Monday, 15 August 2016

“పూర్ణమేవావశిష్యతే..”...కట్టా శ్రీనివాస్ కవిత...ఓ విశ్లేషణ!! - Abdul Rajahussain

అబ్డుల్ రాజాహుస్సేన్ గారు కవిసంగమంలో నాకు నచ్చిన కవిత శీర్షికలో పూర్ణమేవాశిష్యతే కవితపై రాసిన విశ్లేషణ

ఒక కవిత ఎందుకు నచ్చుతుంది? ……..బాగుంది కనుక!
ఎందుకు నచ్చలేదంటే........................ బాగోలేదు కనుక!
ఏం బాగుందంటే...ఒక్కసారిగా చెప్పలేం...కాస్తంత తడుముకుంటాం.
అలాగే బాగోలేదంటే…. ……ఎందుకు బాగోలేదో చెప్పడమూ కష్టమే.
ఆ తర్వాత విమర్శ ద్వారం తెరిచి కొన్ని పడికట్టు ప్రామాణికాలతో దాన్ని
కొలుస్తాం.ఓ అంచనాకొస్తాం….నాదృష్టిలో ఇది సరైన పద్ధతి కాదు.!
ఓ కవిత చదవగానే మనసు అదోలా అయ్యిందంటే ఆ కవితలో మన మనసుకు
నచ్చిన విషయం ఏదో వుందన్న మాట.అలా మనసుకు తాకిన ఆ కవిత చదివాక
మన బుర్రను తొలవడం మొదలెడుతుంది.దాంతో కవితను మళ్లీ మళ్లీ చదువుతాం.
కొంత కాలం దాంతోనే కలిసుంటాం..దాని ఆలోచనలతోనే ప్రయాణం చేస్తాం.
అప్పుడు గానీ ఆ కవిత ఎందుకు నచ్చిందో తెలీదు.అంటే కవిత మనసుకు తగిలి
పాఠకుడిలో రసాయనిక చర్య జరిగి దాని ఫలితం ఆవిష్కృతం కావడమన్న మాట.
కట్టా శ్రీనివాస్ పోస్ట్ చేసిన “పూర్ణమేవావశిష్యతే”కవిత కూడా ఇలాంటిదే.
మొన్న కవిత చదివాక మనసంతా అల్లకల్లోలమైంది.రాత్రి నిద్రపోయి,
తెల్లారే లేచాక గానీ ఓ పట్టాన మనసు కుదుటపడలేదు.ముందు చెప్పినట్లే
ఈ కవితలోనూ ఏదో వుంది..దాన్ని వెదికే ప్రయత్నమే ఈ విశ్లేషణ.

“నువ్వు వెళ్లి పోయాక

లోకమెలా పయనిస్తునే వుంటుందో చూడాలనివుందా!”?

ఇవి ఆ కవితలోని మొదటి పాదాలు.ఇక్కడినుంచే కవి మన చేయిపట్టుకొని
తనతో ట్రావెల్ చేయిస్తాడు. ఈ ఆలోచనలోని మంచి చెడ్డల్ని విశ్లేషిస్తాడు.
అసలు ఇటువంటి ఆలోచన రావడం మంచిదేనా? అన్న విషయమై చర్చిస్తాడు.
ఇది ఓరకంగా తాత్త్విక పరమైన ప్రయాణంగా కనిపిస్తుంది కానీ,నిజానికి ఇందులో
తాత్త్వికత కంటే హేతుబధ్ధతే ఎక్కువ.మరణం తర్వాత మనిషి అస్తిత్వం ఏమిటి?
మనిషి తానున్నంత వరకు అన్నీ నావే అనుకుంటాడు.సమస్తం తనే అనుకుంటాడు.
మరి తానే వెళ్లిపోయాక ... అంతా తానే అనుకున్నదీ,,అన్నీ తనవే అనుకున్నవీ…..
ఏమైపోతాయి? తను లేకుండా అవి ఎలా వుంటాయన్న మనిషి జిజ్ఞాసలో అర్ధముందా?
సమాధానానికి అందని ప్రశ్నలేం కావివి.వీటికి సమాధానాన్ని వెదికే ప్రయాణమే ఈ కవిత.
నిజానికీ ప్రతీ మనిషీ ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయమిది..దీనికోసం
హిమాలయాలకెళ్లి ముక్కుమూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు.ఇంట్లోనే ఓ మూల
కళ్లు మూసుకొని మససు లగ్నం చేసి ఆలోచిస్తే సరిపోతుంది. “ నేను” “నాది,” ‌అనే మూలాల్లోకి
మనం జొరబడితే మనమేంటో తెలుస్తుంది.అప్పుడు మన తర్వాత నేను,నాది అనుకున్నవి
బోధపడటం మొదలవుతుంది.మన పూర్వీకులు దీన్నే తాత్త్వికతగా భావించి రాశులకొద్దీ
జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని మనకొదిలి వెళ్లారు.అసలు జీవితమంటే ఏమిటి? మృత్యువంటే ఏమిటి?
చలనం జీవితం.నిశ్చలం మృత్యువు...బతకడం జీవితం..చావడం మృత్యువు.
చావు బతుకులు కేవలం దేహపరమైనవేనా? కాదు...ఆలోచనా పరమైనవి కూడా.
మనిషి బతుకున్నా ఆలోచనల్లేకుండా స్థాణువు లా వుంటే వాడు మృతుడితో సమానమే.
మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే మెదడు పనిచేయక కోమాలోకి వెళితే...
బతికున్నా చచ్చినవాడితో సమానమంటారు. వైద్య పరిభాషలో దీన్నే క్లినికల్ డెత్ గా పిలుస్తారు.
అటువంటిది మనిషి చచ్చాక తను బతికిన లోకాన్ని చూడాలనుకోవడం సాధ్యమా?

మనిషి పోయాక వాడిలోని “ నేను” ఏమయ్యాడు.? ఎక్కడికెళ్లాడు?
ఆత్మగా మారి మరో శరీరంలోకి ప్రవేశించాడా? ఆత్మ కు చావు లేదా?
ఆత్మ శాస్వతమా? ఈ కవితలో కట్టా ఇటువంటి తాత్త్విక,మార్మిక రహస్యాల
జోలికి పోకుండా తెలివైన పనిచేశాడు.ఇక్కడే కట్టా 'భౌతికవాదిగా’ కనిపిస్తాడు.
అలాగనీ కట్టాను భౌతికవాది జాబితాలో వేయడం తొందరపాటే అవుతుంది .
“ఆకాశాత్పతితంతోయం...సాగరం ప్రతి గఛ్ఛతి “..ఆకాశం నుండి నీరు (నదిగా మారి)
సాగరం వైపుకే సాగుతుంది.జీవితమూ అంతే.పుట్టుకతోనే మనిషి ప్రవాహశీలి. నది సాగరంలో
కలిసినట్లు..జీవుడు మృత్యు ఒడికి చేరతాడు.అమ్మ కడుపులోంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక
కిందాపైనా, పడిలేస్తూ.. వెనక్కూముందుకూ నడుస్తూ..జీవిత ప్రయాణంలో అలసి,సొలసి చివరకు
మృత్యు ఒడిలో సేదతీరుతాడు.ఆ సమయంలో తను వదిలి వచ్చిన లోకమెలా నడుస్తుందో చూడాలన్న
తపన,ఆలోచన వుంటే అది వ్యర్ధమంటాడు.నేను..నాది అన్న అస్తిత్వాలు మనిషి మరణంతోనే పోతాయి.తను
లేకున్నా తాను బతికిన ప్రపంచం అలానే వుంటుంది.తన విధుల్లో తనతో అప్పటికి వున్న మనుషులతో సాగు
తూనేవుంటుంది…’పూర్ణమేవావశిష్యతే’..పూర్ణమంటే నిండుగా వుండటం.ఒక పూర్ణం నుంచి మరొక పూర్ణం వస్తుంది.
పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ఙమే వస్తుంది.చివరగా కూడా పూర్ణమే మిగులుతుంది.మనిషి జీవితమూ అంతే.
మరణం తర్వాత మనిషి ...మొత్తం ఖాళీ అయిపోయి సున్నాగా మారతాడు..సున్నానే మనం పూర్ణం అంటాం.
సున్నాగా మారిన మనిషికి ఇక ఆలోచనలు,తాపత్రయాలూ ఎక్కడుంటాయి?

“అంతా వదిలేశాక
లేదా అన్నీ నిన్నే విడిచాక
అసలు”నువ్వు” అనుకునే ఆలోచనే ఆవిరైనాక
మిగిలిన ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో గమనించాలని వుందా?

బంధుత్వాలనీ,స్నేహాలనీ,
బాధ్యతలనీ ,బరువులనీ,
ఆలోచనలనీ,సంవేదనలనీ,
ఆఖరుకు తెలియబడేదాన్ని, తెలుసుకునే దాన్నీ
విడిచి పెట్టేశాక మిగిలినదెలా వుంటుందో
అనుభవంలోకి వస్తే బావుండుననుకుంటున్నావా!

ఒకసారి
వేరే వూర్లో ఖాళీ చేసిన అద్దెకొంపకి వెళ్లిరా
…...మరోసారీ
చిన్నప్పడి బడినో చూసిరా
……ఆఖరుగా
చితికెళ్లిన వాళ్ల చిగురుల్లోకి,చూసిరా!”

జీవితం నదిలాంటిది.నది బిందువుగా మొదలైనట్లు,జీవితం జననంతో
మొదలవుతుంది.నదిలో ఉపనదులు కలిసినట్లే,జీవితంలో అనుభవాలు
కలుస్తాయి.నది క్రమంగా విశాలమైనట్లే జీవితమూ విశాలమవుతుంది.నదీ
ప్రవాహంలో కొండలూ,కోనలూ ఎదురవుతాయి.నది జలపాతంగా మారి
హోరెత్తుస్తుంది.అప్పుడప్పుడూ ఇంద్రధనుస్సూ సృష్టిస్తుంది.జీవితమూ అంతే ,
జీవనయానంలో ఆపదలెదురవుతాయి.అప్పుడప్పుడూ సుఖసంతోషాలూ
వెల్లివిరుస్తాయి.జీవితం విశాలమవుతుంది.చిక్కుముడులు పడుతుంటాయి.
వాటిని విప్పుకుంటూ,ఆపదల్ని తట్టుకుంటూ మనిషి ఎదుగుతాడు….
నదీ సంగమం లానే జీవితమూ సంగమిస్తుంది.జీవితభాగస్వామి వస్తుంది.
ఆ తర్వాత పిల్లాజెల్లా...కామ క్రోధ,మద,మాత్సర్యాలు ,బతుకుబండి ఆటుపోట్లు.,
బంధుత్వాలూ,స్నేహాలు,బాధ్యతలు,బరువులు,ఆలోచనలు,సంవేదనలూ…...
ఇవన్నీ కలగలిసి బతుకు బండి తీరానికి చేరుతుంది.నదీనాం సాగరో గతిః ...నది చివరకు
సముద్రంలో కలిసినట్లే జీవితం మృత్యు ఒడికి చేరుతుంది. నిరంతర పరిణామమే
జీవితం.మనిషి పుట్టీపెరిగి బతికి చివరకు గిట్టేదాకా జీవన యానమంతా అనుభవాల పుట్ట.
దీనికి సమాధానం కావాలంటే..ఓ సారి వేరే ఊర్లో ఖాళీ చేసిన అద్దె కొంపకి వెళ్లి రమ్మంటాడు.
అలాగే పనిలో పనిగా చిన్నప్పటి బడి,చితికెళ్లిన వాళ్ల చిగురుల్లోకి వెళ్లి చూసి రమ్మంటాడు.
నిజానికి బతికుండటమంటే సగం జీవితం మాత్రమే అవుతుంది.మరణాన్ని కూడా
కలుపుకుంటేనే సంపూర్ణ జీవితంకింద లెక్క.కాబట్టి మరణాన్ని గురించి భయపడకూడదు.
మనం లేకపోయినా ఈ సృష్టి వుంటుంది.నిజమేమిటంటే మనం పుట్టక ముందునుంచే
సృష్టి వుంది.పుట్టాకా వుంది.గిట్టిన తర్వాతా వుంటుంది.కేవలం సృష్టే కాదు.మన ఊరు,మన
వాడ,మన ఇల్లు.బడీ గుడీ రాయీ రప్పా,చెరవూ,చెట్టూ చేమా అన్నీ అంతే… మనతో పాటే
ఇవన్నీ అంతం అవుతాయనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది!ఈ లోకంలోఅనంతమైన
రాజ్యాలూ,సామ్రాజ్యాలు,శ్రీమంతులు,సామంతులూ,పండితులూ,పామరులూ,సన్మార్గులూ,
దాతలూ,ఎందరెందరో జన్మించారు.వారు పుట్టిన భూమి మీదనే మనమూ జన్మించాము.ఎందరో
మహానుభావులు.ఇలా.వచ్చారు,.అలా.వెళ్లారు.,మనమూ అంతే..మనకున్న ప్రపంచాన్ని మనం
ఆలోచిస్తున్నంత వరకు మాత్రమే చూడగలం.కానీ ఆ తర్వాతా,అంతకుముందూ కూడా అది
వుంటుంది…”..పూర్ణమేవావశిష్యతే”.....!!

“కుండలకొద్దీ బళ్లున కుమ్మరిస్తున్న వెచ్చని వెలుతురులో
లోపల దేన్నో కడుగుతున్నట్లవుతుంది
…………………….
దీర్ఘకాల సుప్తావస్తలో
మొద్దు నిద్రపోతున్న మెదడు మూలాలను తట్టినట్లవుతుంది

అయితే ఇప్పుడు
నువ్వసలేం మిగలకుండా పోయాక
నిలబడేదేమిటో వెదకాలని వుందా!

ఇనప్పెట్టల కలల్నీ, కుర్చీల ఎత్తుల్నీ,
యవ్వనపు సవ్వడుల ఎండమావుల్నీ,
చీకటి చు.క్క.ల..మత్తునీ దాటుకుంటూ నడవాలని వుందా?

ఇదిగో ఈ చిన్న వెలుతురిని అంటించుకో
కనీసం అది తర్వాత వేసే అడుగుపై పరుచుకున్నా చాలు
లోలోపల వేల మైళ్ళ ప్రయాణం ఏదో నాడు పూర్తవుతుంది.

హుష్….!
ఇలా కూడా వెదిక
దాచుకున్న జ్ఞాపకాలు సైతం దేహంతో పాటు కాలిపోయాక
ఈ వెతుకులాట ప్రయోజనాల్ని విశ్లేషించాలని వుందా?
అయితే…!

మళ్లీ మొదటి లైను దగ్గర నుంచే
చదువుకుంటూ రా…..!!” .

ప్రతి జీవితంలోనూ కొన్నిబాధలూ,దుఃఖాలూ,అసంతృప్తులూ,ఆవేదనలూ,సంవేదనలూ
వుంటేనే కానీ మానసానికి పదునెక్కదు.బుధ్దికి పనిబడదు.అప్పుడే తోటి మానవుడి వెలుగు
నీడలను అర్ధం చేసుకోలేము.గతంలోకి ఓసారి వెళ్లొస్తే దీర్ఘకాల సుప్తావస్థలో వున్న మెదడు
మూలాల్ని తట్టిలేపవచ్చు! ఇప్పడు మనం అసలే లేనపుడు ఓ సారి వెనక్కు తిరిగి చూసుకుంటే
మిగిలిందేమిటో వెతుక్కోవాలి….
మనం లేకపోయినా మన మంచితనం ఏమైనా మిగిలుందా?
మనం లేకపోయినా మన జ్ఞాపకాలు ఇంకా ఆకుపచ్చగానే వున్నాయా?
మనం వదిలి వచ్చిన అడుగులు నడవడానికి ఎవరికైనా పనికొస్తున్నాయా?
మనం లేకున్నా..మన తాలూకు తడి ఎవరి గుండెల్లో అయినా చెమ్మగా మిగిలిందా?
ప్రతీ మనిషి చావుకు ముందే తన్ను తాను తడిమి చూసుకోవాల్సిన ముఖ్య విషయాలివి.
బతికున్నపుడు ఇనప్పెట్టెలు నిండాలని కలలు కంటాం.రాజకీయ కుర్చీకోసం,అధికారం కోసం
పాకులాడతాం.యవ్వనపు సవ్వడుల ఎండమావులుకోసం తాపత్రయపడతాం.
చీకటి చుక్కల మత్తులో చిత్తవుతాం..ఈ వికారపు చేష్టలను దాటి ముందుకు నడవాలనుకుంటే..
మనిషివాసనను అంటించుకోవాలి.మానత్వపు చిన్ని వెలుగులో ప్రయాణించాలి.కనీసం అది
తర్వాత వేసే అడుగు పై పరచుకున్నా చాలంటాడు కవి..ఇదే నిజమైన జీవిత లక్ష్యమంటాడు కవి.
దీన్ని గుర్తెరిగి నడుచుకున్నప్పుడే మనిషి లోలోపల వేల మైళ్ల ప్రయాణం ఏదో ఒక నాటికైనా
పూర్తవుతుందన్నది కవి ఆశ. .మనిషి తన దేహంతో పాటు తాను దాచుకున్న
జ్ఞాపకాలు కాలి బూడిదయ్యాక వాటికోసం వెదుకులాటలో అర్ధం లేదన్నది కవి అభిప్రాయం.
మరణం తర్వాత మిగిలేది మనం చేసిన మంచి మాత్రమే.బతికున్నపుడు మంచిని మిగుల్చుకొనే
ప్రయత్నం చేస్తే బాగుంటుంది.అంతేగానీ చచ్చి,దేహం కాలి బూడిదై పోయాక కూడా..స్వార్ధంతో...
ఇంకా……’నాది,’నావాళ్లు అనిపాకులాడటం వృధా ..వృధా! అన్నది ఈ కవిత పిండితార్ధం.
“తన్ను తా తెలిసిన తత్వమేల?”.నిన్ను నువ్వు తెలుసుకుంటే ఇక తత్త్వాలతో పనేముందంటాడు వేమన..
తనవెంటజనుదెంచు వారలెవ్వరు? చేసిన పాప పుణ్యములు గాక”అని అన్నమయ్య చెప్పడంలో కూడా
అర్ధం ఇదే….."పూర్ణమేవావశిష్యతే!"....

(మనసును తాకి మెదడుకు పనిపెట్టిన .....మంచి కవిత అందించిన కట్టా శ్రీనివాస్ గారికి అభినందనలు .....!!!)

ఫేస్ బుక్

Tweets

లంకెలు