దేవరకొండ బాల గంగాధర తిలక్ || నీడలు

( జనసేన పార్టీని ప్రారంభిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని లైన్లు ఈ కవితలోనివే )

చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘం భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా
వీళ్ళందరూ సగం సగం మనుష్యులు
మరోసగమ్ మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం, భాగవతం చదువుతారు
పాపం,పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విధ్యాధికులు విధూషకులు
తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
ధారిపక్క నిల్చిన మోడుచెట్ల భాధని అనువదించాలి
పచ్చికలో ధాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యా గగనం రుథిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, ఇల్లేమో దూరం
చేతిలో దీపమ్ లేదు, ధైర్యమే ఒక కవచం

కామెంట్‌లు