త్రివేణి సంగమ పవిత్ర కందకుర్తి

మీకు రాజమండ్రి తెలుసా? ఆంధ్రలో గోదావరి ప్రవేశించే ప్రాంతం.. మరి కందకుర్తి?? తెలంగాణలోకి గోదావరి ప్రవేశించే ప్రాంతం.. పైగా ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి.. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి... రాఠ నేల నుంచి వడివడిగా పరిగెడుతూ గోదావరి తెలుగు నేలపై అడిగిడే ప్రాంతమిది. హరిద్ర, మంజీర నదులను సంగమించుకొని గలగలా బాసరమ్మ వైపు పరుగు తీసే ప్రాంతం.. ఆ కందకుర్తి డిస్కవరీ ఇది.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కందకుర్తి ఉంటుంది. గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణీ సంగమమిది. త్రివేణి సంగమం మహిమ ప్రయాగ మహిమతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. గోదావరి మహత్యం అనే గ్రంథం ఇక్కడ స్నానమాచరిస్తే వచ్చే పుణ్యాల గురించి వివరిస్తున్నది.

ahilyabai-nirminchina-shiva
మన నేలపై వడి వడిగా...

మహారాష్ట్రలోని నాసికాత్రయంబకం వద్ద జన్మించిన గోదావరి నది వడివడిగా తెలంగాణ నేలపై ప్రవేశించేది ఇక్కడే. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా సంగమేశ్వర్ గ్రామం నుంచి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలోకి ప్రవేశిస్తుంది. కర్నాటకలోని బీదర్ జిల్లా పటోడా తాలూకాలో పుట్టిన మంజీరమ్మ గోదావరి మాత చెంతకు చేరేది ఇక్కడే.. మెదక్ జిల్లాలో పుట్టిన హరిద్రా నది గలగలా ప్రవహిస్తూ గోదావరి నదిలో సంగమించే దివ్యధామమిది.

మూడు నదులూ ఒకే చోట సంగమించే ప్రాంతంలో పురాతన సంగమేశ్వరాలయం ఉంది. కొద్దిపాటి వరద వచ్చినా నదీగర్భంలోకి చేరుతుందా మందిరం. ఆ సందర్భంలో ముక్కంటిని పూజించేందుకు వీలుగా మహారాష్ట సరిహద్దు గ్రామంలో గోదావరి ఒడ్డున మరో సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ బాసరలోని సరస్వతీ మాతకు బిరబిరా తరలివెళుతుంది గౌతమీ నది.

teppa
కందకుర్తి అంటే..

కందకుర్తి అనే పేరు స్కంద కుడుతి నుంచి రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. స్కంద మహర్షి ఇక్కడే తపస్సు చేసినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడ పురాతన స్కందమాత మందిరం ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. తల్లియైన పార్వతీ దేవి ఒడిలో కూర్చున్న స్కందుని విగ్రహం గోపురంపై ఉండేది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. స్కందము అంటే నది అని కూడా అంటుంటారు. మూడు నదుల కూడలిలో ఉన్నందున దీనిని స్కంద కూడుతి అనే వారట.. కాలక్రమేణా కందకుర్తిగా రూపాంతంరం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు.

స్కంద పూజ..

మహారాష్ట్రలోని గోదావరి తీర ప్రాంతాల్లో కచ్చితంగా స్కందుని ఆలయం ఉంటుంది. తమకు ఎలాంటి ఆపదలూ రాకుండా స్కందుడిని పూజిస్తారు. స్థానికంగా వారు ఖండోబా అని, కండేరాయుడని పిలుస్తుంటారు. సమీపంలోనే ఉన్నందున ఇక్కడి వారు సైతం స్కందుడిని పూజస్తూ వచ్చారని చెబుతారు. పూరాతన కాలంలో నది ఒడ్డున ఒక గద్దె మాత్రమే ఉండేది. దానిపై స్కంద మాత కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించేవారట.. ఏటేటా పండగలు నిర్వహించి ఆమెకు బోనాలు సమర్పించడం ఇక్కడి ప్రజల ఆనవాయితీగా కొనసాగుతోంది. 150 ఏళ్ల క్రితం అహిల్యాబాయి అనే మరాఠా దాన ధర్మాలు చేసేవారని, ఆమె సహాయంతో ఇక్కడ మొదటి పుష్కరఘాట్‌లో ఉన్న శివాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది.

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం..

కందకుర్తి గ్రామానికి యుగయుగాల చరిత్ర ఉన్నది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నడయాడిన ప్రాంతం కావడంతో ఇక్కడ పురాతన రామాలయం ఉంది. పాలరాతితో ఉత్తరభారత శైలిలో నిర్మించిన సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఆలయం శిథిలావస్థకు చేరడంతో పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాలను నూతన మందిరంలో ప్రతిష్టించారు. అయోధ్యకు చెందిన సీతారామ్ సేవాసమితి శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి శ్రీలంక వెళ్లిన రూట్‌ను వివరిస్తూ ఒక మ్యాప్‌ను ఇక్కడ ప్రదర్శించారు.

నిజామాబాద్ జిల్లా కందకుర్తి గోదావరీ నది తీరాన శ్రీరామచంద్రుడు కొన్ని రోజులున్నట్లు ఈ మ్యాప్ ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి వెళ్లినట్లు మ్యాప్‌లో పేర్కొన్నారు. శ్రీరాముడు నడయాడిన ప్రాంతం కావడంతో అయోధ్యకు చెందిన సాధువు సీతారామ్‌జీ మహరాజ్ స్థానిక దాతల సహకారంతో నదీతీరంలో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ఛత్రపతి శివాజీ పూణే నుంచి గోల్కొండ కోటకు ఈ దారి గుండానే పోయినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్రమంలో కందకుర్తి గ్రామంలో బస చేసినట్లు, అప్పుడు స్థానికులకు భూములు కేటాయిస్తూ ఫర్మానాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఆదిశంకరాచార్యులు సైతం కందకుర్తి గ్రామాన్ని సందర్శించినట్లు స్థానికులు చెబుతుంటారు.

పూర్వీకుల స్వస్థలమిది..

డాక్టర్ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను ప్రారంభిచారీయన. ఈయన పూర్వీకుల స్వస్థలం కందకుర్తి. హెడ్గేవార్ జన్మించక పూర్వం ఈ కుటుంబం నాగ్‌పూర్‌కు వలస వెళ్లింది. వీరి వంశస్తులు ప్రస్తుతం నిజామాబాద్‌లో నివాసముంటున్నారు. హెడ్గేవార్ ఇంటిని కూల్చేసి అక్కడ కేశవనిలయం అనే భవనాన్ని స్మృతి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మృతి మందిరంలో హెడ్గేవార్, కేశవుడు, భారత మాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. కేశవ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ చరిత్ర కారుడు కందకుర్తి యాదవరావు చెబుతున్నారు.

తెప్పలు విడవడం..

ఆషాఢమాసంలో గోదావరి తీర గ్రామాల ప్రజలు తెప్పలు విడిచి మొక్కులు తీర్చుకుంటారు. వర్షాకాలం మొదలై నదీమ తల్లి ప్రవహిస్తున్న సమయంలో నది వద్దకు కుటుంబ సమేతంగా చేరుకొని అప్పాలు, అన్నం, తోటకూర నైవేద్యం తయారు చేసి గడ్డితో తయారు చేసిన తెప్పలో ఉంచి అందులో దీపం వెలిగిస్తారు. గోదావరి మాతకు కొబ్బరికాయ కొట్టి తెప్పను నదిలో విడిచి భక్తితో మొక్కుకుంటారు. వచ్చే ఏడాది వరకు సల్లంగ సూడాలని కోరుకుంటారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా గోదావరి తీరంలో ఉంది. స్థానికులు గోదావరిని గంగగా పిలుస్తారు. అందువల్లే ఈ జిల్లాలో గంగాధర్, గంగారాం, గంగాకిషన్, గంగామణి, గంగారెడ్డి తదితర పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఇంతటి మహానీయ కందకుర్తిలో గోదావరి పుష్కర శోభ వెల్లివిరియాలని ఆశిద్దాం..

సౌజన్యం : నమస్తే తెలంగాణ

http://kandakurthi.blogspot.in/

కామెంట్‌లు