ఉత్తర తెలంగాణలో బౌద్ధం - సంగనభట్ల నరసయ్య

దక్షిణ భారతదేశంలోతొట్టతొలుత బౌద్ధాన్ని ఆచరణలోకి తెచ్చుకొన్న జాతి తెలుగుజాతి. బుద్ధునికి సమకాలికంగానే ఆయన బోధనలను అక్కున చేర్చుకొని, ఆయనతో చర్చించి, తర్కించి, ప్రశ్నించి తృప్తిపడ్డాకే ఆయన సిద్ధాంతాలను ఆచరించిన జాతి. తర్వాత కాలంలో స్తూపాలు, ఆరామాలు, నిర్మాణం చేసి సుమారు వేయి సం|| బౌద్ధాన్ని ఆచరించిన జాతి. క్రీ.పూ.6వ శతాబ్ది బుద్ధుని జీవిత కాలంలో ప్రారంభమైన, క్రీ.శ.6,7 శతాబ్దాల్లో హ్యుయన్‌త్సాంగ్‌ లాంటి విదేశీ పర్యాటకులైన బౌద్ధ భిక్షువులను ఆకర్షించే కాలం వరకు కొనసాగింది. ఉత్తరాన తెలంగాణం, దక్షిణాన కృష్ణాతీరం, తూర్పున కళింగం బౌద్ధ ధర్మాచరణకు నెలవైన స్థలాలు. ఐతే వీటిలో తెలంగాణ ప్రాంతం ముందుగా బౌద్ధాన్ని ఆచరించిన నేల.



అంధకులు, ఆంధ్రులు, మూలకులు, నాగులు, మహిష్మతీయులు, దక్షిణాపతీయులు, అశ్మకులు, దక్షిణ కోసలీయులుగా వివిధ గ్రంథాల్లో పేర్కోబడ్డ ఈ ప్రాంతీయులు ఉత్తర తెలంగాణాలోని దక్షిణ గోదావరి తటాన (నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలు) చరిత్రకందనంత ప్రాచీన కాలం నుండే స్థిరపడ్డ తొలి తెలుగు జాతీయులు. 1. ఉత్తర భారతం నుండి గంగాతీరం నుండి వలస వచ్చి గోదావరి తటాన స్థిరపడి గంగా అని పిలుచుకున్నారు. 2. వీరి రాకకు పూర్వం ఈ నదికి ఇక్కడ తెలివాహ (తెల్లనది) అని పేరు. పురాణ కాలంలో దీనికి గోదా (మొసళ్లు గలదని), గౌతమి (మహర్షి కారణంగా), గోదావరి (శబరి కలిసిన కారణంగా) అని పేర్లు ప్రచలితం అయ్యాయి. పురాణ కాలంలో ఈ ప్రాంతాల నుండి వలస వెళ్లిన, స్థిరపడిన ఇతర ప్రాంతాల తెలుగువారకి గంగ అని వ్యవహారం. కాశీ (వారణాసి) నగరం మీది ప్రేమతో గంగ (గోదావరి) ఒడ్డున చాలా గ్రామాలకు కాశిపేట వంటి పేర్లు ఉంచుకున్నారు. 3. ఉత్తర భారతదేశంతో ఉన్న సంబంధాల కారణంగా మహా భారత యుద్ధంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుండి మధ్యయుగాల వరకు విదర్భ ప్రాంతంగా పేర్కోబడింది. 4. గోదావరిని హద్దుగా చేసుకొని అక్కడి నుండి దక్షిణాపథమని పేర్కొన్నారు. 5. బౌద్ధ వాజ్మయం ఈ ప్రాంతాలను అశ్మక, మూలక దేశాలుగా పేర్కొంది. విశేషంగా సుత్తనిపాతం ఈ ప్రాంతాల వివరాలు అందించింది. 6. జాతక కథలు ఈ మార్గాన్ని తైర్థికుల, వ్యాపారుల మార్గంగా ప్రాచీన రాజపథంగా పేర్కొన్నాయి.7 ఇది పూర్వ

చారిత్రక యుగపు మహా వ్యాపార పథం. 8. బౌద్ధ తైర్థికుల్లో ప్రసిద్ధుడు చైనా దేశీయుడైన హ్యుయన్‌ త్సాంగ్‌ వంటి విదేశీ యాత్రికులనా నాటి వరకు (క్రీ.శ. 6వ శతాబ్దం) బౌద్ద తైర్థిక పథమే. 9. సుత్తనిపాతలో కరీంనగర్‌ జిల్లా వాసులైన బావరి, అతని శిష్యులు బుద్ధుని వద్దకు వెళ్లే మార్గం సూచించబడింది. 10. అశ్మకులు మహాభారత యుద్దంలో పాండవుల పక్షాన పోరాడినారు. 11. అశ్మకుల రాజధాని పోతన (పోతలి, పౌదన్య) నగరం నేటి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. 3 వేల సంవత్సరాల చరిత్ర గల మహానగరం. మొదటి తీర్థంకరులైన ఇద్దరు జైన ప్రభువుల రాజధాని 12. అశ్మక (శ్రైష్ఠమైనరాయి గల ప్రాంతం) రాజ్యం నిజామాబాద్‌ జిల్లా అయితే మూలక (తొలి నుండి ఉన్నవారు మూలస్థానీ యులని అర్థం) ప్రాంతం కరీంనగర్‌ జిల్లా. బౌద్ధ వాజ్మయంలో క్రీ.శ.2వ శతాబ్దికి ముందే ఈ ప్రాంతం మూల విషయంగా పేర్కొనబడింది. 13. ఇక్కడి గ్రామాలకు ఇలాంటి పేర్లే ఉన్నాయి. ములకల్ల, ములకనూరు మూలశాల వంటి అతి ప్రాచీన గ్రామ నామాలు ఇక్కడ ఉన్నాయి. కోటి లింగాల నుండి పైఠాన్‌కు శాతవాహనుల రాజదాని మారినాక, పైఠాన్‌ ప్రాంతానికి మూలకులు వలస వెళ్లి దాన్ని ములక ప్రాంతంగా, అక్కడి గోదావరి ఉపనదికి మూలానదిగా పేరు పెట్టుకున్నారు.

భారతదేశపు దక్షిణ ప్రాంతంగా, దక్షిణాపథంగా పేర్కొనబడ్డ ఈ ఉత్తర తెలంగాణ (మధ్యగోదావరి లోయ) నాడు మహిషాసుర సంస్కృతి వ్యాప్తమైన నేల. ఇది అనార్య సంస్కృతీ కేంద్రం. ఈ నేల ఆర్య సంస్కృతీయుల హద్దుకు అవతలి నేల. అశ్మక రాజ్యంలో పోతన నగరం మహిషనామమే. పాణినీయ వ్యాఖ్యత భట్టస్వామి అశ్మకాన్ని మహారాష్ట్ర అని భావించి దాని రాజధాని పోతలి లేదా పోతన అని చెప్పినాడు. ''నగరే పోతనాభిధానే'' అన్న దానికి పౌదన్యమన్న పాఠాంతరం తర్వాతిదని డా|| సూక్తంకర్‌ పేర్కొన్నాడు. హేమచంద్ర రాయ్‌ చౌదరి వాయుపురాణం ఆధారంగా పోదన నగరం ఇక్ష్వాక రాజుల చేత నిర్మితం అంటారు.
తెలంగాణాలో పోతన పదం ఎక్కువ వాడుక. పోచమ్మ (పోషమ్మ ్ష పోచమ్మ), మైసమ్మ (మహిషి ్శ అమ్మ) ప్రాచీన తెలంగాణ గ్రామదేవతలు. మహిషి ్స దున్నపోతు, బర్రె. పోత శబ్దం మహిషార్థకం. తెలుగుమా. అన (అన్న రూపాంతరం. మారన, కేతన, తిక్కనల్లో వలె అన అన్నకు రూపాంతరం) వెరసి పోత ్శ అన ్స పోతన నగరం (పోతరాజు నగరం). అలాగే ఆదిలాబాద్‌ జిల్లాలోని నేటి భైంసా గ్రామం ఈ పేరు దున్నపోతునే సూచిస్తుంది. బస్తర్‌లోని భైంసా సుర పూర్‌' ఈ సంస్కృతీ ప్రాంతం. ఈ మహిషాసురుణ్ణి చంపిన యుద్ధ విజేత బతకమ్మ పేరుతో దసరా తొమ్మిది రోజులు పూజించబడే సంప్రదాయం తెలంగాణాలో మాత్రమే ఉంది. బతకమ్మ తెలంగాణా ప్రాచీనదేవత. ఈ అనార్య సంస్కృతీ ప్రజలు గాంగేయుల (గంగా తీర భూముల నుండి ఇక్కడికి వలస వచ్చిన వారి) వల్ల హిందూ సంస్కృతిని స్వీకరించినా, మౌలికంగా హైందవేతరులే. అందుకే తొలుత జైనాన్ని అశ్మక రాజు లిద్దరు జైన తీర్థంకరులు), ఆపై బౌద్ధాన్ని ఠక్కున అక్కున చేర్చుకున్నారు.
ఈ మూలక ప్రాంతీయులు తెలుగు మాట్లాడేవారు. క్రీ.పూ. 6వ శతాబ్ది నాటికే ఇక్కడ తెలుగు ఉంది. 15. ఈ విషయాన్ని బుద్ధుని కలిసిన ఈ ప్రాంతపు 18 మందిలో కొందరి పేర్లలోనూ, సుత్తని పాత లోనూ కోటిలింగాల నాణముల మీదానూ, ధూళికట్ట నాణముల మీదాను ఉంది. కరీంనగర్‌ జిల్లాలోని మరో బౌద్ధ స్తూపం ఉన్న ధూళికట్లలో లభించిన నాణములపై తెలుగు విభక్తి ప్రత్యయాలున్న సంగతి చారిత్రకులచే ధృవీకరించబడింది. 16 ఐతే ఔత్తారాహికుల రాకవల్ల ప్రాకృతం కూడా జనభాషగా స్థిర పడింది. ఆర్హధర్మ కారణంగా సంస్కృతం, ప్రాకృతంతో బాటు దేశభాషయైన తెలుగు ఇక్కడ త్రిభాషా ప్రచలిత ప్రాంతంగా అనాదిగా గుర్తించబడింది. తొలి శాతవాహన ప్రభువుల కాలపు గుణాఢ్య పండితులు త్రిభాషల్లో కావ్యరచన చేయనని భీష్మ ప్రతిజ్ఞ కావిచిందిక్కడే. మహారాష్ట్ర పైఠాన్‌లో ఇది జరగలేదు. అక్కడ సంస్కృత, మహారాష్ట్రీ ప్రాకృతాలే ఉన్నాయి. సంస్కృత ప్రాకృతేతర దేశభాష ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడి ప్రాంతపు ప్రచలిత ప్రాకృతం ఇతర ప్రాకృత భేదాలలో బాటు గుర్తించ బడింది. 

సౌజన్యం : ఆంధ్రప్రభ

కామెంట్‌లు