శత వసంతాల సినిమా

రంగస్థలం నుంచీ బొమ్మలు కదలాడుతూ తెరమీదకి ప్రతిక్షేపించబడ్డాయి. ఆక్షేపణలేం లేవు. ఒక చరిత్ర నెమ్మదిగా కనుమరుగవుతూ తెర ఆ స్థానంలో నిలబడింది. కదిలే బొమ్మలాటకు ఇంతపెద్ద ఆర్ధిక(రాజకీయ కూడా ) కదలిక తెచ్చే శక్తివుంటుందని 1913లో అనుకొని వుండరు.

ఆడవాళ్ళు ఈరంగంలో రంగేసుకోవటమే అవమానం అనుకునే దశనుంచీ అవకాశాన్ని పదిలం చేసుకునేందుకు చర్మన్ని పరిచే దాకా ప్రయాణం సాగింది. పొట్టకూటికి పిట్టల దొర వేషాల నుంచీ రాజ్యాలు ఏలేందుకు రంగేసుకున్న ఆకర్షణ పనిచేస్తోంది. అటు రాజకీయాలతోనూ ఇటు మాఫియాలతోనూ పెనవేసుకుంటూ విచిత్రమైన కొత్తతలలను మొలకెత్తించుకుంది.

మూగ గా కదలాటం దగ్గరనుంచీ సాగుతూ మాటలూ, రంగూలూ అద్దుకుని ఈరోజు ఆధునిక సొబగులతో ఐమాక్స్ తెరలపై, త్రిమితీయ హోయలు పోతూ డాల్భీ శబ్దాలతో దడదడ లాడిస్తొంది.

తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిఙ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశం లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గ సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రి లో స్థాపించారు. అప్పుడు వేలరూపాయిలతోనే పూర్తయ్యే చిత్రనిర్మాణం నేడు కోట్లరూపాయిలను అలవోకగా ఖర్చుపెడుతోంది. వందల కోట్లను అంతే సామర్ధ్యంతో తిరిగి తెచ్చుకోగలుగుతుంది. అందుకే అత్యంత శక్తివంతమైన,ఆకర్షణీయమైన మాద్యమంగా ఊరిస్తోంది.

దేశంలో అత్యధిక సినిమా ధియెటర్లు ఆంధ్రపదేశ్లోనే, ప్రపంచంలోనే అతి పెద్ద త్రిమితీయ ఐ మాక్స్ తెర, అత్యధికంగా సినిమాను వీక్షించే తెరలూ హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ లోనే. అతి పెద్ద పిల్మ్ స్టుడియో కూడా రామోజీ పిల్మ్ స్టుడియోనే. అన్నగారు సినిమా తెరకూ రాజకీయలకూ మధ్య వారధి ఎలా వుంటుందో చూపారు. ఎక్కువ తాలూకూ రికార్డులు తెలుగుసినిమాకు చాలానే వున్నాయి.

అయితే ఆధునిక పరిజ్ఞాన నేపద్యంలో పైరసీ వ్యాధి సోకిన సినిమా మరెంత కాలం బ్రతుకుతుందో చూడాలి. లేదా దీన్ని తట్టుకునేలా మరో కొత్తరూపంలోకి మారుతుందో కూడా ఎదురు చూడాలి.



కామెంట్‌లు

  1. బెంగాలి,మలయాళీ,కన్నడ భాషలలో మంచి సినిమాలు వచ్చాయి!తెలుగులో రాలేదు!మన సినిమాలన్నీ ఒకటే మూస!రోడ్ద కొట్టుడు!గొప్ప ప్రపంచ సినిమాలు కూడా మన దర్శకులు చూస్తున్నట్లు లేదు!తెలుగు దర్శకులలో మేధావులు లేరు!రుచి పచి లేని ,చవక బారు,నేలబారు సినిమాలు ఎడాపెడా తీసి పారేస్తున్నారు!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి