ఒక్కోసారి చీకటిరాత్రి

మనసంతా కిక్కిరిసిపోయినపుడు
విశాలమైన ఖాళీల్లోకి ప్రవహించేందుకు
నాలోంచి నేను బయటికి దూకేస్తుంటాను

ఆలోచనలన్నీ వెలితై వెలవెల పోయినపుడు
మెరుగైన పని నింపుకుంటూ
ఒక్కోగది గడిలోకి ఒంపుకుంటుంటాను.

అప్పుడప్పుడూ మది డొల్లగా వెక్కిరిస్తే
ప్రియతమా ‘నిన్ను’ తలచుకుంటాను.
గాయమై జ్ఞాపకం కారితే
లేహ్యంగా వాస్తవాన్ని పూస్తుంటాను.
ఒంటరై రద్దీలో తత్తర పడితే
నీ వేలి ఆసరా వెతుక్కుంటాను.

అయినా నా జవనాశ్వమా
స్వారీ తెలియని ఈ రౌతు తెరచిన మనసుని
నువ్వే చదువుతూ వుండు.

సరేలే నేస్తమా
గమ్యం ఎరగని బాటసారినని
దాహం గమనిస్తే చెలమను చూపిస్తుండు.

లావొక్కింతయు లేదు నా లకుముకి పిట్టా
పిచ్చి సంభాషణలకిలా ఊ కొడుతుండు.

►26-09-2014
కవిసంగమంలో

కామెంట్‌లు