‘‘విరాట్’’ స్వరూపం


జీవితానికి అర్ధం ఏమిటి? సరిగా జీవించటం అంటే ఎలా ? 
బహుశా ఈ ప్రశ్నని తాత్వికులూ, రాజనీతిజ్ఞులూ మేధావులే కాదు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురపుతూనే వుంటుంది. ఇదే సరైన సమాధానం అని నిర్ధారించుకునేందుకు ఇప్పటికే ఏర్పరచిన తూకపు రాళ్ళేవీ లేనపుడు. జీవనమే నిర్ధారిస్తుంది. కానీ ఇంత లోతైన విషయాన్ని ఒక కథగా (నవలిక అంటారు తెలుగు అనువాదకులు పొనుగోటి కృష్ణారెడ్డి గారు) మలచటం చాలా గొప్ప ప్రయత్నం. అందుకే ఈ పుస్తకం 40 భాషల్లోకి అనువాదమయ్యింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడవుతున్నాయి. సుమారు 120 ( 1881 November 28) సంవత్సరాలకు క్రితం ఎక్కడో వియన్నా(ఆస్ట్రియా) లో పుట్టిన స్తెఫాన్ త్వైక్ (పలకటమే కష్టంగా వుంది) అనే వ్యక్తి ఆలోచనలు ఈ నాటికీ ప్రభావితం చూపుతున్నాయి.

డా||పులిపాటి.గురు స్వామిగారి పుస్తకాన్ని నందకిషోర్ బావుంది చదవమని ఇచ్చేంత వరకూ డిస్కవర్ చెయ్యలేని నా అజ్ఞానానికి ప్రాయశ్చిత్తంగా మిత్రులకు కొంచెం పుస్తకపు రుచి చూపిస్తే, ఈ అంశంపై ఆలోచించేవారికి ఉపయోగపడుతుందని చిన్న ప్రయత్నం.

కథ విషయానికి వస్తే.

విరాట్ అనే వ్యక్తి సక్రమమైన మార్గం వెతుక్కుంటూ చేసిన జీవన యానం. త్వైక్ కి భారతీయ తత్వ శాస్త్రం అంటే చాలా ప్రేమట అందుకే 1915-16 కాలంలో ఇండియా సందర్శనకు కూడా వచ్చాడట. మరి ఆ ప్రభావం వుందో లేదో కానీ సిద్దార్దుడు బుద్దునిగా మారే క్రమంలో రోగిష్టి, ముసలివాడు, శవం కనిపించటం అతని జీవితంపై ప్రభావం చూపిన అంశం గుర్తొచ్చింది.

1) నిర్జివమైన కళ్ళభాషతో హింసని పరిత్యజించటం

యోధుడు ప్రతిభాశాలి, గురితప్పని విలుకాడు, వజ్రసమానమైన బాహుబలుడు, ధైర్యశాలి అయిన ‘విరాట్’ రాజు గారి హంసలను కాపాడే ప్రయత్నంలో తన ధీరత్వాన్ని చూసిస్తాడు. కానీ ఆ పోరాటంలో స్వంత అన్నని తెలియకుండానే చంపుతాడు. మరణించిన సోదరుడి కళ్ళనుంచి ప్రసరించే పాఠం అతడిని హింసకు దూరం చేస్తుంది. ఎన్నడూ కత్తిపట్టనని ప్రమాణం చేస్తాడు. న్యాయాధికారిగా తరువాతి అంకం ప్రారంభిస్తాడు.


2) ఆటవికుడి మాటలతో అధికారాన్ని వదిలేయటం



ప్రాణహాని తలపెట్టకుండా ఉద్వేగరహితంగా నిర్మలమైన మనసుతో,  న్యాయాధికారిగా అత్యత్తమమైన తీర్పులిస్తున్న దశలోనే ఒక హంతకుడైన ఆటవికుడు నాజీవితం పై నీ అధికారమేమిటి ? ఎప్పుడైన శిక్షల రుచిచూసావా ? మరణం కంటే బాధాకరమైనవి నీ తీర్పులు అంటాడు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంగా తనే ఒక నెల ఆ ఆటవికుడికి బదులుగా నేలమాళగ శిక్షను, కొరడా దెబ్బలను చవిచూసి వాటిలోని కౄరత్వాన్ని అర్ధం చేసుకుంటాడు. న్యాయాధికారిగా మరొకరి జీవితాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించటం సరికాదని కేవలం సలహాదారునిగా మారి కోరిన వారికి మాత్రం తగు సూచనలను అందిచే జీవన విధానాన్ని ఆరంబిస్తాడు.


3) బానిస బాధలను చూసి ఐహికత్వానికి దూరంగా

       
కుటుంబాన్ని సైతం శాసించకుండా సలహా రూపంగా జ్ఞానాన్ని వినియోగిస్తున్న దశలో తప్పించుకుపోజూసి కొడుకుచేతిలోదెబ్బలు తింటున్న బానిస కళ్ళలో ధైన్యం, దానితర్వాత తన పిల్లలతో జరిపిన చర్చనుంచి ప్రతి మనిషి బలప్రయోగం ద్వారానే ఇతరులను తన ఆధినంలోఉంచుకుంటున్నాడని కుటుంబాన్ని ఆస్తిపాస్తులనూ వదిలేసి అడవిలో ఒంటరిగా వనవాస జీవనం ప్రారంభిస్తాడు. అక్కడే పిట్టలూ, కోతులతో సహవాసం చేస్తూ బలప్రయోగాలనుంచీ, అధికార దర్బాలనుంచీ బయటపడ్డాననుకుంటారు. ఒకరోజు అనుకోకుండా ఓ వేటగాడు ఈ అధ్భుత జీవనాన్ని గమనించి జనానికీ తద్వారా రాజుగారికి పాకిపోతుంది. రాజు సైతం అపురూపంగా విరాట్ దర్శనం చేసుకుని వెళతాడు.

4) పల్లె వనిత భోధతో నిష్కమకర్మదిశగా

విరాట్ వనవాస జీవితానికి ఎందరో ఆకర్షితులవుతారు. తాముకూడా విరాట్ చూపిన బాటలో వనవాస జీవనం ప్రారంభిస్తారు. అయినా ఇక్కడ ఒకరి కొకరు ఎటువంటి మాటపూర్వకమైన సంబదాలు కూడా లేకుండా ఒంటరి జీవనాన్నే సాగిస్తుంటారు. పొరపాటున ఒకరికొకరు ఎదురైతే కేవలం పరిచయ పూర్వకంగా ఒక పలకరింపు చిరునవ్వు మాత్రమే పూయిస్తూ జీవితాలను ఏకాంత వాసం గా మార్చుకుంటారు. 
ఒకానోక నాడు కాలధర్మం చేసిన ఒక వనవాసికి దహనక్రియలు నిర్వహించటం విరాట్ ఒక్కడికీ సాధ్యంకాక సహాయం కోసం పక్కనున్న గ్రామంలోకి వెళతాడు.ఊరంతా అత్యంత వినమ్రంగా ఆహ్వానిస్తారు, సంతోషంగా సహాయపడేందుకు ముందుకొస్తారు. 

                                                ఒక్క వనిత తప్ప


ఆమె చూపులలోని నిరసనకు కారణం తెలుసుకుని మ్రాన్పడి పోతాడు విరాట్, ఈ వనవాసపు ట్రెండ్ కి ఆకర్షితుడైన ఆమో భర్త భార్యాపిల్లలను వదిలేసి, తనకెంతో నైపుణ్యం వున్న మగ్గం పని వదిలేసి అడవికి వెళ్లాడని, ఆమె ముగ్గురు పిల్లలూ ఒక్కరొక్కరూ చనిపోయారని ఇప్పుడిక చివరి కుమారుడి శవం ఇంట్లోనే వుంది చూడమంటుంది. చలించి పోతాడు కర్మని వదిలేయటం తప్పేనని అర్ధం అవుతుంది. ఆమెను క్షమాపణ అడిగి రాజువద్దకు వెళతాడు.



సాధారణ స్థితిన సమర్ధించిన లోతైన ముగింపు



‘‘ నేను కావాలని తప్పు చేయలేదు. నేను పాపాల నుంచి దూరంగా వెళ్లాను. కానీ మన కాళ్లు ఈ భూమితో బంధింపబడి వున్నాయి. మన కర్మలన్నీ నిత్య నియమాలతో పెనవేసుకుని వున్నాయి. నిష్కర్మ కూడా ఒక కర్మ.   నేను అనేక సార్లు అపరాదం చేసాను నా జీవితాన్ని పోషించుకుంటే చాలునన్నట్లు వ్యర్ధంగా బతికాను. ఇప్పుడు నేను సేవ చేద్దామనుకుంటున్నాను’’  రాజుతో చెపుతాడు. 
స్వంతత్రత కావాలి, సేవచేయాలి అనే విరుద్దాంశాలను ఎలా పొసిగింపజేసుకోవాలో అర్ధంకాక. సేవ చేయించుకునే వాడు స్వతంత్రుడు కాదన్నమాట. నువ్వుచెప్పేది నాకు అర్ధం కావటం లేదు అంటాడు రాజు
మీ హృదయంతో ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేరు. అది మీకు బోధ పడితే మహారాజుగా కొనసాగలేరు అంటాడు విరాట్. రాజుతో అన్న మాట బహుశా మనలో కూడా చాలమందికి అవసరమే. ఫలితాన్ని కోరే దిశగానే పనులుంటాయి. తాత్కాలిక ప్రయోజనాలే ముఖ్యమనే మైండ్ సెట్ తో నిర్మించుకున్న పనులు చేస్తూవున్న మహారాజులకు ఈ కోణం అర్ధం కాకపోవటంలో ఆశ్చర్యంఏమీలేదు.

కోపించిన రాజు సరే అయితే కుక్కలకు కాపలాదారునిగా వుండమంటాడు. ఆపనిని సంతోషంగా స్వీకరిస్తాడు విరట్ పనులలో చిన్నవి,పెద్దవి వుండవు. గొప్పవి అల్పమైనవి అని అసలుండవు వాటిని మనమెంత బాగా నిర్వర్తించాము అన్నదే ముఖ్యం అనే వుద్దేశ్యంతో ఆపనినే శ్రద్దగా చేస్తూ మరణిస్తాడు. చాలా మంది నిష్కామ కర్మ నిర్వాహకుల లాగానే. 

కాకపోతే కొన్ని ప్రశ్నలు తొలుస్తూనే వుంటాయి.

కర్మనిర్వహణలో తర్కాన్ని ఎందుకు విమర్శించారో,
ఇరుసుగా పనిచేయగల వారు, నలుసుగానే వుంటాననటం కూడా నేరమే. Low Aim is Crime, న్యాయాధికారులకే న్యాయం చెప్పగల సమర్ధత కలవాడు కుక్కల దగ్గర ఆగటం ఎలా సమంజసమో?
దు:ఖ కారణ తెలిసినపుడు నివారణ దిశగా పనిచేయాలని కూడా విరాట్ కి ఎందుకు తోచలేదు.

అదృష్టం కొద్దీ తెలుగులోకి స్వేఛ్ఛాను వాదం చేసిన పొనుగోటి కృష్ణరెడ్డి గారు అందుబాటులో వున్నారు.ఇప్పటికే ఈ పుస్తకాన్ని వందసార్లకు పైగా చదివేంత, కొడుకుకి విరాట్ అని పేరు పెట్టుకునేంత ప్రేమవున్న ఆయన బహుశ మరింత మంచి సమాచారాన్ని సమాధానంగా ఇస్తారనుకుంటాను. ఆ వివరాలు కూడా త్వరలో మిత్రులకు అందిస్తాను. 

ఈ కథ సంక్షిప్తంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
కినిగే లో పుస్తకాన్ని కొనుగోలు చెయ్యలంటే 


పుస్తకం : విరాట్
మూలం : స్తెఫాన్ త్వైక్
స్వేచ్చాను వాదం : పొనుగోటి కృష్ణారెడ్డి
పేజీలు : 48  వెల : 25/-
ప్రతులకు :

మంచి పుస్తకం
మంచి పుస్తకం, 12/13/439 వీధి నెం 1 : తార్నాక, సికింద్రాబాదు - 500 017 (manchipustakam.in)
ISBN : 978-93-80153-31-5
ఫోన్ : 9490746614
కినిగే : http://kinige.com/kbook.php?id=147&name=Virat

కామెంట్‌లు