యుద్ధక్షేత్రం

ఎముకలు కొరికేందుకు
తనకోరల్ని కసిగా విసురుతున్న చలితో పెనుగులాడుతూ
గూడులేని దేహాలెన్నో గడిపేస్తున్నాయి.
కాలిబాటల్లోనూ, షాపు సందుల్లోనూ
ప్లైయ్యోవర్ల మలుపుల్లోనూ చీఛీ అనుకునే శౌచాలయాల దుర్ఘంధ ప్రాంగణాల్లోనూ
నిరంతరం శీతల ఘాతాలకు ఎదురొడ్డుతున్నాయి.

కొట్టుకునే గుండెనుండీ
ఉప్పెంగే రక్తపు వెచ్చదనం తప్ప మరో కవచమేం లేదు.
ఏ కొరడా దెబ్బలుకోడుతోందో బీళ్ళుగా పగులగొడుతోంది దేహాన్ని,
కాళ్ళూ,చేతులేకాదు పెదాలూ వరకూ బీటలు అలముకుంటున్నాయి.

ఓటుకార్డు మాత్రం వస్తుంది.
చోటో, చాటో లేకపోయినా.
అట్టముక్కలూ, పాతబట్టలూ
వెగడుకి నెగడుకాలేనప్పుడు ఇందెంత.
చెత్తకుప్పలూ,మురికి తొట్లూ
రక్షించలేనపుడు ఇదేపాటి.
ఎప్పటిలానే
ఎండదాడిలో మాడిపోయినట్లు
వరదదారిలో కొట్టుకుపోయినట్లు
ఈ సమరంలోనూ క్షతగాత్రులేకాదు
విగతజీవులూ రాలుతున్నా జఢత్వమేకానీ
జలదిరింపేం వుండదు.

విరామం లేని ఆకలికి దోపిడీకి తోడుగా
అనేక సంస్ఫోటనాల్లో చలిపోటు మరోటి
కఠోరపోరాటంలో కడతేరినా కీర్తీచక్రాలేవీ రావు
విశ్రాంతస్థితిని చేదుకునేందుకు నిధులేమీ ప్రవహించవు
బిడ్డలను పొదువుకునే ప్రేమనే కవచంచేసిన మాతృహృదయాలీ లడాయిలో ఆగిపోతే
శరీరం క్షీణించిన పండుటాకులు వణకుతూ ఈ జగడానికి రాలిపోతే
ఆ నేరం ఎవరిది?
ప్రశ్నడిగేందుకే ఎవరూలేనపుడు సమాధానమింకెక్కడిది?

కామెంట్‌లు