Monday, 1 August 2016

దీపంకింద నీడలా జిల్లాకేంద్రం పక్కనే మన్యం ఆక్రందన.

అప్పుడెప్పుడో అశ్వారవుపేట ఏజెన్సీ ఏరియాలోని ఉడుముల బండ అనే గిరిజన గ్రామానికి వెళ్లినపుడు అక్కడి దుర్భర పరిస్థితిని చూసి ఆందోళనగా అనిపించింది  కానీ ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో మన్యాన్ని మరపిస్తూ కారుచీకట్లలో చావువాకిట్లో కాపురం చేస్తున్న ఓ గ్రామాన్ని గురించి ఈనాడులో శుక్రవారం నాడు రాసిన కథనాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం వేసింది. బెంగళూరునుంచీ రెండ్రోజులు గడుపుదామని వచ్చిన Balu Vakadani వెళ్దామన్నా అన్నందుకు ఈ పర్యటన బోనాల సెలవు పేరుతో ఈరోజు పెట్టుకున్నప్పటికీ ఈ సమాచారంతో పాటు మరెన్నో చారిత్రక ఆనవాళ్ళను సంపాదించుకోగలిగాము.
ఖమ్మంజిల్లా కొణిజర్లమండలానికి చెందిన ఒకానొక పంచాయితీ గుబ్బగుర్తి ఆ పంచాయితీ పరిధిలో వెళ్తున్న NSP కెనాల్ గట్టుని ఆనుకుని రెండుదశాభ్దాల కాలంనుంచీ ఎదిగిన కుగ్రామం యల్లన్న నగర్, ప్రస్తుతం 180 కుటుంభాలూ, 250 .జనాభా వున్న ఈ గ్రామం యల్లన్న అనే వ్యక్తి మొదటిగా వేసుకున్న ఇంటితో ప్రారంభం కావడంతో యల్లన్న నగర్ గా మారిందట. కైబర్ బోలాన్ కనుమల గుండా ప్రవేశించినట్లు గ్రామపు ద్వారంగా పెట్టని మట్టికోటలా చైనా వాల్ లా అడ్డంగా వున్న మట్టి గట్టు మధ్యలో చేసిన దారిగుండా లోపటికి ప్రవేశించాం. వర్షం వచ్చింది క్రిందంగా నల్లరేగడి జిగురు నేల, చెప్పులతో నడవటం ఏమాత్రం సాధ్యం కాక వాటినలా దారిపక్కనే వదిలేసి ఫ్యాంట్లను పైకి మడిచి జారిపడిపోకుండా నడవటం ప్రారంభించాం. ఆసుపత్రికి వెళ్ళటం కోసం పిల్లల్ని భుజాలపై మోసుకుంటూ వస్తున్న ఒక జట్టు వాళ్ల సమస్యలను చెపుతూ స్వాగతం పలికినట్లు ఎదురయ్యింది. కొంచెం ముందుకు వెళితే ఏదో కుటుంబ పంచాయితీ కావచ్చు ఊరిమధ్య ఆడామగా జనమంగా గుంపుగ నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇలా ఊరిని చూసేందుకు వచ్చామని చెప్పగానే ఒక వ్యక్తిని తోడిచ్చి ఊరును చూపించమని పురమాయించి తమ పంచాయితీని కొనసాగించారు. కలాం విద్యాలయం పేరుతో కట్టిన బడిని, మిషనరీ వాళ్ళ చారిటీతో వేసిన బోర్లను, కట్టబోతున్న చర్చీలనూ పూరిళ్ళను, వాటిముంగిళ్ళలో పశుసంపదనూ, రాళ్ళను అందంగా పేర్చి ప్రహారీగా మార్చిన పనితనాన్ని, నీళ్ళను మోసుకొస్తున్న పసితనాన్నీ చూసుకుంటూ వారి గ్రామం వివరాలను పాముకాట్లతో డజన్లకొద్దీ పోయిన ప్రాణాల వివరాలనూ, వైద్యం అందక గిలగిలలాడే సందర్భాలనూ తెలుసుకుంటూ ఊరిని ఒకచుట్టు చుట్టి వచ్చాం. రాజకీయ కారణాలు, పట్టింపులేని తనాన్ని చెపుతూ ఒక కిలోమీటరు దూరంలో వున్న సబ్ స్టేషన్ నుంచీ కరెంటు ఎందుకివ్వరంటూ ప్రశ్నించారు.

కేవలం ఓటరు కార్డులుగానో, రేషను కార్డులుగానో కాకుండా మనుషులుగా వీరిని గమనిస్తే మాత్రం ఈ ఇబ్బందులు గుండెను తరిగేస్తున్నట్లే అనిపించింది. కరెండు తీసుకొచ్చే పని ప్రారంభం అయ్యిందని అంటున్నారు కొంత దూరం వేసిన పోల్స్ ని చూపిస్తూ అదే జరిగితే చాలా మార్పు వస్తుంది. విషపు పురుగులనుంచి రక్షణ, ఆరోగ్యానిరి భరోసా కూడా ఏర్పడితే ట్రాన్స్ పోర్టు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. బడి సక్రమంగా నడిచేలా చేస్తే రేపటి తరం తలెత్తుకుని బయటకు వస్తుంది. లేదా మరేవైనా ఇతర కారణాలుంటే ఊరిని మరోచోటకు కాలనీలుగా కట్టయినా తరలించండి ఏలాగూ అన్నీ పూరిళ్లే కాబట్టి కానీ సార్లూ ఓసారిలా మాత్రం చూడండంటూ దీనంగా అడుగుతున్నారీ గ్రామస్థులు.
ఇక అదనంగా ఇక్కడి చారిత్రక అంశాలను గురించి గుబ్బగుర్తి నుంచి ఎంటెక్ వరకూ చదువుకున్న రామనబోయిన లాలు వివరించాడు. యల్లన్న నగర్ కు ఎదురుగా వున్న గుట్టల్లో నిలువెత్తు రాతిగోడలూ, పశువుల దొడ్లు, నంది విగ్రహాలు, లాంటవి వున్నాయట, ఈ బురదలో అక్కడివరకూ నడచి వెళ్ళటం కూడా సాధ్యం కాలేదు. బొల్లిగుట్ట అనిపిలిచే ఈ ప్రాంతంలో కీసర లచ్చమ్మ అనే ఆవిడ పురాతన కాలంలో వ్యవసాయం చేసిందని పెద్దలు కథలుగా చెప్పుకుంటారట. చుట్టూ గుట్టలతో వున్న లొద్దికుంట ప్రాంతంలో ఒకవైపు జాగ్రత్తగా మూసి వేయగలిగితే లొద్దికుంట చెరువులో మరిన్ని నీళ్ళు నిలచి మరింతసాగుకు తోడ్పడతాయని భావిస్తున్నారు. గుబ్బగుర్తిలో అత్యంత పాత శివాలయం కనిపించింది.దానికి ముందు ద్వారపాలకులుగా ువన్న జయవిజయులకు పక్కన పూర్ణకుంభాలున్నాయి. లోపటి ద్వారానికి రెండువైపులా గరుత్మంతుడూ హనుమంతుడూ వున్నారు. బహుశా వైష్ణవాలయం అయ్యివుండొచ్చేమో అనిపించింది. ఈ ఆలయానికి దగ్గరలోనే గుండ్రని బండకు ఒకవైపు చెక్కిన వినాయక విగ్రహం పడిపోయి వుంది. సర్పాన్ని ఉదరానికి చుట్టూ కట్టుకున్నట్లు ఈ విగ్ర్హహం చెక్కివుంది. గుడిపక్కనే వున్న తొట్టిని పాలతొట్టి అనిపిలుస్తారట. గుడి పడమరవైపుకు తిరిగివుంటటంతో ఇది ప్రధానాలయం కాక ఉపాలయం అయివుండొచ్చనే భావన కలుగుతోంది. దానికి అనుగుణంగానే దూరంగా విగ్రహాలు దొరకటం గరుడస్థంభం విడిగా వుండటం నిర్ధారింస్తున్నాయి. చాలా రాళ్ళు విరిగి మట్టిలో పడిపోయివున్నాయట వాటిలో ఏవైనా శాసనస్థంభాలుకానీ దొరికితే మరింత చరిత్ర ఆనవాళ్ళు ఏరుకోవచ్చు. మరికొన్ని ఫోటోలను ఈ క్రింది లింకులో చూడవచ్చు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు