అందీ అందని ముచ్చట

ప్రేమించటం అంటే బహు భాషల్లోనో,
మీదు మిక్కిలి అంకెల్లోనో,
అంటే మాట పదే పదే పొర్లాడించటం కాదు.
పడీ పడీ పడిగాపులు కాయటమసలే కాదు.

అసలది చాలామంది అనుకున్నట్లు
నామవాచకమో, విశేషణమో కాదు.
నేనను కున్నట్లు భాషలో క్రియామాత్రమో కాదు.
అది భాషకందని నిండుదనం.

ఇవ్వటాన్నో, తీసుకోవడాన్నో ప్రేమంటే
వ్యాపార ప్రపంచం విస్తుపోవటం తప్ప ఏం చేస్తుంది?
లొంగటమో, లొంగదీసుకోవడమో ప్రేమయితే
దండయాత్రల బలశాలురూ, మోడువారిన సన్యాసులూ
అదేమిటో అర్ధంకాక మకతికబడతారు.

భవిష్యత్తుకోసం పెట్టుబడిలాంటి బీమాపధకంకాదు.
హటాత్తుగా కలిసొచ్చేందుకు లాటరీ టిక్కెట్టూ కాదు.
నెలవారి స్థిరాదాయానిచ్చే ఉద్యోగమో,
లక్ష్యాలను సాధించేందుకు చేసే ఉద్యమమో కూడా కాదు.

అదికానిది తెలిసినంతనే అదేమిటో తెలిసేంత సుఖరమైనదీ కాదు.
నాకూ నీకూ ఒకే నిర్వచనంలో దక్కే దారున్న నికరమైనదీ కాదు.
భాషతో పడుతున్న ఈ కుస్తీపోటీలో బరిబయట నిలుచున్న ప్రేక్షకురాలైనా కాదు.
భావాన్ని చేర్చాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో మాత్రం
భాగస్వామి తనే

17-04-2013

https://www.facebook.com/groups/kavisangamam/permalink/545521722167251/

కామెంట్‌లు