Monday, 23 June 2014

రామప్ప గుడి శాసనము పూర్తిపాఠం (అనువాదము)

రామప్ప గుడి శాసనము (అనువాదము)

No 50 (AR No 341 of 1966 )

వరంగల్ జిల్లా శాసనం పుటలు 142-149

పాలంపేట (ములుగు తాలూకా)

కాకతీయ యుగం గణపతిదేవ చక్రవర్తి కాలం
శాలివాహన శకం 1135 శ్రీముఖ (క్రీ.శ. 1213)గణపతిదేవుని సేనాధిపతులలో అతి ముఖ్యుడు రేచర్ల రుద్రుడు మహాదేవరాజు తదనంతరము గణపతిదేవుని సింహాసనాధీష్టుడిని చేయడంలో ముఖ్యపాత్ర వహించాడు. పాలంపేటలోని రామప్పచెరువుని నిర్మించింది ఇతడే. ఈ శాసనంలో రేచర్ల వంశానుక్రమమును తెలుపుచున్నది. ఈ సంస్కృత శాసనము తెలుగు కన్నడ ప్రాచీన లిపిలో 54 శ్లోకాలలో రచించపడినది. దీని ఆంగ్లానువాదము Dr.L.D. Barnett D.Litt చేసినట్లు గులాం యజ్దాని ముద్రించారు.


తెలుగు అనువాదం : డా: హరి సనత్ కుమార్ M.A. Ph.D

రుద్రేశ్వరునికి నమస్కారము....

1.       చిక్కని మదజలము స్రవించి చారికలు కట్టిన కపోలములపైని తుమ్మెదల వరుసల వలె కస్తూరిపూతల అందములు వొలకించుచున్న గజవదనుడైన గణేశుడు మిమ్ము రక్షించుగాక.

2. దేవదానవుల సమూహములచే అర్చింపబడుతున్న పాదపద్మములు గల వరములనిచ్చు శారద ఎల్లప్పుడూ మీకు ఆనందమునిచ్చుగాక

3. ఎవని పాదపద్మముల వద్ద నిరంతరము నమస్కరించుచున్న దేవతల ప్రభువు యొక్క కిరీటము నుండి ప్రసరిస్తున్న నీలమణికాంతి కిరణముల సమూహము, ఆనందముతో రొదచేయుచున్న తుమ్మెదల సమూహమును పోలియున్నదో ఎవడు తన తలయందు బాలచంద్రుని అలంకరించుకున్నాడో అట్టి శివుడు ఐశ్వర్యము నిచ్చుగాక.

4. ఆదివరాహమై, నల్లని మేఘశకలముతో కూడిన చంద్రరేఖల వలె, లీలాక్రీడలో భూమిని తన కోరల చివర ధరించి, సముద్రపు నీటి బిందువులు స్వేదబిందువులై మెరయుచుండగా, నక్షత్రములు పొదిగిన ఆకాశము వలే వెలుగొందుచున్న శ్రీపతి మీకు శ్రీయముల నిచ్చుగాక.

5. జయశీలి అయిన గణపతిదేవ ప్రభు విజయుడాయెను అతని చిత్మునందు ఈశుడు సుస్థిరుడై ఉండెను.

6. ఆయన రణరంగ ప్రవేశము చేసినప్పుడు అతని సైన్యములోని అశ్వసమూహముల కాలిగిట్టల నుండి రేగిన ధూళి, అతనికి అనుకూలముగా వీచు గాలికి ముందుకు పయనించుచు సాక్షాత్తు భూదేవి వలే వొప్పారుతున్నది. ఆమె తనను రక్షించు ప్రభువుకు సంతోషము కలిగించుటకే అతని శత్రురాజులను తెగతార్చుటకు కోపముతో ముందుకు సాగుతున్నట్లున్నది.

7. ఆ రాజును సేవించుటకు వచ్చిన రాజుల వాహనములైన ఏనుగుల తొండముల నుంచి కురియుచున్న నీటిధారలతో తడిసి ప్రజలు అంతటి తీవ్రవేడిని కురిపించే ఋతువులో కూడా చల్లదనమును అనుభవించిరి.

8. ఆ రాజు చేసిన భూరిదానముల వలన పొందిన భూ,ధన వైభవములతో సంప్రీతి నొందిన బ్రాహ్మణుల సమూహములు చేసిన అనేక యజ్ఞములతో హవిస్సులతో అగ్నిదేవుడు ఆనందము పొందెను. అగ్ని ఆ భూరి హవ్యములను దేవతలకు అందించుటలో ప్రయాస కూడ పడుచుండెను. అందువలన అగ్నిదేవుడు సుఖదు:ఖములను కలిసి అనుభవించుచుండెను.

9. అట్టి గణపతి చక్రవర్తికి భక్తుడు, గొప్ప వీరుడు అయిన రుద్రచమూపతి రేచర్ల ప్రభువు. ప్రఖ్యాతి వహించిన రేచర్ల ప్రభువు వంశమును గురించి చెప్పుచున్నాను 10. ఆ వంశమునందు సుగణమూర్తియై తన ప్రతాపముచే రాజ్యమును రక్షిస్తున్న ‘బ్రహ్మి’ అనే సేనాని వుండేవాడు.

11. తూర్యములు మ్రోగిన వెంటనే తెర ఎత్తిన చందమున కాంచీనగర ద్వారములు తెరచి కాకతి ప్రభువునకు, వీరలక్ష్మికి వివాహమెనర్చెను. ( కాకతి ప్రభువు కాంచీనగరమును జయుంచుటకు కారకుడైనాడు)

12. బ్రహ్మసేనాని వంశములోనే ‘కాటయ’ అను సేనాని జన్మించెను. అతడు శత్రుంజయుడు, విచిత్ర సంపదలు పొందిన వాడు మరియు సజ్జనులకు ప్రయమైనవాడు.

13. బ్రహ్మ మరియు దేవతా సమూహములు నమస్కరించగా వారి కిరీటములలోని శ్రేష్టమైన బృహన్మణి సమూహముల కాంతులచే ఎర్రనైవెలుగొందుచున్న శ్రీకంఠుని దివ్వపాద పద్మములయుందు ఈ కాటయ చిత్తముఅనే భ్రమరము లగ్నమై యుండెడిది.

14. అతని పుత్రుడు కామసేనాని. ఈ కాముని చరిత్ర విచిత్రమైనది. ఈయన నిర్మల మానసము లోకనాధుని పాదపద్మముల యందు లగ్నమైనది.

15. ప్రోలరాజు యెక్క సైన్యాధ్యక్షుడుగా శక్తి ప్రతాపముల కు ప్రఖ్యతిగాంచిన ఈయన యుద్దములో ‘మంథన్యగుండ’ ను రాజును ఓడించినపుడు, గజరాజును సింహము పడవేసినపుడు సమూహములోని ఇతర గజములు భయముతో పారపోయినట్లు ఇతర శత్రురాజులందరు భీతితో తొక దిక్కు పారిపోయిరి.

16. ఈ కామసేనాని కొడుకు శూరుడు అతని పేరు కాటయసేనాని. ఈ కాటయ సేనాని సత్యభాషణము, అవక్ర పరాక్రమము అలంకారములుగా కలవాడు శూరుల చేత స్తుతించబడినవాడు.

17. ఈ కాటయసేనాని సుగుణములు అనే మణులు కుప్పలుగాగల సముద్రము. సజ్జనులైనవారికి ఏకబంధువు. వితరణలో కల్పవఈక్షము, శత్రుసమూహములను అణచివేయువాడు విమల బుద్ధిగా కీర్తి గడించిన వాడు అభీష్టసిద్ధి పొందిన వాడు . పశుపతి వంటి మూర్తి గలవాడు. అతని కీర్తిప్రఖ్యాతము, అనంతము.

18. ‘రోహణము’ అనే పర్వతరాజము నుంచి ఉజ్జ్వలమైన వైఢూర్యములు ఉద్భవించినట్లు అతనికి శత్రుంజయుడైన ‘రుద్రచమూపతి’ అనే కుమారుడు కలిగెను.

19. బ్రహ్మదేవుడు స్థైర్యమునకు మేరువును సృజించాడు కానీ దానికి మార్దవము లేదు. సౌందర్యానికి మన్మధుని సృష్టించాడు. అతడు ఈశ్వరునిపై తిరుగుబాటు చేశాడు. గాంభీర్యానికి సముద్రాన్ని సృష్టించాడు. కానీ అది ఆర్దులకు అందుబాటులో లేదు. కనుక వీటన్నిటితో అసంతృప్తి చెందిన బ్రహ్మ ఏదోషాలు లేని సుగుణాలఖనిగా కామాంబికా నందనుడైన రుద్రచమూపతిని సృష్టించాడు.

20. ఈ రుద్రసేనాని ప్రతాపం అనే ఎండ శత్రురాజులు అనే చీకటిని నిర్మూలిస్తుంది. శత్రురాజుల స్త్రీల ముఖపద్మములు వాడిపోయేలా చేస్తుంది. స్వర్గంలోని సురకన్యలు తమప్రియులను కలుసుకొని, వారి నేత్రపద్మాలను వికసించేలా చేస్తుంది.

21. శత్రురాజ సమూహమనే పర్వతంపై పిడుగువంటి రుద్రభూపతి, కాకతినాధుడు భోగించుటకై రాజ్యలక్ష్మిని కైవసము చేసుకున్న వీరుడు ఇతడు స్వర్గమునకు వెళ్ళగానే పూర్వము ఇతనిచే పరాజితులై స్వర్గమునందున్నశత్రురాజులు విఖ్యాత పరాక్రముడైన ఈతనిని చూసి భయకంపితులై లేచిరి.

22. ఈయన ఒక అవిధేయుడైన శత్రుసామంతుని శిరస్సు ఖండించి సమున్నతమైన తన ధ్వజదండమునకు తగిలించి, విశ్వ సౌభాగ్యమునకై తన ప్రభువు నగరమున నిలిపెను. ఆ ఖండిత శిరస్సు శత్రురాజులనే వన్యమృగములను పారద్రోలు దిష్టిబొమ్మవలె ఉండెను.

23. సమున్నతమైన అతని సైన్య పతాకములు చూచి నాగతి అను రాజు వేగముగా పలాయనము చిత్తగించెను.

24. కాకతీయ ప్రభువు యోక్క భాగ్యలక్ష్మి చరణములు కంటకములలో చిక్కుచున్నపుడు త్రివిధశక్తి తాత్కాలికముగా భంగమైనప్పుడు, స్వామిభక్తిపరుడు సునిశ్చితమతియైన రేచర్ల రుద్రుడు తన భుజ బలముచే ఆటంకములను నిర్మూలించి, ఆ కాకకతీయ భాగ్యలక్ష్మిని భద్రముగా సుస్థాపన చేసెను.

25. ఈ శ్లోకభాగం నష్టమై పూర్తిగా కనిపించుట లేదు. ఇది రుద్రుడి సైనిక విజయాలను వర్ణిస్తుంది.

26. రుద్రచమూపతి యెక్క తీక్షబాణములు యుద్ధభూమిలో శత్రురాజుల శరీరములను చీల్చియూ ఈ వీరుల మనసు చూసినంతనే అసువులు బాసినారు. మనము వీరిని అనవసరముగా గాయపరచినాము అని సిగ్గుపడుతూ ముఖములు వాల్చినవి.

27. శత్రురాజులు ఛత్రములు అతని బాణములచే చీల్చబడి నేలకూలి ధూళితో కలిసి కాంతి విహీనమైన వైభములై కన్పిస్తున్నవి.

28. అతని బాహుపరాక్రమానికి భీతిల్లిన శత్రురాజులు అతనితో సమానం కావాలనే కాంక్షతో విశాలమైనన భూమి భృత్ (పర్వత/రాజుల) కటకాల (కోనలు/శిబిరాలు) గుండా నడుస్తున్నారు. ఆ కటకాలు విశాల సాలములతో నిండి దట్టంగా ఉన్నాయి. దుర్గమంగా ఉన్నాయి. రొదచేస్తున్న నాగుల (ఆటవిక/ఏనుగుల) తోను, మేతమేస్తున్న వాజుల (గుర్రాలు/పక్షులు) తోనూ నిండి ఉన్నాయి.

29. వాడిమొనగల, బంగారు చివరలు గల అతని బాణాలు, అతని మొక్కవోని పరాక్రమానికి అనుగుణంగా, యుద్ధంలో శత్రురాజు సమూహాలను చీల్చుతూ భూమిలోనికి ప్రవేశించి, భూమిని ‘ఆదిశేషుడితో’ ఈ రోజు దుర్జనులను ఓడించి భూబారాన్ని తగ్గించాము’’ అని నివేదించాయి.

30. యుద్దభూమిలో చెలరేగుతున్న అశ్వముల కాలి గిట్టల నుండి రేగిన దుమ్ము ఆకాశమంతా పరుచుకొనియు, భద్రగజముల మదజలముతో తడిసి భూమి నుండి విడివడి పైకిలేచిన మేఘమువలె ఒప్పుచున్నది. స్తంభము వంటి దీర్ఠమైన అతని చేతి ఖడ్గధారలకు తలలు తెగిన యుద్ధవీరులకు, వీరస్వర్గములోని అప్సరసలతో జరుగు పెళ్ళితంతులోని తెరవలే ఆ మేఘము కన్పించుచున్నది.

31. రాజఠీవితో వెలుగొందుతున్న రుద్రుని కరవాలము శత్రువీరుల బృందములను చెండాడుతూ ధూమ్రవర్ణమును సంతరించుకోగా, శత్రువీరుల ఖండిత అవయవముల నుండి రక్తము ముద్దలు అగ్నివలెను. శత్రురాజ గజముల కుంభస్థలముల మీది ముత్యములు రక్తముతో తడిసి ఎర్రని నిప్పు కణములవలెను కన్పించుచుండెను.

32. ముత్యాల హారము కాంతివంతమైననూ రంధ్రములు కలవు. ఇంద్రుని ఏనుగు తెల్లనిదైనా మదజలముచే మలినమైనది. హంస తెల్లనిదైనా జలమునందే ఆనందించును. చంద్రుడు స్వచ్ఛమైననూ దోషాకరుడగుచున్నాడు. కనుక ఇవి ఏవీ అతని కీర్తికి సాటిరావు. అతని కీర్తి దోషరహితమూ, స్వచ్ఛకాంతిమంతము.

33. శ్రీమద్రుద్ర చమాపతి ఓరుగల్లు పురమునందు రుద్రేశ్వరుని ప్రతిష్టించేను.

34. సుధీయుతుడైన ఈ కామాంబా తనయుడు ఈ శివుని రంగ, అంగ భోగములకై (నాట్యకళా ప్రదర్శనాది భోగాలకు, నివేదనా అలంకారాలకును) నెక్కొండ అను గ్రామమును దానము చేసెను.

35. ఈయన సర్వ సంపదలకు శాశ్వత నిలయముగా రమ్యహర్మ్యములతో, ఎత్తైన ప్రాకారములతో ఒక నగరమును నిర్మించెను.

36. ఈ నగరము నిత్యము శ్రీద్వారావతి, గిరివ్రజ సహితమైన అయోధ్యం శ్రీవిశాల, స్పష్టముగా అది ఒక మధుర. ఒక భోగవతి.

37. ఆ నగరంలో ఒకచోట సమున్నతాలైన భద్రగజాల ఘీంకారాలు. ఒకచోట అశ్వసమూహాల గిట్టల టంకారాలు. మరొక చోట యుద్దవిద్యాక్రీడల సందడి. మరియొక ద్యూత ప్రియులైన విటుల వాదాలు.

38. ఒకచోట వీణావేణునాద సహితంగా సుందరీమణుల మధురగానాలు. వేరొకచోట శ్రావ్యసంగీత సహిత మధుర పద్యపఠనాలు ఒకచోట విప్రసమూహాల స్పష్టమైన చతుర్వేద ఘోష, కొండొకచోట, శాస్త్రాభ్యసనమే వ్యసనమైన విద్యార్ధుల సదుపన్యాస వైభవం.

39. ఆ నగర వైభవాన్ని తిలకించడానికి తమలపాకుల తీగెలు, పోకచెట్లు భుజాలెక్కుతున్నాయి.

40. ఈయన ఒక చెరువు అంచులవెంట తెల్లని నురగతో తేలియాడుతున్న తెల్లని శంఖముల సమూహాలతో కూడిన అలల వరుసలతో సముద్రాన్ని పోలియున్నది.

41. ఆ చెరువు అంచులవెంట తెల్లని నురగతో తేలియాడుతున్న తెల్లని శంఖముల సమూహాలతో కూడిన అలల వరుసలతో సముద్రాన్ని పోలియున్నది.

42. మేఘాలన్నీ మధురజలాన్నే వర్షిస్తున్నాయి కనుక సాగరజలాన్ని కాక ఈ చెరువు నీటినే గ్రహిస్తున్నాయి.

43. (రాత్రివేళ స్వచ్ఛకాంతుల నక్షత్రాలు ప్రతిబింబ రూపాలతో ఈ తటాక స్వచ్ఛజలాలలో ప్రవేశించి, పూర్ణచంద్రుడితో నిత్య ఏకత్వాన్ని పొందేందుకు జలస్తంభన విద్యను సాధన చేస్తున్నాయి) రాత్రివేళల స్వచ్ఛకాంతులు నక్షత్రాలు ప్రతిబింబరూపాలతో ఈ తటాక స్వచ్ఛజలలాలలో ప్రవేశించి పూర్ణచంద్రుడితో నిత్యసమాగమం పొందటానికి జలవాసం చేస్తున్నాయి.

44. సమృద్ధములై, మెల్లమెల్లగా ఎగసిపడుతూ సయ్యాటలాడుచున్న తరంగ డోలికల వలన పక్షిసమూహాలకు ప్రీతిపాత్రమైన ఈ కొలనులో, చేపల ఈదులాటలో దూరదూరాలకు ఎగసిపడిన నీటిబిందువులను వాన చినుకులుగా భ్రమించిన చాతకపక్షులు వేసవిలో దాహం తీర్చుకుంటున్నాయి.

45. ఈ సరోవరమును సైన్యమువలె దర్శింపవచ్చిన పక్షిసమూహములు అలలతో పాటు లోనున్న నీట ఎరుగుచున్న మత్స్యములు విదల్చుచున్న నీటి జల్లును వర్షపాతముగా భావించి జలక్రీడలు చేయుచున్నవి.

46. స్తుతిపాత్రమైన, బహుసుందరమైన ఈ నగరంలో అరివీరభయంకరుడైన రుద్రదేవుడు, రుద్రేశ్వరుని ప్రతిష్టించాడు. ఈ ప్రతిష్ట బ్రాహ్మణోత్తములచే స్తుతించబడినది.

47. ఎత్తైన తూర్పుకొండపై వెలుగుతున్న సూర్యునివంటి కాంతితో ఆకాశ దేశమును ప్రకాశింపజేస్తూ, ఈ దేవాలయ ప్రాసాదము మీద ఒక స్వర్ణ కలశమున్నది.

48. శరకేందు భూసంఖ్య (శక సంవత్సరం 1135) గల శ్రీముఖనామ శక సంవత్సరములో మధుమాస వసంత శుక్లపక్ష అష్టమీ భానువారము నాడు పుష్యమీ నక్షత్రాన మమామతియైన అతడు రుద్రేశ్వరాలయ సంప్రోక్షణము చేసినాడు.

49. గౌరీశ సహితుడైన రుద్రేశ్వరునికి భోగార్ధము ఉప్పరపల్లి, బొర్లపల్లి గ్రామాలను సమర్పించెను.

50. నా వంశీయులుగాని, తర పాలకులు గానీ పాపభీతిగల ఏ పాలకులైనా నాచే స్థాపించబడిన ఈ ఆలయ సముదాయమును పోషించి రక్షించిన వారికి తలపై చేతులు జోడించి నమస్కరింతును.

51. శత్రువు చేత నిర్మితమైనదైనను మత ప్రాతిపదికపైన నిర్మించబడినదైనను దానిని శ్రద్ధతో ఉద్ధరించినను, పోషించినను, శత్రువుగా ఉండినను వారు శత్రువులుగా ఎంచబడరు.

52. ఈ ఆలయమునకు ఇచ్చిన భూరిదానమును ఇతరులు లాగివేసుకున్నచో అట్టివారు 60 వేల జన్మలో పేడలో పురుగువలె జీవింతురు.

53. రాబోవు తరము పాలకులు ఈ మతప్రాముఖ్యముగల ఆలయమును ప్రేమతో కాపాడగలరు. అట్లు చేసి అభివృద్ధి నొంది సుఖింతురు గాక.

54. ఋషితుల్యుడైన, ధన్యుడైన రుద్రసేనాని సుఖ సంతోషముల దేలుచూ ఆతుకూరు గ్రామమున సుస్థిరులై నిలిచిన కాటేశ్వర, కామేశ్వర, రుద్రేశ్వర ఆలయముల భోగార్ధము నడికుడి గ్రామము దానముగా సమర్పింపబడినది.
ఫేస్ బుక్

Tweets

లంకెలు