Thursday, 26 March 2015

మళ్లీ గూట్లోకి

ఉవ్వెత్తున గాల్లోకి లేచినప్పటి ఉద్వేగం
చివ్వున మళ్ళీ నీళ్లలోకి చేరినా
మీనానికి దాచుకునే జ్ఞాపకమే.

రంగురంగుల ప్రపంచంలో తేలుపోయే పూనిక
పొందికగా గూట్లోకి వెళ్లినా
పులుగానికి ప్రశాంతత ఉత్సాహమే..

ధృడమైన సున్నిత కరచాలనాల స్పూర్తి
మట్టివేళ్ల మొదళ్ళలోకి ప్రవహిస్తున్నపుడు
నాక్కూడా ఒక అంతుపట్టని  రసనోద్వేగం.

ప్రయాణాన్ని, పరిచయాలనూ పదిలంగా దాచుకుంటూ
నా చిన్ననాటి నేస్తాల టైరు బళ్లలో
మరింత మాటల ఇంధనాన్ని నింపుకుంటూ పరిగెడతాం.

సెలవుకి బలమేముంటుంది.
నెలవుని అచ్చంగా మర్చిపోవాల్సొస్తే
ఊయల ఇటుగా మళ్ళీమళ్ళీ ఊగాలనే కోరుకుంటా.
ఏతాం తిరుగుతూ జ్ఞాపకాలను తోడుకునే సేద్యం సాగిస్తునే ఉంటా.
బరువెక్కిందో తేలికయ్యిందో అర్దంకాని గుండెని
ఇలా అక్షరాలతో అప్పుడప్పుడూ తూచుకుంటూనే వుంటా.


26-03-2015
ఫేస్ బుక్

Tweets

లంకెలు