మట్టివేళ్ళు-మిత్ర పొత్తం - NVM వర్మ కలిదిండి

ఇంతకీఏముంది మిత్ర పొత్తంలో! రెండు మూడుసార్లు చదివినా ఇంకా ఏదో ఉంది మళ్ళీ చదవాలని ఎందుకు అనిపిస్తొంది? మట్టి వేళ్ళు పుస్తకమేనా మనిషా?మనిషి అంతరాలయం ఈ కవిత్వమా? అడగగా అడగగా కవి "మరోసారి" ఇలా అన్నాడు

"చెప్తానంటే వినే ఓపికా నాకుంది
వింటానంటే చెప్పే సహనమూ ఉంది"



సరే అగ్రజా చెప్పు నారాత లేవో నేను తర్వాత రాసుకుంటా అన్నాను, అప్పుడింక "అంచుల దాకా" తీసుకెళ్ళి
"బహుశా ఇది ప్రపంచానికి చివరి కామోసు
అరె అదేమిటి?
నాకంటే ముందుగా ఎగురుతూ కనిపిస్తొంది
ఆశ్చర్యం
అదో కవిత్వాన్ని పులుముకున్న కాగితం"
అని అన్నాడు.

ఇక నేను కవిత్వం వెంటపడ్డాను. చదువుతూ మళ్ళీ ఆలోచనలో పడ్డాను, కవిత్వమంటే స్పందించడమేనా పాఠకుడిలోకి పరావర్తనం చెందటమేనా!నిత్య సామాజిక మానసిక సంఘర్షణ నడుమ సగటు మనిషికి కవిత్వం ఏమిస్తుందని అడగటమే తడవు

"ఏ సాంత్వనలో
దుఃఖం ఉపశమిస్తుంది?
కన్ను తుడిచేచేయి,వెన్ను నిమిరే ఒడికోసం
అంగట్లో అంగలార్చకు"
అంటూ హెచ్చరించి ఇలా అన్నాడు.

"నిన్ను నీవే ఆవిష్కరించుకోకుంటే
ప్రపంచం తన నిశబ్దంతో బహిష్కరిస్తుంది"


ఒకటికి రెండు సార్లు ఎందుకు చదివాను అంటే కొన్ని కవితలు నిగూడంగా ఇంకేదో ఏదో చెబుతున్నట్టు అనిపించాయి నాకు,ఇంత ఓపిక ఎక్కడిదీ మనిషికి అనుకొంటూ మట్టిలో అన్వేషణ కొనసాగించాను, వీపు మీద బళ్ళున చరిచినట్టు ఉలిక్కిపాటులో ఊహకందక నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు,ఒక్క చొట కళ్ళూ మనసూ రెండూ ఆగిపోయాయి.
"సుదృడ కాండపు దేహాన్ని నిటారుగా నిలిపి
ప్రపంచమే నాదన్నట్లు గర్వంగా వొదిగినా"

"గర్వంగా ఒదిగినా" ఈ రెండు పదాలు చాలవూ కవీ కవిత్వమూ ఒకటేనని చెప్పడానికి,నిజాన్ని నిజంగా చూడాలన్నా చదవాలన్నా కించిత్ సాహసం చెయ్యలని తెలిసొచ్చింది ఈ పూట నాకు.

కట్టా శ్రీనివాస్ పరిచయమున్న వారందరికీ ఆతని ప్రజ్ఞా పాటవాలు, బుద్దికుశలత, మృదు మధుర స్వభావం తెలిసినవే మరి ముందు మాటలో అఫ్సర్ గారన్న లోపలి యుద్దం ఏమిటంటే
"కూర వండేందుకు వేడి ఉడాల్సిందే
పరిస్థితులలో మార్పు పండాలంటే
కోపమూ ఉండాల్సిందే"

కవి తనలో లేని కోపాన్ని, తనకూ అవసరమే అనుకొన్న కోపాన్ని..ఎంతవరకూ అవసరమో తెలుసుకోవడం లోపలి యుద్దమే కదూ.....

అక్కడా ఇక్కడా విశ్లేషనలూ విమర్సలూ చదివి అభివ్యక్తిని కూడా వెదికాను.కవి;
"ముడి చెదిరిన జడలా
రెప రెపలాడుతున్న కొబ్బరాకుల సవ్వడి"

అనగానే నేనికి పుష్కర స్తానానికి బయలుదేరాను.

ఇంతకీ ఏముంది మిత్ర పొత్తంలో! మట్టి వేళ్ళలో?
చిలక వాత్సల్యపు ఇస్మైయిల్ బాబా పలకరింపు ఇంపు ఉంది.

మిత్రమా కట్టా శ్రీనివాస్ నీమాట నీకే ఇప్పుడిక:

నీకు, నీలాంటి వాళ్ళకు మరో ప్రదేశముంది

అక్కడికే వెళ్ళు ఫో
కుదురితే వాళ్ళతో ఉండిపో
దాన్ని స్వర్గమని
నీలాంటి వాళ్లనే దేవతలనే పేర్తొ
తిడతారని
ఎక్కడో విన్నా


ఆ ప్రదేశం జనం నాలుకలని, అక్కడ మీ కవితలు నిరంతరాయంగా ప్రవహించాలని కోరుకొంటూ....

గర్వంగా వొదిగినా పచ్చని చెట్టుని నిలబెట్టిన మట్టివేళ్ళ నడుమ ఒకానోక వానపాము.....



మీ వర్మ.

















కామెంట్‌లు