఎందుకు తీసివెయ్యరాదన్న ప్రశ్న తెలుగు లిపి సంస్కర్తలలో ఎందరు వేసుకున్నారు? తీసి వెయ్యడానికి లేదన్నది ఆంగ్ల భాషను బాగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. రెండక్షరాల ఉచ్ఛారణ ‘స్ట్రెస్’లో తేడా ఉంటుంది. ఆ స్ట్రెస్‌నిబట్టే ఛందోగణాలూ నిర్ణయవౌతాయి. అందుకే పాశ్చాత్యులు రెండు అక్షరాలూ ఉంచుకున్నారు తప్ప ఒకటి తీసిపారేద్దామనుకోలేదు. ఈనాడు మనకి ర, ఱలను విడిగా పలకడం రాదు, ఋకారం అనడం తెలియదు. క్ష, క్షలకు వేరు వేరు ఉచ్చారణలు ఉండేవేమోనన్న ఊహ కూడా రాదు.
5. పాశ్చాత్య భాషలు వ్యాప్తి చెంది తెలుగు భాష అంతరించిపోతుందన్న భయమున్న భాషల జాబితాలో చేరడానికిదే కారణం. వారి భాషను తరతరాలుగా వస్తున్న సంపదగా వారు గ్రహించారు. ఎల్‌ఎల్‌ఎని ‘యా’గా పలకడమేమిటి. వేరే స్పెల్లింగ్ తయారుచేద్దాం అని స్పెయిన్ దేశస్థులనుకోలేదు. డూప్లే అన్న మాటకు డియుపిఎల్‌ఇఎఎక్స్ అని ఇన్ని అక్షరాలేమిటని ఫ్రెంచి వారనుకోలేదు. ఆంగ్లేయులైనా, జర్మన్లైనా, రష్యన్లయినా అంతే. టెక్నాలజీ వచ్చినా లిపి సంస్కరణలు ప్రారంభించలేదు. లిపికి అనుగుణంగా టైప్ రైటర్లనీ, కంప్యూటర్లనీ సృష్టించుకున్నారే తప్ప మిషన్లకి అనుగుణంగా భాషనూ, లిపినీ మార్చుకోలేదు.
6. ప్రపంచంలో లిపి సంకేతాల సంపద తెలుగు భాషకున్నట్లుగా చాలా తక్కువ భాషలకే ఉంది. ఐరోపా భాషలలో లిపి సంకేతాలకీ, ఉచ్చారణకీ మధ్య ప్రమాణమే లేదు. దేవనాగరి లిపిలో ఎకార, ఒకారాలకు లిపి సంకేతాలు లేవు. పొరుగున ఉన్న తమిళంలో వర్గాక్షరాలలో మొదటి నాల్గింటికీ ఒకే లిపి సంకేతం ( ఏ అక్షరం ఎలా పలకాలన్నదానిపై వేడి చర్చలు పాఠశాలలో, కళాశాలలో సామాన్యం). దాదాపుగా ప్రతి ఉచ్చారణకూ తెలుగులో లిపి సంకేతం ఉంది లేని వాటికి (్ఫ, తాటాకులో టా వంటివి) అక్షరాలు కల్పించుకోవడం మానేసి ఉన్నవాటిని తీసెయ్యాలనటం ఎంతవరకూ సబబు?
7. మొదట్లో నేర్చుకునేందుకు తెలుగులో అక్షరాలూ, గుణింతాలూ, ఒత్తులూ కష్టమేననిపించవచ్చు. కానీ లిపి నేర్చుకున్నాక స్పెల్లింగ్‌లో కానీ, ఉచ్చారణలో కానీ తడబడే ప్రశ్న రానేరాదు. ఇరవై ఆరు అక్షరాలే కదా అనుకుంటే (వాస్తవానికి 4 న 26 = 104 అక్షరాలు, ఆపైన కలిపిరాత) జీవితాంతం స్పెల్లింగ్‌తో కుస్తీ పట్టాలి.
8.ఎవరెస్ట్ శిఖరం మహోన్నతమైనది. ఎక్కడం కష్టమని సగానికి పేల్చేద్దామనడం ఎంత హాస్యాస్పదం?

ఆధారం : ఆంధ్రభూమి

ఫేస్ బుక్

Tweets

లంకెలు