భోపాల్ టూర్ డైరీ :01



ఆదిమానవుడి కాలం నాటి కొన్ని చిన్న చిన్న రంగుబొమ్మలు ఈరోజు మమ్మల్ని భోపాల్ వరకు ప్రయాణం చేయిస్తున్నాయి. రాతి చిత్రాలు లేదా గుహ చిత్రాలు పరిశోధన కోసమే ఏర్పడిన rock art society of India (RASI) 24వ జాతీయ కాన్ఫెరెన్సు ఫిబ్రవరి 27,28,29 తేదీలలో భోపాల్ లో నిర్వహిస్తున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒంటిగుండు, ఆంద్రప్రదేశ్ లోని గవికొండ గండి కోట లలో వెలుగు చూసిన రాతి చిత్రాల వివరాలను ఈ సదస్సులో పత్ర సమర్పణ చేసేందుకు పెద్దలు BM రెడ్డి గారు, భాస్కర్ కొండ్రేడ్డి, గారు, కొండవీటి గోపి గారు, తమ్ముడు కట్టా జ్ఞానేశ్వర్, యువకెరటం అరవింద్ ఆర్యా లతో పాటు ఈరోజు ప్రయాణం సాగుతోంది. బండి మురళీధర్ రెడ్డి గారు హైద్రాబాద్ నుంచి వేరే ట్రైన్ లో వస్తున్నారు. మేము ఐదుగురం కలిసి ప్రయాణించే అవకాశం కుదిరించుకున్నాం. శ్రీరామోజు హరగోపాల్ గారికి వారి అబ్బాయి పెళ్ళిపనుల హడావిడి లేకపోతే బహుశా మాతో ప్రయాణిస్తూ వుండేవారు.
ఆలోచనల్లో ఇక బి ఫర్ భోపాల్ లా నడుస్తోంది కాబట్టి కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుంటూ ఉంటాను.
రాతి చిత్రాలకు MP కి ఉన్న సంబంధం అయితే భీం బేడ్క భీముని వసతి ప్రదేశంగా చెప్పే ఒక గుహ సముదాయంలో ని రాతి చిత్రాలు ప్రపంచంలోనే చాలా చాలా ప్రత్యేకమైనవి. అది అసలు పనికి అనుబంధం అయితే ఇక ఇక్కడి కోసరు విశేషాలు మరెన్నో.
మనకి వార్తా పరిజ్ఞానం నుంచి భోపాల్ అనగానే 1984 లో జరిగిన మిథాయిల్ ఐసో సైనేడ్ విషవాయువు దుర్ఘటన దానిలో వేలాది మంది ప్రత్యక్షంగా, లక్షల మంది పరోక్షంగా నష్టపోవడం గుర్తొస్తుంది. సోషల్ మప్స్ పరిచయం ఉన్న వారికి దేశపు కేంద్రంలా మినీ భారత దేశంలా కనిపించే మధ్యప్రదేశ్ రూపం కళ్ళముందు కనిపిస్తుంది.
మహిస్మతి అవంతిక ఉజ్జయిని వంటి ఎన్నో పాపులర్ పేర్ల పుట్టుకకు చారిత్రక నేపద్యాన్ని ఇచ్చిన ప్రాంతం. ఇకపోతే బోజుడు పాలించిన ప్రాంతం భోజ్ పాల్  భోపాల్ గా మారిందంటారు. మన అంగళ్లలో రత్నాలు రాసులుగా పోసి అమ్మించిన, సంగీత సాహిత్యాలను గొప్పగా పోషించిన కృష్ణ దేవరాయలునే ఆంధ్ర బోజుడు అంటాం కదా. మరి అసలు బోజుడు ఎంత గొప్పవాడు కావాలి. ఒక పౌరాణిక పాత్రలాంటి ఉదాత్త ఔన్నత్యాన్ని చూపించే చారిత్రక వ్యక్తి భోజ రాజు సంగతులు సాలభంజికల కథల్లో చదువుకునే ఉంటాం. భోపాల్‌ను క్రీస్తుశకం 1000-1055 మధ్య కాలంలో పరమార రాజవంశానికి చెందిన భోజ మహారాజు నిర్మించాడని ప్రతీతి. దీనిని తొలినాళ్లలో 'భోజ్‌ పాల్‌' అని పిలిచేవారు. అదే క్రమంగా భోపాల్‌ అయింది. ఇప్పటికీ ఇక్కడి దేవాలయ సముదాయాన్ని భోజ్‌పూర్‌ అనే వ్యవహరిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశపు హృదయంగా చెప్తారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సాంచీ స్థూపం, నేటికీ వన్నె తగ్గని ఖజురహో శిల్పాలు, ప్రకృతిసిద్ధమైన సరస్సులు, అద్భుతమైన కోటలతో  మధ్యప్రదేశ్‌ ప్రాచీన చరిత్రను, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం. ఇలా వన్నెతగ్గని రాతిశిలలు, చారిత్రక భవంతుల విశేషాల మణిహారమే  మధ్యప్రదేశ్. మొగలాయిలు, సింధియాల పాలన, 1851 సిపాయిల తిరుగుబాటు వంటి చారిత్రక ప్రముఖ్యతలే కాకా  ఇటు కాళిదాసును కన్నతల్లి కాబట్టి సాహిత్య సౌరభము గుభాళిస్తుంది.
మరికొన్ని ముచ్చట్లు వీలువెంబడి చెపుతూ ఉంటాను. కుదిరితే ఇలా నాతో పాటు మీరు కూడా ఈ ప్రయాణం చేద్దురుగాని రండి.


ఫేస్ బుక్ కధనంగా


కామెంట్‌లు