కవిత్వం మనిషిని మృదువుగా మారుస్తుందా?



 యశస్వి సతీష్ గారి పరాం ప్రేయసీ పుస్తకంపై లేఖా రూప స్పందన ఇది


కవిత్వం మనిషిని మృదువుగా మారుస్తుందా?

సోదరా యశస్వీ మీ పరాం ప్రేయసీ చదివిన తర్వాత మూడు సందేహాలతో ఈ ఉత్తరం రాస్తున్నాను.
ఒకటి అంతా ఆన్ లైన్ అయిపోయిన తర్వాత పోస్టు డబ్బాలే కనిపించని రోజుల్లో ఇంకా ఉత్తారాలను చదివే వారు వుంటారా? రెండు నిజంగా మనతోనే వున్న మన సహచరిని ఇంతాలా ప్రేమించడం ప్రేమించారు పో కేవలం మనసులో దాచుకోకుండా బహిరంగంగా వ్యక్తం చేయడం సాధ్యమా? మూడోది చివర్లో చెపుతాను.
అనేక సందర్భాలలో కలిసి ప్రయాణం చేసిన వాళ్లం మీ వ్యక్తగత జీవితాన్నీ, రచనా ప్రస్తానాన్నీ, సామాజిక తపననూ గమనిస్తున్నవాడిని ఇదే పుస్తకం పేరు దగ్గరనుంచి పుస్తకం రూపు ఎలా వుండాలన్న దానివరకూ నిరంతరం ప్రశ్నలతో విసిగిస్తున్నవాడిని కొన్ని మాటలు పంచుకోకపోతే ఎలా మరి?
అప్పుడెప్పుడో రెండో శతాబ్దంలో నాగార్జునుడు తన మిత్రుడు యజ్ఞశ్రీకి రాసిన ‘‘సుహృల్లేఖ’’ కంటే ముందు ఏదన్నా లేఖలున్నా లేఖా సాహిత్యం వుందా? లేఖలో సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని కలిగే స్థాయి వుంటేనే వాటిని లేఖా సాహిత్యం అంటారట కదా. లేఖలకేం కరువు పావురాలు, పిట్టలూ వేగులూ వాటిని తెగచేరవేసే వారట కూడనూ. వాస్తవమైన వ్యక్తుల మధ్యనే అఖ్కర్లేదు ఊహాత్మక వ్యక్తుల మధ్య సంభాషణ ఇలా లేఖల రూపంలో జరిగినా దానికా ఔన్నత్యం వుంటే లేఖా సాహిత్యం సరసన కూర్చుంటుంది కదా. అభిజ్ఞాన శాకుంతలం, సూరన గారి ప్రభావతీ ప్రధ్యుమ్నమూ కాల్పనిక సాహిత్యంలో లేఖలను భలేగా వాడుకున్నారు కూడా. గుడిపాటి వెంకటాచలం ప్రేమలేఖలు, కనపర్తి వరలక్ష్మమ్మగారి శారదలేఖలు, కాటూరి వెంకటేశ్వరావుగారు తెలుగులోకి అనువదించిన నెహ్రూ లేఖలు, పురాణ రాఘవ శాస్త్రి గారు తెలుగీకరించిన శరత్ చంద్ర చటర్జీ లేఖలు మన లేఖా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవే కానీ వాటికీ మీ లేఖలకూ తేడాలు కూడా వున్నాయి. వాళ్లలో ఎవరూ సహచరిని యథాతధంగా ప్రేమిస్తూ జ్ఞాపకానికి కాక వ్యక్తికే రాసిన వారు కాదు. అందుకే నాకు ఇన్ని ఆశ్చర్యాలు. మెన్ననే మీరు పంపిన భోయి భీమన్న గారి జానపదుని జాబులు అక్కడక్కడా చదివి పోతగాని గారికి అందజేసాను. తిరుపతి వెంకట కవులూ, త్రిపురనేని గోపీ చంద్ లేఖలను సాహిత్యంగా మలచిన వారే కానీ ఆ లేఖలను అందజేసే పోస్టు మ్యాన్ కు రాసిన ఉత్తరం మన గుండెల్లో మోగించే తిలక్ రాసింది కూడా ఉత్తరమే కదా. కందుకూరి వీరేశలింగం మొదలు గురజాడ, ఆరుద్ర, కొడవటిగంటి, కె.వి. రమణారెడ్డి, బంగోరె, తదితరులెందరో లేఖా సాహిత్యానికి వన్నెలద్దారు సరే ఇదంతా చెపుతున్నాను కానీ ఈ లేఖా సాహిత్యం పై పరిశోధనలతో పి హెచ్ డీ చేసిన మలశ్రీ గారు మా ప్రాంత వాసే కదా.  మాటల మధ్యలో సిపి బ్రౌన్ ని తలచుకోకుండా ఎలా? బ్రౌన్ లేఖలు-ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శకలాలు పేరుతో ఎన్నెన్ని ముచ్చట్లు తెలుగు నేల తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాయి. కావచ్చు కానీ ఆయా లేఖా సాహిత్యాలకూ మీ లేఖలకూ మధ్య తేడాలు కూడా కనిపిస్తున్నాయి. చూస్తే అదేదో విస్తృత జనబహుళ్యానికి మహా ప్రయోజనం కోసం అన్నట్లుగా కాక పైపైన మీతో వున్న మీ సహచరి కి మాత్రమే రాసినట్లున్న లేఖలు లోపటి ప్రపంచాన్ని ఎక్కడా వదలకుండా ఎలా తడమగలిగాయి అసలు?

ఈ జ్ఞాపకాల లావా అక్షరమై రాకపోతే ఏమయ్యేదో కదా? ఎంతటి వేదన సోదరా నిజానికి ఇది ప్రస్తావించాల్సి వస్తుందనే నాలుగు ముక్కలు రాయడానికి తెగమారాం చేసాను. మీ మనసులో నిరంతరం మసలిపోయే లావాని ఎలా భరిచడం కుదిరింది అసలు? వైకల్యమో, అవకరమో అనలేం వ్యాకులత కూడా కాదు అదేమిటో వాస్తవ ప్రపంచంనుంచి విడివడి ఊహాప్రపంచంలో చిన్నారలా మారి తను సంతోషంగా వుందని సంబరపడుతున్నప్పుడు, మీ వాస్తవం కనిపించే కన్నీటీ ముత్యమై మెరిసినప్పుడు నేనే కళ్ళు తిప్పేసుకునే వాడిని. బుజ్జిగాడి పేరును రేపటి తరం వరకూ మిగిలేలా ప్రతిభకు వెలుపటి రూపం చేసి నిలిపేసారు. వాడికంటే చిన్నారిలా తనని ఉత్తరాల జెండాచేసి మీ జీవిత కాన్వాసుపై ఎగరేసారు. ఈ జ్ఞాపకాలు ఫోటోలుగా విడియోలుగా దాచుకుంటే సరపోయేవి కాదు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాల వరుసలుగా పేర్చడంతో తాపసికి కొంతైనా సాంత్వన లభించివుండాలి కదా. ఊహించండి మీ మనవళ్లో మనవరాళ్ళో వివాహ వ్యవస్థలు పునాదులే కోల్పోయాయి అనుకున్నరోజున ఈ నాలుగు అక్షరాలు చదువుకుంటే మీ మీద కాదు భారతీయ సంస్కృతి మీద ఎంత గౌరవం కలుగుతుందో తలచుకుంటే మీ శ్రమకు అప్పటికే అవార్డు వచ్చినంత ఆనందంగా నాకనిపిస్తోంది. అసలిదంతా కాదు మా అమ్మాయి శైలజ ఒకసారి మీ నిండు ప్రేమను అచ్చంగా అర్ధం చేసుకోగలిగేంత కోలుకుంటే మరెంత బావుండునో కదా అనిపిస్తుంది. ఇవి కేవలం మీ ఇద్దరి మాటలు కాదు మీ తెల్లటి మనసును ఒక ఉదాహరణలా చదువుకునేందుకు, బలహీనమౌతున్న ప్రేమదారాలను గట్టిగా పేనుకునేందుకు, పగుళ్ళుబారుతున్న నమ్మకాలను మీ గుండెలోపటి చెమ్మతో అతికించుకునేందుకు ఆధారాలు, ఆకరాలు ఇవి.
కవిత్వమే రాయడం వచ్చిన వ్యక్తి వచనం ఎంచుకోవడం ఏమిటా అనిపించింది కానీ కప్పిచెప్పే లక్షణం కవిత్వంలో చూపడం కూడా ఇష్టంలేక అస్పష్టత మనసుల మధ్య ప్రసారంలో ఉండొద్దనుకోవడం వల్ల టైం మిషన్ లో మీ గతకాలపు జ్ఞాపకాల్లోకి ప్రయాణం చేసి సరళంగా సహజంగా అప్పటి ఉద్వేగాన్ని ఒడిసి పట్టుకని అచ్చంగా అక్షరాల్లోకి వంపేప్రయత్నం చేసినట్లున్నారు. అయినా సరే కవి ఎక్కడికి పోతాడు. ప్రముఖ మిడియాలో మీ అనుభవం ఎక్కడికి పోతుంది. పుస్తకాలతోనూ, పుస్తకాలను మించిన మస్తకాలతోనూ చేస్తున్న మీ స్నేహపు విద్వత్తు ఎటు పోతుంది. కవిత్వమేమో అనిపించే ఉత్తరాలుగా మారాయి. పుప్పొడి పరిమళాన్ని అద్దుకున్న పసిడిలా మారాయి అందుకే ఇవి.
కవిత్వం మనిషిని మృదువుగా మార్చుతుందా? మృదుత్వాన్ని కలిగిన మనిషే కవిత్వాన్ని రాస్తారా? అనే సందేహం వుండేది గతంలో అసలు కవిత్వం అంటే రాసేది కాదు రాయడానికి ముందు చూసే కోణం అనేది మిమ్మల్ని మీ లాంటి మిత్రులను గమనించాక అర్ధం అయ్యింది. పువ్వు అందంగా వుంది అనిపించడం వెనక కారణం దాని రేకలను ఒక్కో ముక్క గా విడదీసుకుంటూ పోతే దొరకదు. దాన్ని అచ్చంగా అలాగే చూడటంలో మృదుత్వం ఏమిటో తెలిస్తే వుంటుంది. మీకు జీవితాన్ని సరళంగా చూడటం ఎలానో వంటబట్టింది. మనుషుల మధ్య ప్రేమను అల్లుకుంటూ పోవడంలో సంపద్వంతుడు కావడం ఎలానో తెలిసింది. ఇప్పుడు దాన్ని నలుగురికీ పంచేందుకు దారికూడా దొరికించుకున్నారు అభినందనలు. మీ ప్రయాణంలో ప్రమాదపు ఆపదని ప్రమోదంగా మార్చుకునే పరసువేది మీ స్వంతం చేసుకున్నారు. గిడసబారిన మరికొన్ని పాషాణాలను మొత్తబరిచే అక్షరాలు ఎన్నోగుండెల మీదుగా ప్రసరించాలని ఉవ్వెత్తున ఈ ఉద్వేగాలు ముంచెత్తెలా ప్రవహించాలనీ కోరుకుంటున్నాను.
ఉంటాను మరి
ఇంకేమిటి మూడో ప్రశ్నకోసం చూస్తున్నారా? బహుశా అడిగేసే వుంటానో లేదా ఇంకా అడగటం అవసరమా అనుకునో వుంటాను. ఇంకేమీ అడగాలని లేదు. పుస్తకం గుండా మనిషిని చదవాలనుకోవడం తప్ప.
ప్రేమతో
అన్నగా పిలిపించుకుంటున్నందుకు అత్యంత ఆనందపడే
కట్టా శ్రీనివాస్

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి