Wednesday, 23 October 2013

తెలంగాణా ఇగురం నందినీ సిధారెడ్డి


‘‘నాగేటి సాలల్లో నాతెలంగాణా ’’ పాటను అప్పటికే అనేక సభల్లో అనేక మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, వైభవాన్ని తెలిపే ఆ పాటచివరకు ఆర్.నారాయణమూర్తి నటించిన వీర తెలంగాణచిత్రంతో వెండితెరకు కూడా ఎక్కింది. గేయరచయిత నందిని సిద్దారెడ్డికి ఉత్తమ గేయరచయితగా 2010 సంవత్సరానికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటే నాగేటి సాలల్లో నా తెలంగాణ…’. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించే సిధారెడ్డగారు కెసిఆర్, కోదండరామ్ వంటి ముందుశ్రేణి నాయకత్వానకి దగ్గరగా వున్న వ్యక్తి.


పుస్తకాలు చదవడం కాదు....పుస్తకాలు రాసుడు గొప్ప అన్న తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకొని బడిలో తెలుగు పాఠాలు చెప్పే అష్టకాల నర్సింహ్మశర్మ గురువు ప్రోత్సాహంతో అన్నింటా గురువైన శివారెడ్డి ఆదరణతో తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుండి మన కంటికి చూపిన బంగారమసొంటి కవి నందిని సిధారెడ్డి. 1955 జూలై 12న మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బాలసిధారెడ్డి, రత్నమాల కు ముద్దుబిడ్డ నందిని సిధాడ్డి. బందారం గ్రామంలో బాల్యాని గడిపి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాల విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్కటూర్‌లో పూర్తి చేశారు. పేదరికం విద్యకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాలు తిప్పక కలం పట్టిన కవి సిధారెడ్డి. ఒక్క పూట తిండితోనే గడిపిన రోజులు ఎన్నో ఉన్నా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువులను పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటూ పోస్టు గాడ్యుయేషన్ , 1981 లో ‘‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు ’’ అనే అంశంతో  ఎంఫిల్‌ను పూర్తి చేశారు. 1986లో డాక్టర్ సి.నారాయణడ్డి పర్యవేక్షణలో ‘‘ ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత ’’ అనే అంశంతో పిహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు.

సాహితీ ప్రయాణం
1973 నుండి మిత్రుడు భగవంతాడ్డి ప్రోత్సాహంతో సామాజిక కవిత్వం రాయడం మొదలు పెట్టారు.
1974 లో సిధారెడ్డి రాసిన దివిటి మినీ కవితా సంకలనాన్ని కందుకూరు శ్రీరాములు, కర్ణాల బాలరాజు కలిసి తొలి                పుస్తకంగా అచ్చు వేయించారు.
1991లో సంభాషణ,
1995లో ప్రాణహిత,
1997లో భూమిస్వప్నం,
2001లో ఒక భాద కాదు,
2007లో నది పుట్టుబడి,
2007లో ఇగురం
2008 తెలుగు కుల వృత్తుల సాహిత్యం
2011 తెలంగాణా సాహిత్యంపై వ్యాసాలు
2012 నాగేటి సాలల్లో నా తెలంగాణా – నంది బహుమతి పొందిన పాట

గుర్తింపు
1987 భూమి స్వప్నం కవితా రచనకుగాను ఫ్రీవర్స్ ఫ్రంట్
1988 లో దాశరథి అవార్డు పొందారు.
2001లో ప్రాణహిత కవితా సంకలనానికిగాను తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. కానీ అప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. 
2009లో విశ్వకళాపీఠం వారు ఒక భాద కాదు కవిత రచనకుగాను ఉత్తమ కావ్య స్నేహనిధి పురస్కారాన్ని అందించింది
1979లో మల్లీశ్వరీ గారిని జీవితభాగస్వామిగా ఆయన జీవితంలోకి ఆహ్వానించారు. వీరి గారాల పట్టి కుమారి వీక్షణ.
1994లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పని చేసిన సిధారెడ్డి ఉద్యమాలతో నిరంతర సంబంధాలు వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించారు. 
1994నాటి విప్లవ ఉద్యమం మొదలుకొని నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన పాటలు, మాటలు తుపాకీ తూటాలైనవి. 
1997 ఆగస్టు నెలలో ఆయన రాసిన తొలి పాట నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ఉర్రుతలూగించింది. అమరుల స్మృతి కోసం రాసిన జోహారులు...జోహారులు అనే పాట కడుపులో ఉన్న దుఃఖాన్ని కళ్లకు తెచ్చింది. ఆయన కవిత్వం రాసేటప్పుడు మనిషి ఎడ ఉన్నా మనస్సు మాత్రం బందారం చెరువు కట్టకాడ, మూడు గుండ్ల కాడ, బందారం ఊర్లే సంచారం చేస్తదట. ఊరి జ్ఞాపకాలన్నీ మదిలో మెదిలితేనే ఆయన కలం కదులుతదట. అందుకేనేమో ఆయన కవిత్వంలో పల్లె కన్న తల్లోలే కనబడుతది.

కీలక బాధ్యతలు


1984లో మెదక్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు.
1986లో మంజీర రచయితల సంఘాన్ని (MARASAM)- ఏర్పాటు చేసి తెలంగాణ కవులకు కొత్త వేదికను అందించారు.
2001అక్టోబర్ లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు.
మంజీర అనే ద్వైమాసిక, సోయి అనే త్రైమాసిక పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిధాడ్డి కాలినడకను ఎక్కువగా ఇష్టపడతారు. చిందు భాగవతం, శారదకాళ్లు వంటి తెలంగాణ సంసృ్కతిని అద్దం పటే కళా ప్రదర్శనలు ఎక్కడ జరిగినా ముందు వరుస ప్రేక్షకుడు సిధారెడ్డి. ఫలితం వచ్చే దాకా పట్టువిడవకుండా పోరాడే తత్వాన్ని పెంచుకోవాలని సిధాడ్డి ఎప్పుడూ అనే మాట.
‘నాగేటి సాలల్లో…’ అనే పాటకుగాను నాకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు వస్తుందని తనేమాత్రం ఊహించలేదని సిధారెడ్డి గారంటారు. ఎందుకంటే గత 14 ఏళ్ళుగా అనేక మంది ఈ పాటను పాడుతున్నారు. బాగా పాపులర్ అయిన పాట అంది. 1997 ఆగస్టు 16వ తేదీన షేక్ బాబా అనే గాయకుడు ఓ పాటను రాసివ్వండి… బహిరంగ సభలో పాడుదాం అని అడిగినందుకు ఆ మరుసటి రోజే అంటే ఆగస్టు 17వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పాటను రాసిచ్చేశారట. ఆ పాటకు ఆయనే ట్యూన్ కట్టుకుని బహిరంగ సభలో పాడారు. అలా మొదలైన ఆ గేయాన్ని దేశపతి శ్రీనివాస్ అనేక సభల్లో పాడి పాపులర్ చేశారు. ఈ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన పాడటమూ ఓ కారణం. ఓ రోజు ఆర్.నారాయణమూర్తి సిద్ధిపేటలో ఉన్న సిధారెడ్డిగారి ఇంటికి వచ్చి ఈ పాటను తన సినిమాలో పెట్టుకుంటానని అడగడమూ…వీరు వెంటనే ఒప్పుకోవడమూ జరిగిపోయింది. ఈ పాటను తన సినిమాలో జె.ఏసుదాసుతో పాడించారు. సినిమాల్లోకి వెళ్ళాలని సిధారెడ్డిగారి చిన్నప్పటి నుంచి వున్న కోరిక ఆవిధంగా నంది అవార్డు రావడంతో తీరిందేమో. కానీ ఉద్యమం బాటలో నడిచే క్రమంలో సినిమాకోసం అటుతర్వాత ఆయన సమయాన్ని ఇవ్వలేకపోయారట.


ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే పాటలను రాయాలనేదే వారి సంకల్పం. ఇప్పటి వరకు 25 పాటలు రాస్తే అందులో పది పాటలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి. 1992లో జరిగిన మద్యపాన వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఓ ఐదు పాటలను, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఓ పాటను, ప్రజా ఉద్యమాలకు సంబంధించి తొమ్మిది పాటలను రాశారు.

మే 2012లో సిధ్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతిగా పదవీ విరమణను చేశారు.

                                                           ( వేర్వేరు ఆధారాలనుంచి సేకరించిన సమాచారం మేరకు తయారు చేసిన వ్యాసం ఇది, సవరణలూ పూరణలూ వుంటే తెలపండి )దేశపతి శ్రీనివాస్ గారు పాటలోనాగేటి చాళ్ళల్లో నా తెలంగాణా
నాగేటి చాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా

నవ్వేటి బతుకులు నా తెలంగాణా నా తెలంగాణా
పారేటి నీల్లల్ల - పానాదులల్ల
పూచేటి పువ్వుల్ల - పునాసలల్ల
కొంగు చాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా                       |నాగేటి|

తంగేడు పువ్వుల్లు - తంబాలమంతా
తీరొక్క రంగుల్ల - తీరిచీనా పువ్వు
బంగారు చీరలు బజారులన్నీ
బతుకమ్మ పండుగ - నా తెలంగాణా నా తెలంగాణా
బంతి పూలతోట - నా తెలంగాణా నా తెలంగాణా                         |నాగేటి|

వరదగూడు గడితె వానొచ్చునంట
బురద పొలమూ దున్ని మురిసున్నరంతా
శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి
వాన కొరకు భజన - జడకొప్పులేసి
వాగుల్ల వంకల్ల - నా తెలంగాణా నా తెలంగాణా
చూపు రాలిన కండ్లు - నా తెలంగాణా నా తెలంగాణా                    |నాగేటి|

కొత్త బట్టల్లు గట్టి - కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి - పడుచు చప్పట్లు
జొన్న కర్రల జెండా - జోరున్నదేమి
అలయి బలయి దీసె - నా తెలంగాణా నా తెలంగాణా
జంబి పంచిన ఆర్తి - నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

మోటగొట్టే రాత్రి - మోగీన పాట
తాడు పేనిన తండ్రి - తలుపులున్నప్పు
కల్లమూడ్సిన అవ్వ - కలలోని గింజ
ఆరుగాలం చెమట - నా తెలంగాణా నా తెలంగాణా
ఆకలిదప్పుల మంట - నా తెలంగాణ నా తెలంగాణా                     |నాగేటి|

ఊరు గాచే తల్లి ఉరిమి చూడంగ
బువ్వలేని తల్లి బోనమొండింది
సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా
బోనాల పండుగ - నా తెలంగాణ నా తెలంగాణా
కాట్రావుల ఆట - నా తెలంగాణా నా తెలంగాణా
శివసత్తుల ఆట - నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

దట్టి గట్టిన రోజు దప్పు చప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుకపేర్ల మొక్కు కూలి బతుకుల్లు
ఆలువాడిన పాట - నా తెలంగాణా నా తెలంగాణా
ఆత్మగల్ల చెయ్యి - నా తెలంగాణా నా తెలంగాణా

కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
కళలకే పుట్టుకా - నా తెలంగాణా నా తెలంగాణా
పాటగాచిన పట్టు - నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

తాడూ పేనిన తండ్రి తలుపులున్నప్పుడు
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్లు లేని చెరువు నిను జూసి నవ్వె
బతికి చెడ్డా బిడ్డ - నా తెలంగాణ నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి - నా తెలంగాణా నా తెలంగాణా                               |నాగేటి|

బురుజు గోడల పొగరు మెడలు వంచంగ
గుట్టల్ల చెట్లల్ల గోగు పువ్వుల్లు
సద్ది మోపిన తల్లి సావు బతుకుల్ల
పానమిచ్చిన వీర కథలు బతుకంగ

గోరుకొయ్యల పొద్దు - నా తెలంగాణా నా తెలంగాణా
గోరువంకల సభలు - నా తెలంగాణా నా తెలంగాణా

సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే ‘‘కాట్రావుల పండుగ’’ గురించి కూడా పాటలో పేర్కొన్నారు దాని వివరాలు తెలియవు.

 పునాస వువ్వులు : 
The first crop of the year which consists of grain of an inferior kind
వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయదారులు ఆయా పైరులను విత్తి పెంచు కాలము. సంవత్సరమును
పునాస (ఎండ) కారు,
తొలకరి (ముంగటి వానకారు),
నడివాన కారు,
వెనుకటి వానకారు,
శీతకారు,
పయరకారు అని ఆరుకారులుగా వ్యవసాయాధారితంగా విభజింపవచ్చును (Sowing seasons).
 •  జూన్‌ నెలలో (పునర్వసు కార్తెలో) చల్లు పంట.
 •  మామిడిలో ఒక రకము.( మామిడి కాయలు పునాసపిందెలు బజార్లోకి వస్తున్నాయి అనే వాడుకను వింటుంటాం)


తాంబూలంలో తంగేడుల పేర్పు, బతుకమ్మ పండుగకు చేసే ఏర్పట్లలో బాగంగా పువ్వులు పేర్చే ఇత్తడి లాంటి లోపపు పళ్ళేన్ని తాంబూలం అంటారు.

 వరదగూడు / వరదగుడి ( చంద్రునిచుట్టు ఏర్పడు వృత్తాకారం లేదా పరివేషము) దూరాన్ని బట్టి వర్షాన్ని అంచనా వేస్తారు,

 భజన, కోలాటంలో జడకొప్పులాట, దసరాకు కొత్తబట్టలూ,పాలపిట్టలూ, అలయ్ బలయ్ లు, జమ్మిఆకు పంచుకోవడం గురించి చెప్పారు.

మోట కట్టేందుకు (మోటబావిలో నీళ్ళుతోడుకునేందుకు) తండ్రి తాడు పేనటం
అవ్వ కల్లాన్ని ఊడ్చటం (
 • వరికట్టల్ని బంతికొట్టేందుకు వీలుగా కల్లంలో అమర్చడం)
 , ఆరుకాలల/ఆరుగాలం (ఋతువుల) శ్రమ
బోనాల పండుగ, శివసత్తుల ఆట, కాట్రావుల ఆట
దట్టీ కట్టడం [నడుముకు కట్టుకున్న పంచె గోచీ లాంటిదాన్నీ బిగించి కట్టడం, అరదట్టీలు (Cut drawer). ] చిన్ని కృష్ణుడి వర్ణనలో ప్రసిద్ధ పద్యంలో కూడా ‘‘ బంగారు మొలత్రాడు, పట్టు దట్టీ గురించి చెపుతారు.

పీరీల గుండం (ముస్లిం సంప్రదాయం పీరిల పండుగ సందర్భంగా పెద్ద పెద్ద మొద్దులను మండించి తయారుచేసే నిప్పుల గుండం) , 

సిందోళ్ళ సిందుళ్లు (చిందు బాగోతం చిందు యక్షగానం)

చితికిపోతున్న జానపద కళల్లో ప్రజాదరణ, బహుళ ప్రాచుర్యం పొంది చిందు యక్షగానం. కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న ఈ చిందు బాగోతం చిందు యక్షగానంగా ప్రసింది చెందింది. చిందు బాగోతం ప్రదర్శించిన పల్లె లేదంటే ఆ కళారూపం ఎంతగొప్పదో మనం అర్ధం చేసుకోవచ్చు. చిందు కళాబృందంలో 20 నుంచి 30 మంది కళాకారులు ఉంటారు.చిందు కళాకారుల కుటుంబంలో ఆరు నెలల పసిపాప మొదలుకొని అందరూ కళాకారులే. గ్రామం నడిబొడ్డున ‘చాందిని’ వేసి, చిందు ప్రదర్శన ఉందని చాటింపు వేసి ఊరంతా తిరిగి చెప్పేవారు. సాయంకాలం మసక చీకటి ప్రారంభానికి ముందే గ్రామ ప్రజలంతా ఈత చాపలు, జోరసంచులు, గొంగళ్లు, గడె మంచాలు వేసి వారు కూర్చునే స్థానాలను ముందే ఆక్రమించుకునే (రిజర్వ్‌) వారు. ’లాయిరి’ (బందరమియ్యా)గాని రాకతో యక్షగానం ప్రారంభమయ్యేది. పౌరాణిక గాథలు ఈ చిందు యక్షగానంలో ప్రధాన కథాంశాలు. చిందు కళాకారులు వేషధారణ ప్రదర్శిస్తూ, పాటపాడుతుంటే వారి కుంటుబాలలోని మహిళలు తాళం వేస్తూ కోరస్‌ పాడేవారు. మద్దెల, హార్మోనియం, తాళాలు ప్రధాన సంగీత పరికరాలు. కిరీటాలు, బుజకిరీటాలు, పట్టువస్త్రాలు తదితరాలు ఆహార్యాలుగా ఉండేవి.ఒగ్గు కళాకారుల చిందులు, :

ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ. బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.

కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొగొరవయ్యలు అని వీరిని పిలుస్తారు. వైవిద్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం ఒగ్గు (ఢమరుకం) ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెల్సుకోవడం అంటే కురుమ జాతి చరిత్ర, సంస్కృతుల్ని గురించి తెలుసుకోవట మన్నమాట. ఒగ్గు దీక్ష ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు[[ చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.

సద్ది మోయడం, ముందురోజు రాత్రి వండిన ఆహారపదార్దాలను తెల్లవారగట్ల పనిలోకి వెళ్లేముందు కట్టుకుని తీసుకువెళ్లేవారు. బతుకమ్మ పండుగలో భాగంగా సద్దులు మోయటం అనే సంప్రదాయం కూడా వుంది.

 గొరుకొయ్యల పొద్దు(సప్తర్షి మండల దర్శనం)  ఆర్ద్రానక్షత్రము, గొర్తి కొయ్యలవలె వరుసగా ఉండు మూడు నక్షత్రములు, గొర్తి కొయ్యలు. -- గడియారాలు వాడని ఆ రోజుల్లో రాత్రిసమయాన్ని లెక్కించేందుకు నక్షత్రగమనాన్ని ఆధారంగా తీసుకునే వారు.

ఇవన్నీ ఒక సంస్కృతిని తమ భుజాలపై మోస్తున్న మాటలు వాటిని పాటలో అల్లి జనాలకు అందించిన కవి నిజంగానే ధన్యుడు కదా.
వీటిలో ఒక్కో పదానికి పూర్వాపర వివరణ ఒక్కో పెద్దవ్యాసమో గ్రంధమో అయ్యేంతటి విస్తారమయినవి.

6 comments:

 1. Sahityam Dwaara Samaajaanni Maarchaalanna nibaddhatha tho kavithaa vyavasaayam chestunna krusheevaludu Na.si .Re.
  Abhinandanalu
  Saatyaki
  http://seshendrasharma.weebly.com
  saatyaki@gmail.com

  ReplyDelete
  Replies
  1. సాత్యకీ సర్ నమస్తే..
   ధన్యవాదాలు..

   Delete
 2. Sir please Nandini sidhareddy garu ekadi chettalagali Kavitha nu panpadi sir maa college lo modern Telugu lo lesson undi sir

  ReplyDelete
 3. బ్లాగునుచూస్తున్నట్లులేదు..కట్టాశ్రీనివాస్ గారి అరచేతిఅద్దంలో తెలంగాణాయెడదసందడిలో మైమరచి నడుస్తున్నట్లుంది

  ReplyDelete
 4. బాధుండదాండి. ఏం తమాషాలు చేస్తున్నారా. భ్రమరావతి రాజునైన నేను ధిక్కారమున్ సైతునా

  ReplyDelete

ఫేస్ బుక్

Tweets

లంకెలు