Friday, 28 November 2014

సుమేరియన్ నాగరికతలో ‘తెలుగు’ ‘తెలివాహ’ ప్రస్తావనలు

 
మెసపొటేమియా (నేటి ఇరాన్‌, ఇరాక్‌ దేశ ప్రాంతాల)లో సుమేరియన్లు క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం నివసించేవారు. ఇది నేటికి నాలుగువేల సంవత్సరాల క్రితం మాట. వీరి సంస్క­ృతిని The lost culture (నశించిపోయిన సంస్క­ృతి)గా చరిత్రకారులు భావిం చారు. వీరి రాతలుClay Tablets (మట్టి బిళ్లల) మీద లభించిన వాటి ప్రకారం తాము సూర్యుడు ఉదయించే దిక్కు నుంచి వచ్చామని, తమ దేశం (వలసవచ్చిన వారి మూలప్రాంతం) ప్యారడైజ్‌ ల్యాండ్‌ (స్వర్గసీమ) అయిన 'తెలిమన్‌' (Tel -mun) దేశం, తమ దేవుడు ఎంకి అని జియశూద్ర (Ziasudra) తమ మూల పురుషుడని చెప్పుకున్నారని చరిత్రకారులు రాశారు.

హమ్ము రాబి రాజు క్రీ.పూ. 1792-1750ల మధ్య బాబిలోన్‌ను పరిపాలిం చాడు. ఈయన కాలంలో సుమేరియన్‌ల రాజ్యం బాగా విస్తరించింది. అస్సిరియ న్‌ రాజ్యం క్రీ.పూ. 7వ శతాబ్దిలో శిథిలం కాగా ఆర్కియాలజీ తవ్వకాలలో రాజభవనాలు బయటపడి వీరి రాజధాని నగరం ఐన నినేవే -(Nineveh)- లో అస్సురబానిపాల్‌ చక్రవర్తిగారి 25 వేల పుస్తకాల లైబ్రరీ బయటపడింది. ఈ లైబ్రరీలోని పుస్తకాలన్నీ Clay Tablets. ఇవి కీల లిపి (Cuneiform Script)లో ఉన్నాయి. 

ఈ తెలిమన్‌ ప్రాంతం తెలివాహ (గోదావరి) నది తీరమైన తెలుగు నేల. అంటే తెలంగాణ నేల. తెలిమన్‌ తెలుగు పదాల (తెలి=తెల్ల, మన్‌=మన్ను) మూల రూపం అగునేమో! సుమేరు ప్రాంతం పేరులో పర్వతనామం, అస్సుర బానిపాల్‌ (అసుర వనపాలుడు)లలో మరికొంత సంస్క­ృతం కనిపిస్తోంది. సుమేరియన్లు వాడిన మట్టి బిళ్లల మీద క్యూనిఫాం లిపి (కీల లిపి) భారతదేశపు బ్రాహ్మీలిపికి మాతృక అని లిపి శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. కోటిలింగాల తవ్వకాలలో బౌద్ధస్థూపపు లఘు శాసనాలలో పూర్వ బ్రాహ్మీలిపి కొంత గోచరించింది. ఎడ్వర్డు థామస్‌ సంస్క­ృత ప్రాకృత భాషలకు ఉపయోగించిన అక్షరాలకు అశోకుని శిలాశాసనాల్లో ఉపయోగించిన (బ్రాహ్మీలిపి) అక్షరాలకు మూలం ద్రావిడ లిపేనని భావించాడు.

భారతదేశం- మెసపొటేమియాల మధ్య వ్యాపార సంబంధాలు క్రీ.పూ. 3వ సహస్రాబ్ది (క్రీ.పూ.3000) నుంచి ఉన్నాయని ప్రొ. జేమ్స్‌ ఎడ్గార్‌ స్వీన్‌ అన్నారు. మెసపొటేమియాలోని సుమేరియన్‌ సంస్క­ృతిని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. కాని భారతదేశంలో ఏ ప్రాంతమో తెలుపలేదు. అవి గోదావరి దక్షిణ తీరస్థమైన ప్రాంతాలే.

సుమేరియన్ల కాలగణన మనవారితో కలుస్తుంది. తెలుగువారి వలెనే వారు చాంద్రమానంతో కాలాన్ని కొలిచేవారు. 60 సంవత్సరాలు వారికి కాల ప్రమాణం, ఆర్యుల వలె శతమానం లేదు. ఆయా సంవత్సరాల శుభాశుభాలు, తుపాన్లు, యుద్ధాలు, ముఖ్యమైన వ్యక్తుల మరణాలతో పేర్లు పెట్టేవారు. మనకు వలెనే వారికీ 60 సంవత్సరాలకు సంవత్సర చక్రం పూర్తి అవుతుంది. ప్రభవ, ప్రమాది, బహుధాన్య, రాక్షస, నల, రౌద్రి, దుర్ముఖి వంటి పేర్లుండటం గమనించాలి.
సుమేరియన్లు తెలుగునేల(తెలంగాణ ప్రాంతం) నుండి వలస వెళ్ళినవారే అనడానికి ప్రాచీన శిలా సమాధులు సాక్ష్యం. ఇరాక్‌లోని కిర్కుక్‌ పట్టణంలోని సమాధులు మెదక్‌ (మంజీరాకా దేశంగా బౌద్ధ వాఙ్మయం పేర్కొన్న ప్రాంతం)లోని మర్కుక్‌ ప్రాంతంలో పురావస్తు శాఖవారు జరిపిన తవ్వకాలలో బయటపడ్డ సమాధులు (మెగాలిథిక్‌లు) ఒకే జాతీయులు ఏర్పాటు చేసికొన్న సమాధులే. 

తడిమట్టి పెంకుల మీద రెల్లుగడ్డి వంటి సాధనంతో కీలాకారపు గుర్తులతో, నిశితమైన సాధనంతో గుంతలు తవ్వినట్టుగా సుమారు వేయి చిహ్నాలు ఉపయోగిస్తూ, ఒక చిహ్నం ఒక మారు అక్షరాన్ని, మరొకమారు పదాన్ని సంకేతించేలా రాసి, విషయం మారినప్పుడు (పేరా మారినలాగా) అడ్డు నిలువు గీతలతో విభజిస్తూ రాత పూర్తి చేశాక అగ్నిలో కాల్చి Clay Tablets తయారు చేసేవారు. ఈ లిపి భారతదేశపు లిపులన్నింటికి మాతృక అయిన బ్రాహ్మీలిపికి మాతృక ఐంది. దీంతో పాశ్చాత్య చరిత్రకారులు భారతదేశంతో వీరి సంబంధాన్ని స్థిరపరిచారు. వీరు తెలిమన్‌ దేశము వారు కనుక తెలివాహ నదీ ప్రాంత జనులతో మాతృ సంబంధం కల్గి ఉన్నవారు కనుక తెలివాహ ప్రాంతీయులైన తెలుగువారితో సంబంధం కల్గి ఉన్నట్టు నిర్ధారించవచ్చు. ఈ ప్రాంతం నుండే ఈ క్యూనిఫాం లిపి, ఇతర భారతీయ ప్రాంతాలకు వెళ్ళింది. తెలుగు వారు రాసిన లేఖలు మట్టి బిళ్లల రూపంలో తెలుగు భాషతో ఈ జాతీయుల వద్ద లభించాయి. తమ తెలిమన్‌ ల్యాం డ్‌ స్వర్గసీమగా వర్ణించుకున్న ప్రాంతం తెలివాహ నదీ తీరంలోని తెలంగాణ ప్రాం తం. కోటిలింగాల పూర్వ బ్రాహ్మీలిపి శాసనాలు, అక్కడ లభించిన రోమన్‌ నాణెములు ఈ ప్రాంత ప్రాచీన సంబంధాలను నిర్ధారిస్తున్నాయి. 

కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల, వేంపల్లి వెంకటరావుపేట, ధర్మపురి (శాతవాహనుల నాణెములు లభించిన మరో గోదావరి తీర ప్రాంతం), బాదన్‌కుర్తి వంటి గోదావరి తీరాలునాడు విదేశీ వ్యాపారానికి అనువైనవి. చిన్న పడవలలో గోదావరి ద్వారా బంగాళాఖాతంలో చొరబడి పాండిచేరి (రోమన్‌ నాణేలు దొరికిన చోటు) మీదుగా, సింహళం మీదుగా అరేబియా సముద్రంలోని భరుకచ్ఛ (టాలెమీ చెప్పినవి), కళ్యాణి, సోపోరా (సూరత్‌, పెరిప్లస్‌ తీరమిది) రాజస్థాన్‌ తీరాల వెంబడి, పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌ల దక్షిణ భాగాన గల సముద్ర జలసంధి గుండా పర్షియన్‌ గల్ఫ్‌లోకి చొరబడి 'ఊరు' అనే పేరుగల ఊరు చేరేవారు. ఈ ఊరు (UR)బాబిలోన్‌కు పొరుగు నగరం. మరొక నగరం పేరు నిప్పూరు. నిప్పు+ ఊరు= అగ్ని నగరం, ఈ పేర్లు తెలుగు నామాలు. నిప్పూరు క్రీ.పూ. 1500 సంవత్సరాల నాటి నగరం. సింహళంతో నౌకా సంబంధాలు హాలుని రాణి సింహళ రాజకన్య లీలావతి కళ్యాణానికి బాటలు వేశాయి. వీరిద్దరి వివాహం సప్త గోదావరి తీరం వెంపల్లి వెంకటరావుపేట (కరీంనగర్‌ జిల్లా)లో జరిగింది. క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం ఇక్కడి జాతీయులకు సోదరులుగా ఇరాన్‌, ఇరాక్‌ ప్రాంతాల కు, రోమ్‌ నగర ప్రాంతాలకు, అస్సీరియా ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి, సుమేర్‌ ప్రాం తీయులుగా పేరుపడి, తమ పూర్వీకులైన తెలుగువారితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలు కొనసాగించారు. సోదర జాతీయులు కనుక అంత దూరం వ్యాపారం చేయగలిగారు.

క్రీ.పూ. 2000 నాటి ఈ మట్టి బిళ్లల మీద ద్రావిడ భాష లేదా ద్రావిడ మాండలికంగా తెలుగు భాష (అప్పటికింకా ద్రవస్థితిలోనే ఉండి ఉంటుంది) విడివడి, ప్రత్యేక భాషగా మార్పు చెందడానికి మరో సహస్రాబ్దులు పట్టి ఉండవచ్చు. అంతేకాదు, తెలుగు వలెనే ద్రావిడ భాషా జనితమైన మరొక భాష 'బ్రాహుఇ' (ఉత్తర ద్రావిడ భాషగా) ఈ ప్రాంతంలో నేటికీ ఉంది. వాయువ్య భారతంలోని ఇండోయూరోపియన్‌ భాషా సముద్రంలో ద్రవిడ ద్వీపంలా ఈ 'బ్రాహుఇ' భాష ఉంది. ద్రవిడ జాతీయులు తెలిమన్‌ నుండి సముద్ర మార్గం గుండా పోయి స్థిరపడినారనుటకు నేటికీ భాషీయులు సజీవసాక్షులు. పాకిస్థాన్‌లో కాలత్‌, హైరాపూర్‌, క్వెట్టా, హైదరాబాద్‌, కరాచీ ప్రాంతాల్లోనూ, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని అప్ఘనిస్థాన్‌లోను, ఇరాన్‌ దేశంలో కొన్ని జాతులు ఈ భాషను మాట్లాడుతున్నాయి. ద్రావిడ భాషలన్నీ దక్షిణ భారతదేశంలో ఉండగా ఈ ఒక్క 'బ్రాహుఇ' మాత్రం వాయువ్య భారతం దాటి పర్షియా దేశాల్లో స్థిరపడటం భాషా శాస్త్రవేత్తలకు నేటి వరకు వింత. దీనికి కారణాలు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. ఇలా ఒంటరిగా ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబాల మధ్య విదేశాల్లో మిగిలిపోయిన ద్రావిడ భాషా జన్యమైన ఈ 'బ్రాహు ఇ' తెలివాహనదీ తీరాల నుండి తెలిమన్ల చేత తీసుకపోబడింది. అంతేకాదు ఈ భాష మిగతా ద్రావిడ భాషలకంటే తెలుగుకు అతి దగ్గరగా ఉన్న భాష.

సుమేర్‌ నుండి దిగుమతి తెచ్చుకొని, తనకు మోసం జరుగగా, తెలిమన్‌ వ్యాపారి తెలుగువాడైన నాన్ని (Nanni) తనకు జరిగిన అన్యాయానికి కోపించి 'ఊర్‌' (UR) పట్టణంలోని సంబంధిత వ్యాపారి ఉ్చ ూ్చటటజీటకు మట్టి బిళ్లల (క్లే టాబ్లెట్స్‌) మీద రాసిన లేఖ తవ్వకాల్లో దొరికింది. (ఊర్‌, బాబిలోన్‌ నగరాలకు అతి సమీపంగా నైరుతి దిశగా రోమ్‌ సామ్రాజ్యం ఉంది. రోమన్‌ల నాణెములు మనకు కోటి లింగాల తవ్వకాలలో దొరికాయి) ఊర్‌ నగరంలోని ఈ నాసిర్‌ ఇంట్లో తెలిమన్‌ వ్యాపారపు ఒప్పందం పత్రం (క్లే టాబ్లెట్స్‌) లభించింది. దాంట్లో అబ్బా(Abba), అప్ప (Appa), అను (Anu), అక్కుా హక్కు(Aqqu), Ser(సెరి=చెరి), అప్పిలుా అప్పులో(Appilu), Nimmakku Iskunti(నిమక్కు ఇస్కుంటి= మీకు ఇచ్చుకుంటి), Anna Ittisu (ఆన ఇట్టిసు= ప్రమాణము చేసెను) వంటి పదాలు లభించాయి.

నాన్ని ఉత్తరంలో రాగి దిగుమతి విషయంగా రాసిన లేఖలో క్రీ.పూ. 1907 నాటి క్లే టాబ్లెట్స్‌ క్యూనిఫారం లిపిలో తెలుగువాని కోపం తెలిసింది. IA ATI (అయ్యా అది), Anniim(అన్నియాంఅన్యాయం),Tusi im mmani maki (తూసి ఇమ్మని మాకి= తూచి ఇమ్మని మాకు), Mari a weliki Maneti (మరి ఆ వెలకి ఇమ్మనేటి), Ina Aliik Telmun(అయినా అలికి తెలిమన్‌), Ma Annuum Sakinam (మా అన్యాయం సకియం= సహించం), Ipusa Anniima (ఇప్పుస అన్ని ఇమా= ఇంత అన్యాయమా?) ఇవి నేటికి 3900 ఏండ్ల క్రింది తెలుగు/ ద్రావిడ పదాలు. 
సుమేరియన్ల పురాణగాథలు గ్రహించి హిబ్రూ జాతీయులు బైబిల్‌లోనిOld Testamen్టలో కథలు రాశారు. ఆ బైబిల్‌ కథలలో మన తెలుగు పేర్లు ఉన్నా యి. తెలిమన్ల నుండి సుమేరియాకు, సుమేరియన్ల నుండి హిబ్రూలకు ఈ తెలుగు వ్యక్తుల పేర్లు బట్వాడా ఐనాయి.
Holy Bibleలోని Old Testamentలో Seraiah (సేరయ్య), Meraiah(మీరయ్య), Hashbaiah (హష్‌బయ్య), Serebiah (శరభయ్య) వంటివి ఇందుకుదాహరణలు. హోలీ బైబిల్‌లో చెప్పబడ్డ GenesisలోనిLand of Shiner పైన చెప్పిన తెలిమన్‌ లాండ్‌ ఒకటే కావడం వల్ల చరిత్రలో తెలిమన్‌కు చాలా ప్రాముఖ్యం లభించింది. ఇవన్నీ సంయుక్త కూనయ్యగారు వివరించిన తెలుగు పదాలు.

హోలీబైబిల్‌లో Kishon నది (కృష్ణానది), Naarath (నారదుడు),Kanha (కన్హ), Rama (రామ), Sisera (శిశిర), Thimnaathah(తిమ్మనాథః), Murari (మురారి) వంటి పురాణ పాత్రల పేర్లు లభిస్తున్నాయి.

పై అంశాలాధారంగా తెలివాహ నది (గోదావరి నది) తీరమైన తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, బస్తరు జిల్లాలు తెలుగు నేల అతి ప్రాచీన ప్రాంతాలనీ, ఇక్కడ ఉండే తెలిమన్లు గోదావరి లోయగుండా సముద్ర మార్గాన సుమేరు ప్రాంతాలకు వలస వెళ్లారని, తమ పూర్వజులతో వర్తక సంబంధాలు కొనసాగించారని, ఇదంతా క్రీ.పూ. 2000 సంవత్సరాల నాటిదనీ (నేటికి నాలుగు వేల ఏండ్లు) ఆనాటి నుండే ద్రావిడ మూలం నుండి విడిపోయి తెలుగు స్వతంత్ర భాషగా కొంతకాలానికి స్థిరపడిందని, అప్పటికి వివిధ జన పదాలుగా గణరాజ్యాలుగా ఉండి క్రీ.పూ. 500 సంవత్సరాల నాటికి రాజ్యాలేర్పడి, మగధ రాజన్యులచే గుర్తించబడి, తరువాత శాతవాహనుల ఏలుబడిలోకి ఈ ప్రాంతాలు వచ్చాయని భావించవచ్చు.

(మూల వ్యాసం: ఆంధ్ర జ్యోతి పాత సంపుటులు )

=====మరికొన్ని లింకులు=======

ఫేస్ బుక్

Tweets

లంకెలు