ఆది శంకరాచార్య నుంచి ఏం తెలుసు కోవచ్చు ?

శిష్యులతో ఆది శంకరాచార్య
ది శంకరాచార్య సినిమా చూసాను ఇంతకు ముందే. అతని గురించి కథగా తెలిసి చూస్తుంటే విషయాన్ని తెరకెక్కించటంలో క్రమం, శ్రధ్ధా బాగానే వున్నాయి. నటీనటుల పరంగానూ ఒకే. కానీ శంకర్ మఠ్ అంటే ఒక లాండ్ మార్క్ అని, అవుట్ డేటెడ్ డ్రెస్రింగ్ తో వున్న వ్యక్తిని తలకెక్కించటంలో విజయవంతం కాదేమో ననిపించింది. దానికి ప్రదాన కారణం కథలో బిగింపు ఏర్పడలేదు. కావాలని కల్పించే ఎమోషన్స్త్ ని బాగా సాగదీసారు. నేనీ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పటినుండీ చాలా ఉత్కంఠతతో ఎదురు చూసాను. భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొన దగ్గ మలుపు తిప్పిన వ్యక్తి జీవితం వెండి తెరకు ఎలా ఎక్కుతుందా అని.

భలేమంచి సమయం

ఎవరికి వారే తమదారే గొప్పదనుకుని చీలిపోతున్న సమయంలో శంకరుడు తన వంతు పాత్ర పోషించాడు వేరు వేరు కాదు ఒక్కటే (అద్వైతం) అనే సిధ్దాంతంతో అందరినీ కలిపేందుకు ఒక్కవ్యక్తి నిజంగా ఇంత పని చేయగలడా అనిపించేలాంటి కృషి చేసాడు. బ్రతికింది 32 సంవత్సరాలే, అయినా భారత దేశాన్ని ఆ చివరకూ ఈ చివరకూ నాలుగు సార్లు పాదయాత్ర చేస్తూ వ్యతిరేఖులను ఓడించి తన సిధ్దాంతాన్ని స్థాపిస్తూ తిరిగాడు. భాష్యాలూ, సిద్ధాంత గ్రంధాలూ, ప్రకరణ గ్రంధాలూ, స్తోత్రాలూ రచించాడు. పుస్తకాలను చదువటం ద్వారా నింపుకునే ఊటతో ప్రవహించటం కంటే రాహూల్ సాంకృతాయన్ లా అనుభవాల ఊటలు నింపుకుంటూ రాయటంలో పస పదునూ ఎక్కువ వుంటాయి. అదే ప్రయాణానికి ఒక లక్ష్యం వుండి ఆ జీవితానికి ఆ లక్ష్యం తప్ప మరోటి లేని ప్రయాణంలో ఒక ఉద్యమ కార్యాచరణ తోడయితే అది శంకరాచార్యుని జీవితం అవుతుంది. ఆది శంకరాచార్యుని జీవితమే అవుతుంది. 

ఏ కాలం వాడు ? 

శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయ అన్న పేరుతో పిలుస్తారు..
మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచనల ద్వారా శంకరుని గురించి మనకు తెలుస్తుంది.

ఒక అంచనా ప్రకారం శంకరుడు క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో జీవించాడని అంటారు.అచ్చుయంత్రాలు లేవు. సరైన ప్రయాణ, ప్రసార, ప్రచార సాధనాలేవీ లేని రోజుల్లో ఒక్క వ్యక్తి అఖండ భారతదేశంపై ప్రభావం చూపి వెయ్యిసంవత్సరాల తర్వాత కూడా తన ఆలోచనలను సజీవంగా బ్రతికించ గలగటం నిజంగా గొప్పవిషయమే. సినిమా పొరపాటున బొరనిపించటం ద్వారా శంకరుని జీవితాన్ని కూడా బోరు అనే భావిస్తారేమో అనే సంశయంతోనే ఈ కొంచెం రాయాలని పించింది. ఇప్పుడు చదువుతున్న మీ ఒక్కరికి చేరినా సరే అన్న ఉద్దేశ్యంతోనే.

తండ్రి బాల్యంలోనే మరణించటంతో తల్లి ఆర్యమాంబ అన్నీ తనై పెంచుతుంది. తల్లిని ఒప్పించి సన్యాసం
మొసలినుంచి తప్పించుకోవాలంటే సన్యాసిగా మరేందుకు అనువతివ్వమ్మా
తీసుకుంటాడు. ( భవభందాలనే మొసలినుండి విడివడ్డానని రచయత చమత్కారం కూడా బావుంది) సాధారణ జనంపై గట్టిప్రభావం వెయ్యాలంటే మహిమలు తప్పనిసరి అప్పటికి వెయ్యేళ్ళక్రితం నుండీ నాస్తికతలోనుండీ పుట్టినప్పటికీ తన ప్రభావం చూపిస్తున్న బౌద్దానికైనా జాతక కథలు చెప్పటం తప్పలేదు. మహిమాన్విత విషయాలను ప్రచుర్యం చేయకా తప్పలేదు.

ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన,సమానాలనే పంచప్రాణాలు శ్వేతవర్ణపక్షులుగా శంకరుని తండ్రి మరణం సమయంలోనూ, ఇతని పరకాయ విద్య సమయంలోనూ కపాలంనుంచి బయటికి ఎగురుకుంటూ వెళ్లినట్లు చూపించిన గ్రాఫిక్స్ కొంత సపోర్టివ్ గానే వున్నాయి. 

శంకరుని విషయంలో కూడా ఇలాంటి ప్రభావాన్ని చూపే మహిమల కథలున్నాయి. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవిబంగారు ఉసిరికాయలు వర్షింపజేయటం ఒక మహిమ అలానే తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయిందని. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించాడని చెప్పే మరోక కథా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటువంటివే వ్యక్తి సెలబ్రిటీ హోదాకు మించిన స్థితిని ఇచ్చి చెప్పబోయే అంశాలపై ఉత్కంటత ఏర్పడేలా చేస్తాయి. అంతకంటే ముఖ్యంగా ప్రాచీన యోగ విద్యకు సంభందించిన అనేక విషయాలను శంకరుడు అవపోశన పట్టాడని చెపుతారు. 

కలిసి వచ్చిన సజ్జన సాంగత్యం

మహా భారత రచన చేసిన వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు, నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదుని దర్శనం లభిస్తుంది.గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారట.

సాధారణ ప్రజలు మొహాలను చూస్తూ మాట్లాడుతారు వీరికి ఉద్వేగాలు ముఖ్యం, మేధావులు మనసులోకి పరిశీలిస్తూ మాట్లాడగలరు వీరికి సంఘటనార్ధలు ముఖ్యం. తాత్వికులు సైద్దాంతికి కారణాల జన్యమయ్యే ఫలితాను లక్ష్యాలుగా చూస్తూ మాట్లాడుతారు వీరికి విస్తృతార్ధం, విస్తృత ఫలితం ముఖ్యం అన్నట్లు శంకరుని పాత్రధారి కూడా ఎక్కడో గాలిలోకి చూస్తున్నట్లు కవళికలు చూపిచాడు. తన తల్లికి కృష్ణ లీలలు చూపే సందర్భంలో చేసిన డబుల్ యాక్షన్ లో అతనికి నటనపై వున్న పట్టు కనిపించింది.

మనీషా పంచకమనే ముఖ్య ఘట్టం

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో
ఛండాలునిగా నాగార్జున
నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు (ఈ పాత్ర నాగార్జునా చేశారు) అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.


అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి


సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా?
వేదాలనే నాలుగు కుక్కలతో ఛండాలునిగా భోద
ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు

ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తరువాతి కర్తవ్యాన్ని  వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని అందరూ అంగీకరించి పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ఇక్కడే శంకరునికి నిజంగా తన జీవిత లక్ష్యం ఏర్పడినట్లు.

తను సిద్దాంతాన్ని ప్రతిపాదించటమే కాకుండా అది జనం లోకి వెళ్లాలంటే దానికి అన్యంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలి. పరమత ఖండన జరిగితేనే స్వమత స్థాపన జరుగుతుంది. అంటే వేరు వేరు సిద్ధాంతలకు అధిపతులుగా, నాయకులుగా,సిద్దంతకర్తలుగా వున్నవారిని ఓడించింతే అనుచర గణం, తదుపరి జనం తప్పని సరిగా మార్గాన్ని మారతారు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తన ప్రయాణం ప్రారంభిచాడు.

మండన మిశ్రునితో వాదయుద్ద ఘట్టం

మండన మిశ్రునిగా సాయికుమార్
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వద్దకే వెళ్ళి కలుస్తాడు. మీసంలేని మండన మిశ్రునిగా సాయి కుమార్, న్యాయ కోవిద అయిన అతని భార్య ఉభయభారతిగా కమలినీ ముఖర్జీ నటించారు. వాదనియమాలు పెట్టటం వాదన జరగటం ప్రేక్షకులకు వినోదంగానే వుండేలా తీసారు. వాదనలో భర్తకు సహాయంగా ఆమె అడిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి వంటి కామ శాస్త్ర సంభంద ప్రశ్నలకు ఆజన్మ బ్రహ్మచారి ఐన శంకరుడు సమాధానం చెప్పలేక అప్పటికి సెలవు తీసుకుని పరకాయ ప్రవేశ విద్య ద్వారా వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు శరీరంలో ప్రవేశించి అనంగతంత్ర పాండిత్యం నేర్వడంతో పాటు సక్రమ రాజ్య పాలనమంటే ఏమిటో చూపించాడట. ఆ తర్వాత మండన మిశ్రుని పూర్తిగా ఓడిండి సన్యాసం ఇచ్చి శిష్యునిగా స్వీకరించాడు. మండన మిశ్రుడే తదుపరి సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్దుడయ్యాడట.
ఇదే పద్దతిలో వివిధ సిద్దాంత కర్తలను తన సిద్దాంత పటిమతోనూ, వాదనా సామర్ధ్యంతోనూ ఓడించి అద్వైత సిద్దాంతాన్ని స్థాపించి సర్వజ్ఞపీఠం అధిరోహణ చేశాడని చెపుతారు. అందుకే అతడు జగద్గురువుగా పిలువ బడ్డాడు.

సినిమాలో సుమన్, చిరంజీవి, పిరమిడ్ ధ్యానకేంద్రం పత్రీజీ, తనికెళ్ళ భరణి, లాంటి వారు కనిపించటం అదనపు ఆకర్షణ. చిరంజీవి శివుడిగా ఆపధ్భాందవుడిలో వేసిన శివతాండవాన్నే మళ్ళీ ఉపయోగించినట్లున్నారు.  నాగార్జునా, శ్రీహరి మాటల్లో వాళ్ళ ఒరిజినల్ స్లాంగ్ బాగానే కనిపించింది. పోసాని కృష్ణ మురళీ ఒరిజినల్ హడావిడి కాకుండా కొంచెం ఒద్దికగా ఉంచేసినట్లున్నారు. సుమన్ నోటి నుంచి నిప్పులు ఎగజిమ్మటం డ్రాగన్ లా ఎందుకు పెట్టారో మరి. 

ప్రతిభావంతమైన కార్యనిర్వాహకుడు

తన రచనలతో సిద్దాంతాన్ని శాశ్వతం చేయటమే కాకుండా చాతుర్మఠాల వ్యవస్థను రూపోందిని దాని నిర్వహణకు ఒక పటిష్టమైన చట్రాన్ని రూపోందించాడు. వాటి పరిపాలనకు సంభందించి అత్యంత ముందుచూపుతో వేరు వేరు నిర్వాహకులను ఏర్పరచి వారికి పద్దతులపై ఆధారపడిన నిర్వహణా భాద్యతలను అప్పగించాడు. ఆ పునాదులపై నిలబడిన నిర్మాణమే నేటీకీ దుర్భేద్యమై తలెత్తుకుని నిలబడే వుంది.

శంకరుని అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. శంకరుని తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు.


గాంధీ కావచ్చు, సీతారామరాజు కావచ్చు మార్క్స్, అంబేద్కర్ ఎవరైనా కావచ్చు సమస్యని గుర్తించి మేధోపరమైన పరిష్కారాన్ని కనుక్కోగానే గొప్పవాళ్ళు కాలేదు. జనాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చేందుకు అవసరమైన సూత్రాన్ని అమలుచేయటంలో నిబద్దతను చూపారు. ప్రభావశీలత, ఫలితాలను పరస్పర ప్రేరకాలుగా ముందుకు నడిపించారు. పాకిస్తాన్ చైనాల దాడి కనబడుతూ జరుగుతుండవచ్చు, డాలర్ తన పగ్గాలను మన మెడచుట్టూ వేసి స్వారీ చెయ్యటం కంటికి కనిపించక పోవచ్చు ఈ పరాధీనతలను విడిలించుకునే కార్యాచరణకు లక్షల సైన్యం కాదు కావలసింది ఇదిగో ఇలానే నిబద్దతతో, లక్ష్యాన్ని చూస్తున్న దృష్టితో ముందుకు నడుస్తూ నడిపించేవారు ఒక్కరుంటే చాలదా.

కామెంట్‌లు

  1. Sunday we movie choosaaka Adi sankarudi goppathanaanni sariaina drukpadham tho cheppa galigaaraa ledaa annadi chepthaanu.Kaanee Adi Sankarula jeevithaanni chaalaa varaku cover chesaaru kadaa.

    రిప్లయితొలగించండి
  2. జీవితాన్ని చాలా వరకూ కవర్ చేసారు.
    మీలా మన చరిత్ర నచ్చే వారు ఒకసారి చూడటంలో నష్టం ఏమాత్రం వుండదని గారెంటీ ఇవ్వగలను.
    మరీ కాలక్షేపం కోసమే వెళ్ళాలనుకునే వాళ్ళైతే చూడక పోవటమే మంచిది.

    రిప్లయితొలగించండి
  3. ఆది శంకరుల జీవితాన్ని, సినిమా రివ్యూని ఒకే సారి కలిపి చూపించారు. చక్కటి వ్యాసం. నెనర్లు... ఎన్ని మహిమలు చూపించినప్పటికీ, ఇప్పటి గురువుల లాగా గుళ్ళు, గోపురాలు కట్టించుకుని, దేవుడినని ప్రచారం చేసుకోలేదు. అదే ఆయన్ని జగద్గురువుగా నిలబెట్టింది.

    రిప్లయితొలగించండి
  4. జగద్గురువులను ఏకవచనంతో సంభోదించడం ఇబ్బందిగా ఉంది దయచేసి సరిచేయగలరు...
    కళ్యాణి.

    రిప్లయితొలగించండి
  5. కళ్యాణి గారూ
    కథనాన్ని ఎక్కువగా ఓన్ చేసుకుంటూ అర్ధంచేసుకోవడం వల్ల
    రారా కృష్ణయ్యా, పోరా కృష్ణయ్యా అన్నాట్లు ఇక్కడ జరిగిందనిపించింది.
    ఇందులో నిర్లక్ష్యంఅయితే ఏమీ లేదండీ

    రిప్లయితొలగించండి
  6. శంకరవిజయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి పరిచయంచేసివుంటే సినిమా ఇంకా బాగుండేదిదనిపించింది..శంకరుల చరిత్ర ముందే చదివిన వాళ్లకి ఇది మింగుడు పడటం కొంచం కష్టమే...కానీ ప్రయత్నము ప్రశంసనీయము.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి