Saturday, 21 June 2014

కవిసంగమం వేదికపై కొత్తతరం కవిత్వపు ప్రతినిధిగా : రక్షిత సుమ మాటలు ( పూర్తిపాఠం )

పచ్చని కవిత్వపు చెట్టు నీడలో,
ఓ చిన్ని పిట్ట పాటలకు పరవశించేంత
నిండు  హృదయం ఉన్న పెద్దలందరికీ ముందుగా వందనాలు.
ఈ కవిత్వపు సాయంత్రాలను ఆశ్చర్యంగా,చిత్రంగా గమనించే నన్ను కూడా వేదిక మీద చదివేందుకు అర్హురాలివే అంటూ నన్నిలా మీ ముందు నిలబెట్టిన యాకూబ్ అంకుల్ కి, శిలాలోలిత ఆంటీకి, కవిసంగమం నిర్వాహకులందరికీ పేరుపేరునా నమస్కారాలు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, డా||దేవరాజు మహారాజు గారు ,మా డాడీ కూడా మాస్టర్ అని పిలిచే శ్రీ శ్రీరామోజు హరగోపాల్ గారికీ, కవి బాబాయ్ లు కలిదిండి వర్మ గారు, పుష్యమి సాగర్ గార్లకు  నమస్కారం  తెలియజేసుకుంటున్నాను.
   మీతో పాటు ఇలా కూర్చొని,  కవిత్వం చదవటాన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

నేను సత్తుపల్లి స్కూల్ లో చదువుకునేటప్పుడు మా డాడీ ఖమ్మం జిల్లా బాల సాహిత్యం  సంపాదక వర్గంలో పనిచేస్తున్నారు.పిల్లలు చెప్పే కథలనే వాళ్ళు పుస్తకాలుగా తయారుచేస్తారట.
నన్ను కూడా ఏదైనా చెప్పమన్నారు.
మా నానమ్మ కట్టా లీలావతి చెప్పే కథ లోంచి చీమ-మిడత  అనే కథకు  మా రైమ్స్ బుక్ లోని పద్యం
Work while you work
Play while you Play
This is the way
To be happy each day ని జత చేశాను
ఇది రాష్ట్ర స్థాయిలో బాలసాహిత్యం నుంచి విడుదలైన 100 కథా వాచకాలలో 36వ నంబరుది.
 ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోను ,గ్రంథాలయాల్లోనూ ఇది ఉంది.
తరువాత...
నేను ఆరో తరగతిలో వుండగా హైదరాబాద్కి వచ్చాం.
నా పేరుతో Rakshita Suma (www.rakshitasuma.blogspot.inఅని నాకొక బ్లాగు తయారు చేసారు.
మా డాడీ బ్లాగుతో పోటీ పడుతూ ఏదో ఒక సమాచారాన్ని నింపడం కోసం ఇక మొదలయ్యాయి తిప్పలు.
Rakshi TV (https://www.youtube.com/user/RakshiTV)  పేరుతో పెట్టే ‘‘ తొక్కలో కళ’’ విడియోల నుంచి మా పిక్నిక్ విశేషాలు, నేషనల్ సింబల్స్ అంటూ  పెట్టుకుంటూ వచ్చాను. దానితో పాటు కవిసంగమంలో నా కర్ధమయ్యే కొన్ని కవితలు చదువుతూ అప్పుడప్పుడూ రాయడానికి ప్రయత్నించేదాన్ని.
2012 లో నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ‘‘ మట్టివేళ్లు’’ పుస్తకావిష్కరణ జరిగింది
అప్పుడనిపించింది నేను కూడా పుస్తకానికి సరిపోయేటన్నన్నా కవితలు రాస్తే బావుంటుంది కదా అని.
బహుశా జూలై 2014 నాటికి అన్ని పనులూ పూర్తయితే, నాకొన్ని కవితలను చిన్ని పుస్తకంలా మీకు అందిస్తాను.
ఇది కవిత్వంలో నా బుడి బుడి అడుగుల ప్రయాణం.
.....................................................
ఇప్పుడు చదవబోయే దోమ మీది కవితను రాజమౌళి గారి ఈగ కంటే ముందే రాసుకున్నా.
ఒక రోజు మా స్కూల్ లో మెడిటేషన్ నడుస్తున్నపుడు, ఒక దోమ ‘‘ గుయ్ గుయ్’’  మంటూ గొడవచేస్తుంటే అంతకుముందు టీవిలో చూసిన సినిమాలో మునిగారి తపస్సును భంగం చేయటానికి నాట్యం చేస్తున్న అప్సరస గుర్తొచ్చింది.
పాపం అది పాడుతున్న దోమైనా నాకప్పటికి పాడుదోమే అనిపించింది.
చివరికి దానిని ఎలా సత్కరించానో ఒక్కసారి వినండి మరి.


ధ్యాన భంగిని
పాడు దోమ
పోయిన జన్మలో
అప్సరసేమో
నాట్యం గానంతో పాటు
ధ్యానభంగ విద్య కూడా
వచ్చెసిందేమో
తరగతి గదిలో
నా ధ్యానం పై
ఎప్పుడు దాడి చేస్తుంది
కళ్ళు మూసుకుంటే
చెవుల్లో పాటలు పాడుతుంది
చెవులు కూడా మూసుకుంటే
గుచ్చి గుచ్చి పలకరిస్తుంది
దాని కర్ణకటొరగానప్రతిభకు
నా చప్పట్లే బహుమానం
ఇంకెం చెయను?
అయినా నా ధ్యానం భంగమైందిగా......
||16-12-2012||


ఒక సంవత్సరం వినాయక చవితీ, రంజాన్ ఒకే సందర్భంలో వచ్చాయి.
ఒకళ్ళు చవితి చంద్రుడిని చూడొద్దని కళ్ళు దింపుకొని తిరుగుతుంటే మరొకరు చందమామ లీలగానైనా కనిపిస్తాడేమో పండుగ చేసుకుందామని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అదే అంశాన్ని కవితగా రాశాను.పండుగ వెన్నెలల మామ
చందమామ కోసం
పండుగ ఎదురు చూడటం
ఎంత బాగుంది!
చవితి రోజు
నెలవంకతొ
దొంగా పొలీసాట
భలే బాగుంది.
వేషం,భాష వేరేమో కాని
అందరం భూమి తల్లి పిల్లలమే
ఈ అమ్మ తమ్ముడివేగా
ఓ చందమామ
అందుకే నీవంటే మాకంత ప్రేమ.
ఎవరింట పండగైనా
తొలి అథిధివి
నువ్వే!
చల్లదనమేగాని
పగలసెగ నెరుగవు
వెన్నెల సహనం మాక్కూడా ఇవ్వు
కాకెంగిలితో చాక్లెట్ ముక్కలు పంచినట్లు
అందాల మామ
మా చందమామ!


నేను కవిత్వం రాసే పద్దతి కొంచెం నెమ్మదిగా వుంటుంది. కొంచెం ఏంటిలేండి బాగానే నెమ్మదిగా వుంటుంది. భావనలను పేర్చుకుంటూ, పదాలను ఏరుకుంటూ, గిజిగాని గూడులా నెమ్మదిగా అల్లుకుంటాను. ఊరగాయలా కొద్దిగా మాగనిచ్చి తరువాతే వడ్డిద్దాం అనుకుంటాను.
ఉదాహరణకు ఒక రోజు ఏదైనా డౌట్ వుంటే డాడీ నడుగు అని మా అమ్మ చెప్పిన మాట విన్నాక ఇదేదో బావుందని పించింది దానిని కవితగా మొదలేసాను.
ఏఏ సందర్భాలలో ఎవరిని అడుగుతూ ముందుకి తడుగేయాలో ఈ కవితలో ఒక రకంగా నాకు నేనే చెప్పుకున్నట్లు, మీకు కూడా తెలియజేస్తుంటాను.

అడుగులు
డౌటుంటే డాడీనడుగు
అనుమానముంటే అమ్మనడుగు
ఆచీతూచక అడుగేస్తే
గడబిడల ప్రపంచంలో
తడబడే ప్రమాదముందని గుర్తెరుగు
గురి వైపు సాగాలంటే గురువునడుగు
పోగుబడ్డ ప్రపంచ విషయాల పరిశీలనకు పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు
ఆసరాతగ్గితే నేస్తాన్నడుగు
వెలుగెక్కడుందని నీడనడుగు
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు ….
పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి.


నా కవితలో వినాయక చవితి మరోసారి వచ్చింది. నిమజ్జనపు వేళలో భక్తి పేరుతో చేసే ఆటంకాలకు వినాయకుడు కూడా నొచ్చుకుంటాడేమో అనిపించింది. అవిఘ్నమస్తు అనే బొజ్జగణపయ్యకు నిమజ్జన సమయంలో ఇన్ని విఘ్నాలు కల్పించడం అవసరమా అనిపించింది.

అవిజ్ఞులు
ఎవర్రా బాబు అది
నగరపు నల్లబల్ల నుదుటిపై
విఘ్నధిపతి అర్ధాన్ని
తిరగేసి రాసింది?
మీ రెండు సిమ్ముల సోల్లో
భక్తి బాలెన్సుంటే
కాసేపలా ఊగులాట్టం ఆపి
ఆయనతొనే సరాసరి
ఓ కాన్ఫరెన్స్ కలపండి
ఇదంతా
ఇలాగే అవసరమా?
అని అడిగేస్తానోసారి.
తేది. 18-09-2013
(నగర వాచకం... నిమజ్జనపు వేళ)


మా బాబాయి ఫోన్ కి  రింగ్ చేస్తే వాళ్ళ డిపార్టమెంట్ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. ‘‘ అనుమానాస్పద బ్యాగుల్ని, టిఫిన్ బాక్సుల్ని తాకొద్దనీ హెచ్చరిక వుంటుంది. మీరూ వినే వుంటారు.

అప్పట్లో అల్లాద్ధీన్ ఆంటిక్ లాంతరో, పాత సైకిలో దొరికింది కదా అని రుద్దితే భూతం బయటికి రాదు. రుద్దిన వారు భూతమయ్యే ప్రమాదముంది.

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ లాంటి సంఘటనల నేపద్యంలో రాసిన కవిత

కొత్త చీకట్లు
ఒకప్పుడు
దారిలో కనిపించిన
లాంతరొకటి రుద్దగానే
భూతమొకటి బయటికొచ్చి
‘‘ ఆజ్ఞా కీజియే మేరే ఆకా’’ అనేది
కోరికలను ఇట్టే తీర్చేసేది.
అది
మంచిదైనా, చెడ్డదైనా
న్యాయమైనా, అన్యాయమైనా,
కానీ ఇప్పుడు
దారిలో లాంతరో, జంతరు మంతరో
కనిపించింది కదా అని
తీసి రుద్దితే
మాటల్లేవ్... మాట్లాడుకోటాల్ ల్లేవ్...
అప్పుడు లాంతరున్న వాడితే రాజ్యం
ఇప్పుడు లాంతరెట్టిన చోట వుండదు రాజ్యం
ట్రెండ్ మారింది గురూ...
అన్నీ అల్లావుద్దీన్ లాంతర్లే కాదు
బిన్ లాడెన్ లాంతర్లూ
కొన్ని మందు పాతర్లూ కూడా వుంటాయి.
02-02-2014


నాకీ అవకాశం ఇచ్చిన  పెద్దలందరికీ  పేరు పేరునా ధన్యవాదాలు.
కవిత్వానికి జీవం పోస్తూ నాలాంటి వారిని ఉత్సాహ పరుస్తున్న కవిసంగమానికి మళ్ళీ మళ్లీ ధన్యవాదాలతో సెలవు
నమస్కారం.

ఫేస్ బుక్

Tweets

లంకెలు