Wednesday, 14 February 2018

కోరంగి అభయారణ్యం ఒకప్పటి ప్రాచీన నౌకా వాణిజ్య కేంద్రం


మా స్కూల్ కొలీగ్స్ తో కలిసి శివరాత్రికి ముందురోజు కాకినాడ కొరింగా అభయారణ్య ప్రాంతం చూసివచ్చాం. వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు. జనవరి నుంచి మార్చి నెలల వరకు  సముద్రపు తాబేళ్ళు, సముద్ర తీరాన గుడ్లు పెట్టడానికై వస్తాయి. సంవత్సరంలో 12 నెలలూ ఈ అభయారణ్యాన్ని దర్శించవచ్చు ఐతే  దర్శించటానికి నవంబరు, డిసంబరు నెలలు  అత్యుత్తమమైనవి. జీవవైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూపడానికి, విజ్ఞానాన్నీ, వినోదాన్నీ ఒకే చోట పొందడానికి ఎకో పర్యాటకం - మడ అడవుల సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. రంగురంగుల పడవలు, చిత్తడినేలలు, సముద్రపు గాలీ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.  ఒకవైపు పిక్నిక్ సరదాతోపాటు చాలా విశేషాలు తెలుసుకోగలిగాం కొన్ని మీతో పంచుకుంటాను.
కొరింగి మండల కేంద్రమైన తాళ్ళరేవు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కాకినాడ నుండి యానాం దారిలో 18 కి. మీ. దూరంలోనూ ఉంది. నది సముద్రంలో కలిసే ప్రాంతం నదీసంగమం ఇది సహజ ఓడరేవుగా పనిచేస్తుంది. మనం భారతదేశంలో ఇప్పుడు చెప్పుకుంటున్న పెద్దఓడరేవులకంటే ముందు మన దగ్గర విశాఖ ఓడరేవు కంటే ముందు అతిపెద్ద ఓడరేవుగా వున్న ప్రాంతం కొరింగి. ఎంత అంటే తూర్పుగోదావరి జిల్లా అధికారిక గెజిటీర్ల ప్రకారం భ్రిటీష్ కాలంలో ఓడరేవు అంత్యదశలో వుందనుకున్న కాలంలోనే లక్షలాది రూపాయిల వ్యాపారం నిర్వహించిన ఓడరేవు అంతకు ముందు కోట్ల రూపాయిల వ్యాపారం నడిచేదట. ఇప్పుడంటే కోటి రూపాయిలు చిన్నమాట కానీ అప్పట్లో రూపాయి విలువ డాలరును మించి వున్న రోజుల్లో, రూపాయికి పదహారు అణాలు అణాలో 12 వ వంతుకు కూడా కడుపునిండేంత తిండి దొరికే రోజుల్లో లక్షాదికారి అంటేనే మామూలు విషయం కాదు కదా. క్రీస్తుకు పూర్వం నుంచే పురాతన సంస్కృతివున్న సహజ ఓడరేవు కొరింగీ ప్రకృతి వైవిధ్యం వున్న కొరింగి ప్రకృతి వైపరీత్యాలే కాక బ్రిటీషువారి ఈర్ష్య పూరిత మనస్తత్త్వం వల్ల కూడా మరుగున పడిపోయింది.  ఆ చారిత్రక శిధిలాల పై ఇసుక మేటలు వేస్తూ ఆ నాగరికతా శకలాలలను సంవత్సరానికి ఇంత అంటూ ఇప్పటికీ కప్పెట్టుకుంటూ వస్తోంది.,

కొరంగీ లని తెలుగు వాళ్ళని ఎందుకు పిలుస్తారు?కోరంగి నౌకా తీరం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టే తెలుగు వారికి కోరంగీలనే పేరు వచ్చింది. మచిలీ పట్నమో విశాఖ పట్నమో కంటే ముందునుంచే ఈ కోరంగి ఓడరేపు ఎంత ప్రసిద్దమో చెప్పడానికి ఈ మాట మిగిలి వుండటం ఒక గొప్ప ఉదాహరణ.
ఆంధ్ర ప్రజలు మారిషస్‌కి తదితర ప్రాంతాలకి వలస వెళ్ళడమనేది 1836 లో కొరింగ నుండే ప్రారంభమైనది,కొరింగ నుండి గాంజెస్‌(గంగ) అనే నౌక ఎక్కి వెళ్లినట్లు రికార్డు ఉంది. అలా ఒకేసారి ఎక్కువమంది మన తెలుగువాళ్ళు మారిషస్‌కి వెళ్ళే నౌక ఎక్కింది 1843 సం లో, కొరింగా పాకెట్‌ అనే ఒక నౌక కొరింగ రేవు నుండి బయల్దేరి వెళ్ళింది ఆ నౌక యజమాని పేరు పొనమండ వెంకటరెడ్డి. మారిషస్‌కు వచ్చేటప్పుడు వారు ఎంతో ఆశాపూరితంగా వచ్చేవారు. కానీ పోర్టులూయిస్ చేరుకుని వలస కేంద్రం యొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడే వారు ఏదో విషవలయంలో చిక్కుకున్నట్టు బాధపడేవారు. మానసికంగానూ, శారీరకంగానూ వారు బాధలు పడటానికి మారిషస్ వచ్చినట్టు తెలుసుకునేవారు. ఈ కాందిశీకులు బలోపేతమైన ఇనుప తీగల నడుమ రెండు రోజుల పాటు గడపవలసి వచ్చేది. అటుపిమ్మట వారిని పంచదార ఎస్టేటుకి పంపేవారు. సముద్రంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని వారు ఓడలో ప్రయాణం చేసేవారు. మారిషస్‌లో కాలుపెట్టిన తరువాతే వారు బ్రతుకు జీవుడా అనుకునేవారు. మొదట మగవారు మాత్రమే వచ్చినా 1843 నుండి మహిళలు వారితో రావడం ప్రారంభించారు. 1843 సంవత్సరంలో దాదాపు 35 ఓడల్లో భారతీయులు మారిషస్‌కు వలస వచ్చారు. వారిని తీసుకుని వచ్చిన ఓడల పేర్లు సిటీ ఆఫ్ లండన్, కింగ్ స్టన్, ఫ్లవర్ ఆఫ్ ఉగీర్, సుల్తాన్, సిరంగపట్నం, బాబా బ్రాహ్మిన్, కోరంగి పికేట్ మొదలైనవి.  వీటిలో కోరంగి పికేట్ తెలుగు వారిది. దాని యజమాని పేరు పానముండ వెంకటరెడ్డి. 231 టన్నుల బరువు కల ఆ ఓడ నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ. కాకినాడ దగ్గర కోరంగి రేవు నుండి బయలుదేరి ఆ సంవత్సరం రెండు సార్లు తిరిగి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది. 18వ శతాబ్ద మధ్యకాలంలో, తెలుగు  వ్యవసాయ కూలీలు బ్రతుకు తెరువుకోసం కోరంగి రేవునుండి తెప్పలపై రంగూనుకు వలస వెళ్ళడం మొదలయ్యింది. అదృష్టవంతులు గమ్యాన్ని చేరేవాళ్ళు, దురదృష్టవంతులు నడిసముద్రంలో గల్లంతయ్యేవారు. ఈ ప్రవాసాంధ్రులను బర్మీయులు కోరంగీలనేవారు. ఈ వలస 1942లో జపనీయులు బర్మాపై దాడిచేసే వరకు సాగింది. త్వరగా డబ్బు చేసుకోవాలని వలస వెళ్ళిన ఈ జనం, విశాఖపట్నం, చీకాకోల్ (ఇప్పటి శ్రీకాకుళం), గోదావరి డెల్టాకు చెందినవారు. జల దుర్గ, చిల్క అనే పొగ ఓడలు ఈ వలసదారులను చేరవేయడంలో ప్రధాన పాత్రను నిర్వహించాయి
1842 జనవరి 15న ఆర్డర్ ఇన్ కౌన్సిల్ జారీ చేసిన ఇండియన్ చార్ట్ లేబర్ సిస్టమ్ (Indian Chart Labour System) అనుసరించి మద్రాసు ప్రెసిడెన్సీనుంచి 3 లేక 5 సంవత్సరాల కాంట్రాక్టు పద్ధతిలో తెలుగు వారు అధిక సంఖ్యలో మారిషస్‌కు తరలి వచ్చారు. అలా దాదాపు 20 వేల మంది తెలుగువారు మారిషస్‌కు వచ్చి స్థిరపడ్డారు.
మారిషస్‌కి వలస వచ్చిన తెలుగువారు ఐశ్వర్య సంపదలతో తరలి రాలేదు. కేవలం శ్రమజీవులుగా వచ్చి కాయకష్టంతో తమ జీవితం గడుపుకుని మారిషస్ అభివృద్దికి పాటుపడ్డారు. . ఆ దేశంలో "చెట్టుకొట్టి. మెట్టతవ్వి...కంపపొదల నరికి కాల్చి పుడమిదున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు".
కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది.క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లున్నాయి ,ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చుకుంది.
అంత బరువు ఓడలు నీటిపై తేలడం మామూలు విషయం కాదు. విమానాలు లేని రోజుల్లో దేశాలు ఖండాల మధ్య సంభందాలకు ఓడలే ఆధారం. వాణిజ్య పరంగా సంపాదన కావాలన్నా, ఆధిపత్యం కావాలన్నా, ఇతర దేశల నుంచి రక్షణ కల్పించుకోవాలన్నా ఇవే కీలకం కేవలం నౌకలను కొనుక్కుని వాడుకోవడం కాదు వాటిని తయారు చేయడంలో ఇక్కడ అత్యంతం నైపుణ్యం చూపే వారు. ఉప్పునీటిలో ఎక్కువ రోజులు మునిగి వుండే ఓడ ఆ కోరివేతకు శిధిలమై పోకుండా ప్రత్యేకమైన పూతలు రాయడంతో పాటు, గాలివాలును చాలా బాగా వినియోగించుకుని వేగంగా కదిలేలా ఏర్పట్లు చేసుకోవడం, సరుకులకు మనుషులకు చక్కటి వసతి ఇచ్చేలా లోపటి భాగాలను రూపొందించడంలో  ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చకుంది.. లండన్ రేవులో లంగరు వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వర్గాలు నోళ్ళు వెళ్ళబెట్టాయి. మన నౌకల ముందు వారి బేలతనానికి సిగ్గుపడ్డాయి. అప్పటికే నౌకా వ్యాపారంలో గొప్పవారమని విర్రవీగుతున్న బ్రిటీష్ వారు మన నిర్మాణ కౌశలాన్ని చూసి ఓర్చుకోలేక పోయారు. ఏనాటికైనా ఈ నైపుణ్యంతో వాళ్ళను మించిపోయిన పేరుతో ఎదురు నిలవక ముందే వారి వ్యాపార ఆధిపత్యంతో అణగదొక్కాలని నిర్ణయించుకున్నారు.  నౌకా దానిలో భాగంగానే అనేక రకాలైన పన్నుల భారాన్ని మోపారు. అయినా తట్టుకొని నిలబడింది ఇక్కడి పరిశ్రమ. కోరంగి ఓడ రేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్దిల్లేది. పన్నులకంటే మరింత పెద్ద దెబ్బతీయాలనుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బూచిని చూపి ఒక వెలుగు వెలుగుతున్న కొరంగి ఓడరేవుకు  ప్రత్యామ్నాయంగా విశాఖ పట్టణం ఓడరేవును సమాంతరంగా అభివృద్ధి చేసుకంటూ వచ్చారు.
మన దగ్గర నౌకా నిర్మాణం ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది తెలుసా?
అంతరించిన ఎన్నో ఆధారాలు కాలగర్భంలో కలసిపోగా అదృష్ట వశాత్తు భోజుడను రాజు రాసిన ‘యుక్తికల్పతరువు’ అనే నౌకానిర్మాణ శాస్త్ర వివరాలను విపులంగాచర్చించిన పుస్తకం దొరికింది. ప్రధానంగా దానిలో నౌకా లక్షణాలు, రకాల, నిర్మాణ రీతులు, పరిమాణ రీత్యా వేర్వేరుగా ఎలా నిర్మించాలి ఎందుకు నిర్మించాలి ఓడల నిర్మాణానికి అనువైన కలప జాతుల గురించి, సముద్ర ప్రమాధాలను తట్టకునేందుకు ఎటువంటి మార్పులు చేయాలి. యుద్ధనౌకలలో ఎటువంటి అమరికలు వుండాలి వంటివి చర్చించారు. మచ్చుకు కొన్ని చూస్తే నౌకల పరిమాణము ఉపయోగం వంటివాటిని దృష్టిలో వుంచుకుని ‘సామాన్య’ ఓడలు, ‘విశేష’ ఓడలు అని విభజించారు. సముద్ర ప్రయాణానికి విశేష నౌకలు బాగాఉపయోగపడతాయన్నారు. సామాన్య ఓడలలో ఉపతరగతులుగా క్షుద్ర, మధ్యమ,భీమ, చపల, పటల, భయ, ధీర్ఘ, పత్రపుట, గర్భర, మందర యని పది విధాల నౌకలను గురించి విపులంగాచర్చించారు. వీటిలో ఏవి దేనికి అనుకూలమో, ఏవి తక్కువ ఖర్చులతో సులభంగా తయారుచేసుకోవచ్చో అటువంటి వాటిలో ఏయే బలహీనతలుంటాయి అనేవి చర్చించటం వీరి లోతైన పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక. ఇక రెండవ రకమైన విశేష జాతి నౌకలలో దీర్ఘములని, ఉన్నతములని రెండు ముఖ్య ఉపవర్గాలు, దీర్ఘ జాతిలో దీర్ఘిక, తారిణీ, లోల, గత్వరా, గామినీ, తరీ, జంఘాలా, ప్లావినీ, ధారిణీ, వేగినీ అనేవి వుంటాయి. ఉన్నత తరగతిలో ఊర్ద్వ, అనూర్ధ్వ, స్వరముఖీ, గర్భిణీ,మంధరా, యనేవి చెప్పారు. అలంకరణ కోసం బంగారము, వెండి, రాగి ఈ మూడింటి క్రమ మిశ్రమ లోహము మంచిదని చెప్పారు. నాలుగు కొయ్యల ఓడలకు తెల్లరంగు, మూడు కొయ్యల ఓడకు ఎర్ర రంగు రెండు కొయ్యల ఓడకు పచ్చరంగు, ఒంటికొయ్య ఓడకు నీలం రంగు వేయటం మంచిది అన్నారు. మరి నీటిలోతుల్లోకి వెళ్ళే వాటికి దూరంగా కనబడటం వంటి విషయాలను పరిగణలోనికి తీసుకున్నారా లేదా అనేది పరిశోధకులు పరిశీలిస్తే బావుంటుంది. నౌకల ముందు భాగంను బట్టి సింహ, మహిష, నాగ, గజ, వ్యాఘ్ర, పక్షి, భేక, మనుష్య పేర్లతో పిలిచారు. లోపట వుండే యాత్రికుల సౌకర్యాల కోసం ఏమేం ఏర్పాట్లుచేయాలో చర్చించారు. ఓడలను సర్వ మందిరములని, అగ్రమందిరములనీ, మధ్య మందిరములని విభజించారు. ఇలా ఎన్నో విశేషాంశాలలో మనవారి సూక్షపరిశీలన గమనిస్తే ఓడల నిర్మాణంలో ప్రపంచాన్ని భయపెట్టేంత గొప్పగా మనం ఎలా వున్నామో అర్ధం అవుతుంది. అందుకే బ్రిటీష్ వారు మన ఓడలపై భయంతో కూడిన ఈర్షను ప్రదర్శించారు.
ప్రకృతి వైపరీత్యాలను నిబ్బరంగా తట్టుకుని నిలబడ్డ కొరంగీకి వీళ్ళ మత్సరం మరింత ఇబ్బంది పెట్టింది.  1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహాతుఫాను ధాటికి కోరంగి అల్లకల్లోలం అయిపోయింది. దాదాపు 20 వేల మంది మరణించారు.. ఇక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు.. అయినా క్రమంగా కోలుకొని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు. కానీ 1839లో నవంబర్ 25 తేదీన మరో మహా ఉత్పాతం ముంచుకు వచ్చింది. అనుకోకుండా విరుచుకు పడిన 40 అడుగుల అలలు ఊళ్ళమీదకు మహా వేగంగా దూసుకు వచ్చాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇల్లువాకిలి వదిలేసయినా పారిపోయే అవకాశంలేక 3 లక్షల 25వేలకు పైగా జనాలు మూకుమ్మడిగా ఆ జల ప్రళయంలో సజీవ సమాధి అయ్యారు. గొడ్డుగోడా నామరూపాల్లేకుండా పోయాయి. తయారై ప్రయాణానికి సిద్దంగా వున్న అనేక ఓడలు ఎక్కడికి పోయాయో ఎలా శిధిలం అయ్యాయో వాటిలో సరుకేమయ్యిందో ఇప్పటికీ  నీళ్ల అడుగునా ఈ 150 ఏళ్ళ కాలంలో కనీసం ఆనవాళ్ళతో నయినా వుందో లేదో తెలియదు.  అది చిన్ని తుఫాను కాదు ప్రపంచంలో సంభవించిన అతి పెద్ద తుఫానులను వరసలో పేర్చి చూస్తే మూడవ అతి పెద్ద తుఫాను. అసలు తుఫానుకే సైక్లోన్ అనే పేరు పెట్టేందుకు కారణం అయినా చారిత్రక మహా ఉత్పాతం ఆ తుఫాను. ఆంగ్లభాషలో తుఫానుకు సమానపదమైన సైక్లోన్ను బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారి అయిన హెన్రీ పిడ్డింగ్టన్ 1789 డిసెంబరులో కోరంగిని ముంచెత్తిన ఈ పెనుతుఫానును వర్ణించడానికి కనిపెట్టాడంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. కోరంగి నగరాన్ని దాదాపు మొత్తంగా బతికుండగానే భూమిలోకో జలగర్భంలోకో సమాధీ చేసిన సంఘటన అది.  దాని తర్వాత కూడా కోరంగి పై ప్రకృతి కక్ష తీరలేదు కావచ్చు ఇప్పటికీ గోదావరి నుంచి వచ్చే ఇసుకతో కొద్ది కొద్దిగా పూడుకుంటూ వస్తోంది. ఈ మధ్య నాసా వారి అంచనాల ప్రకారం కూడా కాకినాడ నగరం జలవిపత్తులలో నామరూపాలు లేకుండా పోగల అవకాశ వున్న మరో ద్వారక అని చెప్తోంది.

కొరంగికి ఆ పేరు ఎందుకు వచ్చింది?
కోరింగ గ్రామము ఒక మూలాగ్రము (కేప్) పై వుండటం వలన ఈ పేరు వచ్చివుండొచ్చని పొట్టంగి, బాడంగి, మేరంగి లలాగా అంగి పత్యయాన్ని జతచేసుకున్న ఒకానొక ఊరు అనేది ఒక కథనం.
బౌద్ధ జాతక కథలలో దంతపురమనే నగరానికి సంభందించిన కథలు అనేకం వున్నాయి. ఆంధ్రదేశంలో అది ఒక నదీ ముఖ ద్వారంలో వున్ననగరం అని, అది ఒకప్పుడు కళింగదేశమునకు రాజధానిగా వున్నదని దంతపురము పై వర్ణనలు వున్నాయి. అయితే ఆ కాలములో రాజమహేంద్ర వరమే దంతపురం కావచ్చని కన్నింగ్ హం అభిప్రాయ పడినాడు. కానీ అతని అభిప్రాయాన్ని పెర్గూసన్ పండితుడు అంగీకరించలేదు. గోదావరి ముఖద్వారములో వుండటం ప్రసిద్ద నౌకాశ్రయం అయివుండటం అనే లక్షణాలు కోరంగికి లేదా దాని దగ్గరలోని మరేదైనా అప్పటి నగరానికి సంభందించినవై వుండవచ్చు. పెరిప్లస్ అనే గ్రంధాన్ని రాసిన హిప్పాలస్ కూడా గోదావరి ముఖద్వారమున ఒక ప్రముఖ రేపుపట్టనం వుందని చెప్పాడు కానీ దాని పేరు చెప్పలేదు. ప్లినీ అనే చరిత్ర కారుడు దంతపురమును ‘దండాగుల’ అని చెప్పాడు. అది గంగానది ముఖ ద్వారము వరకూ ఆ కాలపు కొలత ప్రకారం 625 రోమను మైళ్ళ దూరము. అనగా 574 మైళ్ళ దూరమున దక్షిణముగా ఒక మహా నదీ ముఖ ద్వారంలో కొరి యగ్రము(Cape Cori) అని చెప్పాడు. ఈ కోరి అను పేరే ఈ కాలంలో కోరంగి గా రూపాంతరం చెంది వుండవచ్చు. ప్లినీ గోదావరి నదిని కూడా గొయరిస్ అని పేర్కొన్నాడు. గోదావరి సమీపంలో ఇప్పుడు దొంతికుఱ్ఱు అనే గ్రామం వుంది బహుశా అది ఆకాలములో దంతపురమనే పేరుతో విలసిల్లిన నగరం అయి వుండొచ్చు.ఇప్పటికీ నూతులు, చెరువులు, లోతుగా ఇండ్ల పునాదులు తీసినప్పుడు ప్రాచీన కట్టడాల ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి. దానివల్ల కాలగర్భంలో పూడ్చుకుపోయిన మహానగరం ఒకటి ఈ ప్రాంతంలో వుండివుండొచ్చని ఊహించవచ్చు. ఇక్కడ చెప్పుకునే స్థల పురాణం ప్రకారం దంతాసురుడనే రాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో ఒక పెద్ద ఉప్పెన వచ్చి నగరం అంతా దిబ్బయిపోయిందని దానిలోనే అనేక దేవాలయములు, విహారములు, సౌధములు పూడ్చుకుపోయివుంటాయి అని భావిస్తున్నారు.

అయితే కొరింగ అనే తెలుగు మాట ను జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రాంత ప్రాముఖ్యతను బట్టి చూస్తే గ్రామ నామం వెనక మరో కారణం నాకు కనిపిస్తోంది. తెలుగు నైఘంటిక అర్ధాన్ని చూస్తే కొరంగి లేదా కోరజ్గీ అనే మాటకు చిట్టి యాలుక్కాయ, లేదా సన్న యాలుక కాయ అని అంటే ఆంగ్లంలో Cardmom అనే మనకి బాగా తెలిసిన సుగంధ ద్రవ్యం. ఆ ఎగుమతుల ఎక్కువగా జరగటం వల్ల ఆ వాసనలు గ్రామంలో నిండటం వల్ల కోరింగ పేరు వచ్చివుంటుంది అనికూడా ఊహించవచ్చు అనుకుంటున్నాను.
ఏమిటీ యాలుకల ప్రత్యేకత ?
అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీ తోను, మిగిలిన దేశాలలో తేయాకుతోను కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయిలు, కేకులు, పేస్ట్రీలు మొదలైన పదార్ధాలలో సువాసన కోసం ఏలకులను వాడతారు. భారతదేశంలో కూరలు, వంటలలో మసాలా దినుసుగా కూడా వాడతాము. సుగంధ ద్రవ్యాలను ఇక్కడనుంచి చేసే ఎగుమతులలో ఈ యాలుకల పాత్ర చాలా ఎక్కువ వుండటంతో ఆ వాసన ఊరంతా వ్యాపించి వుండటంతో ఇది బహుశా కొరంగీ గా పిలవబడి వుంటుందేమో అనిపిస్తోంది నామట్టుకు. అప్పుడప్పుడు టీలోనో లేదా ఫాన్ సుఫారీలోనో కొంచెం వేసుకునే యాలుక్కాయకు ఇంత వాణిజ్య ప్రత్యేకత వుందా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రాచీన కాలంనుంచి ఇవి ప్రధాన వాణిజ్యవస్తువులు వీటి కారణంగా జరిగిన యుద్దాలే వున్నాయి చరిత్రలో. పచ్చఏలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా (Elettaria) మరియు నల్ల ఏలకుల శాస్త్రీయ నామం అమెమం (Amomum). ఏలకులు పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వ శతాబ్దంలో శుశ్రుతుడు రాసిన చరక సంహితం లోను, 4వ శతాబ్దంలో  కౌటిల్యుడు  రాసిన అర్ధశాస్త్రం లోను వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించినది బ్రిటిష్ వారు.
యాలకులు అనాదిగా ఆయుర్వేద శాస్త్రీయ వైద్యవిధానంలో వాడకంలో ఉన్నట్టు కరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వీటినుండి తయారైన ఇలాదికర్న, ఇలాదివతి, ఇలాదిక్వత, ఇలాదిమొదక, ఇలాద్యారిష్ట, శీతోఫలాదికర్న, అరవిందసవ వంటి ఔషధాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
 దక్షిణ భారతదేశం లోని నీలగిరి కొండలు ఏలకుల జన్మస్థానం. కాని ఇప్పుడు ఇవి శ్రీలంక, బర్మా, గ్వాటిమాల, భారత్, చైనా, టాంజానియా లలో పండించబడుతున్నది. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదయిన సుగంధ ద్రవ్యం ఏలకులు. గ్రీకులు, రోమన్లు వీటిని అత్తరుగా వాడేవారు. భారత దేశపు ఏలకులు అత్యుత్తమమైనవి . మన దేశంలో పండించచే ఏలకులలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవి, మలబార్ ఏలకులు మరియు మైసూరు ఏలకులు. ప్రపంచంలో యాలకులు అత్యధికంగా పండించేది భారతదేశం. కాని అధిక శాతం యాలకులను దేశీయంగానే ఉపయోగిస్తారు. గ్వాతిమాలాలో మాత్రం వాణిజ్యపరంగా సాగు చేస్తారు.
యాలకులు దుంపలు, విత్తనాల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ముందుగా విత్తనాలు నారుపోసి ఎదిగిన తర్వాత పొలంలో నాటుకోవాలి. మలబారు రకాలను 1.8 మీటర్ల దూరంలోను, మైసూర్ రకాలను 3 మీటర్ల దూరంలోను నాటుకోవాలి. యాలకులు 1400 నుంచి 1500 మి.మీ. వర్షపాతంగల ప్రాంతాలలో బాగా పండుతుంది. సారవంతమైన అడవి రేగడి నేలలు దీని సాగుకు అనుకూలం. యాలకులు పండించే భూమికి విధిగా మురుగునీటి సదుపాయం ఉండాలి. ఎందుకంటే ఈ పంట నీటి ముంపును తట్టుకోలేదు. వీటి మొక్క పొద లాగ 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్రమట్టానికి 800 నుండి 1500 మీటర్ల ఎత్తులో తేమ, వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా గాని, కణుపుల ద్వారా గాని పెంచవచ్చు. నాటిన 3 సంవత్సరాల తరువాత ఈ మొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్ర సహాయంతో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని వేరుచెసి గ్రేడ్ చేస్తారు. ఆకుపచ్చనివి అన్నింటి కన్నా ఉత్తమమైనవి. బహుశా అటువంటి ఉత్తమమైన యాలుకలను ఇక్కడినుంచి ఎగుమతి చేసేవారేమో అనుకోవడానికి ఈ పేరు మాత్రమే మనకు ప్రస్తుతం దొరుకుతున్న ఆధారం. మరేవైనా రికార్డులు ఈ విషయాన్న నిర్ధారిస్తాయేమో పరిశీలించాల్సివుంది.

పాతకోరంగి కొత్త కోరంగి
ప్రస్తుతం కోరంగి నదికి తూర్పు తీరాన ఉన్న కోరంగి పట్టణాన్ని 1759 ప్రాంతములో ఇంజరం రెసిడెంటు వెస్ట్‌కాట్ నిర్మింపజేశాడు. పశ్చిమ తీరములో నదికి ఆవలివైపు ఉన్న పాత కోరంగి దీనికంటే పురాతనమైనది. కోరంగిలో మొదట డచ్చివారు స్థావరమేర్పరచుకున్నారు. నాటి కోరంగిలో మొదట డచ్చివారు తమ స్థావరం ఏర్పరచుకున్నారు1759 సంలో బ్రిటీషువారు ఆనాటి కోరంగిని చేజిక్కించుకొని అక్కడికి దక్షిణాన 5 మైళ్ళ దూరములో ఇంజరం వద్ద ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.1827లో ఫ్యాక్టరీ మూతపడ్డది. ఫ్యాక్టరీ మూతవేసేవరకు ఇంజరంలో ఒక బ్రిటీషు వాణిజ్య రెసిడెంటు మరియు ఆయన సిబ్బంది ఉండేవారు. కోరంగి  సమీపంలో తాళ్లరేవు దగ్గర క్రీ.శ1802 సంవత్సరములో ఎబెనీజా రోబెక్ అనే ఆంగ్లేయుడు చాలా పెద్ద మొత్తం ఖర్చుచేసి ఓడలు మరమత్తుచేసే ‘భోధి’ ని నిర్మింపజేసాడు. అందులో పద్నాలుగు అడుగులకంటే ఎక్కువ లోతు అవసరం లేని ఓడలకు మరమత్తులు చేసేవారు. 155 అడుగుల పొడవు, క్రింద 50 అడుగుల వెడల్పు పైన 76 అడుగుల వెడల్పు ఉన్న ‘అల్పట్రస్’ అనే బ్రిటీష్ యుద్ధ నౌకకు ఇక్కడనే మరమత్తులు చేసారట. ఈ బోధిలో ప్రవేశించిన తర్వాత మరమ్మత్తులకు అనుగుణంగా ఓడలోని నీళ్ళు అన్నీ నాలుగు గంటలలోగా తోడివేసేందుకు అనువుగా యంత్రాలు వుండేవట. తాళ్ళరోవు, కోరంగులు మంచి దశలో వున్న సమయంలో 500 ఓడలకు తక్కువ కాకుండా అక్కడ ఎప్పుడూ వుండేవట. ఈ ఓడలను రిపేరు చేసే అనేక బోధులు ఆ చుట్టుపక్కల వేర్వేరుగా ఏర్పాటు చేసివుండేవట. అయితే తర్వాత ఇసుక మేటలలో కనీసం తాడిఎత్తు అంత లోతులో ఈ పూర్తి భాగాలు పూడుకుపోయి ఇప్పుడు పైనున్న చిన్న రూపం మాత్రం మనకి కనిపిస్తోంది. ఇలా తాళ్ళరేవు, కోరంగులు ఇసుకమేటలలో కూరుకు పోయిన తర్వాత కొంతకాలము వరకూ ‘బెండమూర్లంక’ నౌకాశ్రయముగా పనిచేసిందట. కోరంగి సమీపంలోని యానాం, నీలపల్లి, ఇంజరము లు కూడా కొన్నాళ్ళు నౌకాశ్రయాలుగా వినియోగించబడ్డాయట. కాకినాడ రేపుపట్టణంగా పూర్తిస్థాయిలో అభివృద్ది చెందిన తర్వాత ఇది కూడా పూర్తిగా మూత పడిపోయింది. ఇంతకంటే విపులమైన ఆధారాలేవీ మనకు ప్రస్తుతం దొరకటం లేదు.
సప్త గోదావరి పాయల సంగమంగా....
తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమీ వృద్ధగౌతమీ
కౌశికీచ వశిష్ఠాచ తథా సాగరం గతాః


ఈ శ్లోకం సప్త గోదావరిగా పేరు స్థిరపడటం వెనక కారణమైన ఏడు గోదావరి శాఖలను సూచిస్తుంది. కోరంగి దగ్గరి రెండు శాఖల గురించి కొన్ని వివరాలు చెప్తాను.
తుల్యభాగ నదిగా చెప్పుకునే నదీ శాఖ మొదట జమదగ్ని మహర్షిదే అని కొందరి వాదన. తుల్యభాగుడనే మహర్షి గౌతమీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఎన్నో అవస్థలు పడ్డాడు. ఇసుక మేటలు వేసి ఇంకిపోయి నదిలో గోతులు తవ్వించి, వాటి నిండా పసుపు నింపుతాడు.
నీరు పచ్చగా మారుతుంటే ప్రవాహ సరళిని లెక్కవేసి, అనువైన దారి కల్పించి తుల్యభాగను ఉద్ధరిస్తాడు. ధవళేశ్వరం దగ్గర ప్రారంభమయ్యే తుల్యభాగా నది వేమగిరి, కడియం, జేగురుపాడు, అనపర్తి, పొలమూరు, రామచంద్రాపురం మీదుగా ప్రవహించి కాకినాడ సమీపంలోని చొల్లంగి వద్ద సోమేశ్వరుని సన్నిధిలో సముద్ర సంగమం చేయించాడు. సంతాన ప్రాప్తికి తుల్యభాగ స్నానం ఉత్తమమని నమ్ముతుంటారు.
అలాగే దంగేరు వద్ద ప్రారంభమై కోలంక, దుగదుర్రు, కాజులూరు గ్రామాలను దాటి కోరంగి దగ్గర కురుంగేశ్వరుని పాదాల వద్ద సముద్రంలో కలిసే గోదావరికి ఆత్రేయి అని పేరు. అత్రి మహర్షి కుమారుడైన ఆత్రేయుడు గౌతమీ తీరంలో చిరకాలం తపస్సు చేశాడు. తన తపశ్శక్తిని ధారపోసి, ఇంద్రుని స్వర్గం లాంటి మరో స్వర్గాన్ని నిర్మించుకున్నాడు. రాక్షసులు ఆ స్వర్గాన్ని కైవసం చేసుకోబోగా, దాన్ని ధ్వంసం చేసి తిరిగి నేలకు వస్తాడు. స్వర్గ నిర్మాణంలో కోల్పోయిన తపశ్శక్తిని ఆత్రేయుడు గౌతమీస్నానం వల్ల పొందాడు అనేది ఒక పౌరాణిక కథనం.

కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ( CORINGA WILD LIFE SANCTUARY)
దేశంలో పశ్చిమ బెంగాల్‌లోనున్న సుందర్‌బాన్ మడ అడవుల తరువాత కోరంగి మడ అడవులకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు అభయారణ్యం ఇది అరుదైన పక్షులు, జంతువులు, ఔషద గుణాలు కలిగిన అనేక విలువైన మొక్కలు, చాలా దట్టమైన పొదలు, చెట్లతో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. మడ అడవులకున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని 1998 సం లో 235.70 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వణ్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ 'చిత్తడి అడవులు ' కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరరుగుతాయి. అన్ని నదీ సాగర సంగమాలు చిత్తడి నేలలని ఏర్పరచవు. గంగాతీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని "సుందర వనాలు " మడ అడవుల తరువాతి స్థానం కోరంగి అభయారణ్యానిదే. అందంగా, గుబురుగా, దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోతనుంచి భూమిని రక్షించే పెట్టని కోటలుగా ఉన్నాయి.
 అరుదైన వృక్ష, జంతు,పక్షి జాతులు కలిగిన ఒక వైవిధ్యమైన తీర ప్రాంతంగా దీనిని గుర్తించారు. కోరంగి ప్రాంతం పక్షులకు ముఖ్య ఆహార ప్రదేశంగా, సంతానోత్పత్తికి ఎంతో అనువైన ప్రాంతంగా నెలకొనివుంది.ప్రతి శీతాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చే వలస పక్షులకు కోరంగి కేంద్రంగా మారింది. కోరంగిలోన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 10 రకాల ముఖ్యమైనట్టి నీటి పక్షులను గుర్తించారు.ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో 78 వేల నుండి 88 వేల వరకు పక్షులు ఆశ్రయం కోసం తరలివస్తుంటాయని ఒక అంచనా ,ఈ ప్రాంతం అరుదైన పక్షులకు ఒక ఆవాసంగా మారినట్టు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కూడా గుర్తించింది. ఇక్కడ పొన్న, మడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి వున్న ప్రాంతం. ఇక్కడ చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్కవంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షుల కిలకిలలు
కోరంగి అభయారణ్యం ఏటా 78 వేల నుంచి 88 వేల పక్షులకు ఆతిధ్యం ఇస్తోంది.. ఆ పక్షులకు ఆహార సేకరణతోపాటు సంతానోత్పత్తి కేంద్రంగా పేరుగాంచింది ఈ ప్రాంతం. ఈ పర్యటనలో పక్షుల కిలకిలారావాలు సందర్శకులను మంత్రముగ్దులను చేస్తాయి. వలస పక్షుల విడిది కేంద్రంగా ఉన్న కోరంగి ముఖ్యమైన పక్షి కేంద్రంగా, రాంసార్‌ ప్రదేశంగా బోంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ గుర్తించింది.  పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి,
 కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు గవురు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణీసైట్‌, స్పార్క్‌ కొంగలు, నాలుగు రకాల కింగ్‌ఫిషర్‌ పక్షులు ఇక్కడ కనిపిస్తాయి కాకపోవే వాటిని గమనించాలంటే బాగా ఉదయం సమయంలో కానీ సాయంత్రం వేళల్లో కానీ వెళ్ళాలి మేము కేవలం కాలిబాటలో నడుస్తూ మధ్యాహ్నం సమయంలో తిరగటం వల్ల పెద్దగా పక్షులేవీ కనిపించలేదు.
 ఇకపొతే అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సందర్శకులు పర్యటించేందుకు వీలుగా ఒక ఉడెన్ ట్రాక్ కూడా నిర్మించారు. తుల్యభాగ నదిలో బోటులో షికారు చేసెటి సదుపాయం కూడా కలదు.
తాళ్ళరేవు మండలంలోని కోరంగి తోపాటు పచ్చని పంటలతో చూడముచ్చట కొలిపేటి స్వచ్ఛమైన పల్లెటూర్లు ఇంజరం,ఉప్పంగల, చొల్లంగి పేట,చొల్లంగి, జార్జీపేట, జీ. వేమవరం నీలపల్లి,నేరేళ్ళంక,పటవల,పిల్లంక,మల్లవరం పొలెకుర్రు, లచ్చిపాలెం,సుంకరపాలెం ఇంకా మొదలైనవి చుట్టుపక్కల గ్రామాలు.

బోటు షికారు వుంటుందని ఆశపడ్డాం కానీ తాత్కాలికంగా నిలిపివేశారట.
గౌతమి నది ఉప్పుకయ్య లోని ఈ సుందరమైన మడ అడవులులో పడవల మీద  సముద్రం వరకూ సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అభయారణ్య పడవ రేవు నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పడవ సౌకర్యం ఉంటుందని. మనిషికి 50 రూ||లు ప్రవేశ ధరపై, రేవు నుంచి, సముద్ర ముఖద్వారం దాకా, పడవ లో, మడ అడవుల గుండా తీసుకు వెళ్తారు.  కనీసం 10 మంది ప్రయాణీకులు ఉంటే పడవ నడుపుతారు. లేదా తక్కువైన ప్రయాణీకుల రుసుము కూడా చెల్లించి, సముద్రముఖము వరకు పయనించవచ్చును. లాంటి వివరాలు ఆన్ లైన్లో చదువుకుని మేము అందరం కలిసి పాత లైటు హౌసు వరకూ వెళ్ళి రావాలనుకున్నాం కానీ కుదరలేదు. అన్నట్లు బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన పాత ద్వీసస్థంభం ఈ అడవి మధ్యలో వుంటుంది. దాన్ని స్థానికులు ‘బంకోలు’ అని పిలుస్తారు ఈ పేరుతో ఒక నవల కూడా గతంలో రిలీజ్ అయ్యింది. బంకోలు అంటే నిఘంటువు ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షపడ్డ ఖైదీలను ఒంటరిగా పంపే ద్వీప ప్రదేశం అని అర్ధం బహుశా దీన్ని అందుకు కూడా వాడి వుంటారేమో.
 ప్రయాణం సాధ్యపడివుంటే కోరంగి సుందర సముద్రతీరం (Beach) కూడా చూడగలిగేవాళ్ళం. దీపస్తంభ యాత్రీకులు తమతో ఆహారము మరియు నీటిని తీసుకు వెళ్ళాల్సిందే. Light-house వద్ద ఎలాంటి తినుబండారాలు లభించవు.
ఈ మడ ఆడవులలో దీపస్తంభం వెళ్ళలేని వారు పడవరేవు దగ్గర ఉన్న ఎత్తైన గోపురం (Watch Tower) పై నుంచి మడ అడవుల సౌందర్యాన్ని చూడొచ్చు. ఇంకా చూడవలసినవి చెక్కబాట (Boardwalk) మడ అడవుల చిత్తడి నేలపై మనం నడవటం ఏమాత్రం సాధ్యమయ్యే పనికాదు అందుకే ఏడెనిమిది అడుగుల ఎత్తులో రాళ్ళు లేదా సిమ్మెంటు స్థంభాలపై చెక్కలతో ఒక దారి ఏర్పాటు చేసారు. మడ అడవిలో నడిచేందుకు వీలుగా 572 మీటర్ల పొడవున్న చెక్క వంతెనతోపాటు ఇటీవల సుమారు రెండున్నర కిలోమీటర్లు మేర కొంత చెక్క వంతెనను నిర్మించారు.  ఇటువంటి దారిలో నడుస్తూ చుట్టూ వున్న మడ అడవిని దానిలోని జీవజాలాన్నీ పరిశీలించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి దాన్న మాటల్లో చెప్పలేం. ఔషద మొక్కలు, పక్షుల తెలిపే ఏర్పాటు చేశారు. అడుగడుగునా వాటి వివరాలు తెలిపే బోర్డులు దర్శనమిస్తాయి. ఇక మరో ఆకర్షణ కోరంగి తాళ్ళ వంతెన (Corangi Rope Bridge). ఇది కలకత్తాలోని హౌరా బ్రిడ్జిని పోలి వుంటుందట.

ఎలా వెళ్ళాలి?

కోరంగి వెళ్ళేందుకు ముందుగా కాకినాడ చేరుకోవాలి.  రాత్రి బస చేయాలి అంటే
 
కాకినాడలో ఉండాలి. అందుకు అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్స్‌ ఉన్నాయి. మేము మాత్రం రెండు పర్సనల్ ఇన్నోవా వాహనాలలో రావడంతో ఇలా బసచేయాల్సిన అవసరం కలగలేదు. సత్తుపల్లిలో ఉదయం ఆరుగంటలకు బయలుదేరి అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం రాజమండ్రి మీదుగా కాకినాడ వచ్చి అక్కడినుంచి ఈ కొరింగాకు సరాసరి చేరుకున్నాం.  విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్య నగరాలనుంచి కాకినాడకు రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సు, ఆటోలలో కోరంగి చేరుకోవచ్చు. కోరంగిలో తినడానికి అల్పాహారం దొరుకుతుంది. మొయిన్ రోడ్ నుంచి అభయారణ్యం వరకూ ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వుంటుంది. ఒకవేళ టాక్సీ బుక్ చేసుకుని వచ్చినా తిరుగు ప్రయాణంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు పట్టుకోవాలంటే రోడ్డు వరకూ నడుచుకుంటూ రావలసివందే అందుకే దానికోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం అవసరం.
మంచి భోజనం అంటే శాఖాహారానికి సుబ్బయ్య హోటల్ చాలా ప్రసిద్ది కదా ఆయన తమ్ముడు వాళ్ళు దగ్గరలోనే మరో భోజన హోటల్ కూడా అదే స్థాయిలో నడుపుతున్నారట. కానీ సీ ఫుడ్ తిని చూడాలనే కోరికతో వాకబు చేస్తే శ్రీనివాస వర్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, మీసాలరాయుడు (హోటల్ అశోక) ఇవి రెండూ బావుంటాయన్నారు. ఒక బ్యాచ్ ఇక్కడ మరో బ్యాచ్ అక్కడ భోంచేసాం. 1891 లో స్థాపించిన కోటయ్య స్వీట్స్ నుంచి కాకినాడ ఖాజాలను, భక్తాంజనేయా స్వీట్స్ నుంచి తాపేశ్వరం ఖాజాలను పిల్లల కోసం కొనుక్కొచ్చాం. YATI హోటల్ కూడా బావుంటుంది అన్నారు పరిశీలించడం కుదరలేదు.

కోటిపల్లి రైల్‌బస్‌ 
మనకి రైలు ప్రయాణం తెలుసు బస్సు ప్రయాణం తెలుసు కదా కానీ ఇక్కడ రైలు ట్రాక్ పై నడిచే బస్సు వుంది దాన్నే రైల్ బస్ అంటార. కోరంగి ప్రకృతి అందాలను చూసిన పర్యాటకులు తప్పకుండా చేయాల్సిన మరో ప్రయాణం కాకినాడ నుంచి కోటిపల్లి రైల్‌బస్‌ జర్నీ అట కానీ దీన్ని అందుకునే సమయం చాలలేదు. ఈ రైల్‌బస్‌లో చేసే ప్రయాణం పల్లె ప్రాంతం మధ్య సాగటం వల్ల పల్లె అందాలను ఆస్వాదించుకుంటూ తిరిగే అవకాశం వుండేది.  అంతేకాదు, ప్రయాణికులు చెయ్యి ఎత్తిన చోట ఈ బండి ఆగుతుంది. ఈ రైల్వేలైను 2004లో ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఒకే రైలు తిరుగుతుంది. అది కూడా ఒక్క ట్రిప్పే! రైలుకు ప్రతి మంగళవారం సెలవు. ఒకే ఒక్క పెట్టె ఉండే ఈ రైల్లో డెబ్బై మందికి పైగా ప్రయాణం చేయవచ్చు. రైలుతో పాటు ఆరుగురు సిబ్బంది వెళుతుంటారు. రామచంద్రాపురం, కోటిపల్లి స్టేషన్లలో స్టేషన్‌ మాస్టర్లు ఉంటారు. రైలు నడిపే డ్రైవర్‌తోపాటు, టిక్కెట్లు ఇచ్చేందుకు బుకింగ్‌ క్లర్క్‌, గేట్లు వేయడానికి, తీయడానికి మొబైల్‌ గేట్‌ మెన్‌, రైలుగార్డు, రైలుకు రిపేరు వస్తే చేసేందుకు ఇద్దరు మెకానిక్స్‌ కూడా ఉంటారు. దీనికి రానూ పోనూ ట్రిప్పుల ద్వారా వచ్చే రోజువారీ ఆదాయం చాలా తక్కువ 250 నుంచి 300 రూపాయలు మాత్రమే. నిర్వహణ ఖర్చు విషయానికి వస్తే... అప్‌ అండ్‌ డౌన్‌ ట్రిప్‌ లకు 2,500 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అయితే, రైల్వే శాఖకు ఈ రైలు భారమైనా, ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతులను పంచేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదట. అయితే దారిలో ఎలాంటి తినుబండారాలు దొరకవు. రైలు ఎక్కే ముందే మంచి నీళ్ళ నుంచి, స్నాక్స్‌ వరకూ ప్రిపేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
హోప్ ఐలండ్ [ 16.977°N 82.343°E. ]: కాకినాడ సముద్ర తీరానికి నాలుగు నాటికన్‌ మైళ్ల దూరంలో 18వ శతాబ్దం చివరి కాలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 146 చదరపు కిలోమీటర్ల అంటే 56 చదరపు మైళ్ళ దీవి ఇది. సముద్ర మట్టంకంటే ఎత్తుగా వుండే ఈ దీవి చూడటానికి పొడవుగా టాడ్ పోల్ ఆకారంలో వుంటుంది. సునామీ తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించేందుకు మాత్రమే కాకుండా తీరప్రాంతలో ఓడలు లంగరు వేసుకునేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందువల్లే తూర్పు తీరప్రాంతపు నౌకాశ్రయాలలో ప్రత్యేక రక్షణవున్న ప్రాంతంగా ఈ హోప్ ఐలండ్ ను భావిస్తారు.కొరింగా అభయారణ్యానికి అనుభంధంగా వున్న ఈ తీరంలో అనేక అరుదైన జీవజాతులు కాపాడబడుతున్నాయి వాటిలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు ముఖ్యమైనవి. 2016లో వేసిన లెక్కల ప్రకారం 482 ఆడతాబేళ్ళు హోప్ ఐలండ్లోని ఇసుక తెన్నెల  ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టాయి. ఇసుకలోని వీటి గుడ్లను ఇతర జంతువులన నుంచి మనుషులనుంచి రక్షించడానికి రక్షణ ఏర్పాట్లు కొన్నాళ్ళు చేసారు. అయినా అవి సమగ్రంగా పర్యవేక్షణ జరగటం లేదు. పైగా చేపలు పట్టడం కోసం వాడే మరబోట్ల హంగామా వల్ల అనేక ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు చచ్చిపోతున్నాయి. వాటి కళేబరాలు ఒడ్డుకు వచ్చి కనిపిస్తుంటాయి. ఈ ఐలండ్ నిర్మానుష్యంగా ఏమీ వుండదు. ఇక్కడ చేపలు పట్టుకుని జీవించే కొన్ని కుటుంబాలు రెండు హామ్లెట్లుగా వుంటున్నారు. అందులో ఒక హామ్లెట్ పేరు పుత్రయ్య పాకలు, రెండవ దానిపేరు సొర్లగొండు పాకలు. ఇవి కాక కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా వుంటాయి.
 కాకినాడకు సహజరక్షణగా ఉన్న హోప్ ఐలండ్ దీవికి పలుమార్లు తవ్వకాలతో ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడూ అలాగే జరుగుతోంది. నూట ఏభై ఏళ్లకు పూర్వమే ఏర్పడి.. తుఫాన్ల తాకిడి నుంచి కాకినాడ ప్రాంతానికి సహజంగా రక్షణ ఇస్తున్న హోప్‌ ఐలాండ్‌ను కాకినాడ సీపోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌) డ్రెడ్జింగ్ పనుల కోసం గ్రావెల్ ఇసుకను టన్నులకొద్ది తవ్వుకుంటూ వాడుకుంటోందట దానివల్ల భవిష్యత్తులో పెనుప్రమాదం సంభవిస్తుందని పర్యావరణవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సంచరించే అరుదైన జీవజాలానికి హోప్‌ ఐలండ్‌ తవ్వకాలతో తీరని ముప్పు వాటిల్లనుందని తీరప్రాంతాల జీవవైవిద్య పరిరక్షణు కృషిచేస్తున్నసంస్థలు వాపోతున్నాయి.

ఇద్దరు వ్యక్తులు
యానాం వెళదాం అనుకోవడంతో యానాం చరిత్రపై సాధికారిక రచనలు చేసిన ప్రముఖ కవి శ్రీ బొల్లోజు బాబా గారిని తప్పకుండా కలవాలి అనుకున్నాను. కోరంగి సందర్శన విషయంలో వారి సలహాలు తీసుకోవలసిందే అని నిర్ణయించుకున్నాను. ఇదే సంగతి సోదరుడు యశస్వి సతీష్ గారితో చెపితే బాబా గారితో పాటు మడ అడవులపై పరిశోధన చేసి తన యం ఫిల్ పత్ర సమర్పణ చేసిన సతీష్ గారి తమ్ముడు యర్రంశెట్టి రవిచంద్ YRL కళాశాలల అధిపతి గారిని కలవమని చెప్పటం తోపాటు వారితో మాట్లాడి నన్ను మా ట్రిప్ ని పరిచయం చేసారు. ఆయన సాదరంగా కాలేజికి రమ్మని అనేక విషయాలు చెప్పారు అసలు మడ అడవులు అంటే ఏమిటి అన్నదగ్గర నుంచి సముద్రంనుంచి రక్షణలో ఇవి ఎలా తోడ్పడతాయి. వాటిలోని జీవ వైవిధ్యం ఏమిటి ఎందుకు ఏర్పడింది అనే విషయాలు చెప్తూనే తన పరిశోధనాంశం అయిన ఉప్పినీటిని కునే జన్యు పరిశోధన గురించి దాన్ని వరికి అనువర్తనం చేయించడం వల్ల మంచి ఫలితాలు సాధించే యంయస్ స్వామినాధన్ రిసెర్చ్ సెంటర్ వారి పరిశోధనలో వారి భాగస్వామ్యం గురించి ఆయన రాసిన ఆర్టికల్స్ లోని అంశాలను చాలా ఓపికగా ప్రస్తావించారు. వారిచ్చిన సమాచారం తోపాటు సమోసా టీలతో దండిగా కొరింగాకు బయలు దేరాం. ఇక సాయంత్రం రిటర్న్ కంటే ముందు బొల్లొజు బాబాగారు స్వయంగా వచ్చారు. నిజానికి ఆయన గారితో కలిసి చాలా మట్లాడటమే కాదు, యానాంలో వారి పుస్తకంలో రాసిన చారిత్రక ప్రదేశాలలో వార సమక్షంలో కలిసి తిరిగాల్సివుంది. అప్పటికి కేవలం వారి ఆత్మీయతను అందుకుంటూ ఆయన ఇష్టంగా తెచ్చిచ్చిన స్వీట్స్ తీసుకుని రాత్రికి వెనుదిరిగాం.

సూచనలు
రోప్ వే నిర్మించగలిగితే మరింత అందంగా వుంటుంది ఏరియల్ వ్యూ లో హెలీ కాప్టర్ వంటి వాటితో పక్షులను చెదరగొడుతూ చేసే ప్రయాణం కంటే ఇది బావుంటుంది.
కోరంగి సహా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చిర్ర యానాంను కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట అవి అమలులోకి వస్తే బావుంటుంది.
కొన్ని ఉపయోగపడే లంకెలు
1)  కోరంగి ప్రకృతి అందాలను చూసిన పర్యాటకులు తప్పకుండా చేయాల్సిన మరో ప్రయాణం కాకినాడ నుంచి కోటిపల్లి రైల్‌బస్‌ జర్నీ ని ఈ విడియోలో చూడవచ్చు.
2)  సిరి సిరి మువ్వ చిత్రానికి గానూ వేటూరి రాసి కేవి మహదేవన్ స్వరపరచి కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వెలువడిన చిత్రంలో ఈ కోరంగి మాట ఇలా వస్తుంది.
జోర్సెయ్ బార్సెయ్ కోరంగి రేవుకై, కోటిపట్లి రేవుకై...
 ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ?
ఏ దారెటుపోతుందో ఎవరిని అడగక
వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ?
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ?
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై !
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై !
దాన్ని ఈక్రింది లింకులో చూడండి.


3) ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు తీసిన ఆశా జ్యోతిచిత్రానికి వేటురి గారు రాసిచ్చిన పడవ పాట లో కనిపించే కోరంగి వర్ణన
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది
కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గోరింక పడవ
4) కోరంగి రేవు నుంచి మారిషస్ వెళ్ళిన తెలుగువారు తమ జీవనం ఎలా గడిపారు. అక్కడి దేశ నిర్మాణానికి ఎలా తమ శాయశక్తులు దారపోసారు. ఎంత క్లిష్ట పరిస్థితులు వున్నతమ మాతృభాషను స్వీయ సంస్కృతినీ ఆచరవ్యవహారాలనూ కాపాడుకునేందుకు ఏమేం చేసేవారు అనే వివరాలు ఇతర ప్రాంతాలలోకి తెలుగువారి వలసలు వ్యధల వివరాలూ మండలి బుద్ద ప్రసాద్ గారు రచించిన మారిషస్ లో తెలుగు తేజం పుస్తకంలో చూడవచ్చు. ఉచిత పుస్తకం ఈ క్రిందిలింకులో వారు అందుబాటులో వుంచారు.
https://te.wikisource.org/wiki/మారిషస్‌లో_తెలుగు_తేజం 

5) According to the East Godavari district gazette, the Coringa port registered a total business of Rs. 8.2 lakh in 1877-78 and Rs. 3.2 lakh in 1880-81. Coir, homeopathy medicines, fibre, pulses, paddy and oils formed part of the exports, while cycles, motorcycles, iron ore, machinery, sugar and kerosene were the major imports at the port.

సాధు సుభ్రమణ్యశర్మ గారు రచించిన ‘బంకోలా’ నవలలో ఈ ప్రాంతపు జీవనవిధాన చిత్రణతో పాటు చారిత్రక వివరాలు వున్నాయి. పుస్తకం కినిగేలో కూడా అందుబాటులో వుంది. బంకోలా అనేది ఇక్కడి పాత దీప స్థంభాన్ని స్థానికులు పిలుచుకునే పేరు. జన్మఖైదు చేసిన వారిని పంపేద్వీపాంతరాన్ని బంకోలు అంటారని నిఘంటు అర్ధం.
1839 కొరింగా తుఫాను గురించిన వివరాలు
http://www.hurricanescience.org/history/storms/pre1900s/1839/
బ్రిటీష్ కాలంనాటి పాత దీపస్థంభం గురించి వ్యాసం ఈ దీప స్థంభాన్నే స్థానికులు ‘బంకోలి’ అని పిలుస్తారు.
http://kakinadaupdates.com/about-coringa-light-house/

కలకత్తా హౌరా బ్రిడ్జి తరహాలో సర్ ఆర్ధర్ కాటన్ 1889లో నిర్మించిన బ్రిడ్జి
కాళీమాతాలయం
హోప్ ఐలండ్
కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. మహాలక్ష్మీ పర్యాటకం, చొల్లంగిపేట వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.
పాకిస్తాన్ లో ఒక కోరంగి పేరుతో ఒక జిల్లా వుంది
Korangi Town is a town in the eastern parts of Karachi, Pakistan, south of the Malir River. It is bordered by Faisal Cantonment and Shah Faisal Town to the north, Bin Qasim and Landhi to the east and south, Korangi Cantonment to the southwest and Jamshed Town to the west across the Malir River. The population of Korangi Town was estimated to be about 550,000 at the 1998.No comments:

Post a Comment

ఫేస్ బుక్

Tweets

లంకెలు