దేవుడి చేయి, దేవుడి కన్ను, దైవకణం ఎలా వుంటాయో చూసారా?


ఈ మధ్య శాస్త్ర వేత్తలకు దేవుడు కూడా కొంచెం కొంచెంగా దర్శన భాగ్యం కల్పించేస్తున్నట్లున్నాడు. ఈమధ్యనే అమెరికా స్పేస్ ఏజన్సీకి స్పష్టంగా దేవుడి బ్రహ్మాండమైన చేయి దర్శన భాగ్యం కలిగిస్తే, గత సంవత్సరం ఏకంగా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి దైవ నేత్రమే కనిపించింది. ఇందులో మనమేమన్నా తక్కువ తిన్నామా బోసు గారి పుణ్యామా అని ఆయన కనుక్కున థీరీ ప్రకారం దైవకణం ఆచూకీనే పట్టేస్తున్నాం. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇవ్వన్నీ నిజమే నండోయ్. ఇంకా డౌటుంటే కొ్ని వివరాలు చదివేయండి.


జూన్ 2012 లో నాసా ప్రయోగించిన న్యూస్టార్ అనే రోదసీ నౌక అస్తమిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీసి భూమ్మీది శాస్త్రజ్ఞులకు పంపించింది. అది ఒక హస్తం ఆకారంలో రంగులీనివుండటంతో దాన్ని దైవహస్తం (హాండ్ ఆఫ్ గాడ్) అని అభివర్ణించారు.

న్యూస్టార్ ని నక్షత్రాలు, పాల పుంత, శక్తివంతమైన ఎక్స్ రే ల విషయంలో అధ్యయనం కోసం అంతరిక్షంలోకి పంపించింది అమెరికన్ నాసా సంస్థ. నశిస్తున్న నక్షత్రాలు, పాలపుంతకు కూడా ఆవల వున్న ఇతర పదార్థాలను శోధించటానికి పంపించిన ఈ రోదసీ నౌక మండిపోయి అంతరిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీయగా అది రంగులు చిమ్ముతూ ఒక చేతి ఆకారంలో కనిపించింది.

నశిస్తూ విచ్ఛిన్నమవుతున్న ఈ నక్షత్రం (పల్సర్) ఇంకా గిరగిరా తిరుగుతూనేవుంది. ప్రస్తుతం కేవలం 19 కి.మీ ల వ్యాసంలో మిగిలివున్న ఈ పల్సర్ సెకండ్ కి ఏడు సార్లు తనచుట్టూ తాను తిరుగుతోంది. దీనినుంచి విడిపోయిన ముక్కలు ఎక్స్ రే లతో సంయోగం చెంది మండుతున్నాయి.

చేతి ఆకారంలో కనిపిస్తున్న మండుతున్న పదార్ధపు భాగాలు ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన రీతిలో కలుస్తుండటం వలన అలాంటి ఆకారంలో కనిపిస్తోందా లేకపోతే అవి ఉండటమే ఆ ఆకారంలో ఉన్నాయా అన్నది ఇంకా శోధించవలసివుంది.

గత ఏడాది యూరోపియన్ స్పేస్ ఏజన్సీ కూడా దేవుడి కన్ను అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది.

లార్జ్ హాడ్రన్ కొల్లాయిడల్ (LHC) ప్రయోగం ద్వారా పదార్ధానికి మూలమైన అత్యంత మూలకణాన్ని థిరిటికల్ గా ఊహించి దానికి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు.

మరి శాస్త్రవేత్తలు ఈ పేర్లు పెట్టడం వెనక కారణంగా కనిపిస్తున్న దేవుడు ఎవరో మాత్రం అర్ధం కావటం లేదు. జనాలకర్ధం కావటం కోస పెడుతున్న సినిమా పేర్లలాగా ఈ వరస ఎక్కడిదాకా వెళుతుందో. దేవుడా.... 




కామెంట్‌లు