గురువులకు వందనం

నేర్చుకోవడానికిప్పుడు పుస్తకాలూ, పేపర్లూ, మాన్యువల్స్, పైగా ఆడియో విడియోలతో ఆకర్షణీయంగా తయారైన మరెన్నో పాఠాలు, అందర్నీ తనలో పడేసుకున్న పెద్ద నెట్టువల.

ఐనా గురువు ఇంకా అవసరం అవుతారా?

అంటే చిన్నప్పటి చాలా జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. ఏదైనా పాఠం అర్ధం కానట్లు మొహం పెట్టగానే గమనించి ఏరా ఎక్కడొచ్చింది నీకు సందేహం అని కంప్యూటరు అడగగలదా? యమ్యే ఇంగ్లీషులో వికసించేలా ఐదోతరగతిలో ఏల్యాగారిలా ఫోనెటిక్ విత్తనం ముందుచూపుతో నాటటం ఏ మరయంత్రానికి సాధ్యం?

సాయత్రం మా యింటికి బోజనానికి రారా అని మా గంగులుబాబుగారి లాగానో, శర్మగారిలాగానో పిలిచి వాళ్ళపిల్లలతో పాటు కూర్చోబెట్టుకుని జీవితాన్ని పాఠంలా వడ్డించే ప్రొజెక్టర్లను మనిషి తయారు చేయగలడా?

మా అప్పిరెడ్డిగారిలా, ఆడమ్స్ మాస్టారిలా, లక్ష్మినారాయణగారిలా, భుజం మీద చెయ్యేసి వెన్నుతట్టే ఆర్ధ్రత ఏ పరికరాల్లో ఏర్పడుతుంది. ఈమధ్య నువ్వు కవిత్వమీదే కన్నేయటంలేదేమిటని ఫోన్ చేసిమరీ అడిగే అన్నయ్యల్లాంటి గురువుని ఏ యంత్రం రీప్లేస్ చేస్తుంది. ఇంతకీ మంచీ చెడు అంటే నువ్వేమనుకుంటున్నావో ఈ గ్రూపుచాట్లో చెప్పమని దఢాలున అడిగేసే నేస్తాల్లాంటి మాస్టార్లని కేవలం సాప్టువేర్లు సమతూకం చేయగలవా?

ఎక్కడ అనునయించాలో, ఎప్పుడు కోప్పడాలో, ఎంత అవసరమో టైలరింగ్ చేసుకుంటూ అందించేలా చిట్టిరోబో లను నిర్మించే వసీకర్ లకు వశమవుతుందా?

ఈతనేర్చుదామని పుస్తకాలన్నీ తిరగేసి, యూట్యూబు పాఠాలకు కళ్ళప్పగించి, ఆడియే క్యాసెట్లు మరింతగా బట్టీయం వేసి దడాలున చెరువులో దూకటానికీ, సావాసగాడు మొల్తాడు పట్టుకుని తానే గురువై ఒక్కో మునక నేర్పడానికీ ఎంతతేడానో తెలిస్తే గానీ ‘‘గురువులేని విద్య గుడ్డివిద్య’’ అని ఎందుకన్నారో తెలుస్తున్నట్లవుతుంది.

సర్వేపల్లి పుట్టినరోజనో, వ్యాసుడి పౌర్ణమి అనో కాదు కానీ నడుస్తున్నప్పుడు దారిచూపించేలా అక్షరాల వెలుతురు పరచుకున్నప్పుడల్లా నల్లబల్లమీదనే కాకుండా నడతలోనూ పాఠాలు నేర్పిన గురువులెందరో మనసుని తడిపేస్తుంటారు.

ఏదేమైనా అప్పుడప్పుడూ ఇలా కళ్ళు కడుక్కోవటం కూడా చూపుకు మంచిదే.

గురువులందరీ, గురువుల్లాంటి మిత్రులందరికీ ఈ సందర్భాన్ని అడ్డపెట్టుకుని మరోసారి వందనం.
గురుభ్యోనమ:

_/|\_

కామెంట్‌లు