పుట్టగొడుగుల తోట

నిశ్శబ్దం తలొంచుకుంటే
మాటలు పుట్టగొడుగుల్లా పొడుచుకొచ్చాయి
నిశ్శబం సుతారంగా నిలబడితే
గందరగోళమంతా ముడుచుకుని మూలపడుకుంది.

అదే వీణ పైపైన చూస్తే
ఒక్కోసారి బిగించి, మరోసారి వదిలేసే
నరాల తీగలు అల్లుకున్న దేహం మాత్రమే.
రాగాల రంగుల్నొసారి వెలిగించటం మొదలెడితే
వట్టిపోయిన తనం మొలకెత్తి నిలబడే వటవృక్షం కూడా మరోసారి.

భూమి గుండ్రంగానే వుందని చెప్పేందుకు
మాగిలాన్ మళ్ళీ మరో వలయం తిరగాలా?
బుర్రగోళాకారంలో వుందిగా చాలదా?

ఎన్ని గుంపుల్ని వెలిగించినా
ఒంటరి తనపు నీడ పెరుగుతూ తరుగుతూ వుంది.
ధైర్యపు దీపం ఆర్పేశాక
నీడని తిన్న చీకటి బ్రేవు మని తేన్చింది.
బరువు దిగిందో, పెరిగిందో తూచే త్రాసు కూడా దొరకట్లేదు.


కవిసంగమంలో 

కామెంట్‌లు