Sunday, 15 November 2015

కాలా హనుమాన్ మందిరం అత్తాపూర్


నిజాంకు ముందునాటి హైదరాబాద్ అన్వేషణలో
కాలా హనుమాన్ మందిరం అత్తాపూర్

మనం గతంలో అనంతగిరి టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం.  ఆ గుడికి దగ్గర్లోనే వున్న మరో ప్రాచీన ఆలయం కాలా హనుమాన్ మందిరం.  ఇక్కడి హనుమంతుని విగ్రహం నల్లరాతితో చేయటం వల్ల పూర్తిగా నల్లరంగులో వుంటాడు. పైగా వేర్వేరు ఆంజనేయుని గుడులలో రాసినట్లుగా ఇక్కడి హనుమంతునికి సింధూర వర్ణ లేపనం చేయరు. అయితే ఇది ఒక్క గుడి మాత్రమే కాదు అనేక ఆలయాల సముదాయం, హనుమంతుని విగ్రహానికి ఎదురుగా గుహలాంటి ప్రదేశంలో వెలిసిన అనంత పద్మనాభస్వామి విగ్రహం వుంటుంది. గుహలోపట ఆకారం విష్ణువు శయనించినట్లుగా సహజంగా ఏర్పడిన నిర్మాణం ఇది కావడంతో స్వయంభు గా కొలుస్తున్నారు. వీటి పక్కనే అదే ప్రాంగణంలో శివాలయం వుంది. వెంకటేశ్వరుని ఆలయం, మరియు మధ్వాచార్యుల సన్నిధీ వున్నాయి మరీ ముఖ్యంగా ఇక్కడ ఆకర్షణీయంగా వున్న నిర్మాణం పుష్కరిణి, లేదా కోనేరు. అందంగా నాలుగు వైపులా నిర్మించిన దొంతరల మెట్లతో సౌష్టవమైన ఆకారంతా వున్న ఈ కొలనులో అన్ని కాలాల్లోనూ నీరు వుంటుందట. బహుశా పూర్తిగా పల్లపు ప్రాంతం నీటివూట వున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకునే ఈ బావి లేదా కొలనును నిర్మించి వుంటారు. ఒకప్పుడు దీనినుంచి మోటకట్టి నీరు తోడారు అన్నదానికి నిరూపణగా ఇప్పటికీ మోటబావికి వాడే రాతి నిలువు కడ్డీలు వాటి చివరన రంద్రాలూ వున్నాయి. ఇటువంటిదే మరింత పెద్ద పుష్కరిణి పక్కనే వున్న జగన్నాధ ఆలయంలో కూడా వుంది. పుష్కరణి ఆలయ నిర్మాణాలే పాతవి అనుకుంటే వాటికి కట్టిన గోడలను జాగ్రత్తగా పరిశీలిస్తే మరేదో అంతకు పూర్వం వున్న శిల్పశోభితమైన కట్టడం నుంచి సేకరించిన స్థంభాలూ, చెక్కడాలూ ఈ బావి అంచులు కట్టేందుకు వాడారు అన్నట్లు కనిపిస్తోంది. కాళీయ మర్ధనుడి శిల్పం వున్న స్థంభం ఒకటి, ఒకరితో ఒకరు మల్లయుద్దం చేస్తున్న బాలుర చిత్రం ఒకటి బావి ఒడ్డున వున్న అంచులలోని రాతి స్థంబాలలో గమనించవచ్చు.

ఈ ప్రాంత పౌరాణిక నేపద్యం గురించి ఇక్కడ వాడుకలో వున్న కథనం ప్రకారం
తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడు అనే నాగజాతీయుడి వంశనాశనం కోసం జనమేజయుడు సర్పయాగాన్ని చేసిన ప్రదేశం ఇదే నని చెపుతారు. సౌష్టవాకారంలో కట్టిన ఈ పుష్కరణియే అప్పటి యాగగుండమని కాలక్రమంలో ఇలా కోనేరుగా రూపుదిద్దుకున్నదని కథనం. ఆ తార్వాతి కాలంలో గుట్టమీద వున్న గుహలో నాగ్రేంద్రుడు కనిపించేవాడట, ఇప్పటికీ ఆ ఆవరణలోని పుట్టలో భక్తులు పూజచేసి పాలు పోస్తుంటారు. దానిని దాటుకుని శ్రధ్ధగా గమనించే అర్హులైన భక్తులకు గుహలోపల శ్రీమన్నారాయణుడి అనంత శయన రూపం కనిపించేదట. అప్పట్లో జనమే జయుడు ప్రతిష్టించిన యాగరక్షక అంజనా సుతుని విగ్రహం మరుగున పడిపోవటం వల్ల ఆ తర్వాతి కాలంలో విజయనగరాధీశుడైన శ్రీకృష్ణదేవరాయని గురువు శ్రీవ్యాసరాయలు వెలికి తీసి పున: ప్రతిష్ట చేయించారట. శ్రీవ్యాసరాయలు చారిత్రకంగా ఆంజనేయ ఉపాసకులు. ఈయన అనేక హనుమాన్ ఆలయాలను నిర్మించారు, మరుగున పడిన వాటిని వెలికి తీసుకుని వచ్చారు కూడా, ఇక్కడి విగ్రహానికి సింధూర లేపనం పూయవద్దనే విషయాన్ని వాయునందనుడే స్వయంగా శ్రీవ్యాసరాయలకు చెప్పారనేది భక్తుల నమ్మిక. ఆరడుగుల ఎత్తున ఈ విగ్రహానికి ప్రతి మంగళ వారం మరియు స్థిరవారం సంపెగ నూనె పూస్తుంటారు.  తానీషా హయాంలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో ఈ ఆలయ గోపురాన్ని పునరుద్ధరించారు. గోపురం చూడటానికి ఒక ఖజానా పెట్టె ఆకారంలో కనిపించడం విశేషం. 200 ఏళ్ళనుంచి మాధవాచార్యుల వంశస్తులు దేవాలయ అర్ఛకులుగా నిర్వాహకులుగా వంశపారంపర్యంగా సేవచేస్తున్నారు. వారు శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రాఘవాచార్యులు, శ్రీ రామకృష్ణమాచార్యులు, శ్రీ అనంతా చార్యులు, శ్రీ మాధవాచార్యులు, వీరిలో మాధవాచార్యులు 1980లో నవగ్రహ ప్రతిష్ట చేసారు. ధర్మకర్తగా, ఫౌండర్ ట్రస్టీగా దేవాలయ అభివృద్దికి తన స్వంత ధనాన్ని ఖర్చుచేసారు. దేవాలయం మరో ప్రత్యేకత అత్యంత పెద్దదైన గోశాల దీనిని 2003 లో ప్రారంభించారు. అప్పట్లో శ్రీ హనుమాన్ గోశాలగా ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత 2009లో శ్రీ కృష్ణ గోసేవా ట్రస్ట్ గా పేరు మార్చారు. ఇదే ఆవరణలో అనేక పావురాలను పెంచుతున్నారు. పుష్కరణి పూడిక తీత సందర్భంలో లక్ష్మీదేవి విగ్రహం దొరికిందట.


పంచదేవ రాధాకృష్ణ మందిరం

ఇక్కడి కాలా హనుమాన్ మందిరం ముందున్న చిన్న ఆలయంలో ఒకే బండరాతిపై వేర్వేరు దిశల్లో చెక్కిన వేర్వేరు దేవతా రూపాలున్నాయి. వాటిలో శివుడు, విష్ణువు, గణపతి, ఐదుతలలతో కనిపిస్తున్న దత్తత్రేయుడు, హనుమంతుని విగ్రహాలను గుర్తిస్తూ ఈ దేవాలయానికి పంచదేవ రాధాకృష్ణ మందిరం అని పేరు పెట్టారు. ఈ ఆలయం ప్రాంగణంలోనే కాలాహనుమాన్ మందిరంలో వున్న పుష్కరణికంటే పెద్దదైన కొలనుని మనం గమనించగలం. దానికి ఆనుకునే జగదీష్ టెంపుల్ అనే గుడి వుంది. శ్రీ మహంత్ పరమానంద్ (11-03-1919 నుండి 21
-02-2012) గారి ఆధ్వర్యంలో జగన్మాధుని ప్రతిమలతో ఈ గుడి నిర్వహింపబడుతుండేది. కబ్జాదారుల దురాగతాలతో వీరి వంశలో హత్యలు కూడా జరిగాయని వాటిని తట్టుకుంటూ ఇప్పటికీ ఈ గుడిని కాపాడుకుంటూ వస్తున్నామని వంశస్థులు వాపోతున్నారు.

ప్రస్పుటంగా కనిపించే పఠిష్టమైన కోట లక్షణాలు

ఈ గుడుల ప్రాంగణం కేవలం గుడిలాగానే కాక ఒక పద్దతిలో శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన కోట నిర్మాణాన్ని పోలి వుంటుంది.
అనేక చోట్ల నిర్మించిన నీటి అవసరాలను భారీమొత్తంలోతీర్చేలా నిర్మించిన కోనేటి నిర్మాణాలు, వాటిలో అంత:పుర వాసం జలకాలాటకు సైతం ఉపయోగ పడేలాంటి అందమైన మెట్లు, ఆపద సమయంలో మూసి వేసేలాంటి దొంతర నిర్మాణం, మోట మంచెకు చేసిన సస్పెన్షన్ పద్దతి నిర్మాణం గమనిస్తే అత్యవసర సందర్భంలో దానిని బద్దలు కొట్టడం ద్వారా లోపటికి ప్రవేశించకుండా అడ్డగించేందుకు వీలవుతుంది అనిపించేలా వుంది. దాసాంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా వున్న మెట్ల మార్గం గుట్టమీదకు దారి తీస్తుంది. పై భాగాలలో సైనికులు పహారా కాసేందుకు వీలుగా చాలా చోట్ల ఏరియల్ వ్యూ నిర్మాణాలున్నాయి.  ఎకరాల కొద్ది విస్తీర్ణంలో వున్న ఈ ఆలయాల ప్రాంగణాలకు అక్కడక్కడా మిగిలిన గోడలను గమనిస్తే అవి ఒకేలాంటి నిర్మాణ లక్షణాన్ని కలిగి వున్నాయి. అంటే పెద్ద ప్రాంగణం మొత్తం ఒక చక్కటి సరిహద్దు గోడను కలిగివుండేది కావచ్చు. 


ఒకప్పుడు అరుదైన ఉద్యానవనం ఉండివుండొచ్చు

అలాగే రాణీవాసపు అందమైన ఉద్యానవనం ఒకటి వుండేది కావచ్చు అనేందుకు వీలుగా దీనికి దగ్గరలో అత్యంత అరుదైన ఒక మొక్క కనిపించింది. దీనిని ‘‘గౌరీ కల్పవృక్షం’’ గా ఈ ప్రాంతంలో పిలుచుకుంటూ పూజలు చేస్తున్నారు. ఆఫ్రికన్ బల్బోజా వృక్షాలలాగా అత్యంత పెద్దగా వుండే దీనికాండంలో పడే ముడుతలు అనేక ఆకారాలలో కనిపిస్తున్నాయి. వాటిలో ఒక చోటో నంది ఆకారం అని మరోక చోట హనుమంతుడు, వేరొక చోట తిరునామాలు, ఇలా వేర్వేరు దేవాతా రూపాలున్న చెట్టుగా దీన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు. రుద్రాక్షలలో వేర్వేరు ముఖాలుండటంతో పాటు, దానిపై ఓం లేదా త్రిశూలం శివలింగం వంటి రూపాలను గమనించినట్లు ఈ గౌరికల్పవృక్షం అనిపిలుచుకునే చెట్టు ఇందరు దేవుళ్లకు నిలయం కావడంతో కోరిన కోరికలు తీర్చుతోందని నమ్ముతున్నారు. అయితే ఇటువంటి చెట్టు ఇక్కడికి దానంతట అది వచ్చి వుండదు. అందంగా అభిరుచి మేరకు పెంచుకున్న ఒక అమూల్యమైన ఉద్యానవనంలో పోయిన మొక్కలు పోగా దీని ప్రత్యేకత వలన ఇది మిగిలి వుంటుంది. భారతీయ వృక్షసర్వేక్షణ కేంద్రం(Botanical Survey of India) దక్కన్ ప్రాంత్రీయ కేంద్రం(Deccan Regional Centre) కూడా ఈ చెట్టుకు చాలా దగ్గరలోనే వుంది దానితో పాటు LaCONES (Laboratory for the Conservgation of Endangered Species), భారతీయ జంతు సర్వేక్షణ (Zoological Survey of India)కూడా దీనికి దగ్గరలోనే వున్నాయి అయినా ఈ చెట్టు సంరక్షణకు, పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు.

రణగొణ ధ్వనుల హడావిడీ హైదరాబాద్ జీవితంలో నగరం నడిబొడ్డునే వుంటూ మధ్యయుగాల వాతావరణాన్ని చూపించే ఒక చక్కటి ఆటవిడువు కేంద్రం ఇది. ఆధ్యాత్మిక కోణంలో అనేక ప్రత్యేకతలు ఎలాగూ వున్నాయి. పర్యాటకంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఎంతో విలువైన ఈ ఆలయాల ప్రాంగణం ఇప్పుడు కబ్జా కోరల్లో నలుగుతోంది. ఇప్పటికైన కొంత శ్రద్ధ చూపించి సరైన సరిహద్దులను ఏర్పాటు చేసి, సక్రమమైన నిర్వహణ వహిస్తూ, చారిత్రక ఆనవాళ్ళను వెలికి తీసేందుకు పరిశోధకులను ఆహ్వానించడం ప్రోత్సహించడం చేయగలిగితేనే అమూల్యమైన చారిత్రక సంపదను మరుగున పడిపోకుండా కాపాడుకోగలుగుతాం. లేదంటే ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిన అనేక చారిత్రక అవశేషాలమాదిరిగానే ఈ కాలా హనుమాన్ ప్రాంగణంలోని చారిత్రక సత్యాలు సైతం కాలగర్భంలో కలిసిపోతాయి.

ఎలా చేరుకోవాలి?


అత్తాపూర్ 161 పిల్లర్ దగ్గరనుంచి పక్కకు వెళుతున్న దారిలో శ్రీ కృష్ణ గోశాల వస్తుంది దానినుంచి మరికొంచెం ముందుకు వెళితే ఈ కాలా హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా పట్టుకోవాలంటే వాటి కొలతలు ఇవి (17.3581221,78.4268952) గూగుల్ మ్యాప్ ను మీరు ఉపయోగించగలిగితే మీరు ఈ క్రింది లింకులో చూపించే ప్రదేశానికి మీరున్న ప్రదేశం నుంచి డైరెక్షన్లను తీసుకోవచ్చు.


ఫేస్ బుక్

Tweets

లంకెలు