ఏది తెలింగము? ఏది ఆంధ్ర? - పి.వి. పరబ్రహ్మశాస్త్రి

కోస్తా ప్రాంతం కృష్ణదేవరాయల నాటికి కూడా తెలుంగు(తెలింగము) అనే పేరుతో ఉండెను. కొన్ని సందర్భాలలో ఆంధ్రపదం వాడుకలో కలదు. కనుక ఈ పేర్లు తెలింగ (తెలుంగు) - ఆంధ్ర అనేది ప్రజల్లో ఐక్యతకు తోడ్పడాలి గానీ విభేదాలకు దారితీయకూడదు.

క్రీ.పూ. సాతవాహనులు మొదలు క్రీ.శ. 14వ శతాబ్దం - ఆ తర్వాత కూడా ఇప్పటి తెలంగాణము ఆంధ్రమే. ముసల్మానుల హయాంలో ఈ ప్రాంతానికి తెలంగాణమనే పేరు రూఢియయ్యెను.

తెలింగము - ఆంధ్ర... ఈ రెండు పేర్లు 2013 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి చిరకాలం నుంచి చెల్లుతూ వస్తున్నవి. అలా గే మాట్లాడే భాషకు కూడా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాసులలో అధిక సంఖ్యాకులు తెలుగువారు-ఆంధ్రులు అని కూడా వ్యవహరింపబడుతున్నారు. గోదావరి నదికి ‘తెలివాహ’ అను పేరు క్రీ.పూ. నూతన శిలాయుగానికి చెంది స్థిరనివాసాలేర్పరచుకొన్న ప్రజలు పెట్టిన పేరు. దాన్నే తెల్లబెణ్ణ అనేవారు. కృష్ణానదిని నల్లబెణ్ణ అనేవారు. పెన్న అనేది నదికి సామాన్య నామము. గోదావరి నదిలో నీళ్లు కృష్ణానదిలో నీళ్లతో పోల్చి చూస్తే కొద్దిపాటి తెల్లగా (వెలిరంగులో) నున్నట్లు ఆనాటి ప్రజలు గమనించి ఆ నదులకు తెల్లబెణ్ణ, నల్లబెణ్ణ అని రంగులకొద్ది భేదాన్ని బట్టి పిలిచేవారు. కృష్ణానది సితేతరబెణ్ణ అని చేజెర్ల సంస్కృత శాసనంలో పేర్కొనబడింది. కనుక గోదావరి సితబెణ్ణ యగునని తెలుస్తోంది. అదే తెల్లబెణ్ణ. ఉత్తరదేశం నుంచి వచ్చేవారు దాన్ని ‘తెలివాహ’ అని కొంత సంస్కృతీకరించారు. బౌద్ధ జాతక కథలో తెలివాహ అనే పేర్కొనబడింది. ఈ నదికి ఉత్తరదేశ ప్రాంతాన్ని కలింగమని నూతన శిలాయుగం నాటి ప్రజలు పిలుస్తూ దానికి దక్షిణదేశ ప్రాంతాన్ని తెలివాహ నదిని బట్టి తెలింగమని పిలుచుకొన్నారు. ‘ఇంగ’ అంటే నివాసస్థానము. ఇట్లాంటి గ్రామనామాలు వేంగి, మున్నంగి, చొల్లంగి, రేలంగి, వేళంగి, కోరంగి మొదలగునవి కోస్తా ప్రాంతంలో కలవు. దీన్నిబట్టి గోదావరికి దక్షిణంగా గల దేశప్రాంతాన్ని ‘తెలింగము’ అని అప్పటి క్రీస్తుపూర్వ రెండువేల నాటి నూతన శిలాయుగ ప్రజలు ప్రాంతనామంగా స్థిరపరిచారు. ఆనాటి ప్రజలు ప్రాంతాలను అంగ-వంగ; తోసల-కోసల, తెంకణ-కొంకణ, ఇట్లా జంటపేర్లతో పేర్కొనటం కనబడుతుంది. అట్లాగే కలింగము-తెలింగము. రెండుపేర్లు సమకాలీనంగానే శిలాయుగంనాటి ప్రజలు రెండు ప్రక్క ప్రక్క దేశ ప్రాంతాలకు పెట్టినపేర్లు. గ్రామనామాల్లో తాడంకి, పోరంకి, అద్దంకి ఇట్టివే. ఇట్టిదే నూతంకి (నూతక్కి). గ్రామ నామాలను ఇంకా పరిశోధించాలి. ఈ చెప్పిన పేర్లు గల గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌ కోస్తా ప్రాంతానికి చెందినవే. అట్లాగే కలింగవలె తెలింగ కూడా కోస్తా ప్రాంత దేశవిభాగానికి పేరైయుండునని చెప్పటం సహేతుకమైయుండును.


  • 2. కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామంలో ఆంధ్రమహావిష్ణువు అను పేరుతో ఒక విష్ణుదైవము చిరకాలం నుండి ప్రసిద్ధమై పూజాదికం పొందుతోంది. విగ్రహంతో సహా కృష్ణానది వరదల్లో మునిగిపోవ టం మరల దాన్ని పైభాగంలో పునఃప్రతిష్ఠించి గుడికట్టడం జరుగుతోందని తెలియవచ్చెను. ఒక జాతి పేరుతో దేవుడు పూజింపబడటం విడ్డూరంగా తోస్తుంది. కాని యిచట ఆంధ్ర సాతవాహన రాజు గౌతమీ పుత్రసాతకర్ణి తన ప్రధాన సేనాపతి విష్ణుపాలితుడను వానితో వచ్చి మొదటిసారిగా కోస్తా ప్రాంతాన్ని జయించగా ఆ సేనాపతి తన పేరుతో ఆంధ్రరాజును సూచిస్తూ ఆంధ్ర మహావిష్ణువు అనే పేరుతో దేవుణ్ణి ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఆ విష్ణు విగ్రహం కృష్ణానదిలో తరచు మునిగిపోతూ పునఃప్రతిష్ఠింపబడుతుండగా ఇప్పటి విగ్రహం-గుడి రెండూ ఎప్పటి కాలాంత రం నాటివో నిర్ధారించటం సులభం కాదు. ఇట్లా రాజులు, దండనాయకులు తాము జయించిన ప్రాంతాల్లో తమ పేరుతో దేవుళ్ల ను ప్రతిష్ఠించుకోవటం సామాన్య విషయమే. సుమారు క్రీ.శ. 120 ప్రాంతాన గౌతమీపుత్ర సాతకర్ణి మొదటగా తూర్పు కోస్తాను జయించి తెలింగదేశ ప్రాంతంలో కోస్తాలో రాజకీయంగా ఆంధ్ర పదాన్ని ప్రవేశపెట్టాడు. ప్రాచీన బౌద్ధులు ఉత్తరదేశం నుంచి వచ్చినవారగుట వల్ల వారు ఆంధ్రపదంతోనే యీ ప్రాంతాన్ని, ప్రజల్ని పిలిచేవారు. అశోకచక్రవర్తీ అంతే. ఆపస్తంబుడు, బౌధాయనుడు వంటి వైదిక విద్వాంసులు కూడా వారికి పరిచితమైయు న్న ఆంధ్రపదంతోనే యీ ప్రాంతాన్నీ పేర్కొనిరి.
  • 3. మొదటి తెలుగు శాసనాలు కడప-కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇవి క్రీ.శ. 6వ శతాబ్దం నుండి మాత్రమే కలవు. తెలంగాణ ప్రాంతంలో మొదటి తెలుగుశాసనం వరంగల్లు దగ్గర కొండపర్తిలో కలదు. అది సుమారు క్రీ.శ. 9వ శతాబ్దం నాటిది.
  • 4. కర్నూలు గుండా ప్రవహించే హంద్రీ నది ఉత్తరాది ఆంధ్రు ల వలసలైన ప్రాంతం కావచ్చునని డా. నేలటూరి వెంకట రమణ య్యగారు సాతవాహన సంచిక పత్రికలో వ్రాశారు.
  • 5. కోస్తా ప్రాంతంలో కొందరు చోళవంశ్యులు తెలుగు చోళలని వ్యవహరించబడిరి. కాని ఆంధ్రచోళులని పేర్కొనబడలేదు.
  • 6. వైదిక కర్మాదుల్లో సంకల్పం చెప్పే సందర్భంలో శ్రీశైలాన్ని హద్దుగా చూపిస్తూ దానికి యే దిశలో ఆ కార్యక్రమం జరుగుతోం దో చెప్పబడును. అంటే శ్రీశైలానికి ప్రాక్‌ అనిగాని, ఆగ్నేయం అని గాని, దక్షిణం అని గాని ఇత్యాదిగా చెప్పుట సంప్రదాయం. అది జ్యోతిర్లింగానికి, శక్తిపీఠానికి స్థానమగుటయే అందుకు కారణము కావచ్చును. ఈ సందర్భంలో జగన్నాథం నుండి భ్రమరాంబాస్థానం వరకు ఆంధ్రదేశంగాను, శ్రీశైలం నుండి చోళదేశం మధ్య దాకా తెలింగదేశమని ఆనాటి పెద్దలు నిర్ణయించి ‘శక్తిసంగమ తం త్రం’ అనే గ్రంథంలో వ్రాసినట్లుగా ఈ శ్లోకం చెప్పబడింది.

‘జగన్నాథ దూర్ధ్వభాగం అర్వాక్‌శ్రీ భ్రామరాంబికా 
త్తావదాంధ్రాబిధో దేశః
జగన్నాదూర్ద్వభాగ మర్వాక్‌శ్రీ భ్రామరాంబికాత్‌
తావదంధ్రాభిధోదేశః,
శ్రీశైలంతుసమారభ్య చోళేశాన్మధ్య భాగతః!
తైలింగదేశోదేవేశి ధ్యానాధ్యయన తత్పరః!


(ఈ శ్లోకాన్ని శ్రీగడియారం రామకృష్ణ శర్మగారు తరచు చెప్పెడువారు)


తాత్పర్యంలో ఇది శ్రీశైలానికి ఉత్తరభాగం ఆంధ్ర దేశమని, దక్షిణ భాగం తెలింగదేశమని స్థూలదృష్టితో పూజాది కార్యక్రమా ల్లో చెప్పాలని నిర్దేశిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటి తెలంగాణను ఆంధ్రదేశమని, ఇప్పటి ఆంధ్ర గోదావరి నుండి కంచి వరకు తెలింగదేశమని సంకల్పాదుల్లో చెప్పుచుండేవారని తెలుస్తూంది. దీన్ని బట్టి శ్రీశైలానికి ఉత్తరంగా ఆంధ్రదేశముగాను, దక్షిణంగా తెలింగదేశమున్నదని ప్రత్యేకించి రెండు ప్రాంతాలు నిర్దేశించబడినట్లు వ్యవహరించేవారని స్పష్టమగుచున్నది. కలింగానికి గోదావరి దాటి దక్షిణంగా తెలింగము కలదని పైన చెప్పబడెను.

  • 7. క్రీ.శ. 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో
‘‘తెలుఁగదేలయన్న, దేశంబు తెలుఁగేను
తెలుఁగువల్లభుండ దెలుఁగొకండ
యెల్లనృపులుగొలువ నెఱుఁగవేబాసాడి
దేశభాషలందుఁదెలుగుఁలెస్స’’

అని అతిస్పష్టంగా తను తెలుంగు వల్లభుడనని చెప్పుకొన్నాడు. ఆ రాజు చిత్తూరు, అనంతపురం జిల్లా నుండి ఉత్తరాన సింహాద్రి దాకా జయించి కోస్తా ప్రాంతానికి చేరిన తెలుఁగుదేశానికి చక్రవర్తిగా నుండెను కాని ఇప్పటి తెలంగాణానికి రాజు కాడని చరిత్ర వల్ల తెలుస్తూంది కదా. కనుక ఆ రాజు దృష్టిలో కోస్తా-రాలయసీమలే తెలుఁగు దేశము.

  1. 8. క్రీ.శ. 11వ శతాబ్దం నాటికి తెలుగు ఒక గ్రాంథిక వాఙ్మయం గా అభివృద్ధి కాలేదు సరికదా తెలుగువారైన పంప వంటి మహాకవులు కూడా కన్నడభాషలో కావ్యాలు వ్రాయటం మొదలుపెట్టా రు. తెలుగుభాష క్రమంగా మరుగునపడిపోయే ప్రమాదమేర్పడు ను. ఆ దుస్థితిని గమనించి రాజరాజనరేంద్ర చాళుక్యరాజు సర్వవిధాల జనాదరణ పొందిన మహాభారతాన్ని నన్నయభట్టారకునిచే తెలుగులో రాయించ బ్రోత్సహించెను. అట్టి చాళుక్యరాజు ప్రోత్సాహమే నేటి మధురమైన దేశభాషగా తెలుగు వర్థిల్లెను. నన్నయభట్టారకుడు వ్యాసమహాభారతాన్ని సంస్కృతము నుండి తెలుగు లో వ్రాయబూనెను. ఆ రాజు మహాభారతాన్ని తెలిగించమన్నాడు. కాని ఆంధ్రీకరించమనలేదు. తదనుగుణంగా నన్నయ తెలిగిస్తానన్నాడు కాని ఆంధ్రీకరిస్తానని చెప్పలేదు.
  • 9. ఇప్పటికి తెలింగ (తెలగ) కాపులనబడు ప్రత్యేక వ్యవసాయదారులు ప్రాచీనకాలం నుంచి కోస్తా ప్రాంతంలో అధిక సంఖ్యలో గనవత్తురు. వారు తమను తెలింగుల (తెలగల)మని యొక జాతి విశేషమునకు చెందినట్లుగా చెప్పుకొందురు. వారందరు ఇప్పుడు కాపులుగా చెప్పబడుచున్నారు.
  • 10. బౌద్ధులనాటికి అంటే క్రీ.పూ. 2-3 శతాబ్దాల నాటికి కోస్తా ప్రాంతంలో వారి స్తూపనిర్మాణాల ద్వారా అది ఆంధ్రము అని పేర్కొనబడుట సామాన్యమయెను. బౌద్ధుల ద్వారానేగాక అంతకుపూర్వమే స్థిరపడిన కొందరు బ్రాహ్మణులు కూడా ఆంధ్రనామా న్ని తెలుగుదేశానికి సామాన్యంగా వాడేవారని తోస్తుంది.

ఆంధ్ర - విషయము


శేరి వాణిజ జాతకంలో తెలివాహ నది దాటి ఆంధ్రనగరమున్న ట్లు చెప్పబడెను. ఉత్తరదేశం నుంచి వచ్చెడి వర్తకులు తెలివాహ నది దాటి ఆ నదికే దక్షిణంగా నున్న ఆంధ్రనగరం కోటిలింగాల గాని, రాయపట్నం కాని కాదగును. కనుక బౌద్ధుల దృష్టిలో ఆంధ్రము అనగా ఇప్పటి కరీంనగరు జిల్లా ప్రాంతమే.

  • 1. చారిత్రకంగా కరీంనగరు జిల్లాలో క్రీ.పూ. 2-1 శతాబ్దుల్లో కొందరు ఆంధ్ర జాతీయనాయకులు, రాజులు వర్ధిల్లినట్లు వారి నాణెములు తెలుపుచున్నవి. వారిలో ఆంధ్ర జాతీయ శాతవాహన రాజులై ప్రబలులై సామ్రాజ్య స్థాపకులయి క్రీ.శ. 2వ శతాబ్దాంతం వరకు పైథాను రాజధానిగా పాలించిరి. వారిలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి మొదటగా క్రీ.శ. రెండో శతాబ్దికి ఆదిలో కోస్తా ప్రాంతాన్ని సదవంశీయులనుండి జయించి ఆ గుర్తుగా ఇప్పటి కృష్ణా జిల్లాలో కృష్ణానదీ తీరానగల శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణుదేవుని ప్రతిష్ఠించెను. కోస్తా ప్రాంతానికి మొదటిసారిగా రాజకీయపరమైన ఆంధ్రపదం తెలంగ విషయానికి పర్యాయపదంగా వాడుకలోకి వచ్చినట్లు చెప్పవచ్చును. అసలు ఆంధ్రము కరీంనగరు, మెదకు, వరంగల్‌ జిల్లాలే.
  • 2. మతపరంగా భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల మున్నగుచోట్ల స్తూపాలు నిర్మించుకొని మహాసాంఘికులను పేరుతో ఆంధ్ర బౌద్ధులొక విశిష్ట శాఖాసంప్రదాయానుయాయులుగా చెప్పబడిరి. వారి గ్రంథాలు ములక (పైఠానుప్రాంతం), ఆశ్మక (ఆదిలాబాదు, నిజామాబాదు జిల్లాలు), ప్రాంతాలతో కలిసి ఆంధ్ర ప్రాంతం కలదని చెప్పను. కాగా, కలింగం వైపు నుంచి వచ్చిన బౌద్ధశాఖవారుకోస్తా వెంబడి అనేక స్తూపాలు నిర్మించుకొని రామతీర్థం, బావికొండ, శాలిహుండం, శంఖవరం (సంఘారామం) మున్నగు చోట్ల స్థావరాలేర్పాటు చేసుకొనిరి. బౌద్ధులు అంతా ఉత్తరదేశం నుంచి వచ్చినవారే. వారి ద్వారా ఆంధ్ర పదమే తెలుగుదేశానికి వాడుకలో స్థిరపడెను. ఈ విధంగా రాను రాను తెలుగుభాష కేవలం పామర జనుల్లోనే పరిమితమై బౌద్ధులచే తగినందగా ఆదరింపబడలేదు. (కన్నడ దేశంలో జైనమతం వ్యాపించినా కూడా కన్నడభాషను జైనులు ఆదరించారు. అట్టి ఆదరణ తెలుగుభాషకు లభించలేదు.) బౌద్ధమతం బాగా వ్యాపించని రేనాడు ప్రాంతంలో తొలి తెలుగు శాసనాలుండుటయే అందుకు నిదర్శనము. బౌద్ధమతం వెనుకంజవేయగానే సంస్కృతం శాసనభాషగా వచ్చెను.
సుమారు 800 యేండ్లు ఈ గడ్డపై నిలదొక్కుకుని అనేక స్తూపాలు, విహారాలు నిర్మించుకొని సంఘజీవనాన్ని యెంతగానో ప్రభావితం జేసిన బౌద్ధము కొన్నివందల పాలీపదాలను తెలుగుభాషలోకి చేర్చింది. (ఇట్టి పదాలను సుమారు 250 దాకా యేరి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారు ‘తెలుగులో పాళీపదాలు’ అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని తమ వివరణతో వారే తెలుగుగోష్ఠి సంస్థ ద్వారా ప్రకటించిరి. రామ్‌నగరు, హైదరాబాద్‌) తెలుగుభాషా వికాసానికి ఇది రెండో దశ. మొదటిదశ. క్రీ.పూ. ఆ మొదటి దశకు చెందిన పదాలు నాగలి, కాడి, మేడి, అగ్గి, ఎన్నడో ఉత్తరదేశం నుండి ఆంధ్రులు దండకారణ్యం ద్వారా కోస్తాలోనూ ప్రవేశించినప్పటిది.
క్రీ.పూ. మూడో శతాబ్దం నుండి క్రీ.శ. నాలుగో శతాబ్దం వరకు బౌద్ధులు వారి కేంద్రాల్లో వేయించిన వందల శాసనాల్లో ఒక్క తెలుగు శాసనం కూడా కనరాదు అంటే తెలుగుభాషను రూపుమాపి ఆ స్థానంలో వారి పాళీభాషా పదాలు చేరుతూ వచ్చెను.

ఇంక మూడోదశ

ఇది సరస్వతీనది వల్లె అంతర్లీనమై తెలుగుప్రజల సంఘజీవన పద్ధతిలోనే గొప్ప పరిణామాన్ని తెచ్చింది. ఆదిలో ఇప్పటి తెలం గాణ ప్రాంతానికే పరిమితమైన ఆంధ్రనామము, బోధాయన, ఆప స్తంబుల వంటి వారి గురుకులాలు కోస్తా ప్రాంతంలో స్థిరపడి వారి విధానాలను నెమ్మదిగా సామాన్యుల లౌకికి జీవన విధానాన్ని కొంత పరిచయం చేయుచుండిరి. ముఖ్యంగా తెలుగుభాషలో పద-వాక్య నిర్మాణాన్ని క్రమబద్ధం జేయ మొదలిడిరి.
బౌద్ధులు ఇందుకు భిన్నంగా పూర్తిగా ప్రాకృత భాషకే ప్రాధాన్యమిస్తూ తెలుగును మరిపించే విధంగా వ్యవహరించిరి. ఈ రెండు విధానాల తారతమ్యమే భట్టిప్రోలు శాసనాక్షర రూపాల్లోను, అశో క థర్మలిపుల శాసనాక్షరాల రూపాల్లోనూ గన్పట్టును. మొదటిది సంస్కృతానికి తగిన అజంతోచ్చారణము, రెండోది కేవలం ప్రాకృత భాషోచ్చారణమునకు తగినది. మొదటిదానిలో తెలుగు అభివృద్ధి తో గూడిన భాషకు సంస్కరణ వ్యక్తము కాగలదు. రెండవదానిలో తెలుగు అడుగంటి, బౌద్ధుల ప్రాకృతం ప్రబలమగుచున్న సూచన గనవచ్చును. బౌద్ధులు వేయించిన అనేక శాసనాల్లో చిన్నవైనను ఒకటి కూడ తెలుగులో కనిపించదు.

మొదటివారు అంటే ఆపస్తంబాదులు ముందుగా తెలుగు ఉచ్చారణను క్రమబద్ధం చేయుటకై ప్రయత్నించినట్లు భట్టిప్రోలుశాసనాక్షరాలు సూచిస్తున్నవి. దానికి మొదట మాటల్లో అజంతోచ్ఛారణమునకు అనుగుణంగా అక్షరాలను అకారాంతాలుగా వ్రాశారు.

ఈ చెప్పినది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటి పరిస్థితి. సామాన్య ప్రజల్లో భారతదేశ సంస్కృతి రెండు-మూడు శాఖలుగా, వైదిక, బౌద్ధ, జైన సంప్రదాయాలుగా చీలిపోతోంది. ఇదేకాలంలో రాజకీయ అధికార తృష్ణ క్రమంగా పెరుగుట మొదలిడెను. ఉత్తరదేశంలో చిన్న గణరాజ్యాలు అంతరిస్తూ సామ్రాజ్యస్థాపన కొరకు రాజన్యులు పోటీపడుచుండిరి. నందులు, మౌర్యులు వారిలో ముఖ్యులు. రాజనీతిపేరిట కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి గ్రంథాలు బయల్దేరెను. వింధ్యాద్రులు దాటి దక్షిణంగా సాతవాహన సామ్రాజ్యస్థాపన, కలింగం నుండి మహామేఘవాహన ఖారవేలుడి దండయాత్రలు, వాయవ్యదిశ నుండి శకులు విజృంభించి తమ తమ ప్రాబల్యాన్ని చూపుచుండిరి. తరువాత కుషానులు మధ్యభారతదేశం వరకు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పిరి.

ఒక్క శాతవాహనులు తప్ప మిగిలిన రాజన్యులు బౌద్ధమతాన్ని ఆదరిస్తూ తెలుగుదేశాన్ని ఆంధ్రదేశమనియే వ్యవహరించిరి. శాతవాహనులు ఆంధ్రజాతీయరాజులే కదా.

  • 1. శాతవాహనులు తెలింగాణంలోనే వర్థిల్లారు. తరువాత పైఠానుకు చేరిరి. వారు ఆంధ్ర జాతీయులని నిర్వివాదంగా పురాణాల్లో చెప్పబడిరి.
  • 2. కాకతీయులు బయటినుండి వచ్చినవారైనా ఆంధ్ర రాజులనే చాలా సందర్భాల్లో పేర్కొనబడిరి. వారి దేశం కూడ ఆంధ్రదేశమని పలుచోట్ల చెప్పబడెను.
  • 3. వారి ఆస్థాన విద్వాంసుడు విద్యానాథుడు తన ‘ప్రతాపరుద్రయశోభూషణం’అనే గ్రంథంలో పలుచోట్ల ప్రతాపరుద్రుడిని ఆంధ్రప్రభువు, ఆంధ్రనరేంద్రుడు ఇత్యాదిగా పేర్కొనెను.
  • కాని, ఆ విద్యానాధుడే తెలింగ పదాన్ని తిలింగంగా మార్చి శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాల్లో గల ముఖ్య శివలింగాలుగల దేశం కావటం చేత మొత్తం ఆంధ్రదేశానికి త్రిలింగదేశమనే వ్యవహారం వచ్చిందని సంస్కృతంలో వ్యుత్పత్తిని నిర్వచించెను. ఇంక ఈ కృత్రి మ వ్యుత్పత్తిని విశ్వసిస్తూ సామాన్యులు దేశానికి త్రిలింగమనే పేరును రూఢి చేసుకొన్నా, ముసునూరి ప్రోలయనాయకుడి విలస శాసనంలో (సుమారు 1337 ప్రాంతంలో) ఆ కవి తిలింగపదాన్ని మూడు మార్లు పేర్కొనెను.
  • 4. దానము చేయబడిన విలసగ్రామం తూ.గో.జిల్లా అమలాపురం దగ్గర కలదు. ప్రోలయనాయకుడి రాజధాని రేకపల్లి భద్రాచలం తాలూకాలో కలదు.
  • 5. ప్రోలయనాయకుడి పినతండ్రి కొడుకు కాపయనాయకుడు సుమారు ఆ కాలంలోనే వరంగల్లు నుండి క్రీ.శ. 1336-37 ప్రాంతాన తురుష్కులను పారదోలి తాను అచట ‘ఆంధ్రదేశాధీశ్వరుడ’నని ‘ఆంధ్రసురత్రాణుడ’ (ఆంధ్రసుల్తాను)నని ప్రకటించుకొని స్వతంత్రరాజయ్యెను.
ఈ పై రెండంశములలో మొదటిది గోదావరి జిల్లాలు తిలింగ రాజ్యభాగమని, రెండోది కాపయ ఆక్రమించుకొన్న వరంగల్లు ఆంధ్ర నగరమని, ఆ ప్రాంతం ఆంధ్రదేశమని స్పష్టమవుతుంది. ముసునూరి సోదరులు ఏకకాలంలో ఒకరు తీరప్రాంతాన్ని తిలింగము మఱియొకరు వరంగల్లు ప్రాంతాన్ని ఆంధ్రమని పేర్కొని విస్పష్టమగు తీర్పునిచ్చి యాదృచ్ఛికంగానైనా చారిత్రక సత్యాన్ని బయల్పరచారు.

ఈ చారిత్రక సత్యాన్ని దృష్టియందుంచుకొని ఒక ప్రాంతంవారు రెండో ప్రాంతంలోని తెలుగు సోదరులను గూర్చి పరుషంగా మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదు. క్రీ.పూ. సాతవాహనులు మొదలు క్రీ.శ. 14వ శతాబ్దం - ఆ తర్వాత కూడా ఇప్పటి తెలంగాణము ఆంధ్రమే. ముసల్మానుల హయాంలో ఈ ప్రాంతానికి తెలంగాణమనే పేరు రూఢియయ్యెను.

అట్లే కోస్తా ప్రాంతం క్రీ.శ. 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల నాటికి కూడా తెలుంగు (తెలింగము) అనే పేరు ఉండెను. కొన్ని సందర్భాలలో ఆంధ్రపదం కూడా వాడుకలో కలదు. కనుక ఈ పేర్లు తెలింగ (తెలుంగు) - ఆంధ్ర అనేది ప్రజల్లో ఐక్యతకు తోడ్పడవలె గాని, ద్వేషాలకు, విభేదాలకు కారణం కాకూడదు.


- పి.వి. పరబ్రహ్మశాస్త్రి
చరిత్ర-పురావస్తు పరిశోధకులు, రచయిత, గ్రంథకర్త

మరికొంత సమాచారం










కామెంట్‌లు