ఇంటర్నెట్ కు పాతికేళ్ళు

మాయలపకీరు సినిమాలో రిమోటుకంట్రోలర్ లాంటి మంత్రదండాన్ని అలా గాలిలో కదిపి వాయస్ కమాండ్ సెర్చ్ తో ప్రపంచంలో నంబర్ వన్ అందగత్తె ఎవరు అని సెర్చ్ చేస్తే మాయాదర్పణం స్క్రీన్ మీద బాలనాగమ్మ కనిపించిందట, బ్యూటిఫుల్ అని కాకుండా ‘‘హూ ఈజ్ హాట్ ఆన్ నౌ?’’ అని వెతికితే బాలనాగమ్మ బదులు సెర్చ్ రిజల్ట్ లో సంగు కనిపించి కథమరోలా వుండేదేమో. ఆలీబాబా నలభై దొంగలు సినిమాలో కూడా ఖుదాకి కసమ్ అంటూ వాయస్ కమాండ్ తో డోర్ ని మూయటం తెరవటం చేసిన విషయాలు గుర్తున్నయో లేదో. కానీ ఇవ్వాళ మనం అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ అద్దపు తెరల మీద కావలసిన సమాచారాన్ని వెతికేస్తున్నాం, తొలిచిన సందేహాలను సులభంగా తీర్చుకుంటున్నాం. ప్రపంచ మేధస్సును మొత్తం ఒక వలలా అల్లి అందరికీ అందుబాటులో వుంచిన రూపమే అంతర్జాలం అయ్యినట్లుంది. మనస్సంత వేగంగా ప్రయాణించే సామర్ధ్యాన్నీ స్వంతం చేసుకుంది.
మన జీవితాల్లో ఇంతగా అల్లుకుపోయిన ఇంటర్నెట్ ప్రవేశించి కేవలం 25 సంవత్సరాలే అయ్యింది. ఆగష్టు 23, 1991 న పబ్లిక్ వరల్డ్ వైడ్ వెబ్ స్విట్జర్లాండ్ లో CERN లో కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నెర్స్ -లీ రూపకల్పన చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు…అతను 1990 లో హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ( HTTP ), హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ (HTML ); యూనిఫాం రిసోర్స్ లొకేటర్ ( URL ), మొదటి వెబ్ బ్రౌజర్ సర్వర్,మరియు మొదటి వెబ్ పేజీలు ప్రవేశ పెట్టారు.
బలమైనదీ పదునైనదీ ఏదైనా సరే మన చేతిలో వుంటే దాన్ని స్వాధీనంలోకి తీసుకుంటే ఎంతగా ఉపయోగం వుంటుందో,దాన్ని లోబరచుకోలేకపోతే అంత నష్టం కూడా చేస్తుంది. అది చక్రం కావచ్చు, నిప్పు కావచ్చు, విద్యుత్తుకావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, గాలిలో ప్రయాణం కావచ్చు, అణుశక్తి కావచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంతర్జాలం కావచ్చు, సరిగా వాడితే దానితో ఎంత ప్రయోజనం వుంటుందో వాడటం రాకుంటే అంత నష్టం కూడా కలిగిస్తుంది.
రేపు ఎదగాలనుకునే ఏ విద్యార్ధి అయినా, వ్యాపారవేత్త అయినా ఉద్యోగి అయినా అంతర్జాలం సహాయం తీసుకోకుండా వుండలేరు. ఇవ్వాళ అంతర్జాతియ ప్రమాణాలు కూడా అందరికీ నెట్ అందుబాటు తీసుకురాగలిగిన దేశాలు అభివృద్ధిలో ముందువరుసలోకి వస్తున్నాయి అని చెప్తున్నాయి. మనుషులని కలవాలంటే వీధుల్లోకే రానక్కరలేదు సోషల్ నెట్ లోకి వచ్చినా సరిపోతుంది అనే రోజుల్లో వున్నాం. కావలసిన దారివెతుక్కోవడం, బస్సులు ట్రయిన్ల లాంటి టికెట్లు బుక్ చేసుకోవడం, పరిపాలన మొత్తం సాగించడం లాంటి దైనందిన జీవతంతో ముడిపడిన అన్నిఅంశాలూ ఇవ్వాళ అంతర్జాల వేదిక సాక్షిగా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వేగాన్ని అందిపుచ్చుకున్న వారు అంతే సందర్బోచితంగా ముందుకు వెళుతున్నారు. సమాచారాన్ని బుర్రలో దాచే పనికన్నా దొరికే సమాచారాన్ని బుర్రనుపయోగించి వాడటం తెలిసిన వారు ఎదుగుతారనే నిజాన్ని అర్ధం చేసుకుంటున్నాం.
అయితే ఈ వలలో పడటంలో లాభాలతో పాటు కొత్తొక మురిపం లాంటి నష్టాలు సైతం కొన్ని వున్నాయి. ఇవ్వాళ ఆన్ లైన్ స్నేహాలు జీవితాలను నాశనం చేయడం చూస్తున్నాం. ఆన్ లైన్ మోసాలు దేశాలను కుదిపేయడమూ గమనిస్తున్నాం. వినియోగపు సంధికాలంలో వున్నాం పొగరుబోతు గుర్రపు కళ్ళాలను ఇంకా పూర్తిగా చేతిలోకి తీసుకోని రోజుల్లోనే వున్నాం. అందుకే కొంచెం మనసు పెట్టి దానిని నియంత్రించాల్సిన అవసరం కూడా వుంది.




కామెంట్‌లు