ఆత్మ జ్ఞానం ఇలా కలుగుతుందా మరి ?

జీవి నిర్జీవి : ప్రాణం ఉండటం లేక పోవడం ఏమిటివన్నీ ?

జీవికి నిర్జీవికి తేడా ఏమిటి?
◆ కదలటం కదలకపోవడమా?
వాహనాలు కదులుతున్నాయి, మొక్కలు మరికొన్ని జీవులు ఒక చోటుకే పరిమితమై ఉంటాయి.

◆ పోనీ శ్వాసక్రియ జరిపేవాటిని జీవులు అందామా?
మొక్కల శ్వాసక్రియలో మినహాయింపులు ఉండటమే కాక అవాయు శ్వాసక్రియ ( Anarobic respiration ) ద్వారా బ్రతికేజీవులూ ఉన్నాయి. శ్వాసక్రియ లాంటి పద్దతిలో శక్తిని పొందే యంత్రాలూ ఉన్నాయి.

మరి నిర్జీవి నుంచి జీవిని వేరుచేసే ప్రధాన లక్షణం ఏమిటి?
ఆలోచించడం ( యంత్రాలు చేస్తున్నాయిగా) సృజనాత్మకత, నవ్వడం, క్ష్యోభ్యత( నొప్పికి ప్రతిస్పందించే గుణం) బహుశా ఇలాంటివన్నీ పరిశీలించిన తర్వాత జీవ శాస్త్రవేత్తలు జీవుల అసాధారణ (unique) లక్షణం " ప్రత్యుత్పత్తి" అంటున్నారు. అవును తనలాంటి మరో తనను స్వంతంగా సృష్టించుకునే తనం కేవలం జీవికి మాత్రమే ఉంటుంది.
మరో తాను పుట్టుకలో మొదటి దానంత పరిమాణం ఉండదు కాబట్టి A కంటే దాని పిల్ల B చిన్నది అవుతుంది. మరి B నుంచి C అప్పుడే వస్తే అది మరింత చిన్నగా ఉంటుంది. ఇలా కొంత కాలం గడిచేసరికి మరో జీవిని పుట్టించలేనంత చిన్నగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి జీవులు ప్రత్యుత్పత్తికి తోడుగా మరొకొన్ని లక్షణాలను తప్పని సరిగా పెంపొందించుకున్నాయి. అవి పెరుగుదల (growth) వల్ల పేరెంట్ జీవి అంత అవ్వాలి దానికోసం పోషణ ( nutrition)  రూపంలో పదార్థం అందాలి. మనుగడకోసం పోరాటం ( struggle for the existence) రక్షణ, ముందుజాగ్రత్తలు, వ్యవస్తీకరణ ఒకదానివెంట ఒకటి ఏర్పడ్డాయి.

◆◆ మొత్తంగా ఏమంటారంటే జీవి ప్రధాన లక్షణం ప్రత్యుత్పత్తి.

ప్రాణం అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనుషుల్లో ఉదాహరణ తీసుకుంటే చనిపోయారు అనడానికి ఆధునిక నిర్ధారణ ఏమిటి అనేది చూడాలి. ఒకప్పుడు గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, నాడీ (మణికట్టు, మెడ ప్రాంతాల్లో) కొట్టుకోవడం వంటి వాటిద్వారా చెప్పేవారు. ఇప్పుడు మెదడు పనిచేయటం ఆగిపోతే మనిషి మరణించినట్లే అని అంతర్జాతీయంగా అంగీకరిస్తున్నారు. యంత్రాలపై ఆధారపడి గుండె కొట్టుకుంటూనే వున్నా, శ్వాస ఆడుతున్న సరే మెదడు పనిచేయటం ఆగిపోతే ఆమనిషి మరణించినట్లుగా భావించి అవయవ దానానికి సైతం చట్టం ఒప్పుకుంటోంది. మెర్సీ కిల్లింగ్ (Euthanasia ) నేపథ్యంలో ఈ చర్చ చాలా విస్తృతంగా నడిచింది.

భౌతిక యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ నడిపించే శక్తి మరొకటి ఉంటుందా? ఒక గడియారం పనిచేస్తూ చేస్తూ ఆగిపోయింది. మనం అటు ఇటు తిప్పి చూసాం కొత్త బ్యాటరీ కొత్తగానే ఉందని కూడా చూసాం కానీ పనిచేయడం లేదు పనితనం తెలిసిన వాడు అలవోకగా మళ్ళీ దానిని పనిచేయించడం చూస్తున్నాం. కారు లేదా బైక్ విషయంలోనూ అంటే అన్ని పనిముట్లు ఉంది పెట్రోల్ కూడా వున్నా పనిచేయనని మొరాయిస్తే మనం ఏమీ చేయలేకపోతాం కానీ అది చచ్చిపోయిందిలే అని వదిలెయ్యకుండా మెకానిక్ దగ్గరకు తీసుకువెలితే బాగవ్వడమూ చూస్తున్నాం. టీవీ కావచ్చు కంప్యూటర్ కావచ్చు, ఉపగ్రహం కావచ్చు, నానో పార్టీకల్ ఆపరేటర్ కావచ్చు, బాహుబలి బిగ్ బాంగ్   మెషిన్(CERN) కావచ్చు మరే ఇతర పనిముట్టు కావచ్చు మనిషి తయారు చేసిన యంత్రాంగం మనిషే బాగుచేయగలుగుతున్నాడు, కానీ మనిషి అనే సంక్లిష్ట ఉన్నత స్థాయి యంత్రం పనివిధానం పూర్తిగా అర్ధం కాలేదు కాబట్టి అది ఆగిపోతే... ఇక అంతే మళ్ళీ బాగవ్వడం లేదు. ఆ లెక్కన మిగిలిన అన్ని యంత్రాల కంటే భిన్నంగా దీనిలో మరేదో నడిపించేది ఉంటుందా? కేవలం యంత్ర పరికరాల సమన్వయం  మాత్రమేనా ? ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని నమ్మే వాళ్ళు ఈ దేహాన్ని నడిపించేది లోపట ఒకటి ఉంటుంది అంటారు. నేనెవరు అనే తత్వశాస్త్ర మూల ప్రశ్నకు సమాధానం కూడా అదే నని చెప్తారు. నేనెవరు అనే ప్రశ్నకు ఈ చెయ్యి అంటే నేనా? కాదు కదా ఈ చెయ్యి నాది అంటున్నా అంటే ఈ చెయ్యి స్వంత దారుడు ఎవరో వున్నారు. అలాగే ఈ కాలు అంటే నేనా? ఈ తల అంటే నేనా? ఆఖరుకు ఈ దేహం అంటే నేనా? కాదు కదా దేహాన్ని తొడుక్కున్నది వేరే ఉంది అదే నేను అని చెప్తుంటారు. ఇది కాదు ఇది కాదు ( న హితి న హితి వాడుకలో నేతి నేతి వాదవిధానం ఇదే : ఏవేవి అది కాదో చెపుతూ దాన్ని అర్ధం అయ్యేలా చెయ్యడం అన్నమాట) అనే పద్దతిలో ఆత్మ అనేది శరీరాన్ని నడుపుతోంది అంటారు.

కానీ ఇది ఎంత వరకు నిజం?

ఇక్కడ మనకు తెలిసిన ఉదాహరణ ద్వారా నా అభిప్రాయాన్ని మీకు సులభంగా తెలిసేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.

ఆపరేటింగ్ సిస్టం (OS) అంటే ఏమిటో మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు వాడుతున్న చాలా మందికి తెలుసు. కంప్యూటర్ లలో విండోస్ xp, విండోస్ 7, విండోస్ 10 ఇలా ఉంటే మొబైల్ ఫోన్ లలో ios, మైక్రోసాఫ్ట్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. మళ్ళీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ లో A నుంచి ఒక్కో అక్షరం పేరుతో ఒక్కో అడ్వాన్సు Os లను విడుదల చేయడం గమనిస్తున్నాం. జెల్లీ బీన్, కిట్ కాట్, లాలి పాప్, వగైరా పేర్లు సుపరిచితమే. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లోని భౌతిక యాంత్రిక భాగాలు అన్ని వున్నా, బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో వున్నా ఆయా యంత్రాలు పనిచేయాలంటే సాఫ్ట్ వేర్ అనబడే అభౌతిక మైన ఆధారం ఒకటి వీటికి జత చెయ్యాల్సి వస్తోంది. అది మూలం కంటా పాడయిపోతే మొత్తం వ్యవస్థ అంటే సెల్ లేదా కంప్యూటర్ ఉపయోగ పడకుండా పోతుంది. నాకనిపిస్తుంది మనిషికి కూడా అచ్చంగా దాదాపు అదేలాగా మెదడు లోపట ఒక ఆపరేటింగ్ వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. జ్ఞాన నాడులు ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) input పరికరాలు గాను, కర్మేంద్రియాలు output పరికరాలు గాను ఉపయోగపడుతున్నాయి. సమాచార నిల్వ, తార్కిక పరిశీలన, సృజన, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు ఇక్కడి కంట్రోల్ యూనిట్ (CU) లోనే జరుగుతుంటాయి.

పుట్టుకతోనే వచ్చిన ఈ OS జీవిత కాలం అంత ఇదే స్థాయిలో పనిచేయాలా? లేదు అప్పుడప్పుడు update సాఫ్ట్ వేర్ అవుతుంది.పైగా విద్య రూపంలో థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ లను install చేసుకునే అవకాశమూ ఉంది. అది మెమరీ అంగీకరించిన మేరకు, Os ప్రాసెసింగ్ చేయగలిగినంత మేరకు మాత్రమే.

మరి చీమకు, దోమకు, చెట్టుకు, పిట్టకు మనిషికి అచ్చంగా ఒక్కటంటే ఒకే రకమైన Os ఉంటుందా? మౌళికంగా ఒకే రకమైన సాఫ్ట్ వేర్ అయినప్పటికీ వెర్షన్ తేడాలు, కెపాసిటీ తేడాలు తప్పకుండా ఉన్నాయి అనే అనిపిస్తోంది.

సూటిగా చెప్పాలంటే ఆత్మగా భావిస్తోంది కేవలం మెదడు ద్వారా జరుగుతున్న ఆలోచనా ప్రక్రియ మాత్రమే కదా? చనిపోడానికి ముందు వ్యక్తి చుట్టూ అద్దాలు బిగించి పెడితేనో? చనిపోవడానికి ముందు, చనిపోయిన తర్వాత వ్యక్తి తూకం లో తేడాలు చూసి అదే ఆత్మ బరువురోయి అని విజ్ఞాన ప్రదర్శనతో సంప్రదాయ అభిప్రాయానికి బలం చేకూర్చలన్నా సరిపోనిది. kirlian photography లు, Aura లు Orb లు ఏదో నిరూపణ ఇవ్వాలన్నట్లు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడా అనుభవంతో సరిపోలడం లేదు.

దీనికి దగ్గరి దారి ఏమిటంటే పరిశీలకుడే పరిశీలనా వస్తువుగా మారిన విధం అర్ధం చేసుకోవడం. ఆలోచించడం అనే క్రియ ద్వారా దాన్ని అదే పరిశీలించుకునే అవకాశం ఇవ్వడం, సహకరించడం చేస్తే నడిపిస్తున్నదిగా చెపుతున్నది ఏదో నడుస్తున్న దానికి కూడా అర్ధం అయితీరుతుంది.

ఇలా ఆలోచనను ప్రాసెసింగ్ చేయగల శక్తి న్యూరోన్ ల ముద్దరూపం లో ఉన్న మెదడుకి మాత్రమే ఉందా? మెదడు బయట ఆలోచనలు ఏవీ సాగవా? సాగుతాయి పెద్ద మెదడు, చిన్న మెదడు మెడుల్లా అబ్లంగాట తో పాటు వెన్ను పూస లోని పరిదీయ నాడి మండలం కూడా కొన్ని ఆలోచనా ప్రతిస్పందన లు చేస్తుంది. అంతస్రావీ వ్యవస్థలు ( endocrinal system) ఆలోచనలు ఉద్వేగాలు మీద పనిచేస్తాయన్నది నిజం. పుర్రె కూడా ఏర్పడని జీవుల్లోనే కాదు ఒకే ఒక్క కణం ఉన్న జీవుల్లో సైతం ఆలోచనా ప్రక్రియ ఏదో ఒక స్థాయిలో ఉంటుంది అనేది నిజం.


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి