సత్యాన్వేషి సంగనభట్ల - అమ్మంగి వేణు గోపాల్

కరీంనగర్‌- ఆదిలాబాద్‌ల మధ్య గోదావరిలో ఏర్పడ్డ ద్వీపం బాదనకుర్తే- బుద్ధుని తొలి తెలుగు శిష్యుడు ‘బావరి (నివాసస్థలమని స్థిరపరచినా, అశోకునికి ముందే ఆంధ్రు లు బౌద్ధాన్ని ఆచరించారనిచెప్పినా, ‘గాథాసప్తశతి’ లోని ప్రాకృతం ఆంధ్రీప్రాకృతం అని కొత్తగా ప్రతిపాదించినా- ఇవన్నీ సత్యశోధనలో భాగాలే. చరిత్ర గొప్ప నిధి. గతంతో చేసే ఈ సంభాషణతో సంగనభట్ల శ్లోకాలు, పద్యాలు కూడ జత చేసి పరిశోధనను ఆహ్లాదదాయకం చేశారు. ఇది ఒక సంవిధానం. చరిత్రలో సత్యం కోసం వెతికే పరిశోధకునికి లభించే కీర్తి వ్యాకరణంలో చెప్పే ‘వైకల్పికము’ లాంటిది. రాళ్ళూ రప్పల కుప్పల అడుగున అర అంగుళం వజ్రశకలం కోసం వెతికే పరిశోధకునికి అది దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దొరికినా దాన్ని జాతిపరంచేసి వెంటనే మరో అన్వేషణలో బయలుదేరుతాడు.




ఒకటి రెండు భాషల్లో పాండిత్యం, ఒకటికి రెండు శాస్త్రాల్లో ప్రతిభ ఉన్న రచయిత తీరే వేరు. ఆయన రాతల్లో ఒక అధికారం కనిపిస్తుంది. ఆయన పరిశోధకుడైతే, ఆ పరిశోధకుడు సత్యాన్వేషి అయితే ఇక చెప్పేదేముంది? పండిత వంశానికి చెందిన డా సంగనభట్ల నరసయ్య సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు. పురావస్తు శాస్త్రం, నృత్య శాస్త్రం, చరిత్ర- వంటివి స్వయం కృషితో నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతం సాధన చేశారు. వివిధ పౌరాణిక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తుంటారు. అనేక సాంఘిక నాటకాల్లో నటించిన అనుభవం ఉంది. పది గ్రంథాలదాకా రచించి ప్రచురించిన సంగనభట్ల ‘తెలుగు దేశిచ్ఛందస్సు- ప్రారంభ వికాసాలు’ అన్న అంశం మీద పిహెచ్‌డి చేశారు. 

మన సాహిత్య రంగంలో మరుగున పడిన సత్యాలను వెలికితీసే పరిశోధనను ‘సాహిత్య తవ్వకం పని’ అని సాధారణంగా పిలుస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ రంగంలో- బి. రామరాజు, బంగోరె, జయధీర్‌ తిరుమలరావు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మైదలైనవాళ్ళు నిష్ణాతులు. అట్లాగే పురావస్తు సంబంధమైన చరిత్ర, సంస్కృతులను వెలికి తీసే వాస్తవమైన త్రవ్వకం పని చేసేవాళ్ళది భిన్నమైన రంగం. వీళ్ళకు సాహిత్య రంగం కూడా మార్గదర్శనం చేస్తుంది. డా సంగనభట్ల నరసయ్య పై రెండు రంగాలలోను కృషి చేసి తమ పరిధిలో కొన్ని కొత్త విషయాలను వెలికి తీసి సంచలనం సృష్టించారు. వారి ‘తెలివాహ గోదావరి’ (2010) అన్న గ్రంథంలో 16 తెలంగాణ ప్రాచీన చారిత్రక వ్యాసాలున్నాయి. ‘తెలివాహ గోదావరి’ అన్న మొదటి వ్యాసంలో ఆంధ్రదేశ ప్రాచీన చరిత్రలో పేర్కొన్న తెలివాహ నది ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో సంగనభట్ల దాదాపు 20 గ్రంథాలను పరిశీలించారు. 

‘శెరవనీయ బౌద్ధ జాతక గాథ’ ఈ నదిని, ఈ నది ఒడ్డునే ఉన్న ప్రసిద్ధమైన ‘ఆంధ్రపురం’ గూర్చి చెప్పింది. ‘తెలి’ అంటే తెల్లని (తెలి+పు) అన్న స్పష్టమైన అర్థముండడంతో తెల్లని (నీటి) ప్రవాహం కలిగిన నది అన్న అభిప్రాయానికి సంగనభట్ల వచ్చారు. దీంతో అదివరకు కొందరు పరిశోధకులు భావించినట్టుగా వివరించిన తెలివాహ ఒడ్డున ఉన్న ఆంధ్రపురం కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్యకటకం కాదని, కరీంనగర్‌ జిల్లాలోని ‘కోటి లింగాల’ అనే అనేక సాక్ష్యాలతో సంగనభట్ల నిరూపించారు. 1979-84 మధ్య పురావస్తు శాఖ వారు నిర్వహించిన త్రవ్వకాలలో కోటిలింగాల అన్న నగరం బయటపడింది. అంతేకాదు, శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుడు (చిముకుడు) వేయించిన నాణాలు అనేకం ‘చిముక’ పేరుతో లభించాయి. కొత్త చరిత్ర బయట పడడంతో పాత పాఠాలు పాఠ్య ప్రణాళికనుంచి తొలిగిపోయాయి. 

సంగనభట్ల పరిశోధన మూలంగా వెలుగులోకి వచ్చిన మరో అంశం ‘సప్త గోదావరి’. ‘సప్తగోదావరి ఎక్కడ?’ అన్న వీరి వ్యాసం క్షేత్ర పర్యటనలతోను, సాహిత్య, చారిత్రక శోధనలతోను నిండిన ఊపిరి సలపనీయని కృషి. సప్త గోదావరి తీరంలోని భీమేశ్వరాలయం ప్రాంగణంలో శాతవాహన రాజైన హాలునికి, సింహళ (లంక) రాజకన్య లాలావతికి వివాహం జరగడం వల్ల ఈ అంశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. సప్తగోదావరి భీమేశ్వరుడనగానే అందరి దృష్టి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామం వైపు పరిగెత్తుతుంది. కాని, విచిత్రమేమిటంటే క్షేత్ర పర్యటన చేసిన సంగనభట్లకు దాక్షారామంలో గోదావరే లేదని తెలిసింది. ఈ అంశంమీద మరింత లోతుగా కృషి చేస్తే కరీంనగర్‌ మల్లాపూర్‌ మండలంలోని వేంపల్లి వెంకట్రావు పేట వద్ద గోదావరి ఏడుపాయలుగా చీలిందన్న సత్యం వెలుగులోకి వచ్చింది. మొదటి పాయకు ఈవలి ఒడ్డు కరీంనగర్‌ జిల్లా కాగా, ఏడో పాయకు సంబంధించిన ఆవలి ఒడ్డు ఆదిలాబాద్‌ జిల్లా.

గోదావరి పాయల్లో వెతకగా ప్రాచీన శిథిల దేవాలయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక చిన్న శిథిల దేవాలయం ఇటుకలు, కోటిలింగాలలో దొరికిన ఇటుకలు ఒకటే కావడంతో దాన్ని భీమేశ్వరాలయంగా గుర్తించారు. హాలుడు కూర్పు చేసిన ‘గాథాసప్తశతి’కి కోటిలింగాల జన్మస్థలమన్న వాదం మరోసారి సాక్ష్యాలతో రుజువైంది.‘తెలుగు’ అన్న మాటకు ఆంధ్ర, తెనుగు అన్నవి పర్యాయ పదాలు. తలైంగ్‌, త్రిలింగ వంటి పదాలనుంచి తెలుగు నిష్పన్నమైందని పండితులు చెప్తూ వచ్చారు. తెలి+ అగు= స్వచ్ఛమైనది, స్పష్టమైనది అన్న అర్ధాలలో సంగనభట్ల చెప్పిన వ్యుత్పత్తి సత్యమంత సరళమైనది. అట్లాగే, తెలి+ మాగాణ= (నదీ) జలాలతో తడిసి పంటలు పండే భూమి అన్న అర్ధంలో- తెలింగాణ, తెలంగాణగా నిష్పన్నం చెందిందంటున్నారు సంగనభట్ల. 

‘భవభూతి ఉత్తర తెలంగాణ ప్రాంతీయుడా?’ అన్న మరో వ్యాసంలో ‘ఉత్తర రామచరితం’ రచన ద్వారా కాళిదాసు అంతటి వాడనిపించుకున్న భవభూతి ‘దక్షిణా పథంలోని విదర్భ దేశంలోని పద్మ పురం’ తన నివాసమని, తన నాటకాన్ని ‘కాళప్రియనాథు’ని సన్నిధిలో ఆడించబోతున్నానని ప్రకటించాడు. పరిశోధకులు యమునా తీరమని, గ్వాలియర్‌ ప్రాంతమని, ఉజ్జయిని అని అనేక ఊహలు చేశారు. కాని ఇదంతా ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లయిందని సంగనభట్ల పరిశోధనతో రుజువయింది. భవభూతి పేర్కొన్న విదర్భలో కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలున్నాయి. పద్మపురం అంటే పోదనపురం ఇప్పటి నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌. రూఢి చేసుకోవడానికి బాహుబలి గూర్తి రాసిన కన్నడ పురాణంలో బోధన్‌ నగరం పద్మపురమని పేర్కొని ఉంది. కన్నడ మహాకవి పంపడు తనది పద్మపురం అని పేర్కొనటమే కాక, బోధన్‌లోనే సమాధి అయ్యాడు. 

అప్పటి విదర్భ భూభాగంలోని కంధార (నాందేడ్‌)లో భవభూతి పేర్కొన్న శివక్షేత్రం ఉంది. ఆలయ శాసనంలోని ‘కాలప్రియస్య... ప్రాంగణే... సత్రశాలాయాం’ అన్న శ్లోక పాదం చాలు నాటకాలు ఆడడానికి అనువైన నాటక శాల ఉందని నమ్మడానికి. దీంతో భవభూతి బోధన్‌వాడని తిరుగులేని సాక్ష్యాలతో రుజువయింది. చరిత్ర పరిశోధకులలో సాధారణంగా కొన్ని లోపాలుంటాయి. పాక్షిక సత్యమే సంపూర్ణ సత్యమనే నిర్ధారణకు రావడం; ప్రాంతీయ దురభిమానంతో సత్యదూరంగా రాయడం; ఎవరైనా లోపాలను ఎత్తి చూపితే వితండవాదానికి దిగడం వంటివి కొన్ని. ఇవి కాక స్వార్ధ ప్రయోజనం కోసం ఊహాశక్తితో ఒక వాదాన్ని నిర్మించి అతి తెలివితో అసత్యాన్ని సత్యంగా భ్రమిపచేయడం అన్నది మరో లోపం. 

సంగనభట్ల నరసయ్యలో పై లోపాలు కనిపించకపోగా, కొన్ని సుగుణాలు కనుపిస్తున్నాయి. వాటిల్లో తమ వాదానికి రుజువులుగా ఒకటి కంటె ఎక్కువ సాక్ష్యాలు చూపించడం. చరిత్ర పండితులు, పురావస్తు శాస్తజ్ఞ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంస్కృతాంధ్ర సాహిత్యాలనుంచి విస్తృతంగా ఉదాహరణలు ఇవ్వడం, వ్యాస ప్రారం భంనుంచే పరిశోధన ప్రాంగణం లోకి పాఠకుణ్ణి తోడ్కొని పోవడం వంటివి కొన్ని. ఒక పాత వాదాన్ని సమర్ధించడానికి పెద్దగా బాధ్యత అవసరం లేదు. కాని, దాన్ని ఖండిం చి, కొత్త వాదాన్ని ప్రతిపాదించడానికి ధైర్యసాహసాలతో పాటు, సుదీర్ఘ వాదోపవాదాలకు పరిశోధకుడు సంసిద్ధుడై ఉండాలి. ఇవన్నీ సంగనభట్లలో ఉన్నాయి. అయితే, ఈ వ్యాసాలకు అవసరమైన పటా లు, చరిత్ర పటాలు, శాసనాలు మొదలైనవి ఉంటే పాఠకులకు సౌకర్యంగా ఉండేది. 

amamgiకరీంనగర్‌- ఆదిలాబాద్‌ల మధ్య గోదావరిలో ఏర్పడ్డ ద్వీపం బాదనకుర్తే- బుద్ధుని తొలి తెలుగు శిష్యుడు ‘బావరి (నివాసస్థలమని స్థిరపరచినా, అశోకునికి ముందే ఆంధ్రు లు బౌద్ధాన్ని ఆచరించారనిచెప్పినా, ‘గాథాసప్తశతి’ లోని ప్రాకృతం ఆంధ్రీప్రాకృతం అని కొత్తగా ప్రతిపాదించినా- ఇవన్నీ సత్యశోధనలో భాగాలే. చరిత్ర గొప్ప నిధి. గతంతో చేసే ఈ సంభాషణతో సంగనభట్ల శ్లోకాలు, పద్యాలు కూడ జత చేసి పరిశోధనను ఆహ్లాదదాయకం చేశారు. ఇది ఒక సంవిధానం. చరిత్రలో సత్యం కోసం వెతికే పరిశోధకునికి లభించే కీర్తి వ్యాకరణంలో చెప్పే ‘వైకల్పికము’ లాంటిది. రాళ్ళూ రప్పల కుప్పల అడుగున అర అంగుళం వజ్రశకలం కోసం వెతికే పరిశోధకునికి అది దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దొరికినా దాన్ని జాతిపరంచేసి వెంటనే మరో అన్వేషణలో బయలుదేరుతాడు. ఇది అనంతం.

కామెంట్‌లు