Wednesday, 6 June 2018

వెండితెరపై అంతర్జాల అభిమన్యుడి గురించి

మీకు టచ్ ఫోన్ వుందా? ఎడా పెడా అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకుంటూ హా నాకేమి అవుతుందిలే అనుకుంటున్నారా?

మీ బ్యాంక్ అకౌంట్ ఆన్ లైన్ లో ఆపరేట్ చేస్తున్నారా? అబ్బే నేను భద్రమే సుమీ అని మురిసిపోతున్నారా?

వాడెవడో నా ఆధార్ వివరాలు కొట్టేస్టే ఏం పోతుంది నా గోచీ అని చులకనగా తీసేస్తున్నారా?

 జూన్ 1న రిలీజ్ అయిన అభిమన్యుడు (తమిళంలో ఇరంబు తిరై )ఒక్కసారి చూడండి.
కొన్ని నిర్లక్ష్యాలు పటాపంచలైపోయి కొన్ని భయాలు ధడేలుమంటూ పట్టుకుంటాయి.

సంధికాలంలో సందేహాలు సహజమే, శక్తివంతమైనదానిని స్వాధీనపరచుకునేప్పుడు శ్రమపడాల్సివస్తుంది నిజమే. అలాగే రాళ్ళు రప్పలు బిళ్లలు లోహాలు కాగితం కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీగా ఛలామణీ అవుతున్న శ్రమను దోచుకునే సరికొత్త విధానాలపై ఎమోషన్ కూడా షుగర్ కోట్ చేస్తూ అల్లుకున్న కథ అభిమన్యుడు.

పద్మవ్యూహం లోకి వెళ్ళడం వరకూ పుట్టకముందే బొడ్డూడక ముందే నేర్చుకున్న బుడ్డోడు అభిమన్యుడు కానీ వాడికి వెనక్కి తిరిగి రావడం మాత్రం తెలియక అంతమై పోయాడు. ఇవ్వాళ నెట్ కూడా కారుచౌకగా మారాక అంతర్జాలం అరచేతిలో తైతక్కలాడటం మొదలేసాక ఆ పదునైన అంచులను పిల్లాటలుగా ఆడేస్తున్నాం మరి ఈ నవీన అంతర్జాల అభిమాన్యులు దెబ్బతినకుండా బయటపడగలరా? సగం తెలిసి పద్మవ్యూహం లో మనం. నిర్లక్ష్యంగా ఏమరుపాటుగా వుంటే ఎంత ప్రమాదమో ఈ సినిమా హెచ్చరిస్తుంది. విలన్ అర్జున్ (హ్యాకర్ వైట్ డెవిల్) పదే పదే అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్  అవును మనకు హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎలాగో తెలుసు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఏమిటో కూడా బాగా తెలుసు కానీ సమాచారం కూడా సంపదే అనేదెలాగో ఇందులో చెపుతాడు. ఎక్కడంటే అక్కడ మనం నింపే లక్కీ డ్రా కూపన్లు ఏలా అమ్ముడవుతాయి. అప్పు వస్తుందనగానే గబా గబా ఇచ్చేసే మన వివరాలు ఎక్కడ డబ్బుగా మారతాయి,  కేవలం బోర్డింగ్ పాస్ లోని క్యూ ఆర్ కోడ్ ఎంత విలువైనదిగా మారుతుంది లాంటి విషయాలు మనల్ని విస్మయ పరుస్తాయి. సరే మొత్తంగా చెప్పిన కథ ఇదే అయినా దీనిలో సినిమాటిక్ అంశాలకూ కొరతేమీ లేదు.
సైకియాట్రిస్ట్ లక్ష్మీదేవిగా చేసిన సమాంతా ఎప్పటికంటే మరికొంచెం బావుంది. కర్ణ అనే పేరుగల సైనిక అధికారిగా విశాల్ కు ఇది ఛాలెంజింగ్ పాత్ర మొదట్లో కొంత సేపు నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఒక సంఘటనలా మొదలై  హఠాత్తుగా సెంటిమెంటల్ యాంగిలోకి తిరిగి యాక్షన్ థ్రిల్లర్ గా మలుపు తీసుకుంటుంది ఈ సినిమా. మొన్నటి రాజశేఖర్ గరుడ వేగ తరహాలోనే సాంకేతిక అంశాల సమాహారంగా నడిచినా ఏ స్థాయి పరిజ్ఠానం వున్నవారికి అంతమేకు అర్ధం అయ్యేలా కథనాన్ని జాగ్రత్తగా నడిపారు. కేవలం ఫోన్ వాడకమే తెలిస్తే, కేవలం ఏటియమ్ లో డబ్బులు డ్రా చేస్తే చాలులే అనుకునేవాళ్ళకు జాగ్రత్త అని మాత్రమే వినిపిస్తే డార్క్ నెట్ , టార్ బ్రౌజర్ వంటివి తెలిసిన వారికి మరింతగా అర్ధం అవుతుంది. పాటలు పెద్దగా బాగోలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు  ప్రాణం పోసింది కథనానికి తగ్గ మూడ్ తెప్పించడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా సక్సెస్ అయ్యింది. జార్జ్ సీ విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫి కూడా సినిమాకు పాజిటివ్ పాయింట్ మొదట్లో కొంచెం సాగదీతలా వుండి తమిళపు నేటివిటీ ఎక్కువగా కన్పించినా ఇంటర్వెల్ తర్వాత సినిమా ఉత్కంఠతను పెంచుకుంటూ సాగింది. విలన్ అర్జున్ హీరో విశాల్ మధ్య వచ్చే సన్నివేశాలు కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
నాకు సెల్ ఫోన్ మీద బోలెడంత పరిజ్ఞనం వుంది నాకేమిలే అనుకోవడానికి లేదు అత్యంత పాపులర్ అయిన ఫేస్ బుక్ నిర్వాహకుడే ఇటువంటి డార్క్ నెట్ హ్యాకర్లకు భయపడి తన ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్ ను పేపర్ టేప్ తో మూసివుంచుతాడు అవసరం అయినప్పుడు మాత్రమే వాటిని ఓపెన్ చేసి ఉపయోగిస్తాడు ఇక మనమెంత.

ప్రస్తుత అంతర్జాల కాలానికి అత్యంత అవసరమైన ఎవేర్ నెస్ డాక్యుమెంటరీలా అనిపించి సంతోషం వేసినా మరో సందేహం మైనస్ పాయింట్ లా నాకు అనిపించింది. ఈ సినిమా ఆన్ లైన్ ఆర్ధిక దోపిడీలను ఎంతగా భయపెడుతుందంటే ఇప్పటికే సేవింగ్ కోసం బ్యాకింగ్ ను నమ్మటం తగ్గిందనుకుటున్న సమయంలో ఈ సంఖ్య  ఈ సినిమా భయం వల్ల మరింత పెరుగుతుందేమో అనిపించేంతగా వుంది. అయినా భయమూ ఒకరకంగా మంచిదేనేమో అదనపు జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది.

Fb link

No comments:

Post a Comment

ఫేస్ బుక్

Tweets

లంకెలు