మేమంతా ఇంతే మిత్రమా, సగటు భారతీయులం మరి

మేమంతే మరి దారుణంగా విసిగిపోయివున్నాం, ప్రజాస్వామ్య మని గొప్పగా చెప్పుకుని గర్వంగా తలెత్తుకోవలసిన చోట ఎన్నికల సమయంలో ప్రవహించే నోట్ల కట్టలు ముందురాత్రి మందుతో పాటు కిసుక్కున నవ్వి మా వెన్నెముకనే అవహేళన చేస్తూ ఐదేళ్లు తలదించుకునేలా చేస్తుంటే. ఈ డబ్బు జాడ్యాన్ని ఎవరన్నా తొలగించకపోతారా, ఈ విషవృక్షాన్ని వేళ్ళతో సహా పీకేయ లేకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నాం. ప్రజాస్వామ్యా చక్రానికి ఇరుసుగా ఇంధనంగా రంగునోట్లు కాకుండా మనోభీష్టాలు పనిచేసేరోజు రాకపోతుందా అని ఎదురుచూస్తాం.
‘శ్రమకు మరో రూపమే డబ్బు’ అనేదే నిజమైతే వళ్ళుకందని వాళ్ళ దగ్గర కుప్పలుగా పడిపోతున్న లెక్కలు చూపక చీకట్లో మగ్గిపోతున్న సంపదకు వెలుతురు సోకకపోతుందా అని కళ్ళలో వత్తులేసుకుని మరీ చూస్తుంటాం. ఆయనెవరో జూలియన్ అసాంజే వికీలీక్స్ తో ముందుకొచ్చినా అతని గొంతుపై మరింకేదో బలమైన చెయ్యి నొక్కిపెట్టినా ఇంకా బ్రహ్మాంఢం బద్దలవకపోతుందా అని ఎదురుచూస్తూనే వున్నాం. పాపాల ఇనప్పెట్ట చిట్టా బట్టబయలు కాకపోతుందాం నెత్తిన బరువు కొంతైనా తగ్గకపోతుందా అని వేచి చూస్తేనే వుంటాం. పావలాకీ విలువుంటుందని నమ్మే మాకు హవాలా ప్రవాహమై దేశపు శ్రమ అడ్డదారిన కొట్టుకుపోతుంటే అడ్డుకట్టవేసే నాధుడికోసం, నిజమై! కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే చూస్తూనే వుంటాం.
మేమింతే రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన నోట్లు నిజమైన కావని ఫేక్కున నవ్వుతాయేమో నని గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటాం. మేమింతే ఎవరన్నా అసలు ఈ నకిలీలే లేకుండా ఏరేస్తారేమోనని అమాయకంగా ఆశపడుతూనే వుంటాం. మేమింతే శత్రుదేశాలు పదునుపెట్టి విసిరే నకిలీనోట్ల రాకెట్లు జీవితాలను ఢీకొట్టక ముందే అడ్డుగా నాయకుడు తన గుండెబలాన్ని కోటగోడలా కట్టకపోతాడా అని పిచ్చివాళ్లమై పలవరిస్తుంటాం. మేమింతే ప్రతివాడినీ ప్రశ్నలతో పలకరిస్తుంటాం. మేమంతా ఇంతే సోషలమీడియాలలో పొటమరిస్తుంటాం. మేమింతే నిజంగా అచ్చంగా మేమింతా ఇంతే ఇంతే మాదంతా ఈ చింతే వింతే.
జ్వరం తగ్గేందుకు పత్యం అవసరమంటే తప్పకుండా చేస్తాం. దేవుడి దర్శనానికి వరుసల్లో రమ్మంటే వస్తాం. మా వాటాలను అడ్డదారిలో బొక్కేందుకు ఇది పస్తునాటకమని తెలిస్తే పైత్యాలను వదిలించేందుకు పిడికిళ్ళు తప్పకుండా బిగిస్తాం. అప్పటివరకూ ఈ చీకటి తుఫాను వేళలో మాపై ముసురుతున్న యుద్ధమేఘాలను తొలగించే అర్జున పాల్గున పార్ధ కిరీటివి నువ్వే నని నమ్ముతాం. ఆ వెలుతురు దారివైపు ఒక్కో అడుగూ వేస్తూ క్యూలైను ఎంతపొడవున్నా విసుక్కోకుండా నడుస్తూనే వుంటాం. వగలమారి జాలి కన్నీళ్ళ బురదను దాటుకుంటూ, మేకవన్నె పులుల మే మే లను దాటుకుంటూ, మాకోసమే నంటూ తమ లాభాన్ని తూకం వేసుకునే బంగారు కడియపు పులి పక్కగా మా లైను కదులుతున్నా సరే వెలుతురు కనిపిస్తుందనుకున్న దిశగా ఒక్కో అడుగూ ఓపికగా వేస్తూనే వుంటాం.
అబద్దపు ఆక్రోశాన్ని వెళ్లబోసే ప్రేలాపనల మాయతెరలు ఏది నిజమో కనబడనివ్వవు. అయినా పర్లేదు ఈ వగలమారి కన్నీరు తాగి బ్రతకలేం కదా. మేమింతే వెలుతురు వైపే ఆశ చావకుండా అడుగులేస్తాం. నిజం మిత్రమా కనీసం ఈ మాత్రం దిశను చూపించిన వాడే లేప్పుడు మా పాలిట ఈ వెంపలి చెట్టే మహా వృక్షం. కానీ ఏదైనా ఒకరోజు నువ్వే అబద్దమని తెలిస్తే అవి వెలుతురు నీళ్ళు కాదు మోసపు ఎండమావులని తెలిస్తే మాత్రం మొత్తంగా మా గుండెలు కొట్టుకోవడం ఆగిపోతుంది. అప్పుడసలు అడుగెయ్యాలంటేనే భయమేస్తుంది. ఆసాంతం మరింకెవరినీ నమ్మే సత్తువ మొత్తంగా చచ్చిపోతుంది.
అప్పటిదాగా అడుగేస్తూనే వుంటాం. ఎందుకంటే అంధకారంలో కూర్చోవడంకంటే అగాధంలో పడిపోవడం మరీ దారుణం. మేమింతే ప్రేమిస్తే ప్రాణమిస్తాం. మంచి కొంచెమైనా చేస్తే చరిత్ర సైతం మర్చిపోనంత ఎత్తున వాడ్ని నిలబెడతాం. పాతవెన్నో తప్పులున్నా పర్లేదు పాతరేస్తాం. ఒక్కడైనా కావాలి, ఆ ఒక్కడెవరో రావాలి అంటూ పలవరించే మా కలవరింతలను నిజంచేసేది నిజంగా నువ్వేనా, ఇన్నేళ్ళ వెన్నుపోట్లతో మా నీడను సైతం మాదేనని నమ్మలేనంత బెదురిపోయివున్నాం. ఇదంతా అబద్దమని చెప్పేవు సుమా. అప్పటిదాకా
మేమింతే రేపటి మా బిడ్డల భవిష్యత్తుకు వెలుతురులద్దే రంగుల కోసం వెతుకుతుంటాం.
మేమింతే చీకటి తోకకు నిప్పుపెట్టే హనుమంతుడి కోసం కలలుగంటాం.
మేమింతే ఫలితపు దిశ అనిపిస్తే పక్కాగా అటువైపుగా ఒక్కటన్నా అడుగువేస్తాం.
మేమింతే ... మేమింతే... మేమింతే... మేమంతా ఇంతే. ఇంతింతే.

కామెంట్‌లు