సజీవ కవిత్వం - భాస్కర్ కొండ్రెడ్డి

శ్రీ భాస్కర్ కొండ్రెడ్డి

పొట్టిదానా అన్నాను హేళనగా,
భావం పిడిబాకై పొడిచేసింది.

ఎప్పుడో చాలకాలం క్రిందట రాసుకున్న వాక్యాలివి. అంతగా దూసుకుపోయే కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. అలా నాకు కన్పించిన రెండు కవితలు పి.రామకృష్ణ గారి, భగవాన్ ఉవాచ, ఎప్పట్లాగే.


రెండవకవిత “ఎప్పట్లాగే ‘” చదవగానే ఇంత ఆలోచనత్మకంగా, ఇంత సులభంగా చిన్న ఘటనను కవితగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అరే, ఇలా మనం రాయలేకపోయామే అనిపిస్తుంది కూడా.

చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక చిన్న సంఘటనను, ఒక మంచి మార్గాన్ని సూచిస్తుందీ కవిత. ప్రకృతి పట్ల ప్రేమని, పర్యావరణం పట్ల బాధ్యతను చాలా సరళంగా స్పృశిస్తుంది. పిట్టగోడలు తప్ప పచ్చని చెట్లు కనిపించని నగరవాతావరణాన్ని ప్రశ్నిస్తుంది కూడా.బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో వుంచదగ్గ కవిత ఇది,.
—————-

పి.రామకృష్ణ // ఎప్పట్లాగే

గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ,
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?

** ** **

ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.

———-

కవిత్వాన్ని విభజించు అని నాకెవరైన అవకాశం ఇస్తే సజీవకవిత్వం, నిర్జీవకవిత్వం అని రెండు భాగాలుగా విడదీస్తానేమో! దేని ప్రాధాన్యత దానిదే అయినా కొన్ని సార్లు చటుక్కున జీవం ఆకట్టుకున్నంత సహజంగా ఇంకోటి ఆకట్టుకోదు.

పదాడంబరం చేతనో, లయచేతనో, కవి చేసే కనికట్టు వల్లనో కవిత్వం ఆకట్టుకోవచ్చు కాని మనుసు పొరల్లో తెరలు తెరలుగా అలలు, ఒక అలజడి రేకెత్తించలేకపోతే అది వస్తు కవిత్వమే.

కఠినమైన వాస్తవాన్ని, సత్యాన్ని, ఒక తాత్వికతను ఇంత సున్నితంగా చేయి తిరిగిన చిత్రకారుడిలా కేవలం రెండే రెండు దృశ్యాలతో హృదయపు కాన్వాస్ పై చిత్రించడం సామాన్యమైన విషమేమి కాదు.

మొదటి కవిత “భగవాన్ ఉవాచ” చదవగానే మొదటి దృశ్యం సర్వసాధారణంగా అనిపిస్తుంది. రెండో దృశ్యం జతకూడగానే ఎవరో చెంప చెళ్లుమనిపించినట్లు కళ్లలో నీరు సుడితిరగక మానదు. మనసు మూగగా రోదిస్తుంది భగవంతుడు ఎంత నిర్ధయుడో కదా అని.

ఎక్కడా అయోమయం ఉండదు, అస్పష్టతా ఉండదు. చెప్పదలుచుకున్నది అలవోకగా గుండెకు అతకబడుతుంది. అలజడి తగ్గి స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే గీతాసారాంశం కళ్లకు కడుతుంది. జరిగేది జరగక మానదని ,.ఇంకొంచెం తిక్కగా ఆలోచిస్తే నాస్తికత్వాన్ని భుజాన మోస్తున్న కవిత గా చెప్పుకోవచ్చు. ( కవికి ఆ ఉద్దేశ్యమే లేక పోవచ్చు అది వేరే విషయం) రెండు ఒకటి అని ఇచ్చిన సృజనాత్మక నెంబరింగ్ కూడా ఆకట్టుకుంటుంది ఈ చిన్న కవితలో. ఎక్కడైనా ఆదివారం అని కనిపిస్తే చాలు కవిత మొత్తం కళ్లముందు నిలబడిపోతుంది. బహుశా ఏ ప్రయత్నం చేయకుండా నాకు పూర్తిగా కంఠస్తమైన కవితకూడా ఇదొక్కటేనేమో.
—————-
 శ్రీ. పి.రామకృష్ణ

పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ

2. ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.

1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
“భగవంతుడా ఇలాంటి చావు-
నా బిడ్డకు రాకుండా చూడు” అని.

———–
మొదటగా చెప్పుకోవలసిన రెండు మాటలు చివరలో చెప్తున్నాను.

కవిత్వం నచ్చడమనేది వ్యక్తిగతం.
కవిత్వమనేది ఓ కనెక్టివిటి.
ప్రతి కవితకు ఒక ఫ్రీక్వన్సీ వుంటుంది, అది పాఠకుడి ఫ్రీక్వెన్సీ కలవగలిగితేనే అది హత్తుకుంటుందనుకుంటాను నేను.
ప్రతి పాఠకుడి ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే కవితలు గొప్ప కవితలవుతాయ్. ప్రతి కవిత ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే పాఠకుడు గొప్ప పాఠకుడౌతాడేమో?!


రెండో విషయం కనెక్టవిటి. కవి కుక్క గురించి ఫీలై కవిత రాస్తే చదివిన పాఠకుడు ఏనుగనుకుని కవిని నెత్తిన పెట్టుకొని పొగిడేస్తే ఆ కవిత ఫెయిలైనట్లే. కవి కూడా…
కవి ఏమనుకున్నాడో కవిత దాన్నే ప్రతిఫలించాలి. అదే పాఠకుడికి కనెక్ట్ అవ్వాలి. ఆ విషయంలో పై రెండు కవితలు పూర్తిగా విజయం సాధించాయనుకుంటాను.
బహూశా కొంత మందికి నచ్చకపోవచ్చు. కవిత్వం నచ్చడం వ్యక్తిగతం కావడంవల్ల.

---------------------------------------14/7/2013,.17.18


కవిసంగమంనుండి...

కామెంట్‌లు

  1. అంతర్లోచనలో భాస్కర్ కొండ్రెడ్డి గారు రెండు కవితలు తీసుకుని విశ్లేషణ చేసి కవనం చదువరికి ఎలా కనెక్ట్ అవుతుందో,ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రిక్వేన్సి కి react అవుతారో వివరణ ఇచ్చారు!ఒకరికి నచ్చిన కవిత ఇంకొకరికి నచ్చితీరాలని ఎక్కడా లేదు!రచనాసమాధి లోకి పోయి ఒక తపస్సులా కవనసృజన జరుగుతుంది!అప్పుడే ప్రసవించిన మహిళ తన శిశువును చూసుకుని పరవశించినట్లు కవి తన కవన శిశువును చూసుకొని మురిసి మైమరచిపోతారు!కాకిపిల్ల కాకికి ముద్దు!తర్వాత మళ్ళీ మళ్ళీ చదువుకుంటే తన ప్రతి కవితా తనకు నచ్చదు!మార్పులు చేర్పులు చేస్తాడు!

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు,.నా పేరు ముందు శ్రీ,.తమషాగా అనిపించిందండి,.

    రిప్లయితొలగించండి
  3. సూర్యప్రకాశ్ గారూ మీరన్నది నిజమే కావచ్చు కానీ, అందం, ఉపయోగితల విషయంలో కొన్ని సాధరణీకరణలు అవసరమే కదా. కొంత మేరకు భాస్కర్ గారి విశ్లేషణ కొంత మార్గదర్శకతను ఇస్తుందని భావిస్తున్నాను

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి