Saturday, 14 July 2018

థాయ్ ల్యాండ్ గుహ సంఘటనలో తలచుకోవలసిన వ్యక్తి : చాంతవాంగ్(Ekkapol Ake Chantawong)

#thaicaverescue

చాంతవాంగ్ థాయ్ ల్యాండ్ గుహ ప్రమాదంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి.  ఎరక్క లోపట దూరి ఇరుక్కుపోయిన చిట్టి పొట్టి పిల్లల సాకర్ టీం కి మన చాంతవాంగ్ ట్రైనర్. వాళ్ళ టీం పేరు కూడా తమాషాగా wild boars

25 ఏళ్ల కుర్రాడు చాంతవాంగ్ ను మొదట్లో అందరూ తెగతిట్టుకున్నారు. అంతబప్రమాదకరమైన నిషేధ నిషిద్ధ ప్రదేశానికి ముక్కుపచ్చలారని చిన్నారులని తీసుకెళ్లినందుకు తిట్టుకున్నారు. కానీ నిజాలు తెలుసు కుంటున్న కొద్దీ ఈ యువకుడు చాంతవాంగ్ పై అభిమానం ఆప్యాయత స్థాయి దాటి గౌరవం కలుగుతుంది.అంత చిమ్మ చీకటిలో, చిత్తడి బురదలో అన్నాళ్లు పిల్లలు బ్రతికేవున్నారంటే ఒకే ఒక కారణం పిల్లల కోడిలాగా ప్రాణాలు పణంగా పెట్టి తన ఆశల రెక్కల కింద దాచుకున్న అమ్మతనం నిండిన ఈ కుర్రాడే ముమ్మాటికీ కారణం. లేకపోతే ఆ చీకటికీ కంగారుకే హదలెత్తి చెల్లాచెదరై జీవితాలను కోల్పోయివుండేవారు.

చాంతవాంగ్  చాలా చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే అమ్మను కోల్పోయాడు. తల్లిప్రేమ చవిచూడకుండానే పెరుగుతున్న ఇతడు తన 10 ఏళ్ల వయసుకే కన్న తండ్రిని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత అల్లరిచిల్లరగా తిరిగి బజారులో పడకుండా. బౌద్ధ సాధువులతో కలిసి ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నాడు. Monk గా జీవనం గడిపాడు. అలా 10 ఏళ్ళు గడిచాక సంఘం శరణం గచ్ఛామి అనుకున్నాడో ఏమో. సమాజాసేవకుడిగా అనేక పనులు తలకెత్తుకున్నాడు. సుదీర్ఘ ధ్యానం, పర్వతారోహణ (ట్రెక్కింగ్) సంచార జీవనం వంటి జీవన నైపుణ్యాలలో మంచి పట్టువున్న ఈ యువకుడు చిన్నపిల్లలపై ఉన్న మమకారంతో కేవలం కొద్దీ మొత్తం స్టైఫండ్ తో వీళ్లకు సాకర్ లో శిక్షణ కూడా ఇస్తున్నాడు. పిల్లలతో వారిలో ఒకడిగా కలిసిపోతూ ఆడుకుంటూ సాలహాలిస్తూ కొనసాగుతున్నాడు. శిక్షణ సమయంలోను ఎంతో సహనంగా ఉంటాడని, వెనకబడిన పిల్లలకు సైతం ఊతం ఇచ్చి ఉత్సాహపరుస్తాడాని మంచి పేరు ఉంది. అసలు ఆ గుహలోకి పిల్లలు వెళ్ళాక ఇతడు వెళ్లాడా? అందరూ కలిసి వెళ్ళారా? ఇంకెదన్న తప్పని సరి కారణం ఉందా అనేది ఇంకా తెలియదు. కానీ గుహలో ఇతడు పిల్లలను ప్రాణానికి ప్రాణంగా కాదు ప్రాణాలనే ఫణంగా పెట్టి కాపాడుకున్న విధానం మాత్రం తెలిసింది.
మానసికంగా పిల్లలు కుంగిపోకుండా ఎంత గుండె ధైర్యాన్ని ఇతడు అందిస్తే వాళ్ళు బెంబేలెత్తకుండా అలా వుండగలిగారు? ఉన్న కొద్దీ ఆహారాన్ని కనీసం తను ఏమీ ముట్టకుండా కొంచెం కొంచెంగా అందరికీ అందిస్తూ వాళ్ళని కాపాడుకుంటూ రావాలంటే అతని మనసులో ఎంత అమ్మతనం నిండివుండాలి? వాళ్ళకి చర్మవ్యాధులు పెరిగిపోకుండా? కనీస పరిశుభ్రత పడవకుండా పన్నెండు మందిని కాచుకోవాలంటే ఎంత సహనం ఉండాలి?

ఇతడు గుహలో ఉండగా సహాయక సిబ్బంది చేత పంపిన ఉత్తరం కూడా ఇతని మానసిక ఔన్నత్యాన్ని తెలియజేసేదిగా ఉంది. తల్లిదండ్రులారా జరిగిన సంఘటన విషయంలో మిమ్మల్ని మీరు నిందించుకోకండి. నేను మీ పిల్లల విషయంలో నాకు ఓపినంత రక్షణ చేస్తున్నాను. ఇప్పుడు రక్షక దళాలు కూడా రంగంలోకి దిగాయి. వారు తప్పకుండా కాపాడబడతారు మీరు నిబ్బరంగా ఉండండి అనేది దానిలోని సారాంశం. ఇది చాలదా అతని గురించి చెప్పడానికి. పిల్లలు అందరూ బయటికి వచ్చాక చివరికి అతడు వచ్చాడు. రక్షక దళాలు చూసే సమయానికి ఆ పిల్లలకంటే అత్యంత బలహీనంగా ఉన్నది ఇతదేనట కారణం పిల్లలకు సరిపోదని ఆహారంలో తన వాటా తీసుకోకపోవడం. అందరికీ ధైర్యం చెపుతూ మొత్తం వత్తిడిని తనపై వేసుకోవడం. బహుశా స్వంత తల్లిదండ్రులే పిల్లలతో తోడుగా ఉన్నాసరే ఇంతటి త్యాగం చేయగలిగిన ఇంతటి వ్యవహార దక్షత చూపలేకపోయేవారేమో!!

మెచ్చుకోళ్లు మాట ఏమో కానీ ఇతన్ని అపార్థం చేసుకోలేదు సంతోషం. అవార్డులు సంగతి ఏమో కానీ ఇంతవరకు ఏ దేశపు పౌరసత్య పొడలేకపోయిన ఇతనికి ఆ పాస్ పోర్ట్ అయినా దొరికితే అతని అనితర సాధ్యమైన శ్రమకు మానసిక ధైర్యానికి గుర్తింపు ప్రోత్సాహం అందజేయటమే కాక సాకర్ టీం కు పూర్తి స్థాయి శిక్షకుడు కాగలుగుతాడు.
ఫేస్ బుక్ లంకె

No comments:

Post a Comment

ఫేస్ బుక్

Tweets

లంకెలు