కొసరు మాటలు



‘‘నాకెంత ధైర్యమో తె లు సా?’’
భయపడ్డ ప్ర.తి.సా.రీ.
ఈ ముసుగులో మునకేసే వారికి
మరోమాట చెప్పే అవకాశమే రావట్లేదు.


మూర్ఖత్వం ముక్కుపైకెత్తి వెక్కిరించినప్పుడల్లా
మేధావిని సుమా అంటూ ఢంబాల టపాసులు పేల్చేవారొకరు.
కాలుసైతం కదపక కొవ్వుపేరిన దేహభారంతో
పనివంతుల బోర్డులను దిగేసుకునేది మరొకరు.

ధీరత్వపు దీపం వెలుగుంటే
ఆ దారెంట పరిగెత్తేవారొకరయితే
దీపపు బొమ్మని అచ్చంలాంటి రంగుల్తో
చిత్రించాలనుకుంటూ చీకటిని తడిమేవారింకోకరు.

మేధస్సు పదునులో దారిని కత్తిరించుకుంటూ
ఒకరెళుతుంటే
మేధావిననే భుజకీర్తుల ముడులేసుకుంటూ
చిక్కులపొరల్లో బిక్కుబిక్కుమంటూ వేరొకరు.

దీపపు వెలుగులు చీల్చుకెళ్ళే దారిగుండా
కనిపించే తీరం వైపు వస్తావా అంటూ పిలుస్తారింకొకరు.

సమయాన్ని వృధాచేయని సుడిగాడినంటూ
సాగిన రబ్బరుబ్యాండు మరోమారు లాగి లాగి
ధడాలున తలుపేసుకుంటాడితడు.
పైగా దాని ఫలితం మీద కలలకోసం
కునికిపాట్లు పాధన చేసేందుకంటూ పడక కూడా వేస్తాడు..

లిపిడ్ పొరల దొంతరలపై తిష్టవేసిన బోర్డులు
సజీవ సమాధిని కదలకుండా సిద్దం చేస్తుంటాయి.
ఢాంభికపు మాటల హోరు
మూగగా మది పలికే మాటల్ని తొక్కేస్తుంటాయి.

‘‘నేనసలే విశ్లేషకుడిని తె లు సా ?’’
చిక్కుముడుల్లోకి జారినప్పుడల్లా నేనుకూడా చెపుతుంటాను.

► 17-12-2014

కామెంట్‌లు