Sunday, 28 August 2016

పెళ్ళిచూపులు చిన్న సినిమానే కానీ ....

ఇంత ఆలస్యంగా పెళ్ళిచూపులకు వెళ్లొచ్చాను మద్యలో స్నాక్స్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం ఇక ఎలావుందో చెప్పాలి కదా.
చాలా చిన్న బడ్జెట్ తో తీసినా మించి విజయం వచ్చిందంటూ చాలా మంది మిత్రులు చెప్పారు. 
పెద్దపెద్ద హీరోలు లేరు. కమెడియన్లు లేరు, ఢిష్యుం ఢిష్యూం ఫైటింగులూ గాల్లోకి ఎగరటాలూ లేవు. ఆఖరుకి పంచ్ డైలాగులు డబుల్ మీనింగ్ ఎటకారాలూ లేవు. భారీ కాస్ట్యూమ్ లూ, గ్రాఫిక్ ఎఫెక్టులూ లేనేలేవు. అయినా సినిమా బావుందనే ప్రేక్షకులు కూడా చూస్తున్నారు ఎవరన్నారండీ తెలుగు ప్రేక్షకులకు టేస్ట్ లేదని చెప్పింది?. సినిమాలో సత్తా వుండాలే కానీ తప్పకుండా దాన్ని ఆదరిస్తారనడానికి ఇదో మంచి ఉదాహరణ.
ఈ మధ్య చదివిన పుస్తకాల్లో రస్మీ భన్సాల్ రాసిన కనెక్టింగ్ ది డాట్స్ ( విజయాల చుక్కల్ని కలపండి) దానిలో కొందరు భారతీయ చిరు వ్యాపారులు అంతర్జాతీయ స్థాయి వరకూ ఎలా ఎదిగారు. చిన్న పెట్టుబడితో చక్కటి ఫలితాలను ఎలా సాధించారు అనే విషయం ప్రధానాంశంగా వేర్వేరు ఇంటర్వూలను చక్కటి విశ్లేషణతో అందించారామె. అందులో మొదటి చాప్టర్ కప్పులు కడుక్కునే స్థితిని దాటుకుంటూ దోసెలు వేయడాన్ని వ్యాపారంగా మలచుకుని దాన్ని ఒక రేంజికి తీసుకువచ్చిన నిజమైన ఉదాహరణ వుంది. దాన్ని చదివినప్పటి ఆశ్చర్యం కంటే
మొన్నీమధ్య వరంగల్ లో Aravind Arya తో కలిసి తిరుగుతూ తన మిత్రులు ప్రారంభించిన Dosa Express బండి దగ్గరకు వెళ్ళాను. చిన్న వ్యాన్ ని మొబైల్ హోటల్ గా మలిచి, క్వాలిటీ అండ్ టేస్టీ దోసెలను సాయంత్రం వేళలలో అందిస్తున్నాను. ఉద్యోగాలు ఎవరో ఇవ్వాలని నిరాశతో ఎదురు చూడకుండా పెద్ద హోటళ్ళకు సైతం పోటీగా వాళ్ళు ఇష్టంగా కష్టపడటం చాలా అబ్బురంగా అనిపించింది.
ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే...
సినిమా అంటే ఒక అవుట్ డేటెడ్ ఫార్ములా కాదు. వందల సినిమాలు రాసిన వాళ్లనుంచి కథలు తీసుకుంటేనే గొప్ఫ ఫార్ములాలు రావు. నిజంగా బ్రతికే జీవితం నుంచి చాలా కథలుంటాయి చూడండి అని చెప్తున్నట్లు వుంటుందీ సినిమా. కథ చాలా సింపుల్ అడ్రసు తెలియక ఎవర్నో చూడబోయి ఇంకెవరో అమ్మాయిక ిజరుగుతున్న పెళ్ళిచూపుల్లోకి వెళతాడు, కానీ వారి పరిచయం కెరీర్ ను మలచుకునేందుకు పరస్పరం భరోసాను ఇచ్చుకునేలా సాగుతుంది. విధి తప్ప విలనేమీ లేని సినిమాలో నిజంగా కొత్తగా జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునే యువతరం ఎంత తపన పడతారు. యూట్యూబులో విడియోలు పెట్టి క్లిక్ కావాలా? ఛెఫ్ గా స్థిరపడాలా? మొబైల్ క్యాంటిన్ పెట్టి నెట్టుకు రావాలా? పేరెంట్స్ కి వాళ్ళ ఫెయిల్యూర్లు మాత్రమే కనపడొచ్చు. దర్శకుడు వాళ్ళ లోపటి తపనను కూడా లెక్కలోకి తీసుకొమ్మని చెప్పినట్లనిపించింది. నేటి తరం ఆలోచిస్తోంది. పైకి జోవియల్ గా వున్నట్లు కనబడుతున్నా, వారికి జానా బెత్తెడు నెలసరి జీతాలతోనో, వచ్చీరానీ పెన్షన్లతోనే జీవితాన్ని సరిపెట్టేయాలనుకోవడం లేదు. తడి ఇసుకలో తమ పిచ్చుక గూడు తామే కట్టేందుకు తంటాలు పడుతున్నారు. అదే చూపించాడిందులో. 
అంతే కాదు
డైలాగులు కానీ కథ చెప్తున్న తీరు కానీ డ్రమటైజ్ గా లేదు. మన పక్కింట్లో జరుగుతున్న సంఘటనంత సహజంగా మాటలు, ఎమోషన్లూ వున్నాయి. అంతే సింపుల్. ఏదో నేర్పాలని పెద్దక్షరాలతో రాసి అండర్ లైను కూడా చేసి పేపరు మడత పెట్టే ఉద్భోద కాదు. మాసు మషాలాలంటూ వల్గారిటీనో, క్రైమ్ నో, దయ్యాల కామిడీనో కుప్పపోసిన పైత్యమూ కాదు. నేటీ జీవితంలో ఒకానొక చిన్న ముక్క కాకపోతే ఒక ట్వస్టు వున్న ముక్య లక్ష్యాన్ని ఎంచుకుంటున్న పోకడను చూపించిన ముక్క.
ఈ ధోరణి బావుందనిపిస్తే మీరూ ఓసారి పెళ్ళిచూపులకు వెళ్ళొద్దురూ...

ఫేస్ బుక్

Tweets

లంకెలు