Thursday, 2 January 2014

ముచుకుందా నది మూసీనదిగా ఎలా మారింది.ప్రవహిస్తున్న ముచుకుందా నది
మూసీకున్న అసలు పేరు సంగతి అలా వదిలేయండి. ఇప్పటి తరానికి మూసీ అంటే ముక్కుమూసుకునేంత దుర్ఘంద భరిత మురికి కాలువ అనే తెలుసు. నిజానికి అదో స్వచ్ఛమైన నది, మన అత్యాసలే కలుషితాలై దాన్నలా దుర్వాసనలతో కుమిలిపోయేలా చేసాయని ఎలా తెలుస్తుంది. అదొక స్వచ్చమైన గలగల పారే నదిలా వుండేదని ఎన్నటికి తెలుస్తుంది?

నిజానికి మూసీ నది హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతిలో విడదీయలేని భాగం. మూసీ లేనిదే హైదరాబాద్‌ లేదనుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడలా కాదు. నగరం మధ్యలో మూసీ మురికి కాలువ ఎందుకు ఉన్నదా అని ఆలోచిస్తున్నారు.మూసీ నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో కృష్ణా నది యొక్క ఉపనది. హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది.మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టినల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35% సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.

ఇప్పటిలా చల్లగా సాగిపోయే బక్కపలచని సన్న కాలువ కాదు మూసీ వరద భీభత్సాన్ని సైతం చూపిన ఉగ్రరూప శరీరాన్ని సైతం కలిగినది ఇదే20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.

మూసిఅంటే ఇప్పటిలా చిక్కిపోయి, కాలుష్య కాటుకు రోగగ్రస్తమైన అవసాన కాలువలాంటిది కాదు
అప్పుడు నవయవ్వన శౌర్యంతో ఉప్పొంగిన నది వరదలను సృష్టించగల ఉగ్రరూపధారి అప్పట్లో జరిగిన ఒక సంఘటన ఇది. 

► దానికి సజీవ సాక్ష్యమైన ఒక చెట్టు కథ వినండి.

చరిత్రలో ప్రత్యేకించి ఓ చెట్టుకు విశిష్ట స్థానం లభించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన ఘనతను పొందింది మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోని ఓ పెద్ద చింత చెట్టు. పాత ఇన్‌పేషెంట్‌ బ్లాక్‌లో ఇది ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బ్లాక్‌ ఉన్న స్థలమంతా కూడా ఓ ఉద్యానవనంగా ఉండేది. ఆసుపత్రికి స్థలం అవసరమైన కారణంగా ఆ పార్కును కూడా ఆసుపత్రి స్థలంలో కలిపేశారు. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెబుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లను ఆశ్రయించిన వారు, కూకటివేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకు బలైపోయినా, ఈ చెట్టు ఎక్కినవారు మాత్రం సురక్షితంగా ఉండగలిగారు. రెండు రోజుల పాటు వారు తిండీ తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారని చెబుతారు. 

అది సుమారు 400 ఏళ్ళ క్రితం నాటిదని భావిస్తున్నారు. అది నేటికీ సజీవంగా ఉంది. అంతే కాదు. చెట్టు చేసిన మహోపకారాన్ని ప్రస్తుతిస్తూ ఓ ఫలకాన్ని కూడా దానికి అమర్చారు. దానికి ‘వారసత్వ’ హోదా ఇప్పించే ప్రయత్నాలూ జరిగాయి. సాధారణంగా అలాంటి హోదా కట్టడాలకు మాత్రమే దక్కుతుంది. ఓ ‘సజీవ’ ఉనికి ఇలాంటి గుర్తింపును పొందడం అత్యంత అరుదు. 

ఆ చెట్టు ప్రాధాన్యం దృష్ట్యా దానికి ఇలాంటి గుర్తింపును హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ (హెచ్‌సీసీ) ఇస్తుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ ఆసుపత్రి ఉండేది. 1908 మూసీ వరదల్లో అది దెబ్బ తినడంతో 1924లో ఏడో నిజాం అక్కడ ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించారు. ఆ చెట్టు గొప్పదనాన్ని గౌరవిస్తూ ఏటా నవంబర్‌ 30న హాస్పిటల్‌ డేను ఆసుపత్రి సిబ్బంది అక్కడే నిర్వహిస్తుంటారు. 

2002లో ప్రముఖ కవి రావూరి భరద్వాజ ఆ చెట్టును ‘ప్రాణధాత్రి’గా అభివర్ణించారు.

నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
మూసీ నరాల గుండా అత్యాస విషాన్ని నింపిదెవరో కానీ ఈ రోజు దీనంగా రోగగ్రస్త అయ్యింది.
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.


మూసినది పేరు వెనక చరిత్ర

హరిచ్చద్రుడూ, దిలీపుడూ, రఘు, శ్రీరాముడు వంటివారు జన్మించిన ఇక్ష్వాకుల వంశం లేదా రఘు వంశంలో జన్మించిన మాంధాత మహారాజ పుత్రుడు ముచుకుందుడు. ఒకనొక సందర్భంలో దేవతల తరపున రాక్షసులకు వ్యతిరేఖంగా జరిగిన ఘోర యుద్దంలో పాల్గొని శత్రువులను ఓడిస్తాడు. కానీ ఆ యుద్దంలో చాలా అలసి పోవటం వలన మంచి విశ్రాంతి కావలనుకుంటాడు. తన అలసట తీర్చుకోవడానికి అనంతగిరి కొండల్లో నిద్రిస్తాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు తపస్సు చేయాలనుకున్న మార్కండేయ మహర్షి అందుకు అనువైన స్థలాన్ని తనకు సూచించాలని బ్రహ్మ దేవుడిని కోరగా, ముచుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండలే నీకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశమని బ్రహ్మదేవుడు మార్కండేయునికి సూచిస్తాడు. బ్రహ్మ దేవుడు సూచించిన ప్రకారం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఈ సమయంలోనే శ్రీ కృష్ణుడు,

బలరాముడిపై కాలయవనుడు అనే రాక్షసుడు దండెత్తి రావడంతో ఆయన ధాటికి తట్టుకోలేక శ్రీకృష్ణ, బలరాములు అనంతగిరి అడవుల వైపు పరుగెత్తి వచ్చి అదృశ్యమవుతారు. వారిని వెంబడిస్తూ అనంతగిరి అడవులకు వచ్చిన కాలయవనుడు అక్కడ తపస్సులో ఉన్న మార్కండే యుడిని చూసి శ్రీకృష్ణ, బలరాముల జాడ సూచించాలని కోరగా మార్కండేయుడు ముచుకుందుడు నిద్రిస్తున్న గుహను చూపిస్తూ ఆవైపు వెళ్లమని సైగ చేస్తాడు. కాలయవనుడు ఆగ్రహంతో భీకరంగా అరుస్తూ గుహలోకి ప్రవేశిస్తాడు. . కాలయవనుడి భీకరమైన అరుపులకు నిద్రాభంగమైన ముచుకుందుడు ఆగ్రహంతో కళ్లు తెరువగా, ఆ కళ్ల నుంచి వెలువడిన కాలాగ్ని జ్వాలకు కాలయవనుడు అక్కడిక్కడే భస్మమై పోతాడు. అంతకు ముందే అతడికి దేవతలు ముచుకుందుడికి నిద్రాభంగం కలిగించిన వారు భస్మమయ్యేలా వరాన్ని ప్రసాదిస్తారు. ముచుకుందుని కోపాన్ని శాంతింప చేయడానికి శ్రీ కృష్ణుడు అనంత స్వరూపుడై శ్రీమన్నారాయణుడి(అనంత పద్మనాభస్వామి)రూపంలో దర్శనమిస్తాడు. శ్రీ కృష్ణుడిని అనంత స్వరూపంలో చూసి ప్రసన్నుడైన ముచుకుందుడు వెంటనే తన కమండలంలోని పంచతీర్థంతో శ్రీమన్నారాయణుడి పాదాలను అభిషేకిస్తాడు. స్వామివారి పాదాలను అభిషేకించిన పంచతీర్థం ద్వారా ఉద్భవించిందే ముచుకుందా నది. ఈ నదిలో స్నానమాచరించిన వారి కోరికలు నెరవేరుతాయని శ్రీమన్నారాయణుడు అభయమిస్తాడు. నాటి ముచుకుందా నదే కాలక్రమేణ మూసీనదిగా పిలువబడుతోంది. ముచుకుందునికి శ్రీకృష్ణ భగవానుడు అనంతపద్మస్వామి అవతారంలో దర్శనమిచ్చిన కారణంగానే అనంతగిరిలో వెలసిన స్వామికి అనంత పద్మనాభ స్వామిగా పేరు వచ్చిందని పురాణ కథనాలు చెబుతున్నాయిమూసీ పై వంతెనలు

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.


ఫేస్ బుక్

Tweets

లంకెలు