ఛైతన్యపురి కాలనీలోని కొసగుండ్ల ఫణిగిరి నరసింహస్వామి ఆలయ శాసనాలు ఎప్పటికి చదువుతాము?

దిల్ షుక్ నగర్ దగ్గర్లో, ఛైతన్య పురి ఫణిగిరి కాలనీలో కనీసం క్రీస్తుశకం మూడవ శతాబ్దం కాలం నుంచి వుందన్న శాసనాధారాలు దొరికిన ఒక ఆలయం మన మధ్యే వుంది.
పేరు : కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయం
కొండ కొసన వున్న బండరాతి గుండ్ల మధ్యనున్న ఆలయం కావడం వల్ల కొసగుండ్ల అనే పేరు వచ్చి వుండొచ్చు.
ఆదిమానవుడు నివసించి వుండొచ్చు అనిపించే లాంటి గుహల నిర్మాణం, గుహ లోపల చెక్కివున్న బొమ్మలను నరసింహుని విగ్రహాలుగా పేర్కొని పూజిస్తున్నారు.
ఈ రోజు అంటే ది 09-11-2014(ఆదివారం) నాడు నేను మరియు వేముగంటి మురళీకృష్ణ, నందకిశోర్, భాస్కర్ కొండ్రెడ్డిలము ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చాము.

అక్కడి ప్రధాన విశేషాలు...............


1) గుహలోపటి ఐదుపడగల నాగశిల్పం
ఇది గర్భగుడి బయటి చిత్రం : మూలవిగ్రహాన్ని ఫోటో తీయనీయలేదు
ఐదుపడగలతో వున్న నాగశిల్పం ఒక పక్కవుంటుంది. దానివల్ల లేదా మొత్తంగా కొండ పడగలాగా వుండటం వల్ల కానీ ఫణిగిరి అనే పేరు వచ్చివుండొచ్చు. పడగ ఆకారానికి పక్కన లోహ తాపడాలతోనూ, లోహనిర్మిత నేత్రాలను అమర్చిన బొమ్మలు వున్నాయి వాటి స్పష్టమైన చిత్రాలను పరిశీలించే అవకాశం కలగలేదు. నిజానికి ఈ గుహాలయపు గర్భగుడి కూడా చాలా ఇరుకుగా వుంటుంది. ఒకే సారి ఇద్దరి కంటే ఎక్కువ పట్టటం కూడా ఇబ్బందే. గుహలోపల నాగశిల్పాన్ని చిత్రించి పూజించే సంస్కృతి ఏ కాలంలో వుండేది. బౌద్ధులే కాక మరెవరన్నా ఇటువంటి పద్దతిని అనుసరించే వారా అనేది పరిశీలించాల్సివుంది.

2) బండలపై స్పష్టమైన అసాధారణ పరిమాణ పాదముద్ర మరియు గదారంధ్రం




గర్భగుడి పక్కనే వున్న బండలలో స్పష్టమైన ఆకృతిలో సుమారు ఎనిమిదిన్నర అడగుల పొడవు, దానికి తగిన పొందికైన వెడల్పు స్పష్టమైన పాదం ఆకారం వుంది. ఇది ఖచ్చితంగా సహజంగా ఏర్పడిన గుంత కాదని అర్ధం చేసుకోవచ్చు.

3) విష్ణుకుండిన, గోవింద వర్మ కాలం నాటి శాసనాలు

అమెజాన్ అందాలను మరిపిస్తూ కాలుష్యాన్ని భరిస్తూ
ప్రవహించే మూసీ
ఈ ఆలయ రాతిశిలలపై రెండు శాసనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం బియన్ శాస్త్రి గారు ఒక శాసనాన్ని పరిష్కరించి 1960 లలో భారతి పత్రికలో శాసనం వివరాలతో ఒక వ్యాసం రాసారట. రెండో శాసనం మనకు దూరం నుంచి చూసేందుకు కనిపిస్తోంది కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కావలసిన పరికరాలతో వెళితే తప్పచేరుకోలేని విధంగా వుంది. ఇలా కొసన వున్న శాసనాన్ని పరిష్కరించి నట్లు వివరాలు అందుబాటులోకి రాలేదు. పైగా ఈ వివరాలను అందించేందుకు దానిని చూడటానికి అనుమతించేందుకు ఆలయ నిర్వాహకులు ఇష్టపడటం లేదు. ఇప్పటికే అందుబాటులో వున్న అమూల్య శాసనాన్ని నామరూపాలు లేకుండా సున్నం తదితర రంగులతో నామరూపాలు లేకుండా పూడ్చేశారు. శ్రీ పి.వి పరబ్రహ్మశాస్త్రి గారు పరిష్కరించిన శాసనం ఆనవాళ్ళు కూడా ఎంతవెతికినా అక్కడ కనిపించలేదు. అందాజుగా ఒక ప్రదేశంో కొంత సున్న గీరితే కనిపించ వచ్చు అని భావించాం. కానీ దానికి కూడా బహుశా వీళ్ళు అంగీకరించక పోవచ్చు. కొండలు ఎక్కే పరికరాలు వుండి నైపుణ్యం కల మిత్రులు వుంటే లేదా ఆర్కియాలజీ నుంచి అటువంటి పరికరాలను సమకూర్చి ఆ శాసన ముద్రను స్పష్టంగా ప్రింట్ చేసుకోగలిగితే ఈ ప్రాంతం వివరాలు. దాని చరిత్ర గురించి చాలా విలువైన వివరాలు దొరికే అవకాశం వుంది.
4) ఎన్నెన్నో గుహలవంటి అరలు దొంతరలతో రాతి అమరిక

గుడిచుట్టూ వున్న రాళ్ళు చాలా అందంగానే కాకుండా ఒకప్పుడు ఆదిమానవుడు జీవనం సాగించి వుంటే చాలా సౌకర్యవంతంగా వుండేందుకు అనుకూలంగా వుండేలాగా వున్నాయి. పక్కనే ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మూసీ నది కూడా వుండటంతో తర్వాతి కాలంలో దీనిని జైన, బౌధ్ధ మతాల కాలంలో ధ్యానకేంద్రంగా వాడుకుని కూడా వుండి వుండొచ్చు. పాదముద్రలు ఏర్పరచి పూజించే లక్షణం బౌద్ధులలో కూడా వుంది.

5) మూసీ నదిలోపలికి ప్రత్యేకంగా శివాలయం
గుడికి కొంచెం దూరంలో ఒక శివాలయం వుంది. దానిలో పానవట్టం తూర్పువైపుగా వుంటుంది. రాతిబండలపై త్రీశూలం, ఢమరుకం ధరించినట్లు కనిపిస్తున్న విగ్రమాన్ని గంగామాతగా భావిస్తున్నారు. శివలింగం పక్కే నేలబండపై స్త్రీ, పురుష బొమ్మలు చెక్కివున్నాయి. వారు విహార భంగిమలో వున్నారు. ఇవి ఏ కాలంలో గీసారో ఏ ఉద్దేశ్యంతో గీసారో తెలియదు. వాటి పక్కనే రాతిపై గీతలుగా గీచిన బొమ్మ(పెట్రోగ్లైవ్స్) కూడా వున్నాయి. కానీ వాటి వివరాలు. సరిగా అర్ధంకావడంలేదు ఇవి నవీనమో ప్రాచీనమో నిర్ణయించటము కూడా అవసరమే. ముఖ్యంగా మూసి నది మధ్యవరకూ వెళితే కానీ చూడటానికి అవకాశం లేకుండా వున్న ఈ ఆలయ ప్రాంతం సందర్శనకు చాలా ఇబ్బందిగానే వుంది.

ఇటువంటి శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలయాలు ఉరుకుల పరుగుల మహానగరం నడిమధ్యలో ఎన్నివున్నాయో, ప్రవహిస్తున్న మూసీ పరిసరాలలో ఏమేమి చరిత్ర పరిఢవిల్లిందో. పరిశోధనకు కొంత శ్రమనూ, సమయాన్నీ వెచ్చించగలిగితే అమూల్య మైన వివరాలు కాలగర్భంలో కలిసిపోకముందే చరిత్ర మనకోసం చెప్పాలనుకుంటున్న కొన్ని మాటలనూ దాని ప్రాణం పోయే లోగానే వినగలుగుతాం.....
మూసి మధ్యలో శివలింగం








గంగాదేవి విగ్రహం














ఒక చేత త్రిశూలం, మరోచేత ఢమరుకం
గంగాదేవి శిల్పం ఎవరి శిల్ప శైలి కావచ్చో


భారతి పత్రికలో శ్రీ పి.వి. పరబ్రహ్మ శాస్త్రిగారు రాసి వ్యాసం పూర్తి పాఠం





కామెంట్‌లు