కొత్త తరానికి మరోసారి కాశీయాత్రా చరిత్ర

The world is a book and those who do not travel read only one page
Life is either a daring adventure or nothing at all
సమాజంలో బ్రతికే మనిషిగా దాన్ని అర్ధం చేసుకోవాలంటే వున్న మార్గం పుస్తకం అని భావిస్తాం కానీ దానికంటే ప్రామాణికమైనది మాత్రం అచ్చంగా సమాజంలోకి వెళ్ళడమేనని చాలా రుజువులు ప్రయోగపూర్వకంగా నిరూపించబడ్డాయి. పూర్వం రాజు కావాలంటే అర్హత దేశాటన అని చెప్పేవారు. రాజు అనే డబ్బు, హంగూ అర్భాటాలేవీ చూపకుండా జనంలో తిరిగివస్తేనే పట్టాభిషేకం అర్హత వుండేది. విక్రమార్కుడు లాంటి రాజులు కూడా కొంత కాలం దేశాటన కొంత కాలం రాజ్యపాలన చేసేవారని కథలు చెప్తుంటాయి. బుద్దుడు, జీసస్ మహమ్మద్ ప్రవక్త వంటి సమాజంపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు సైతం విస్త్రుతంగా సమాజంలో ఒకరుగా కలిసిపోయి తిరిగిన వారే. ఆ సారాంశాన్ని గందస్థంగా అందించారు వీరు. జగద్గురువుగా ప్రసిద్దులైన ఆదిశంకరాచార్యుడు కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ నాలుగు సార్లు కాలినడకన ప్రయాణం చేసాడని చెప్తారు. అప్పటెప్పటో టోలమీ నుంచి నిన్నమొన్నటి ఉదాహరణ వైయస్ రాజశేఖర్ రెడ్డిగారి పాదయాత్ర వరకూ అదే పద్దతి. ఎందరో విదేశీ స్వదేశీ యాత్రికులు వేర్వేరు ప్రాంతాలగుండా ప్రయాణం చేస్తూ పేర్కొన్న విషయాలను అప్పటి పరిస్థితులను అర్ధం చేసుకునే విషయాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి.

యాత్రికుడు (టూరిస్టు కాదు ట్రావెలర్) అంటే మనకి వోల్గానుంచి గంగాతీరం వరకూ అంటూ యాత్రను కథనంగా రాసిన రాహూల్ సాంకృతాయన్ (9 April 1893 – 14 April 1963) గుర్తొస్తారు కానీ ఆయనకంటే వందసంవత్సరాల ముందటి వాడు ఏనుగుల వీరాస్వామయ్యను (1780- 1836) అంతగా పట్టించుకోము. మరోసారి ఏనుగుల వీరస్వామి తిరిగిన దారిలో మళ్ళీ నడిచి పాత కథనంలోని సంక్లిషతను తొలగించి మనకి సరళంగా అందించడమే కాక, యాత్రారచనలో మూల ప్రతి సహాయం తీసుకుని మరెన్నో తప్పులను సరిదిద్ది మనకి అందిస్తున్నారు మాచవరపు ఆదినారాయణ గారు. వారిద్వారా పుస్తకం నిన్ననే చేతికి అందింది. మరిచిపోతున్న మనతెలుగువాడి గొప్పతనం అది చదువుతున్నంత సేపూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. దేశంలో కెమేరా వినియోగంలోకి రావడానికి (1850) కి ముందే, దేశంలో మొదటి రైలు కూతపెట్టడానికి (1853) ముందస్తుగానే, సూయజ్ కెనాల్ (1889) పనామా కెనాల్ (1914) తవ్వడానికి ముందే సుబ్బన్న దీక్షితులు(1868-1928) గారి ప్రఖ్యాత కాశీమజిలీ కథలకంటే 37 సంవత్సరాల ముందే కాశీ యాత్ర చేయడమే కాదు తనతో పాటు తన కుటుంబం మిత్రులు 100 మందికి అదే యాత్రావకాశం కల్పించిన వాడు. ప్రపంచంలో మరే యాత్ర జరగనంతగా పదిహేను నెలల పదిహేను రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అంతే కాదు ఆ యాత్రలో కేవలం ప్రయాణ విశేషాలు మాత్రమే కాక అప్పటి స్థితిగతులను అక్షరబద్దం చేసినవాడు ఏనుగుల వీరాస్వామయ్య. అయితే ఆయన జీవించి వుండగా తన పుస్తకం అచ్చుకు నోచుకోలేదు. ఒకవేళ అది అలాగే కాలగర్భంలో కలిసిపోయి వుంటే మనకి వీరస్వామయ్యదక్కేవాడు కాదు.
ఏనుగుల వీరాస్వామయ్యది తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబం. శ్రీవత్స గోత్రం. 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది. 12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టరు ఆఫీసులో ద్విభాషి(రెండు భాషలు తెలిసిన వాడు అనువాదకుడు) గా ఉద్యోగంలో కుదిరాడు. రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి, అనేక వ్యాపార సంస్థలలో పనిచేసాడు, బుక్‌ కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌ లో ఎకౌంటెంట్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిషు జడ్జీలకు ద్విభాషీలు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. ఈ అనుభావాలన్నింటి ఆధారంగా అప్పటిలో బ్రిటషు పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాల వలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిదొడ్ల దగ్గర ఒక నిజాయితీగా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.
సర్ రాల్ఫు ఫాల్మరు దొర, ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులో నున్ను, చేంబరులో నున్ను, అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప ఉద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగా జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతిచంద్రిక మొదలైన పుస్తకములకు అనువాదము చేసెననిన్ని, నేనెరిగినంతలో ప్రభుత్వవారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది. సరే ఇదంతా ఆయన గురించి సంక్షిప్త పరిచయం. ఇక కాశీ యాత్ర ఎలా మెదలేసారు ఏం చేసారు అనేది చూద్దాం.

కాశీ యాత్రా చరిత్ర.
కాశ్యాంతు మరణాన్ముక్తి అనే నానుడి వుంది. అదే స్పూర్తి ఏమో ఏనుగుల వీరాస్వామి గారు కూడా తప్పనిసరిగా కాశీ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అంతే కాదు రెగినాల్డ్ బిషప్ హెబర్ (1783-1826)అనే ఈస్టిండియా కంపెనీ మతాధికారి 1824-26 కాలంలో భారతదేశం అంతటా యాత్రను చేసి ఎప్పటి కప్పుడు ఆ యాత్రా వివరాలను తన మిత్రుడికి లేఖలుగా వ్రాసి వాటిని Bishop Hebor journal అనే పేరుతో పుస్తకంగా అచ్చువేయించాడు. ఇది తనకు స్పూర్తిగా పనిచేసిందని వీరస్వామి గారు చెప్పుకున్నారు. అదే పద్దతిలో తన ప్రయాణ విశేషాలను మిత్రుడు కే. శ్రీనివాస పిళ్ళై కు ఉత్తరాలుగా పంపేవాడు. దానికి అదనంగా కొంత సమాచారం డైరీలలో రాసుకునేవాడు. యాత్రముగిసిన తర్వాత ఉత్తరాలకు అదనంగా వున్న సమాచారం కూడ కలిపి కోర్టు కాగితాల సైజు లో 490 పేజీల పరిమాణంలో శుద్ధ ప్రతిని రాసి అచ్చుకోసం బ్రౌను దొరకు పంపాడు. కానీ దాన్ని చదివిన బ్రౌన్ ఎందుచేతనో అచ్చుకు పంపక ఓరియంటల్ లైబ్రరీకి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు.
1838 లో వీరాస్వామి గారు మరణించిన రెండేళ్ళ తర్వాత కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై తన దగ్గరి ఉత్తరాల సహాయం తీసుకుని పుస్తకంగా కాశీయాత్రా చరిత్రను మద్రాసు నుంచి అచ్చు వేయించారు. మళ్ళీ 1869లో ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం మద్రాసునుంచే పునర్ముద్రింపబడింది. 1941 లో విజయవాడ నుండి దిగవల్లి వేంకట శివరావు ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళంకలిసియున్న మాటలకు అర్ధములతో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. 1992లో ముక్తేవి లక్ష్మణరావు చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇప్పుడు ప్రత్యేకంగా యం ఆదినారాయణ గారు బ్రౌన్ దగ్గరకు చేరిన శుద్ధ ప్రతి ఆధారంగా దానిలోని వివిధ క్లిష్టతలను తొలగించి ఇప్పటి వాడుక భాషకు దగ్గరగా వుండేలా సంపాదకత్వం వహించి సరళీకరించారు.
Traveling – it leaves you speechless, then turns you into a storyteller

///////////////////////మరి ఈ పుస్తకంలో వున్న అంశాలు ఏమిటి? దానిలో తెలిసే విశేషాలు ఏమిటి?
 అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.
 ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగారు.
 అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశారు.
 విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశారు.
 కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించారు.
 పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించారు.
 హైదరాబాదు, శంషాబాద్, కంటోన్మెంట్ వంటి నేటి హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని నాటి జనజీవనం గురించి ఆయన రాసిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఇదే మే నెల లో ఆయ ప్రయాణం ప్రారంభం అయ్యింది ఏయే తేదీలలో ఏయే ప్రాంతాల గుండా ప్రయాణించారో సంక్షిప్తంగా ఈ చిట్టా చూడండి.
1830 మే నెల
1830 మే 18 - చెన్నపట్టణం
మే 19 - పాలవాయి సత్రం, మాధవరం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము)
మే 20 - తిరువళ్ళూరు
మే 21 - కనకమ్మ సత్రం (కార్వేటినగరం)(రామంజేరి మార్గం మీదుగా)
మే 22 - బుగ్గగుడి, పుత్తూరు (నగరి మీదుగా).
మే 23 - వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం
మే 23 నుంచి మే 30 వరకూ - తిరుపతి పట్టణంలో విడిది చేశారు. ఆ మధ్యలో ఒకనాడు తిరుమలను తిరుమల తిరుపతి పరిసరాల్లోని కొన్ని తీర్థాలను దర్శించారు.
మే 30 - కరకరంబాడు, శెట్టిగుంట, బాలపల్లె, కోడూరు
జూన్
జూన్ 1 - వోరంబాడు, పుల్లంపేట
జూన్ 2 - నందలూరు, అత్తిరాల
జూన్ 3 - భాకరాపేట, వొంటిమిట్ట
జూన్ 4 నుంచి జూన్ 6 వరకు - కడప
జూన్ 7 - పుష్పగిరి(చెయ్యేరు మీదుగా వెళ్లారు), కాజీపేట
జూన్ 8 - దువ్వూరు, వంగలి
జూన్ 9 - అహోబిళం
జూన్ 10 - శ్రీరంగాపురం, రుద్రవరము
జూన్ 11 - మహానంది, బండాతుకూరు
జూన్ 12 - వెలపనూరు, ఓంకారము, వెంపెంట
జూన్ 13 - ఆత్మకూరు
జూన్ 14 నుంచి జూన్ 15 వరకు - కృష్ణాపురంః, సిద్దాపురం, భీముని కొల్లము, నాగులోటి, పెద్దచెరువు(పెద్దచెరువు తక్క మిగిలినవి మజిలీలు కాదు. దారిన చూసిన గ్రామాలు)
జూన్ 16 నుంచి జూన్ 19 వరకు - శ్రీశైలము
జూన్ 19 - నందికుంట
జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం)
జూన్ 21 నుంచి జూన్ 24 వరకు - ముసలిమడుగు
జూన్ 24 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి
జూన్ 25 - పానగల్లు
జూన్ 26 - చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట(చోళపురం, మనోజీపేట మజిలీలు కాదు. గణపురం మార్గంలో తగిలే గ్రామాలు)
జూన్ 27 - జడచర్ల(జడ్చర్లకు మూలకర్ర, కోటూరు, ఆలూర్ తదితర గ్రామాల మీదుగా వెళ్ళారు)
జూన్ 28 - బాలనగరం(దీనికే నాగనపల్లె అని మరొకపేరు వ్రాశారు), జానంపేట (ఫరక్కునగరం)
జూన్ 29 – షాపురం
1831 సెప్టెంబరు నెల 3 వ తేదీ శనివారం సాయంకాలం ఐదు గంటలకు మళ్ళీ చెన్నయ్ చేరుకున్నారు ఏనుగుల వీరాస్వామి. యాత్రానంతర కార్యక్రమాలను త్వరత్వరగా ముగించుకుని తన కోర్డు విధుల్లోకి హజరయ్యారు. తెలుగులో పుస్తకం ప్రచురణకి మిత్రులు సాయం చేస్తానన్నా సరే బ్రౌన్ తప్పకుండా దీన్ని గుర్తిస్తారు అన్న నమ్మకంతో ఎదురుచూసాడు. నిజానికి బ్రౌన్ ఈ పుస్తకం విషయంలో స్పందించ నందుకు చాలా బాధపడినట్లుగా కూడా డైరీల్లో రాసుకున్నాడు. తన జీవితకాలంలో తెలుగులో ముద్రణకాకపోయినప్పటికీ కరకంబాటి తపాలా రైటరు పనయూరి వెంకం మెదలియారి దీన్ని తమిళంలోకి అనువదించి ప్రచురించారు. నాగపూరి మొదలియారి అనే ఆయన మరాఠీలోకి అనువదించారు.
ఆదినారాయణ గారి గురించి నిరజానిక ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు కానీ రెండు మాటలు పంచుకుంటాను. వ్యక్తిగా ఆయన చాలా చైతన్య శీలి కవియాకూబ్ గారి స్వంత ఊరు రొట్టమాకు రేవు సభకు వచ్చినప్పుడు వీరిని స్వయంగా కలిసే అదృష్టం దక్కింది. రిటైర్డ్ ప్రొఫేసర్ గారు ప్రపంచాన్ని చూసిన పెద్దాయన అని భయంగా వినయంగా ముడుచుకుంటే కాలేజీ క్లాస్ మేట్ లాగా భుజాన చరుస్తూ జోకులు చెపుతూ తనెంత అప్ డేట్ గా వున్నారో చెప్పకనే చెప్పారు ఈయన. టెక్నాలజీ వాడకంలో కానీ, సామాజిక మాధ్యమాల వినయోగంలో కానీ నేటితరానికి ఏమాత్రం తీసిపోరు.
ఆరు ఖండాలు, 14 దేశాల్లో సుమారు 35 వేల కి.మీ. ప్రపంచ యాత్ర చేసినప్పటికీ.. ఏనుగుల వీరస్వామి చేసిన కాశీయాత్రను చేయటం తన జీవిత ఆశయమని ప్రపంచ యాత్రికుడు ప్రొ.ఆదినారాయణ చాలా సార్లు చెప్పారు అంత ఇష్టంగా ఈ రచనను పూర్తిచేశారు ఆయన.
1999లో వచ్చిన ఎమ్‌. ఆది నారాయణ భ్రమణ కాంక్ష తెలుగు యాత్రాసాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. మూడు యాత్రల కలయిక ఈ భ్రమణ కాంక్ష. రాహుల్‌ సాంకృత్యాయన్‌ శత జయంతి సందర్భంగా 1993లో విశాఖపట్నం నుంచి సాంకృత్యాయన్‌ సమాధి వున్న డార్జిలింగ్‌ వరకూ చేసిన ‘పాదయాత్రాంజలి’ దీనిలో మొదటిది. తాను చిన్నప్పుడు ఆడిపాడిన గుండ్లకమ్మ నది మూలాల అన్వేషణలో ఆ నది ఒడ్డునే చేసిన మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర ‘ఏటి ఒడ్డున ప్రయాణం’ రెండవది. అకాల మరణం చెందిన చెల్లి కోటేశ్వరి జ్ఞాపకార్థం స్వంత ఊరు చవటపాలెం నుంచి ఆమె సమాధి వున్న ఢిల్లీ నగరం వరకూ రెండువేల మూడువందల కిలోమీటర్లు నడచిన వైనం, ‘ప్రార్థించే పాదాలు’ ముచ్చటగా మూడోది.
భూభ్రమణ కాంక్ష పుస్తకంలో తాను చేసిన పద్నాలుగు దేశాల ప్రయాణాల వివరాలనే కాకుండా యాత్రల గురించి అనేకానేక మౌలిక భావాలను నిర్వచించి వివరిస్తారు. ‘తన గ్రామాల్లో తిరిగినంత స్వేచ్ఛగా సహజంగా ప్రపంచమంతా తిరగాలని ఉంది’ అనే ఆదినారాయణ ఆ పని చేసి చూపించారీ పుస్తకంలో. ఒక ప్రపంచ స్థాయి యాత్రికుడు తాను చేసిన ప్రపంచ స్థాయి ప్రయాణాల గురించి రాసిన పుస్తకం ఈ భూభ్రమణ కాంక్ష.
ప్రపంచ వ్యాప్త సంచారుల గురించి జిప్సీలు అనే పుస్తకం రాసారు. 28 మంది ప్రపంచ ప్రసిధ్ద యాత్రికురాళ్ళ జీవిత విశేషాలతో స్త్రీ యాత్రికులు అనే పుస్తకం వెలువరించారు. మరో 24 మంది ప్రపంచ స్థాయీ యాత్రికుల జీవిత విశేషాలను గుదిగుచ్చి మహా యాత్రికులు అనే పేరుతో పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. తన ఐదు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కాలిబాటలు నా స్వర్గ ద్వారాలు అనే పేరుతో ఒక చక్కటి పుస్తకంగా పదిల పరిచారు. మన కాలపు మహా యాత్రికుడు మాచవరపు ఆదినారాయణ గారి కృషికి రెండు చేతుల నమస్సులతో వారి ప్రయత్నానికి నా అభివందనాలు తెలియజేస్తున్నాను.

...................................................................To Travel is to Live

మరింత లోతైన వివరాల కోసం ఇక్కడ చూడండి.
 మాచవరపు ఆదినారాయణ గారి ఫోన్ నంబరు : 9849883570
 కాశీయాత్రా చరిత్ర పూర్తి పుస్తకం పాత ప్రతి ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
https://ia800905.us.archive.org/…/kasiyatracharitr020670mbp…
 తెలుగులో యాత్రాసాహిత్యం
ఏనుగుల వీరాస్వామికన్నా ఎనిమిదేళ్ళు ముందుగా, 1822లో వెన్నెలకంటి సుబ్బారావు తాను చేసిన కాశీయాత్ర గురించి తన ఆత్మకథలో రాశారు. అది 1873లో ఇంగ్లీషులోనూ 1976లో తెలుగులోనూ వెలుగు చూసింది. అలాగే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తన 1889 నాటి కాశీయాత్రను 1934లో గ్రంథస్థం చేశారు
http://eemaata.com/em/issues/201706/12031.html
 మైమరపు ప్రయాణాలు – భూభ్రమణ కాంక్ష అంటూ కొల్లూరు సోమశేఖర్ గారి వ్యాసం
http://pustakam.net/?p=19654
◆◆◆◆ పేస్ బుక్ లోని ఈ ఆర్టికల్ క్రింది లింక్ ద్వారా చూడండి.
https://www.facebook.com/media/set/…


కామెంట్‌లు