Monday, 11 March 2013

దేవుడు కనిపిస్తాడా ?


దీనిపై మన సాధారణ చర్చలకంటే చాలా లోతైన, శాస్త్రబద్దమైన చర్చే జరిగినట్లు ఉపనిషద్ సారాలలో తెలుస్తోంది.
కేనోపనిషత్తు ద్వితీయఖండంలో శిష్యుని ప్రశ్నకు సమాధానంగా గురువు చెప్పిన బ్రహ్మసాక్షాత్కార రహస్యం ఇలా వుంది.

అస్య బ్రహ్మణ: యద్ రూపం(తత్)
త్వం సువేదేతి యది మన్యసే
నూనం దభ్రమేవ వేత్థ. అథను దేవేషు
అస్య యద్ (రూపం) విదితం తదపి త్వం నున్యసే
సువేదేతి తే మీమాంస్యమేవ మన్యే

(పదపదార్ధాన్ని కాదు కానీ విశ్లేషణ ఏమిచ్చారో కొంచెం వివరణాత్మకంగా చూస్తే)
ప్రత్యక్షం కావడం అంటే సినిమాల్లో ఎన్టీవోడు డింగ్ మని కెమేరా ముందుకొచ్చి ‘ భక్తా ఏమి నీ కోరిక’ అని అడగటం కాదు. లేకపోతే ‘నరుడా ఓ నరుడా ఏమి కోరికా ’అని గంతులేయడమూ కాదు.
ఇంద్రియాల ద్వారా తెలియటం లో ఆలోచిస్తే రూపం మాత్రమే కంటికి కనిపిస్తుంది. మీకు తీపిని తెలుసుకున్నారా? అని అడిగితే అవును నా కంటికి కనిపించింది అని చెప్పరు. దానిని గుర్తించే సాధనానికి తెలియాల్సిన పద్దతిలో తెలిసిందో లేదో చూస్తారు. అంటే తీపి తెలియటం అంటే నాలుకకు ప్రత్యక్షం గా తాకించటం ద్వారా తెలియడమే కదా. అలాగే చక్కటి సంగీతమో, వీనుల విందైనా శబ్దమో మీకు తెలిసిందా? అంటే అది కూడా కళ్ళముందు కదలాడటం కాదు. నునుపో చల్లదనమో తెలియడం అంటే అదికూడా మరేదో ఇంద్రియ గోచరం కావడమే కానీ కేవలం కంటికి సంభందించిన గొడవ మాత్రమే కాదు. ఇది ఇంద్రియాలకు తెలియటం గొడవ.

ఇక పోతే రేడియో తరంగాలు వున్నాయని మీరెరుగుదురా? అంటే సమాధానం చెప్పేందుకు ఇంద్రియసామర్ధ్యం మాత్రమే సరిపోదు ఇంద్రియానికి అతీతమైన రేడియో తరంగాలు, పరారుణ కిరణాలు ( Infra Red), అతినీలలోహిత కిరణాలు ( Ultra violet) లాంటి వాటిని గుర్తెరగాలంటే మరేదో సాధనం సహాయాన్ని తీసుకుని ఇంద్రియాల శక్తికి అందేలా చేసుకుని గుర్తిస్తున్నాం.

కరుణ,ప్రేమ, వాత్సల్యం లాంటి అభౌతికాంశాలను, అబ్ స్ట్రాక్ట్ అంశాలనూ మనో విశ్లేషణలతో గర్తించామని చెపుతున్నాం. ఏదో సినిమాలో బ్రహ్మనందం అడిగినట్లు ‘‘ ఏదే నా మీద ప్రేమను చూపించు, ఇప్పుడు చూపించు ’’ అని రోడ్డు మీద వీరంగం ఆడితే గబుక్కున జేబులోంచో, సంచీలోంచో తీసి దడాలున చూపించేది కూడా కాదు.

మరి భగవంతుడు / సృష్టికర్త / సృష్టికారకుడు / ఇంకా... వగైరా వగైరా వున్నాడనో (నిశ్చయం), వున్నాడేమోననో ( అనుమానం), ఖచ్చితంగా లేడనో అనుకోవాలంటే ఏం తెలియాలి ??

ఏ లక్షణము లేదా ధర్మము ద్యారా తనని గుర్తించే వీలుందో ఆ లక్షణాన్ని గుర్తించటమే తన రూపాన్ని తెలుసుకోవటం అని చెపుతుంది. పై సమాధానం అతడు ఇంద్రియాలకు అలభ్యుడని (కేవలం మహద్ వాచకంగా సౌలభ్యం కోసం వాడుతున్నాను) ఇతర సాధనాలకు దొరకడనీ చెపుతున్నారు.

డామిట్ మాకు అర్ధం కానిదే మేం గుర్తించం. కుదిరితే ప్రెండ్ రిక్వెస్ట్ పంపమనండి చాట్ చేసి తేల్చుకుంటాం. ఫేక్ ఐడీ నో ఒరిజినలో నని అంతే దట్సాల్..

ఫేస్ బుక్

Tweets

లంకెలు