వేయి స్థంభాల గుడిపై వేయి పడగల నిర్లక్ష్యం

గుడిని 2004 నుంచీ ఇలా కూలగొట్టి కూర్చోబెట్టారు
భారత దేశం పై దండయాత్ర చేసిన శత్రువులు మన దేశ దేవాలయ శిల్పసంపదను ద్వంసం చేస్తేనో, తాలీబాన్లు బమియన్ బుద్దవిగ్రహాన్ని నాశనం చేస్తున్నప్పుడో బాధ అనిపిస్తే సాధారణమే,  కానీ స్వంతంగా మన ప్రభుత్వపు భాద్యతా రాహిత్యమూ, శ్రద్ధలేని తనం మూలంగా ముక్కముక్కలై వేయి శకలాలుగా కాకావికలమై పడిపోయి వున్న వరంగల్ వేయిస్థంభాల గుడిని చూస్తే అంతకంటే మరీ బాధనిపిస్తుంది. వందల సంవత్సరాలుగా ఎన్నో తుఫానులనూ, భూకంపాలనూ తట్టుకుని ఠీవిగా నిలబడ్డ నిర్మాణాన్ని ఈ రోజు కాళ్ళువిరగ్గొట్టి క్రింద పడేసి మళ్ళీ నిలబెట్టటమెలాగో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు.



ఎప్పుడో 11వ శాతబ్ధంలో కాకతీయ వంశ తేజం రుద్రదేవుడు చాళుక్య శైలిలో నిర్మించిన శివాలయం ఇది. 1163 లో
అంతకు ముందు ఇలా ఠీవిగా వుండేది
దీన్ని నిర్మించారు. నిర్మాణ కాలం 72 సంవత్సరాలు పట్టిందట. ఒక మీటరు ఎత్తుగా ముందు పటిష్టమైన ప్లాట్ ఫాం నిర్మించి దానిపై వెయ్యి అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన స్థంబాలను నిలబెట్టారు. ఆ నిలబెట్టటంలో గణిత నైపుణ్యం విక్షకుడు ఏ స్థానం నుంచి చూసినా దేవతా మూర్తికి ఇవి అడ్డుపడకుండా వుండేలా జాగ్రత్త పడ్డారట. సిమెంటు వాడకుండా నిలబెట్టటం కంటే ఇది మరీ ఆశ్చర్యం అనిపించింది. త్రికూటాలయం లో నక్షత్ర పీఠం పై రుద్రేశ్వరుడిని ప్రతిష్టించారు. త్రీకూటాలయంలో ప్రధాన దేవతా మూర్తులుగా శివుడు, విష్ణువు, సూర్యభగవాడు.
లావా జనిత ఎకశిలా నిర్మిత నిండైన నంది
ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా వుంటుంది. వేయిస్థంభాల గుడి దక్షిణాభిముఖమై వుంటుంది. ఇలా నిర్మించటంలో ప్రధానోద్దేశం ఉదయ సూర్యకిరణాలు సరాసరి శివుని తాకటం కోసమే అయ్యింటుందని చెపుతారు.(మళ్ళీ దీనిపై వాస్తు దోషమంటూ కొత్త ఆర్భాటం కొంత మొదలయ్యింది ఇప్పుడు) ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై వున్న నందీశ్వరుడు నల్లటి బసాల్ట్ ( లావా శిల) నుంచి మలచ బడిన ఏక శిలా విగ్రహం. అత్యద్భుతమైన పాలిషింగ్ తో నున్నగా వుంటుందీ విగ్రహం. నంది పై చెక్కన గంటలు లాంటివి చాలా స్పష్టంగా చెక్కారు. తుగ్లక్ కాలం లో తీవ్రమైన విధ్వంసానికి గురయ్యింది. మతపరమైన ద్వేషంతోనే కాకుండా విగ్రహాల వెనుక నిధిరహస్యాలుంటాయని వాటిని ఛేదించాలని కూడా శిల్పలను ధ్వంసం చేశారు. అందులో నంది కూడా దెబ్బతింది. ఈ గుడుల మద్యలో నాట్య మంటపం వుంటుంది. ఆలయ ప్రాంగణంలో మరేడు
, రావి, వేప

వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు వున్నాయి. కేవలం ఆధ్యాత్మిక అవసరాలకోసం మాత్రమే కాకుండా భద్రతను కూడా సైనిక అవసరాలనూ దృష్టిలో వుంచుకుని ఇక్కడి నుండి ప్రధాన సైనిక స్థావరాల వరకూ భూ అంతర్భాగంలో సొరంగాలున్నయట. ఒక సొరంగ మార్గం ఓరుగల్లు కోట వరకూ వుండేదట. కొన్ని శిధిల గృహాలను ఇప్పటికీ తలుపులు మూసే వుంచుతున్నారు బహుశా వాటిలోపలేవైన ద్వంసమైన సొరంగ మార్గాలుండి వుండవచ్చు కూడా. 

పీకేసిన స్థంభాలను సరిచేసి నిలబెట్టేందుకు 2004 నుంచి క్రిందా మీద పడుతూనే వున్నారు. పూర్తయిన పనులకు బిల్లులు రాక శిల్పకారులు వెళుతున్నారు. కొత్తవాళ్ళు వస్తున్నారు. పాతవాళ్లు సగంలో వదిలేసిన పని అర్ధం అయ్యికాక వీళ్ళూ వీళ్ళ పద్దతిలో మరికొంచెం చేసి వెళుతున్నారు. స్థానికంగా ఎటువంటి నిర్మాణ భాద్యతలు కానీ పరిశీనా భాద్యతలు కానీ ఇవ్వలేదు. కేంద్ర పరిశీలక బృందం ఎప్పుడొస్తారో ఏం పట్టించుకుని వెళతారో తెలియదు. పోనీ ఎప్పటికి పూర్తవుతుందని టార్గెట్ పెట్టుకున్నారో తెలియదు. ఇప్పటికి మూడున్నర కోట్లు ఖర్చు చేసారు మరెన్ని కోట్ల అంచనాలను పెంచుకుంటూ ముందుకు పోతారో. బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒక్కరోజులో చంపేస్తారా? గుడ్లు పెట్టినన్నాళ్ళూ గుద్దుతూనే వుండాలి. చారిత్రక సంపద పరిరక్షణలో ఇంతటి ప్రభుత్వ నిర్లిప్తత నిజంగా బాధగానే వుంది.



కామెంట్‌లు