చారిత్రక శిధిలాల్లో దొరుకుతున్న చొప్పకట్లపాలెం చరిత్ర

చొప్పకట్లపాలెం శివాలయం ముందువైపునుంచి దృశ్యం ఇది



చొప్పకట్లపాలెం ఆకాశచిత్రం (ఏరియల్ వ్యూ)
చొప్పకట్లపాలెం ఖమ్మంజిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. సరిగ్గా ఎక్సెప్రెస్ స్టేజీకూడా ఏదీ లేని ఊరు. గట్టి ప్రభుత్వకార్యాలయం సైతం కనిపించని చిన్నఊరు కానీ కొంచెం శ్రద్దగా ఊరి ఆనవాళ్ళను పరిశీలిస్తూ తమచారిత్రక వైశిష్ట్యాన్నివివరించమంటే మనం ఆశ్చర్యపడేంత సమాచారాన్ని చిటికెలో ముందుంచేస్తుంది. ఇదిగో ఒక్కరోజు సందర్శనలోనే నేను సేకరించుకున్న విషయాలను మీముందుంచుతున్నాను.
చొప్పకట్లపాలెం శివాలయం
ఖమ్మంజిల్లాలోని బోనకల్ మండలానికి చెందిన ఒక గ్రామం చొప్పకట్లపాలెం ( https://www.google.co.in/maps/@17.018233,80.2141807,15z ) ఇప్పుడు ఇలా ఒక చిన్నగ్రామంలా వున్నప్పటికీ ఎప్పటినుంచో ఈ గ్రామం ఉనికిలోవున్నట్లు అనేక చారిత్రక ఆధారాలు బయటపడుతున్నాయి.
అందులో ముఖ్యమైనవి శిధిల శివాలయం, దాని ఆవరణలోని నలుపలకల శాసనం, కోటబురుజు, కోటబావి, ఆంజనేయస్వామి గుడి ఆవరణలో దొరికిన గుర్రంమీదున్న వ్యక్తి వీరగల్లు, చురకత్తిని చేతపట్టిన వ్యక్తి వీరగల్లు, ఊరి ముత్యాలమ్మ విగ్రహం, గొడ్ల ముత్యాలమ్మ విగ్రహం, చెరువు అలుగు కట్ట దగ్గర వున్న సర్వేబాదుల పొలంలోని నల్లశానపు రాయి ఆంజనేయుని విగ్రహం పురాతన చరిత్రకు ఆనవాళ్ళుగా నిలిస్తే, నీలిమందు తయారు చేసిన తొట్లు, నీలి ఆకును గానుగ పట్టే సందర్భంలో దానిని గానుగపట్టేందుకు వాడిన రాయి వంటివి డచ్ వర్తకం కాలం నాటి చారిత్రకు ఆనవాళ్ళుగా నిలుస్తున్నాయి. వాటి వివరాలను సంక్షిప్తంగా చూద్దాం.
శిధిల శివాలయం.

ద్వారపాలకుని విగ్రహం

 ప్రస్తుతం ఐదడుగుల మూడంగుళాలు మాత్రమే ఎత్తున్న ద్వారం ఏడెనిమిది అడుగుల ఎత్తున్న గోడలలో నిర్మించిన ఉపాలయం వంటి ఒక పెద్దపెద్ద నల్లరాళ్ళతో నిర్మించిన ఆలయం ఒకటి పైకప్పు పూర్తిగా కూలిపోయి గోడల మధ్య పెద్ద వేపచెట్టు కొమ్మలు విస్తరించుకుని పెరిగివుంది. తూర్పుదిశగా తిరిగివున్న ఈ ఆలయానికి దక్షిణం వైపుగా పశ్ఛిమవాహినిగా ఒక కాలువ వెళుతూ వుండటం వల్ల కావచ్చు సాండ్ బాక్స్ టెక్నాలజీ (ఇసుక దిమ్మిస పునాది పద్దతి)లో నిర్మించిన ఈ ఆలయం పునాదులు దక్షిణంవైపు కొంత ఒరిగి పోయి వున్నాయి. గర్భాలయం, అంతరాలయంగా రెండుగదులు వేర్వేరుగా కనిపిస్తున్నాయి. చుట్టూ గోడలు ఒక వరుసలోనే నిర్మించి వున్నాయి. ఈ ఆలయం ద్వారాలకు రెండువైపులా ద్వారాపాలకుల విగ్రహాలున్నాయి. అదేవిధంగా ఒక్కోవైపు ఐదేసి పద్మాలతో పద్మపట్టికల వరుసలు రెండువైపులా కనిపిస్తున్నాయి. ప్రధాన ద్వారానికే కాకుండా ఆలయం చుట్టూతా వర్షంలో నీటిధారలనుంచి రక్షించే చూరులు నీటిని బిందువులుగా  జార్చేందుకు అనువుగా పొందికగా చెక్కివున్నాయి. వీటితో పాటు ఆలయ స్థంబాలు చెక్కిన విధానం మొదలైనవి గమనించినప్పుడు కాకతీయుల నిర్మాణ శైలి కనిపిస్తోంది.
గర్భగుడిలోపల వాయువ్య (North West) దిశలో గోడకు ఆనుకున్నట్లు నునుపైన నల్లరాతి శివలింగ కనిపిస్తోంది. దీనివల్ల ఈ శిధిల ఆలయం శైవాలయమే, శివాలయమే అని నిర్ధారించుకోవచ్చు.
గుడి ఎదురుగా రంగమండపం కోసం వాడిన రాయి ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల వ్యాసంతో పదడుగుల భుజం కలిగిన చతురస్రాకారపు రాతిపై చెక్కినది కనిసిస్తోంది. విరిగిన రెండు మంటప స్థంభాల ముక్కలను గుడిముందు నిలబెట్టివుంచారు. ఆలయ మంటపం ఒకప్పుడు పెద్దగా వుండేది అనేందుకు ఆధారంగా వాటి అంచుల రాళ్ళు కనిపిస్తున్నాయి.
గర్భాలయానికి సూటిగా ముందువైపు కొంతదూరంలో పొలంలోపల ఒక నిలువురాయి పాతి వుంది. అది ధ్వజస్థంభంలాకానీ, కోడె స్థంభంలా కానీ అనిపించడంలేదు. బహుశా గుడితో సంభంధం లేని బండఅయినా కావచ్చు. ఆ బండకు మరికొంత ఈశాన్యం వైపుగా రెండు పెద్ద నీలిమందు తయారు తొట్లు వుండటంతో ఈ బండ బహుశా గానుగను నడిపించటం లాంటి పనుల్లో వాడివుండొచ్చేమో అనికూడా అనుకోవచ్చు. ఆలయం చుట్టూతా వున్న పొలాల్లోనూ, ఊరిలో అక్కడక్కడా గుడికోసం వాడిన రాయి వంటివే పెద్ద నల్లరాతి ఫలకాలు కనిపిస్తున్నాయి. 

శివాలయం ఆవరణలోని శాసనం
శిధిలాలయంలో ఒక మూలగా కనిపిస్తున్న శివలింగం
శాసనాన్ని పరిశీలించే పనిలో గ్రామస్తులతో పాటు వ్యాస రచయిత
  ఐదు అడుగుల మూడు అంగుళాల పొడవుతో పద్నాలుగు అంగుళాల వెడల్పుతో నలుపలకలుగా వున్న నల్లరాతి శాసనం ఒకటి  గుడి ఆవరణలో వుంది. దానిపై వున్న లిపి తెలుగన్నడ అంటే తెలుగు కన్నడ అక్షరాలు కలయికగా వుంది. విషయాన్ని అర్ధం చేసుకోవలసిన భాష తెలుగు, సంస్కృతంగా వుంది. నాలుగు ముఖాలలో ఒకవైపు శివలింగం క్రిందుగా 
పొడవుగా మెలికలు తిరిగి పడగవిప్పిన పాము బొమ్మ వుంది. నిజానికి ఇప్పటి శివాలయంలోనూ లింగాన్ని రక్షిస్తూ ఒక పాము వుందని అది చాలా సార్లు గ్రామస్తులకు కనిపించిందనీ చెప్పారు. బహుశా ఈ శివాలయానికి నాగలింగంగా మెదటినుంచి సర్పపూజతో సంభందం వుండివుండేదేమోనని గ్రామపెద్దలు అభిప్రాయపడుతున్నారు. మరోదిశలో మూపురం వున్న ఎద్దుబొమ్మ దాని ముందు పదును భాగం పైవైపుకు నిలబెట్టిన కత్తి ఒకటి వున్నాయి. అక్షరాలలో ఒక దగ్గర ప్రతాప రుద్రుని పేరు స్పష్టంగా కనిపిస్తుండటంతో తెలంగాణాలోని అనేకప్రాంతలలో నిర్మించినట్లే చొప్పకట్లపాలెంలో సైతం కాకతీయులే శివాలయాన్ని నిర్మించి వుండొచ్చు అనే అభిప్రాయానికి రావొచ్చు. శాసనంపై సంవత్సరాలను సూచించే ఎటువంటి అంకెలూ లేకపోవడంతో ఇది బహుశా గుడినిర్మాణాన్ని లేదా ప్రారంభోత్సవాన్ని సూచించే ప్రధాన శాసనం కాక దానశాసనం వంటిది లేదా స్తుతి శాసనం వంటిది అయ్యివుండొచ్చని అభిప్రాయపడొచ్చు. 
శాసనానికి మూడోదిశ మధ్యలో వున్న ఖడ్గం మరియు వృషభం
పైన సూర్యచంద్రులు తర్వాత శివలింగం క్రింద పడగ విప్పిన సర్పం
శాసనానికి నాలుగో దిశలో కనిపిస్తున్నాయి


కోటబురుజు, కోటబావి :
శిథిలమయి పోయినవి పోగా మిగిలిన మట్టికోట బురుజు ఇది
గ్రామం మధ్యలో ఆంజనేయ స్వామి ఆలయానికి పక్కన మట్టి రాళ్ళు ఉపయోగించి కట్టిన బురుజు శిధిలాలు కనిపిస్తున్నాయి. నాగులవంచ దివాణం కోట లాగానే ఒకప్పుడు పెద్ద కోటవుండేదనేందుకు ఇవి ఆనవాళ్ళుగా నిలిచాయి. దానికి పక్కనే వున్న ఒక పురాతన బావికి ఒకప్పుడు మోటవేసి నడిపినట్లు ఆధారంగా దానికి మోటరాళ్ళు కనిపిస్తున్నాయి. కోటబావి పక్కనే ఈనాటి పర్యటనలో రెండు వీరగల్లులు గమనించి వాటిని మట్టినుంచి వెలకి తీసి ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో చరిత్ర పరిశీలకులకోసం భద్రపరచివుంచాం.

పేరీణీ ప్రాణత్యాగ వీరగల్లు
ఆత్మసమర్పణ వీరగల్లు
అందులో ఒక పురుషవిగ్రహం సైనిక వేషదారణలో వుంది. తలనుంచి ముంగాళ్ళవైపు దండలా వేళ్ళాడుతున్న అలంకరణ ఏదో కనిపిస్తోంది. ఆ విగ్రహం కుడిచేతిలో చురకత్తికంటే పెద్దదిగానే వున్న విచ్చు కత్తినొకదానిని పట్టుకుని వుంది. ఎడమ చేతి పిడికిలితో తన స్వంత తలనుంచి ముడివేసుకున్న జడవంటి పిలకను బిగించి పట్టుకున్నట్లు కనిపిస్తోంది. బహుశా పేరిణి వంటి వీరనాట్యం తర్వాత స్వీయ ప్రాణార్పణ చేసుకుంటున్న సందర్భం కావచ్చనిపిస్తోంది. పూర్వకాలంలో ప్రధానంగా కాకతీయ రాజుల కాలంలో యుద్ధ సమయంలో సైనికులకు విజయమో వీరస్వర్గమో అంటూ ప్రేరేంపించేందుకు గానూ శివతాండవాలవంటి ఒక లయభద్దమైన వీరనాట్యం చేసేవారు. మనోధైర్యం, మొండి తెగింపు కలిగించేలాంటి శబ్ద వాయిద్యాలనూ వాడేవారట. ఆ నాట్యాన్ని పేరిణి అని అంటున్నాం. ప్రేరణ అనే పదం దీనికి ఊతం. నటరాజ రామకృష్ణగారు రామప్పఆలయంలోని గర్భగుడి ప్రవేశద్వారానికి ఇరువైపులా వున్న శిల్పాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ నాట్యాన్ని పునః సృష్టి చేసారట. అప్పటివరకూ ఇటువంటి నాట్యం ఒకటుండేదని కాకతీయుల కాలం నాటివాడైన జాయన లేదా జాయప సేనాని రచించిన నృత్యరత్నావళిలో చదువకోవడం మాత్రమే చేస్తూ వచ్చాం. బహుశా చొప్పకట్ల పాలెంలో కనిపిస్తున్న ఈ వీరగల్లు (Hero Stone) విగ్రహం పరిశీలిస్తే కూడా కుడిచేత కత్తి పట్టుకోవడం ఎడమ చేత శిఖను బిగించి పట్టుకోవడం తను ప్రాణత్యాగానికి సిద్దపడినట్లు సూచిస్తున్నాయి. అతని ఆహార్యం లో కూడా ముందువైపు నాట్యాకారుల వస్త్రధారణలోని పంచెకట్టు దానిలోని ముందువైపు కుచ్చు కనిపిస్తున్నాయి. చాతీమీద ఎడమనుంచి కుడికి, కుడినుంచి ఎడమకు క్రాస్ అవుతూ ఆంగ్ల అక్షరం ఎక్స్  ఆకారంలో పట్టి వంటిది బిగించి కట్టినట్లు కనిపిస్తోంది. విప్పార్చుకుని కనిపిస్తున్న కళ్ళు తను అప్పటివరకూ వీరనాట్యం చేసివుంటాడు అనేందుకు ఆధారంగా వున్నాయి.

అశ్వారూఢుడైన వీరుని వీరగల్లు
అశ్వారూఢుని వీరగల్లు

రెండవ వీరగల్లు పూర్తిగా నేలలో కూరుకు పోయివుంటే బయటకు తీసారు. దీనిలో గుర్రంపై స్వారీ చేస్తున్న ఒక వీరుడు కనిపిస్తున్నాడు. ఒకచేతితో గుర్రపు కళ్ళాలను పట్టకున్నాడు. రెండవ చేతిలో యస్ ఆకారంలో వంపుతిరిగి చేతితో పట్టుకున్న వైపు కంటే రెండవ చివర వెడల్పుగా వున్న ఆయుధమేదో ధరించాడు. వెనుక రెండుకాళ్ళను ఆధారంగా చేసుకున్న గుర్రం ముందు రెండు కాళ్ళనూ పైకెత్తి వుంచింది. లేదా గుర్రాన్ని తోలుతున్న వ్యక్తే అలా దూకేలా చేసాడో మరి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ గుర్రానికి క్రింద రెండు చిన్న జంతువులు కనిపిస్తున్నాయి. వీరగల్లు ద్వారా ఏ విషయాన్ని పదిలంగా దాచుకోవలనుకుని వుంటారు అనేది ప్రత్యేకంగా గమనిస్తే ఆ రెండు జీవులనూ కాపడటమే ప్రధాన అంశం అనిపిస్తోంది. బహుశా రాజుగారికి లేదా గ్రామానికీ చాలా ఇష్టమైన లేగలు లేదా గుర్రాలను ప్రతిష్టాత్మకంగా శత్రువులు దొంగిలించినపుడో వీరత్వంతో రక్షించి వుండవచ్చు. డెస్ట్రియర్స్ గా పిలువబడే ఆడగుర్రాలు కూడా అప్పటి యుధ్దభూమిలో చాలా సేవచేసాయి. అలాంటి ఏదైనా డెస్ట్రియర్ రెండు పిల్లలను ఈని సైతం యుద్దం వీరుడికి సహాయపడినందుకు కృతజ్ఞతాపూర్వకంగానైనా ఈ వీరగల్లుని ప్రతిష్టించుకుని వుండొచ్చు. మరింత నిశితంగా విపులంగా పరిశీలించడం ద్వారా చరిత్రకారులు మరింత మెరుగైన సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాను.
నల్లరాతి ఆంజనేయ విగ్రహం

ఆంజనేయ విగ్రహాన్ని పరిశీలిస్తున్న గ్రామస్థులు


గొడ్ల ముత్యాలమ్మ నిజరూపం


నీలిమందు తయారీ తొట్లు
ఊరి ముత్యాలమ్మ గుడి దగ్గరున్న రాతి రోలర్


నాగులవంచ గ్రామంలో మాదిరిగానే ఈ ప్రాంతనుంచి కూడా నూలు వస్త్రాల అల్లిక వాటిపై నీలిరంగు (Indigo) అద్దకం వుండేవి అనేందుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో వున్న నీలిమందు తొట్లు నిలుస్తున్నాయి. అంతేకాకుండా నీలిమందు తయారీ సమయంలో తిప్పే గానుగలలో ఉపయోగించిన రాతి రోలర్ కూడా వున్నది. దానిని తర్వాతి కాలంలో ధాన్యాన్ని నూర్చుకనేందకు, పిల్లలు క్రికెట్ పిచ్ లను చదును చేసుకునేందుకు వాడుతున్నారట.
ఇవే కాకుండా గ్రామంలో వేర్వేరు చోట్ల ఊరి మధ్యలో వున్న ముత్యాలమ్మ కావడంతో ఊరి ముత్యాలమ్మగానూ, పశువులు మేసే చోట దొరికి అక్కడ రక్షణగా వుంటున్న గొడ్ల ముత్యాలమ్మ, చెరువు అలుగు కట్ల దగ్గరున్న నల్లరాతి భక్తాంజనేయుడు తదితర విగ్రహాలన్నీ ఈ గ్రామానికి బోల్డంత ప్రాచీన చరిత్ర వుందని ఢంకాభజాయించి మరీ చెపుతున్నాయి. పోయినవన్నీ పోగా ఇప్పటికి మిగిలిన ఈ శిధిలాలను జాగ్రత్తగా సేకరించి పేర్చుకుంటూ పుట్టిన మట్టి గొప్పతనాన్ని సగర్వంగా మన తర్వాతి తరాలకు అందజేయవచ్చు.

గ్రామం మనసు మనకు మరీ నచ్చుతుంది

ఈ విగ్రహంతోనే వానరానికి ఆలయం నిర్మించారు

చొప్పకట్లపాలెం గ్రామం లోకి ప్రవేశించడానికి ముందే దారిపక్కగా వున్న ఒక గుడి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొన్నాళ్ళ క్రింత వాళ్ళ వూళ్ళో చనిపోయిన ఒక వానరం జ్ఞాపకంగా దానిని నిర్మించారు. మన ఇళ్ళ దగ్గరకు కోతులొస్తే తెగచిరాకు పడిపోతాం, కొండముచ్చుల్ని తెచ్చయినా వెళ్ళగొట్టాలని నానా హైరానాపడతాం. ఈమధ్య కొంతమంది నీచత్వం(నీచు తినే తత్త్వంలో) మరో అడుగు ముందుకేసి దొరికిన కోతుల్ని చంపి తినేస్తూ దొరికి పోయిన వారున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ లేదా మటన్ అంటూ వీటిని వండిపెట్టారన్న వార్తల్నీ చదివాం. అట్లాంటి రోజుల్లో ఒక వానరం మరణానికి జాలిపడి దాని జ్ఞాపకార్ధం గుడికట్టడం వీరి సున్నితహృదయానికి నిలువెత్తు నిదర్శనం. ఆ అభిప్రాయం ఏమాత్రం తప్పుకాదన్నట్లు చారిత్రక ఆధారాలను పరిశీలించడంలోనూ నాక్కూడా వారిశక్తిమేరకూ సహకరించారు. ఊర్లోని ముఖ్యమైన పెద్దవాళ్ళందరూ చేరి వారికి తెలిసిన వివరాలను నాకు చేరవేస్తూ శాసనాన్ని అచ్చుతీయడం వంటి పనుల్లో సాయం చేస్తూ నన్నూ ఆ గ్రామసభ్యుడిగానే వారి హృదయాలకు హత్తుకున్నారు. అంతే కాదు ఈ గుడి నిర్మించాలా వద్దా అనే విషయంలో తన సందేహాలనూ సూచనలనూ తెలియజేస్తూ మండెపుడి శ్రీనివాసరావు(7036107841) ఇప్పటికే ఒక కరపత్రం ప్రచురించి వున్నారు. ఆ కరపత్రం నాక్కూడా అందజేసి దీనిపై సాయంత్రం వివరంగా మీతో మాట్లాడతాను అనిచెప్పి అన్నమాట ప్రకారం విపులంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదే గ్రామం నుంచి వివిద మీడియాలో పనిచేస్తున్న మిత్రులు తమ వంతుగా గ్రామం సమచారం నలుగురిలోకి వెళ్ళేందుకు మనస్పూర్తిగా సహకరిస్తూ వస్తున్నారు. 

నీటివసతి వున్న గ్రామం
 
వరంగల్ జిల్లాలో భాగంగా ఖమ్మం తాలూకా వున్న రోజుల్లో చొప్పకట్ల పాలెం వివరాలు ఇవి

గ్రామం పల్లపు ప్రాంతానికి చెందినది కావడం వల్ల కావచ్చు, దగ్గరలో మున్నేరు నది పారుతూ వుండటం వల్ల కావచ్చు చాలా తక్కువ లోతులోనే  నీళ్ళు పడుతున్నాయి. అందుకే సాధారణంగా బోరుబావులకంటే, వెడల్పుగా వ్యవసాయ బావులను తవ్వించేందుకు కూడా ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు.  పత్తి, మిరప పంటలు ఎక్కువగా కనిపించాయి.

ఈ పరిశీలనలో నాతో (కట్టాశ్రీనివాసరావు) పాటు గ్రామస్థులు బోయినపల్లి భద్రయ్య గౌడ్, పర్సగాని నాగేశ్వరరావు, మండపూడి మోహనరావు, బోయినపల్లి సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, నరేశ్, రచ్చ మధు, కొండేటి అప్పారావు, షేక్ మస్తాన్, ఎల్లంశెట్టి సుబ్బారావు, బగారపు రాంచంద్రయ్య, నంబూరి పిచ్చయ్య, సాతెల్లి లింగయ్య, తాటికూరి శ్రీను, మెట్టెల రాంబాబు, నాగరాజు, మండెపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎలా చేరుకోవాలి?
ఖమ్మం నుంచి చొప్పకట్ల పాలెం దారి ఇది
 చొప్పకట్లపాలెం తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన బోనకల్ మండలంలోని ఒకానొక చిన్నపల్లెటూరు. ఇది ఖమ్మం నుంచి కేవలం 29 కిలోమీటర్ల దూరంలోనూ, బోనకల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనూ వుంటుంది. ఖమ్మం బస్టాండ్ నుంచి చొప్పకట్లపాలెం ఊళ్లోకి ప్యాసెంజెర్ బస్సులు నడుస్తున్నాయి. లేదంటే బోనకల్ వరకూ బస్సులో వచ్చి అక్కడినుంచి సర్విస్ ఆటోలు చొప్పకట్లపాలేనికి నడుస్తున్నాయి.

కామెంట్‌లు