అనిర్వచితాలు

చప్పట్లని ఫోటో తీద్దామనుకున్నాను
కలిసివిడిపోతున్న చేతులు తప్ప
చూపించేదేమీలేక ఓడిపోయాను.

భక్తిని బొమ్మగీద్దామనుకున్నాను
భంగిమలను కొలుచుకోవడం తప్ప
బయటకు తేగలిగిందేమీ లేదు.


అమ్మప్రేమను విందామని చెవులు రిక్కించాను
పూల మృదుత్వాన్ని అనుభవించాలని గ్రంధాలన్నీ వెతికాను.
వెలుతురు వాసనలను తెలుసుకోవాలని పరికరాలను కోరాను.
అలసిపోవడం తప్ప తెలుసుకున్నదేం లేదు.


ఆఖరుకి కవిత్వాన్నయినా నిర్వచిద్దామనుకుంటే
పదాలకూ, శబ్దాలకూ అందకుండా
మనసుపై కదలాడే అనుభూతి చినుకుని
అచ్చంగా అంటుకోలేకపోతున్నాను.


ఇంద్రియాలకందని జ్ఞానమేదో
అనుభూతి రంగుల్ని వెదజల్లటం
చాలక నాడుల్ని వాడకుండానే
కదలాడే క్రమాలు స్పర్శిస్తూ వెళ్ళటం
టింపానం ప్రకంపించకుండానే
తరంగాలు మ్రోగుతూ వెలగటం
మాటలుగా చెప్పలేక అశక్తుడనవుతూనే వుంటాను.

అయినా పట్టువదలని విక్రమార్కుడు
అక్షరాన్ని భుజంపై వేసుకుని మౌనంగా నడుస్తూనే వుంటాడు.
తీరా అదేదో అర్ధం అయినా
భాషను సాధనంగా చేసుకుని చెప్పాలని చూస్తే
అనుభూతి వేయివ్రక్కలవుతుందనే ఎరుకను కూడా మదిలో మోస్తూ.

22-11-2013

కామెంట్‌లు