మట్టివేళ్ళూ- నా ప్రయాణం - సురేష్ వంగూరి

కవిత్వం చదవడం మానేసి పదేళ్ళు దాటిపోయింది. బహుశా, కవిత్వంలో నాకు నేను దొరక్కపోవడం వల్ల కావచ్చు. లేదా, నా సామాజిక దృష్టికోణం బలపడిన నేపథ్యం కవిత్వంతో సాన్నిహిత్యం లేనిది అయివుండొచ్చు. కవిత్వం, కవులు పౌరసమాజాన్ని ప్రభావితం చేయడంలో విఫలమయ్యారనే భావన మనసులో బలంగా వుండడం వల్ల కూడా కావచ్చు. కవిత్వపు అబ్‌స్ట్రాక్ట్‌ను అంగీకరించే స్థితిలో నా మనసు లేకపోవడం కూడా కావచ్చు. కారణాలేవైనా తెలుగు కవిత్వానికి నేను కావాలనే దూరమైపోయాను. మళ్ళీ చదవాలనే ఆసక్తి కూడా నిజంగానే లేదు.
మిత్రుడు Katta Srinivas మొన్నీమధ్య తన కవిత్వం 'మట్టివేళ్ళు' ఇచ్చారు. సిటీబస్సులో కూర్చుని, అనాసక్తిగానే పుస్తకం తిరగేశాను. ఒక్కచోట మాత్రం అలా ఆగిపోయాను. నాలుగు చిన్న లైన్లు - ఆయన ఏ నేపథ్యం లోంచి రాశారో తెలీదు. కానీ, ఒక అనుభవంగా తీసుకుంటే మాత్రం కొద్దిసేపు నన్ను ఆలోచనలో పడేశాయి.
గెరిల్లా యుద్ధం నీకూనాకూ మధ్య ..
అర్థం కానంత లోతులో నిశ్శబ్దపు లోయలేర్పడ్డాయి
మాటలతో తప్ప మరేవిధంగానూ పూడ్చలేం
అయినా ... మళ్ళీ కరచాలనం చెయ్యాలనే మనసు
నీ దగ్గరుందా అసలు?
మిత్రులు, కలిసి పనిచేసినవాళ్ళు, బంధువుల్లో చాలామందితో నాకిలాంటి గెరిల్లా యుద్ధం చాలాకాలంగా జరుగుతూనేవుంది. కారణాలన్నీ చిన్నచిన్నవే కావచ్చు. కానీ గోడలు మాత్రం గట్టిబడిపోయాయి. నేను వారికి అర్థం కాకపోవడం ఒక ప్రశ్న. వాళ్ళు నాకర్థం కాకపోవడం ఇంకో ప్రశ్న. అందుకు మాఇద్దరి దగ్గరా సహేతుకమైన కారణాలే వుండొచ్చు. కేవ‌లం న‌డిచేదారిలో వైరుధ్యాలే కావ‌చ్చు. అవి బయటపడాలన్నా కూడా ... ఇద్దరం మాట్లాడుకోవాలి. ఒకరికొకరు తమ ఆర్థడాక్స్‌లను విడమర్చుకోవాలి.
ఆ సందర్భం రాదు, ఒకవేళ వచ్చినా దానిని ఉపయోగించుకునేంత అంతఃశక్తి అప్పటికప్పుడు రాకపోవచ్చు. నావరకూ నేను కరచాలనం చేయడానికి సిద్ధమే. అంత మనసు వారిదగ్గర వుంటే ఆహ్వానించడానికీ సిద్ధమే. కానీ అప్పటిక్కూడా ... నన్ను నేను కుదించుకున్నాననే ఒక వ్యతిరేక భావన నా మనసును వెంటాడుతూనే వుంటుందేమో! ఇది ప్రశ్నా? సందేహమా? అనుభవం నేర్పిన పాఠమా?


Suresh Vmrg
Post by Suresh Vmrg.

కామెంట్‌లు