తోలుపడవలో తోడులేని ప్రయాణం


ఉపోద్ఘాతం

వీలుచూసుకుని రాసేది కాదు చేసుకుని రాసేదే వీలునామా.

1.
ఒక్కోసారి
చీకటి దిగులు కమ్ముకుంటుంది.
అనుకున్నవన్నీ పూర్తయ్యేంత వరకూ
నేనీ దేహంలోనే నివాసం ఉంటానా అని
అలా చీకట్లో దూరంగా నక్షత్రాలవైపు చూస్తుంటే
శూన్య శబ్దం ఒకటి చెవులో గింగురులు తిరుగుతూ సమాధానం చెపుతుంది
వెలుతురు పంచే నీ దేహమొక్కటే దీపం కాదు
వత్తి వున్నంతసేపూ డ్యూటీ చేసివూరుకో తరువాతి శృంఖలమదే తనపని తానే చేసుకుంటూ పోతుందని
చెవిపై మూసిన శంఖంలా లోపటిదో బయటిదో తెలియని నాదం నినదిస్తూనే వుంటుంది.

2.
మరోసారి
వెలుతురు వేడి బైర్లు కమ్ముతూ ఉక్కపోత ముంచుకొస్తుంది.
అవసరమైనదానికంటే ఎక్కువ బతికేస్తున్నామేమో
ఉన్న ఆహారాన్నే శరీరం గుండా చక్రం తిప్పుతూ
పగలూ రాత్రుల చక్రపుసుడిలోదేహాన్నే డొల్లగా తిప్పుతూ
పుల్లాపుడకా రంగుకాగితాలూ ఏరుకోవడమే ఆశయం అనుకుంటూ డొర్లిస్తూ వెళుతున్నానా అని
నకనక లాడే వేడిలో మధ్యాహ్నపు సూర్యుడివైపు చూస్తాను.
వచ్చే సాయంత్రం చల్లగా వుంటుంది పదే పదే పరుగెత్తడమే కాదు కొంచె సాంత్వనపడితేనే కొత్తదనం చిగురిస్తుంది అని చెపుతుంది.

3.
ఉన్నదేదో ఉన్నట్లు
కాదు కాదు
ఉన్నది మాత్రమే ఉన్నట్లు
ఖర్చుచేయట్లేదులే అనుకున్నంత మాత్రాన సమయం నిల్వలో అలా పడివుండే మారకద్రవ్యం కాదు.

4.
చేసిందే మిగిలినట్లు
కాదు కాదు
మిగిలేది చేస్తేనే మిగిలినట్లు
తోచిందో తోచందో చేసుకుంటూ పోతే
చేసిందంతా తలాతోకా తెలిసేలా తోచేపనిచేయదు.

5.
దిగులో గుబులో వదిలిపోతుంది వేదన కాదు
లోటో కొరతో భర్తీఅవుతుంది లోపం కాదు
ఉన్నకాస్తడొల్లనూ ప్రశ్నలతోనే నింపేస్తే జవాబులకు చొటెక్కడ?
అన్నీ జవాబులే నిండితే అవి దేనికి తగిలించాలో తెలియక తికమక గిలగిలలాడిపోతాయి.

6.
ఆరో అడుగు
పంచప్రాణాలనూ దాటుకుంటూ వచ్చాక
అర్దం అవుతుంటేనే నడకకు ఫలితం.
కొలిచేందుకు అసలిది కవితే కాదు.
లోపట వినిపించని గోలకు అక్షరాల రూపం.
అర్దం కాకూడదని రూలేం లేదు. అర్ధం అవ్వాలనీ లేదు
అవును మరి జీవితం అంటే అలాగే వుంటుంది.

09 – 03- 2018 (కృష్ణాష్టమి)


కామెంట్‌లు