Thursday, 14 August 2014

గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే తీజ్ (మొలకల పండుగ)

తీజ్ (మొలకల పండుగ) వ్రతం. బంజారాల కన్నెల పండుగ..కన్నుల పండువగా చేసుకునే ఈ వ్రతాన్ని తండాల్లో పెళ్లికాని యువతుల ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండగన్ని రోజులూ లంబాడ తండాల్లో సందడి నెలకొంటుంది. తండా పెద్ద అనుమతి లభించిన వెంటనే వేడుక ప్రారంభమవుతుంది. మేర వసూలతో ఉత్సవానికి శ్రీకారం చుడతారు.

ఎందుకీ పండుగ ?

మెరామ (డండియడి-అంటే పెద్ద అమ్మ) తల్లి ‘తీజ్‌’ రూపంలో పూజ లందు కుంటుంది. బంజారాల సంస్కృతిలో ఏడుగురు ( మెరామ, హింగళ, తొల్జా, ధ్వాలంగన్, కేంకాలి, మసూరి, తీజ్ బంజార ) మాతృ దేవతలున్నారు. వారిలో మెరామ పెద్దది. ఆమె పైరు పంటలను రక్ష్షిస్తుందని బంజారాల విశ్వాసం. మెరామ్మ దేవత తండాను రక్షిస్తే, తీజ్ దేవత పంటలను కాపాడుతుందని, సీత్ల అనే దేవత పశుసంపదను వృద్ధి చేస్తుందని, మత్రాల్ దేవత పిల్లలకు రోగాలు రాకుండా కాపాడుతుందని గిరిజనుల విశ్వాసం. వీరిని తెలుగు సమాజంలో ఎల్లమ్మ, పొచమ్మ, మైసమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ దేవతలతో పోల్చుతారు.  మంచి వర్షాలు కురిసి, వేసిన పంటలు పుష్కలంగ పండి ఇంటి నిండా ధాన్యాలు నిండాలంటే మెరామ (తీజ్‌) తల్లి దయ చూపాలని బంజారాలు కోరుకుంటారు. అందుకే పచ్చని నారును ఆమెకు ప్రతిరపంగా మలచి బంజారాలు తీజ్‌ పండుగను నిర్వహిస్తారు.తీజ్‌ పండుగ తొమ్మిది రోజులు నాలుగు దశలుగా నిర్వహించబడడం ఆచారం. మొదటిది : బుట్టలలో గోధుమలు చల్లుట. దీనిని ‘తీజ్‌ బోరాయేరొ’ అంటారు. రెండవది : దేవతకు నైవేద్యం సమర్పించుట. దీనినే ‘కడావో’ అంటారు. మూడవది : మెరామ, సేవాలాల్‌ల పెళ్ళి చేయుట. దీనిని ‘గణ్‌ గోర్‌’ అంటారు. నాలుగవది : గోధుమ నారును చెరువులో వదలుట. ఇలా వదలడాన్ని ‘వేరాయేరొ’ అంటారు. బుట్టలలో గోధుమలు చల్లుట (బోరాయేరొ) తీజ్‌ అంటే పచ్చని నారు అని చెప్పుకున్నాము. బుట్టలలో గోధుమలు చల్లడం ద్వారా నారును పెంచుతారు. ఈ బుట్టలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటివి పెద్దవి. వీటిని ‘వోల్డి’ అంటారు. రెండవవి చిన్నవి. వీటిని ‘చొరుకలి’ అంటారు. చిన్న బుట్టలు దేవతకు చాలా ఇష్టమైనవి. అందుకే వీటిని దేవత బుట్టలు అనికూడా అంటారు. రెండు రకాల బుట్టలలోను గోధుమలు చల్లుతారు.

మేర వసూలుతండా పెద్ద అనుమతితో మంగళవారం రోజు గోధుమలు కొనడానికి బంజార అమాయిలు సమూహంగా ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. ఒకప్పుడు డబ్బుకు బదులు ధాన్యం వసలు చేసేవారు. అవ్మయిల సమూహానికి పెళ్ళీడుకున్న ఇద్దరు అమాయిలు నాయకత్వం వహిస్తారు. నేతృత్వం వహించే ఇద్దరు అమాయిలు కొంతమంది అమాయిలను వెంటబెట్టుకుని తండా శివారు గ్రామ వైశ్యుని (కోమటి) దుకాణానికి గోధుమలు కొనడానికి వెళతారు. గ్రామానికి వెళ్ళగా మిగిలిన అవ్మయిలు సారవంతమైన పుట్టమట్టిని తీసుకువస్తారు. గోధుమల కోసం వెళ్ళిన అమాయిలు సాయంత్రానికి తండాకు తిరిగి వస్తారు. అమాయిలందరు బిందెలు తీసుకుని బోరింగు దగ్గరికో, బావి దగ్గరికో వెళ్ళి బిందెలను శుభ్రం చేసి నీళ్ళు తీసుకువస్తారు. తేబడిన నీళ్ళ బిందెలో ఆ సాయంత్రం పాట పాడుకుంట గోధుమలను నానబెడతారు. గోధుమలను నానబెట్టడానికి రెండు రోజుల ముందే పనుల మీద గ్రామానికి వెళ్ళే తండా పెద్దలు తీజ్‌ కోసం బుట్టలు తయరు చేసి పెట్టమని ఎరుకుల వారికి చెప్పివస్తారు. గోధుమలు నానబెట్టడానికి ఒక రోజు ముందు ముత్తైదువలు భోజనాలు చేసి బుట్టలు తీసుకురావడానికి గ్రామానికి వెళతారు. మధ్యాహ్నానికి జొన్నరొట్టెలు కట్టుకుపోతారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలుంటే అన్ని బుట్టలు తయరు చేయిస్తారు. అలా చేయించడం ఆడపిల్లలకు ఆనందంగాన, గర్వకారణంగాన వుంటుంది. మగవాళ్ళు డప్పు దరువులతో, అమాయిలు, మహిళలు నృత్యాలతో పాటలు పాడుత ముత్తైదువలను తండా నుండి వీడ్కోలు పలుకుతారు.

ఆ సందర్భంగా పాట ఇలా ఉంటుంది.

బంజార :

ఘఁవులా ఘమకో రోళియే కనాయెలాల్‌ 
 ఘేరన హాటొ ఫరియే కనాయెలాల్‌ 
 ఘఁవులా ఘమకో భరియ వాళియే కనాయెలాల్‌ 
 ఘఁవులా ఘమకో హాంసళో వాళియే కనాయెలాల్‌ 

తెలుగు :

గోధుమనారంటి దేహపు చినదాన నాట్యమాడవే.
ముక్కెరపెట్టిన ముత్తయిదులారా నెమళ్ళోలె మీరు నాట్యమాడరె
తీరైన పేరునీ మెడలో వేసుకుని మెరుపు వంగినట్లు నాట్యమాడరె

 ఒక భాషలోని సాహిత్యాన్ని మరోభాషలోకి ప్రతిపదార్థాన్ని మాత్రమే తర్జుమ చేయగలం. కాని భావోద్వేగాలను అన్ని సందర్భాలలో తర్జువ చేయడం సాధ్యం కాదు. పైన ఇవ్వబడిన బంజార పాటలోని అర్థాన్ని మాత్రమే తెలుగులో ఇవ్వగలిగాను

గోధుమలకు వెళ్ళినప్పుడు కూడా పాట, దరువు, నృత్యహేళ వుంటుంది. డప్పుల దరువు, పాటలు, నృత్యం అనే మూడు కళారపాల మేళవింపు లేకుండ బంజారాలు ఒక్క కార్యం కూడ నిర్వహించరనే విషయం గమనించదగ్గది.
తీజ్ నిర్ణయం జరిగిన మరుసటిరోజు యువతులు ఇల్లిల్లూ తిరిగి తీజ్ కోసం వసూలు చేసే విరాళాలనే ‘మేర’ అంటారు. దుకాణం నుంచి గోధుమలు, శెనగలు తెప్పిస్తారు. అడవికి వెళ్ళి ‘పిలోణీర్ ఏలే’ (దుసేరు తీగ)ను స్వయంగా తెచ్చి చిన్న బుట్టలను అల్లుతారు. తలారా స్నానం చేసి పుట్టమట్టిని సేకరిస్తారు. వీలుంటే ఈ మట్టికి మేక ఎరువును కలుపుతారు. దుసేరు తీగతో తాము అల్లిన చిన్న బుట్టలకు దండియాడి (మేరా మా భవాని), సేవాభాయా, తోల్జా భవాని, సీత్లా భవాని వంటి దేవతల పేర్లు పెడతారు.

ముందుగా తండా పెద్దను ఆహ్వానించి ఒక బుట్టలో మట్టిని పోయించి గోధుమలు చల్లిస్తారు. అనంతరం ‘శీత్లాయాడి బొరాయీ తీజ్, బాయీ తారో పాలణో...’ అంటూ పాడుతూ మిగతా బుట్టల్లో యువతులు చల్లుతారు. తండా మధ్యలో ఒక చోట కట్టెలతో కాస్త ఎత్తులో డాక్లో(మంచె)ను ఏర్పాటు చేస్తారు. దానిపైన గోధుమలు చల్లిన బుట్టలను ఉంచి నీళ్లు పోస్తుంటారు.

ఎరుకల వారు చేసిన బుట్టలు కాక తక్కువ పడిన వాటిని కూడా చేయించుకుని మధ్యాహ్నం అక్కడే రొట్టెలు తిని మహిళలు సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. మహిళలు, అమాయిలు తమ తమ పనులల్లో ఉండగా మగవాళ్ళు (అన్నదమ్ములు) మంచె వేసే పనిలో నిమగ్నమవుతారు. బుధవారము సాయంత్రం వరకు మంచె వేయడం పూర్తి చేస్తారు. కింద వుంటే నారును పశువులు తింటాయని మంచెను చేయి అందేంత ఎత్తులో నిర్మిస్తారు. మంచె ఎక్కడానికి నిచ్చెన వేస్తారు. మంచెను తండాలోని అన్నదమ్ములలో అందరికంటే చిన్నవాడి ఇంటి వాకిట్లోనే పెట్టడం ఆచారం. చిన్న వాడి ఇంటిని ‘థాపేర్‌ ఘర్‌’ అంటారు. బుధవారం సాయంత్రం చిన్న పెద్ద బుట్టలలో పుట్ట మట్టిని నింపుతారు. ముత్తైదువలు పాటలు పాడుతుండగ, నానబెట్టిన గోధుమలను తండా పెద్ద మొదట ఒక బుట్టలో చల్లుతాడు. తరువాత అన్ని బుట్టలలో చల్లుతారు. నీళ్ళు పోస్తారు. పెద్దబుట్టలను, కొన్ని చిన్నబుట్టలను మంచె౦ మీద పెడతారు. మిగిలిన చిన్న బుట్టలను మంచెకు వేలాడదీస్తారు. నారు ఏపుగ పెరగడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండ నీళ్ళు పోస్తారు. నీళ్ళుపోసే ప్రతీసారి అమాయిలు మూడు లేక ఏడు కడవలు (దీనిని బేడో అంటారు) తల మీద ఒక దాని మీద ఒకటి పెట్టుకుని పాటలు పాడుకుంటు బావి దగ్గరికి వెళ్ళి కడవలను శుభ్రంగా కడిగి స్వచ్ఛమైన నీటిని తెచ్చి బుట్టలలో పోస్తారు. ఎప్పుడో తేబడిన నీటిని బుట్టలలో పోయడం సాంప్రదాయ విరుద్ధం. గోధుమలు చల్లిన నాటి నుండి ఇద్దరు అవ్మయిలు ఉప్పు కారం లేని ఆహారం భుజిస్త దీక్షను కొనసాగిస్తారు. ఈ ఇద్దరు అమాయిల నేతృత్వంలోనే తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. వీరిని మిగతా అవ్మయిలు అనుసరిస్తారు. గోధుమలు చల్లిన రోజును తొమ్మిది రోజులలో భాగంగా పరిగణిస్తారు.

బంజారాలు రోజంత వ్యవసాయ పనులు ముగించుకుంటారు. రాత్రి భోజనాల అనంతరము అందరు తీజ్‌ దగ్గరికి చేరి పాటలు, నృత్యాలతో వాతావరణాన్ని రంగుల మయం చేస్తారు.

ఈ సందర్భముగా గోధుమ నారు పచ్చగా ఎదగాలని ఆశిస్త ఇలా గీతం ఆలపిస్తారు.

బంజార :

లాంబి లాంబియే లాంబడి 
వెగేరియ ఝాెక ఖారియే లాంబడి 
వెగేరియ లేజ లేరియె లాంబడి 
వెగేరియ దళ నాకియే లాంబడి వెగేరియ 

తెలుగు :

ఓ తీజ్‌! నీవు తోటకూర పెరిగినట్లు పెరగాలి. 
పెరిగి గాలికి ఇటూ అటూ ఊగాలి. 
అందరిని ఆకర్షించాలి. 
మమ్ములను ఆనందింప చేయలి. 

తీజ్‌ పెరగాలని పాటలు పాడుతారు. ఆటలు ఆడుతారు. వారు పాడే పాటలలో అనిర్వచనీయమైన భక్తి తొణికిసలాడుతుంది. తొమ్మిది రోజుల పాటు ఇదే వారి దినచర్యగా వరుతుంది.

రేగుముళ్లకు గుచ్చటం...
గోధుమలను బుట్టల్లో చల్లిన రోజు సాయంత్రం నానబెట్టిన శెనగలను ‘బోరడి’ (రేగు ముళ్లు)‘ఝష్కేరో’ (గుచ్చటం) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి వినోద భరితమైన ఈ కార్యక్రమంలో శృంగార, కరుణ,హాస్య రసాలకూ ప్రాధాన్యముంటుంది. 

వదినలు రేగుముళ్ళకు శనగలను గుచ్చేటపుడు మరిది వరసవారు ముళ్లను కదిలిస్తూ ఏడిపించటం, అన్నలు సైతం చెల్లెళ్ళలకు శనగలు దొరకకుండా దాచి, ముళ్ళను అడ్డుగాపెట్టి సున్నితంగా ఏడిపించటం చివరకు వారు సోదరులను ప్రార్థించే పాటలు పాడటం, అందరూ సహకరించి శనగలు వారికందేలా చేయటం వినోదభరితంగా నిర్వహిస్తారు. ఈ రేగులను దండియాడి (మేరా మా భవాని), తోల్జా భవాని పండిస్తుందంటూ ‘కాచిగ పాకీయో బోరడియో.....’ అంటూ పాటలు పాడతారు.

బావి నుంచి నీరు తెచ్చి తొమ్మిది రోజులపాటు బుట్టలపై చల్లుతూ తీజ్‌పట్ల తమ భక్తి, విశ్వాసాలను ప్రకటిస్తారు. పెళ్లికాని యువతులు తీజ్ రోజులలో శుచి, శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఉప్పు, కారం లేని శాఖాహారాన్ని స్వల్పంగా తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు. సామూహికంగా భవాని మాతకు పూజలు చేస్తారు. తీజ్ బుట్టలను భవాని దేవత పెట్టించిందని భావిస్తారు.

ఏడో రోజు : దేవతకు నైవేద్యం సమర్పించుట (కడావో) 
తీజ్ ఉత్సవంలో భాగంగా ఏడో రోజు చుర్మో ( రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను ‘మేరా మా భవాని’ కి సమర్పించే కార్యక్రమమే ‘ఢమోళి’. ప్రతి ఇంటి నుంచి కొంత బియ్యాన్ని సేకరించి కడావ్ (పాయసం) వండుతారు. అనంతరం తండా వాసులంతా తీజ్ దగ్గర చేరి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.

దేవతకు నైవేద్యం సమర్పించుట (కడావో) ఏడవ రోజు నిర్వహించబడే ఈ ఆచారంలో ప్రధమంగా సేవాలాల్‌కు నైవేద్యం సమర్పించడం వుంటుంది. ఆ తరువాత మెరామ దేవతకు నైవేద్యం సమర్పిస్తారు. సేవాలాల్‌ శాఖాహర నైవేద్యాన్ని స్వీకరిస్తే, మెరామ దేవత మా౦సాహార నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. ప్రతి కుటుంబం కొంచెం బియ్యం పిండిని దీక్షలోఉన్న అమాయిలకు పంపిస్తుంది. పిండి, బెల్లం కలిపి అవ్మయిలు తీజ్‌ దగ్గరే పండుతారు. అలా తయరైన తీపి పదార్థాన్ని ‘భజ్మలాప్సి’ అంటారు. ఈ తీపి పదార్థాన్ని నెయ్యితో కలిపి మంటలో వేసి సేవాలాల్‌కు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా మంటలో వేయడాన్ని ‘భోగు’ అంటారు.

ఇదంతా తీజ్‌ మంచె ఉన్న ఇంటి ఇల్లాలు ఉపవాసంతో ఉండి చేస్తుంది. దీక్షలో ఉన్న అమాయిలు ఆమెకు సహకరిస్తారు. తరువాత తీపి పదార్థాన్ని పిల్లలకు, పెద్దలకు వెదుగాకుల్లో పంచుతారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో మెరామ దేవతకు యేటపోతును తీజ్‌ మంచెకు కొంచెం దూరంలో బలిచ్చి ఉడికిన మా౦సాన్ని దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కార్యాన్ని తీజ్‌ వున్న ఇంటి యజమాని నిర్వహిస్తాడు. మా౦సం ప్రతి కుటుంబానికి పంచబడుతుంది. ఆ రోజు సాయంత్రం ప్రతి కుటుంబం బంధు మిత్రులతో మా౦సాహార విందు చేసుకుంటుంది. ప్రతి కుటుంబం బియ్యం పిండితో రొట్టెలు చేసి ఒక్కో వేడి వేడి రొట్టెను బెల్లంతో కలిపి ముద్ద చేస్తారు. ఈ ముద్దను ‘చర్మో’ అంటారు. రాత్రి భోజనాలయ్యక మహిళలు గుంపుగా చర్మోను పళ్ళెంలో పెట్టుకుని తీజ్‌ ఉన్న అతని ఇంటికి వెళతారు. ఆ ఇంటి యజమాని వొడిలో చర్మోను పెడతారు. ఇలా పెట్టడాన్ని ‘ఢవెళి’ అంటారు, ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని వొడిలో ఢవెళి పెడతారు. ఇది కడావోలో ఉన్న ఉప ఆచారం. ‘’ఆహారానికి, గౌరవ మర్యాదలకు, తండా క్షేమానికి, సుఖసంతోషాలకు కొదువ రాకుండా చూడాల్సిన బాధ్యత తండా పెద్దలదేనన్న’’ విషయం గుర్తు చేయడం ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం.

ఎనిమిదో రోజు సాయంత్రం యువతులు చెరువు నుంచి మట్టి తెస్తారు. ఆ మట్టితో ఇద్దరు వృద్ధస్త్రీలు ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలకు పెళ్ళి జరిపించి సంబరం చేస్తారు. తరువాత ఆ బొమ్మలను ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనినే ‘ఛ్వారీ ఛ్వారారో’ పండుగగా పిలుస్తారు.

తొమ్మిదో రోజు ‘గణ గోర్’...మెరామ, సేవాలాల్‌ల పెళ్ళి చేయుట (గణ్‌, గోర్‌) : ఈ ఆచారాన్ని తొమ్మిదవ రోజు అనగా గురువారం (చివరి రోజు కూడ) రోజున నిర్వర్తిస్తారు.

గణ్‌, గోర్‌లు ఎవరంటే (గణ్‌-భార్య, గోర్‌-భర్త) మెరామ మరియు సేవాలాల్‌.

ఈ సందర్భంగా వీరి విగ్రహాలు మట్టితో తయరు చేస్తారు. విగ్రహాలు తయరు చేయడానికి చెరువు నుండి మట్టి తేవడానికి అక్కా చెల్లెళ్ళు (వదినలు కూడ) ప్రయత్నిస్తే అన్నాదమ్ములు అడ్డుకుంటారు. అతి కష్టం మీద మట్టి తెస్తారు. అనుభవజ్ఞురాలు మట్టితో విగ్రహాలు తయరు చేస్తుంది. అది కూడా రహస్యంగా. మెరామ విగ్రహానికి (గణ్‌కు) ఎర్రటి సంప్రదాయ వస్త్రాలు (ఏట్య, టుక్రి, కాంచళి) ధరింపచేస్తారు. విగ్రహాల తలకు వెంట్రుకలు అద్దుతారు. చిన్న అద్దాలను కళ్ళుగా అమర్చుతారు. బియ్యపు గింజలను దంతాలుగా పెడుతారు. విగ్రహాలను రహస్య ప్రదేశం నుండి మంచె దగ్గరికి తీసుకువస్తారు. అన్నదమ్ములు శతవిధాల అడ్డుకుంటారు అతికష్టం మీద విగ్రహాలు మంచె దగ్గరికి తీసుకువచ్చి వాటి కొంగు ముడి వేస్తారు. అంటే మెరామ, సేవాలాల్‌ల పెళ్ళి జరిపిస్తారు. పెళ్ళిని కూడా అన్నదమ్ములు అడ్డుకుంటారు. అయినా అవ్మయిలు దేవతల పెళ్ళి విజయవంతంగా జరిపిస్తారు. ఇంటి యజమానురాలు నెయ్యి కలిపిన తీపిపదార్థాన్ని దేవతలకు నైవేద్యంగా సమర్పించడంతో ప్రధాన ఘట్టం ముగిసినట్టవుతుంది.

దేవతలకు నైవేద్యం సమర్పించిన వెంటనే అన్నదమ్ములు మంచెమీదున్న చిన్న బుట్టలను (చోడకలీలను) అందుకుని పరుగు తీస్తారు. వారి వెంట అక్కాచెల్లెళ్ళు, వదినలు పరుగుతీస్తారు. బుట్టలలోని నారును ఏమి చేయవద్దని అక్కాచెల్లెళ్ళు అన్నాదమ్ములను ప్రాధేయపడతారు. అన్నాదమ్ములు బుట్టలలోని నారు పీకేసే ప్రయత్నం చేస్తారు. దేవతకు ప్రతిరపాలైన చిన్న బుట్టలను అన్నా దమ్ములు చిందర వందర చేయడాన్ని చూసి అవ్మయిలు, వదినలు కన్నీళ్ళు పెట్టుకుంటారు.

ఈ సందర్భముగా అన్నాదమ్ముల హృదయలు కరిగే విధంగా అక్కా చెల్లెళ్ళు శోకభరిత గీతాలను ఇలా ఆలపిస్తారు.

 బంజార :

దారే భీయ చొడకలి ద నవ దాడేరి భకి మ. 
 దారె భీయ చోడకలి ద తోన పేరేన లాల్చిదరాదు. 
 దారె భీయ చోడకలి ద తారి కానేన బాలి దరాదు. 
 దారే భీయ చోడకలి ద తారి టాంగేన తోడ దరాదు. 
 దారే భీయ చోడకలి ద తారి హాతేన కోల్డ దరాదు. 

తెలుగు :

ఓ అన్నయ్య! నా బుట్టలను ఇవ్వు 
 తొమ్మిది రోజుల నుండి ఉపవాసమున్నాను. 
 నీకు పైజామ (లాల్చి) ఇప్పిస్తాను నా బుట్టలను నాకు ఇవ్వు. 
 అన్నయ్య! నీ చెవులకు పోగు కుట్టిస్తాను  నా బుట్టలు నాకు ఇవ్వు. 
 అన్నయ్య! నీ కాళ్ళకు కడియలు చేయిస్తాను నా బుట్టలు నాకు ఇవ్వు 
 అన్నయ్య! నీ చేతులకు కడియలు చేయిస్తాను నా బుట్టలు నాకు ఇవ్వు. 

ఇలా పరిపరి విధాలుగా అన్నాదమ్ములను ఉద్దేశించి అవ్మయిలు పాటలు పాడుతారు. అక్కా చెల్లెళ్ళ బాధలు చూడలేక అన్నాదమ్ములు తీజ్‌ బుట్టలను వారికి ఇచ్చేస్తారు. అక్కా చెల్లెళ్ళు సంతోషిస్తారు. తిరిగి బుట్టలను అపురూపంగా మంచెమీద పెడతారు. బుట్టలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా అన్నాదమ్ములను పొగడుతూ కూడ అవ్మయిలు పాటలు పాడుతారు.

పండుగకు చివరి రోజు కాబట్టి దీక్షలో ఉన్న అమాయిలు దేవతలకు సమర్పించగా మిగిలిన నైవేద్యాన్ని భుజించి దీక్షను విరమిస్తారు.

ఆ నైవేద్యాన్ని అన్నాదమ్ములకు, పెద్దలకు, పిల్లలకు పంచుతారు. విగ్రహాల తయరీకి కావలసిన మట్టిని తేవడానికి కాని, విగ్రహాల తయరీని గాని, విగ్రహాలను మంచె దగ్గరికి తీసుకురావడాన్ని కాని, పెళ్ళి జరిపించడానికి కాని అన్నాదమ్ములు ఎందుకు అడ్డుకుంటారు? దీని వెనుక చిన్న కథ వుంది.

పూర్వం బంజారాలు బిడారి వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపార కాలం నుండి మెరామ, సేవాలాల్‌ ఇద్దరు బంజారాల ఆరాధ్యదైవాలు. ఇద్దర అవివాహితులు. ఒకసారి మెరామ తనను పెళ్ళిచేసుకొమ్మని సేవాలాల్‌ను అడుగుతుంది. సేవాలాల్‌ తిరస్కరిస్తాడు. కోపంతో మెరామ సేవాలాల్‌ పశువులను మాయం చేస్తుంది. విధిలేక సేవాలాల్‌ మెరామతో ఒక అంగీకారానికి వస్తాడు. పెళ్ళి, సంసారం అనే భావనలు లేకుండా నీతో కలిసి జీవిస్తాను అని షరతు విధిస్తాడు. మెరామ షరతును అంగీకరిస్తుంది.

ఈ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీజ్‌ పండుగ సందర్భముగా మెరామ కోరిక ప్రకారము సేవాలాల్‌తో పెళ్ళి జరిపించడానికి అమాయిలు ప్రయత్నిస్తే, సేవాలాల్‌ అభిమతం మేరకు అన్నాదమ్ములు పెళ్ళిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చివరకు మెరామ సేవాలాల్‌ల పెళ్ళి జరిపించడంలో అక్కా చెల్లెళ్ళు, వదినలు విజయం సాధిస్తారు. ‘’పెళ్ళి ద్వారానే సుఖశాంతులు వస్తాయని, సంసారాలు పచ్చగా వుండాలని, తమ భవిష్యత్‌ ఉజ్వలంగా వుండాలని అమాయిలు కోరుకుంటారు. అలాంటి జీవితం వుండాలంటే వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని అందుకు తీజ్‌ (మెరామ) దేవత ఆశీస్సులు అవసరమని’’ అవ్మయిలు ఈ పండుగ నిర్వహణ ద్వారా సందేశాన్నిస్తారు. ఈ సందేశాన్ని అర్థం చేసుకున్నట్లుగా అన్నాదమ్ములు తదుపరి పండుగ నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలిగించరు. పైగా మనస్పూర్తిగా సహకరిస్తారు.
చివరిఘట్టంలో ‘తీజ్‌వేరాయెరో’ (నిమజ్జనోత్సవం)

తీజ్‌ను చెరువులో వదలుట (వెరాయేరొ) : తొమ్మిదవ రోజుకు గోధుమ నారు పెరిగి వంగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు తండా వాసులు తీజ్‌ మంచె దగ్గరికి చేరుతారు. మగవాళ్ళు చిన్నాపెద్ద తేడా లేకుండ తలపాగ చుట్టుకుని వరుసగా కూర్చుంటారు. ముత్తైదువలు పాటలు పాడుతుండగ అక్కా చెల్లెళ్ళు బుట్టలలోని నారును తుంచి వారి తలపాగలలో పెడతారు. ఆ తరువాత బుట్టలను తల మీద ధరించి వాటిని చెరువులో వదలడానికి బయలుదేరుతారు. ఆటపాటలతో చెరువుకు చేరుకునే సరికి మూడు, నాలుగు గంటల సమయం తీసుకుంటుంది. చెరువు దగ్గర జనసందోహం జాతరను తలపిస్తుంది.

మునగకుండ బుట్టల నుండి నారుతో పాటు మట్టిని తీసేస్తారు. నారు మొదళ్ళకు అంటుకున్న మట్టిని కడిగి తిరిగి నారును బుట్టలలో పెడతారు. వెంట తేబడిన చిన్న పీటల మీద అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళ కాళ్ళు కడిగి తమ ప్రేవనురాగాలను ప్రకటిస్తారు. ఈ దృశ్యం అన్నాదమ్ముల అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. తీజ్‌ బుట్టలను నీళ్ళలో వదిలే ముందు ఇలా గీతాలాపన చేస్తారు.

బంజార :

తు కతేతి ఆయెరె సాంక్రియ తలావో 
 వరి తీజేరి జ్యోత్‌ లేయి చాలో, 
డగరచాలో తు కతేతి ఆయెరే దదియ తలావో 
 వరవొడలిరి జ్యోత్‌ లెయి చాలో, డగరచాలో 

తెలుగు :

ఓ సాంకరియ అనే పేరు గల చెరువా! 
 నీవు ఎక్కడి నుండి వచ్చావు 
 వ తీజ్‌ వెలుగును తీసుకుపోతున్నావు 
 ఓ పాల లాంటి చెరువా! నీవు ఎక్కడి నుండి వచ్చావు. 
 వ మంచె వెలుగును తీసుకుపోతున్నావు. 

తండాపెద్ద వారిని ఓదారుస్తారు. యువతులు భవానిమాతను తులుస్తూ తీజ్‌నారు బుట్టలను కిందకు దింపి పూజలు చేసారు. దానిలోనుంచి కొంతనారును తెంపి తమ్ముళ్లు, బంధుమిత్రులకు చెవులలో పెడతారు. పెద్దతలకు తలపాగాలో దోపుతారు. బహుమానంగా యువతులకు కానుకలు ఇస్తారు. అనంతరం పూజలు చేసి బుట్టలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. చెరువు వద్దకు చేరగానే సోదరులు తమ సోదరి పాదాలను నీటితో కడిగి దండాలు పెట్టి ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. . గాలి తాకిడికి బుట్టలు అలల మీద తేలిపోతుంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇంటి ఆడపడుచును అత్తవారింటికి పంపిస్తున్నట్టుగా దుఃఖిస్తారు. బాధాతప్త హృదయలతో అక్కడి నుండి తండాకు వెళ్ళిపోతారు. నిమజ్జనం అనంతరం వారు తమ ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంరొట్టెలు, బెల్లంతో కలిపి చేసిన ‘చూర్మో’ ను వాయినంగా సమర్పిస్తారు. తీజ్ పాటలు పాడుతూ ఇంటికి చేరతారు.

ఇంతటితో తీజ్ వ్రతం ముగుస్తుంది

 ప్రస్తుతం ప్రతి తండాలో తీజ్‌ పండుగ నిర్వహించబడుతున్నది. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండి తండా ప్రజల జీవితమే కాక సమాజంలోని అందరి జీవితాలు సుఖశాంతులతో వుండే విధంగ తీజ్‌ దేవత కరుణిస్తుందని వీరి ఆచర సాంప్రదాయాలను అర్ధంచేసుకుంటూ ప్రభుత్వమూ ప్రజలూ గౌరవిస్తారనీ, గౌరవించాలనీ ఆశిద్ధాం
1) నేపాల్ లో కూడా ఒక రకమైన తీజ్ పండుగ జరుగుతుంది వాళ్ల భాషలో తీజ్ అంటే మూడు, థర్డ్ అని అర్ధం.
2) జైపూర్ లో జరిగే తీజ్ పండుగ నాటి కాల్ బెలియా నాట్యం క్రింది విడియోలో చూడొచ్చుమరికొన్ని
నమస్తే తెలంగాణా వ్యాసం, వ్యాసం2
సాక్షివ్యాసం 
వెబ్ పత్రిక లోని ఆర్టికల్

ఫేస్ బుక్

Tweets

లంకెలు