కట్టా శ్రీనివాస్ || ఎగరాల్సిన పిట్టకోసం ఓ పాట ||

"మెరుపు అంచుల వెండిమబ్బు తునక   బహుమతిగా తెచ్చిస్తావా? "
అడిగింది తను.
"నీ ఎదిగే రెక్కలకైతే 
ఊతం అవుతా "
అన్నా నేను.
అంతూ దరీ లేని అంబరాన్ని
అచ్చంగా తనొకనాటికి ఏలగలదన్న నమ్మకపు సంబరంతో...

"బంగారు మచ్చల అందాల జింకను
నాకోసం వలలో వేసుకురావా"
తన్మయంగా పలవరించింది.
"అవును చుట్టూ అల్లుకుపోతున్న ఈ మాయామోహపు వలను ముక్కలుగా కత్తిరిస్తున్నా" ముభావంగా నేను.

"ఇంకా"
"ఇంతే.."
"............."
" హ ఇంకొక్కటి ఎవరో నీ దారి నిర్ణయించాలని,
ఇలా పదే పదే అడుగుతూ ఎదురుచూడకు..
లోపటివెలుగుతో వేసుకున్నదారిలో
నడుచుకుంటూ సాగిపో.."
"అయితే వస్తామరి... ఇప్పటికి సెలవు"
"..."
"......!"
"ఇగో
ఇం. కో.  మా.  ట.
కుదిరితే నలుగురూ నడిచేంత విశాలమైన దారి పరచుకుంటూ సాగు,
అలా అని అంతా నీ వెనకే నడవాలనే ఆతృతను మోయకు..."
గుప్పిట్లోనుంచి గాల్లోకి ఎగిరిపోయిందిగా"
నవ్వుతున్నట్లున్నారు చుట్టూతా,
ఎగురుతున్న ఇద్దరి మధ్యనున్న దారపు బంధం కనపడని వాళ్ళు

తేదీ : 04:01:2018

కామెంట్‌లు