కట్టా శ్రీనివాస్ || ఇక్కడ వెలుతురు కూడా ఉంది సుమా

సారమున్న మనుషులు వాళ్లు
ఎన్ని ఆలోచనల బీజాలను
కర్తవ్యాలుగా మొలకెత్తించారో కదా!

తడి తెలిసిన గుండెలు వారివి.
కనుల గుండా ప్రవహించడమే కాదు
ఉపశమనమెంత చిప్పిల్లారో మరి!!

కాసుల గొప్ప చప్పుళ్లతో
దిబ్బళ్ళెత్తిపోయిన చెవులు
వాళ్ళ పలకరింపులతో తడమబడితే,

పరుగుల హడావిడిలో
బండబారిపోయిన మొరటు గుండెలు వాళ్ళకెప్పుడన్నా చేరగిల పడితే,

అద్దం ఒక్కసారిగా తేటబారిపోతుంది.
కొలను అలవోకగా నిర్మలమై నిలబడుతుంది.

వాళ్ళు.....
అమ్మా నాన్నలూ,
బంధుగణాల్లో సభ్యులో కావలసిన పనిలేదు,
బాబాలు,
స్వామీజీలు,
హాంఫట్ లు అసలే కాదు.

ఇలా ముఖపుస్తకాల్లో
గుండెలోతుల్ని ఆవిష్కరించే
ఆర్థినిండిన అక్షయ పాత్రలు
కూడా కావచ్చు వాళ్ళు.

అందుకే కిటికీనో, సమాజాన్నో, పుస్తకాన్నో తెరిచి తొంగిచూడటం లాగానే,
సామాజిక మాధ్యమంలోని మరో ప్రపంచాన్ని తరచి పింగ్ చేసినా,

ఓ విశ్వవిద్యాలయం,
మరో సాహితీ సుమం,
ఇంకో కళాహృదయం
ధారలై ఎదురుగా ప్రవహిస్తుంది.

అవును
వాళ్ళు సారమున్న మనుషులు
అవును అవి జీవమున్న రాతలు

( వెతుక్కునే ఓపిక ఉండాలి కానీ,  నిజంగానే జ్ఞానంతో పాటు ఆత్మీయతలను పంచుతున్న సోషల్ మీడియాలోని సారమున్న మనుషులందరికీ కృతజ్ఞతా పూర్వక నమస్సులతో......)
【  ★★★ జూన్ 26, 2017 రంజాన్】
కవిసంగమం లో ప్రచురితం

కామెంట్‌లు