వెళ్లొస్తామరి

దూరంగా వెళ్ళాల్సివచ్చినప్పుడల్లా
లోపటంతా చెమ్మనిండిన వర్షపుమేఘాలు ముసురుకుంటాయి.
అయినా
వర్షపు ఊటను నీదాకా చిప్పిల్లకుండా నవ్వుల తెరను దట్టంగా వేసేయగలను.
ఎందుకంటే
నేను దూరమయ్యేదు:ఖం కూడా నీ గుండెమీద నిల్చోవద్దు.

టాటాలూ బైబైలూ కంటేముందు
ఇల్లంతా నేకోసం నేనే సర్దిపెట్టాను.
రేపటికి కాచాల్సిన పాలు విరిగిపోకుండా భద్రచేసాననే అనుకుంటాను.

మనం ఒక్కోపుల్లా పేర్చుకుంటూ కట్టుకున్న గూడు
ఒక్కో పిసరూ పోగేసుకుంటూ పేర్చుకున్న పుల్లాపేడు
మళ్లీ మళ్ళీ నన్ను గుర్తుచేసి గుండెల్లో గుచ్చుకునేందుకు కాదు
నాలాగే నిన్ను గుండెల్లో దాచిపెట్టుకునేందుకు.

సీట్లు మారుతున్నా ఫేట్లే మారుతున్నా
ఉద్యోగాల నుంచి, ఉద్వేగాలనుంచి విద్వేషాల నుంచీ వీడ్కోలు వేళలుంటూనే వుంటాయి.
ప్రయాణమూ సాగుతూనే వుంటుంది గువ్వగూటికి, కథ కంచికి చేరేంత వరకూ
నువ్వుముందా నేనుముందా అనేది కాలం తూచగలదా?
నీయంత దూరం నేను, నా అంత మేర నువ్వూ మరోరకంగా నడుస్తూనే వున్నప్పుడు.





కామెంట్‌లు